పోగొట్టుకున్న చోటే పతకాన్ని ముద్దాడింది! - inspirational story of mirabai chanu won silver medal at tokyo olympics
close
Updated : 24/07/2021 19:12 IST

పోగొట్టుకున్న చోటే పతకాన్ని ముద్దాడింది!

‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో ఈసారి మనదేశం తరఫున ఎవరు బోణీ కొడతారు?’ అని  ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు రెండో రోజే సమాధానం లభించింది. కోట్లాదిమంది ఆశలను భుజాన మోస్తూ ప్రముఖ వెయిట్‌ లిఫ్టర్‌ మీరాబాయి చాను రజత పతకం గెల్చుకుంది. టోక్యోలో ఏకైక భారత మహిళా వెయిట్‌ లిఫ్టర్‌ అయిన ఆమె.. తన అద్భుత ప్రదర్శనతో మెడల్‌ ఈవెంట్స్‌ మొదటిరోజే పతకాల పట్టికలో మువ్వన్నెల జెండాకు చోటు కల్పించింది. తన విజయంతో మున్ముందు పోటీ పడబోతోన్న తన సహచరుల్లోనూ స్ఫూర్తి నింపింది.

మల్లీశ్వరి తర్వాత!

2000 సిడ్నీ ఒలింపిక్స్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌లో కాంస్య పతకం గెల్చుకుంది తెలుగు తేజం కరణం మల్లీశ్వరి. సుమారు రెండు దశాబ్దాల అనంతరం మళ్లీ అదే విభాగంలో పతకం సాధించి మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేసింది మణిపూర్‌కు చెందిన సాయ్‌కోమ్‌ మీరాబాయి చాను. మహిళల 49 కిలోల విభాగంలో పోటీ పడిన ఆమె స్నాచ్‌ విభాగంలో 87 కిలోలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌ విభాగంలో 115 కిలోలు.. మొత్తంగా 202 కిలోల బరువు ఎత్తి దేశానికి రజత పతకాన్ని సాధించి పెట్టింది.

పోగొట్టుకున్న చోటే వెతుక్కుంది!

మీరాబాయి గత రియో ఒలింపిక్స్‌లోనూ భారత్‌ తరఫున ప్రాతినిథ్యం వహించింది. అయితే దురదృష్టవశాత్తూ తుది పోటీల్లో అర్హత సాధించలేక వట్టి చేతులతో నిరాశగా వెనుదిరిగింది. అయినా ఆమె ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. ఓటమికి కారణాలు కనుక్కుంది. కఠినంగా కృషి చేసింది. ట్రైనింగ్‌ క్యాంపుల్లో పాల్గొని మరింతగా సాధన చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాలు సాధించి సత్తాచాటింది. అదే ఉత్సాహంతో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. కోట్లాది మంది అభిమానుల ఆశలను నెరవేరుస్తూ పోటీలు మొదలైన రెండో రోజే రజత పతకాన్ని ముద్దాడింది. ఈక్రమంలో ‘పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్నట్లు’ గత ఒలింపిక్స్‌లో పరాభవానికి బదులు తీర్చుకుందీ మణిపూస.

రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది!

మీరాబాయి చాను మణిపూర్‌లోని ఈస్ట్ ఇంఫాల్‌లో 1994, ఆగస్టు 8న జన్మించింది. ఓ సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె మొదట విలువిద్య నేర్చుకోవాలనుకుంది. అయితే తమ రాష్ట్రానికే చెందిన కుంజరాణి దేవిని చూసి 12 ఏళ్ల వయసులో వెయిట్‌లిఫ్టింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. వంటకోసం అడవికి వెళ్లి కట్టెల మోపులను మోసుకుంటూ ఇంటికి తీసుకురావడమే ఆమెకు లభించిన మొదటి శిక్షణ. తన గ్రామంలో వెయిట్‌లిఫ్టింగ్ శిక్షణ కేంద్రం లేకపోవడంతో రోజూ 60 కిలోమీటర్లు ప్రయాణించేది. అలా 2007 నుంచి ఇంఫాల్‌లోని ఖుమాన్ లంపాక్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది చాను. ‘ఇంఫాల్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అక్కడ మాకు తగిన మౌలిక వసతులు కూడా ఉండేవి కావు. కోచ్‌లు మాపై శ్రద్ధ కనబరిచి మా డైట్‌ని ప్లాన్ చేసేవారు. రోజూ చికెన్, పాలు వంటివి కచ్చితంగా మా మెనూలో ఉండాలని సూచించేవారు. అయినప్పటికీ అవి రోజూ తీసుకోవడానికి ఆర్థికంగా నాకు వీలుపడేది కాదు’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది చాను.

ఆది నుంచి నిలకడగా రాణిస్తూ..

వెయిట్ లిఫ్టింగ్‌లో శిక్షణ తీసుకుంటున్న తొలి నాళ్ల నుంచే దానిపై పూర్తి దృష్టి పెట్టింది చాను. అందుకే 2013లో గువహటిలో జరిగిన జూనియర్ నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో ‘బెస్ట్ లిఫ్టర్'గా టైటిల్ అందుకుంది. 2011లో జరిగిన ఇంటర్నేషనల్ యూత్ ఛాంపియన్‌షిప్‌లో, సౌత్ ఏషియన్ జూనియర్ గేమ్స్‌లో బంగారు పతకాలు సాధించింది. ఆ తర్వాత 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుతమైన ప్రతిభ కనబరిచిన ఈ యువ లిఫ్టర్.. అందులో 48 కిలోల మహిళల విభాగంలో రజత పతకం గెలుచుకుంది. ఈ విజయంతోనే మొదటిసారిగా తనను తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది చాను.

ఏకాగ్రత కోసం మొబైల్‌ని దూరం పెట్టేసింది!

ఎన్నో ఆశలతో రియో ఒలింపిక్స్‌లో అడుగుపెట్టిన మీరాబాయి దురదృష్టవశాత్తూ తుది పోటీలకు అర్హత సాధించలేకపోయింది. పతకమైతే కోల్పోయింది కానీ ఆటపై ఆసక్తిని మాత్రం వదులుకోలేదీ మణిపూర్‌ లిఫ్టర్‌. రోజూ ఆరుగంటలకు పైగా ప్రాక్టీస్‌ చేసింది. ఏకాగ్రత దెబ్బతినకూడదని మొబైల్‌ను కూడా పూర్తిగా దూరం పెట్టింది. అమ్మ సహాయంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంది. శిక్షణలో భాగంగా తక్కువ సమయంలో ఎక్కువ బరువులెత్తేలా శ్రమించింది. మానసిక ఆందోళనను అధిగమించేందుకు ప్రత్యేకంగా సాధన చేసింది.

రికార్డులు సృష్టిస్తూ!

ఈ క్రమంలో తాను పడిన కఠిన శ్రమకు తగిన ప్రతిఫలమే అందింది. 2017 వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించింది. 2018 గోల్డ్‌ కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లోనూ బంగారు పతకాన్ని ముద్దాడింది. 2019 ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెల్చుకుంది. 2019 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచినా  201 కిలోల బరువెత్తి జాతీయ రికార్డులు సృష్టించింది. 2020 తాష్కెంట్‌ ఏషియన్‌ ఛాంపియన్‌షిప్‌లో 206 కిలోలతో తన రికార్డును తానే తిరగరాసింది. అదే ఏడాది కోల్‌కతా నేషనల్‌ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం గెల్చుకుంది. తాజాగా టోక్యోలోనూ అదే ప్రదర్శనను పునరావృతం చేసి రజతాన్ని ముద్దాడింది మీరా.

అమ్మ ఆశీర్వాదం తోడైంది!

టోక్యోలో రజత పతకం గెలుచుకున్న మీరాబాయికి చెవిదిద్దుల రూపంలో తన తల్లి ఆశీర్వాదం కూడా తోడైంది. 2016లో రియో ఒలింపిక్స్‌ కోసం తీవ్రంగా శ్రమిస్తోన్న మీరాకు తన తల్లి సైఖోమ్‌ ఒలింపిక్స్‌ రింగుల్ని పోలి ఉన్న ఇయర్‌రింగ్స్‌ని బహుమతిగా ఇచ్చారు. తన బంగారాన్ని అమ్మి, అప్పటిదాకా కూడబెట్టిన సొమ్మును కలిపి ఈ చెవి పోగుల్ని ప్రత్యేకంగా చేయించారామె. తన కూతురు విజయంతో తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అయితే అప్పుడు వరించని అదృష్టం మీరాకు ఇప్పుడు వరించింది. అమ్మ ఇచ్చిన చెవిదిద్దులు పెట్టుకొనే బరిలోకి దిగిన ఈ మణిపురీ బాక్సర్‌ తిరుగులేని విజయాన్ని అందుకుంది.

‘ఒలింపిక్స్‌లో కచ్చితంగా స్వర్ణం సాధిస్తానని, లేదంటే కనీసం పతకం అయినా సొంతం చేసుకుంటానని చాను ఆత్మవిశ్వాసంతో చెప్పింది. ఆ ఆనంద క్షణాల కోసం మేం ఎంతగానో ఎదురుచూశాం. మా అమ్మాయి గెలవగానే మేమంతా సంతోషంలో మునిగిపోయాం. మా ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది..’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోయారు చాను తల్లి. ముఖ్యంగా చాను ధరించిన చెవిపోగుల్ని టీవీలో చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారామె.

నిన్ను చూసి దేశం గర్విస్తోంది!

టోక్యో ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించి శుభారంభం చేసింది మీరాబాయి. దీంతో  మణిపూర్‌లోని ఆమె స్వస్థలంలో సంబరాలు అంబరాన్నంటాయి. ఇక ఆమె కుటుంబ సభ్యులు పోటీలు జరుగుతున్నంత సేపు టీవీ చూస్తూ చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. తనకు పతకం ఖరారు కాగానే సంబరాల్లో మునిగిపోయారు. ఇక రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని నరేంద్రమోదీ, కరణం మల్లీశ్వరి, నిర్మలా సీతారామన్‌, మిథాలీ రాజ్‌.. తదితర ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా చానును అభినందిస్తున్నారు. ఆమెను చూసి దేశం మొత్తం గర్విస్తోందని కొనియాడుతున్నారు.1418834299474829315

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని