అప్పుడు ప్రేమ కోసం రాచరికాన్నే వద్దనుకుంది... ఇప్పుడు అది కూడా! - japanese princess rejects a huge payout from her royal family ahead of wedding
close
Published : 04/09/2021 19:13 IST

అప్పుడు ప్రేమ కోసం రాచరికాన్నే వద్దనుకుంది... ఇప్పుడు అది కూడా!

ప్రేమ అనే రెండక్షరాల మధురమైన బంధం కోసం ఆస్తులు, అంతస్తులేంటి.. సర్వం వదులుకోవడానికైనా సిద్ధపడతారు నిజమైన ప్రేమికులు. ఆ బంధంలో అంతటి మాధుర్యం ఉంది మరి..! అందుకేనేమో ఒక సామాన్యుడి ప్రేమ కోసం ఏకంగా తన రాచరిక హోదానే వదులుకోవాలనుకుంది జపాన్‌ యువరాణి మాకో. పుట్టినప్పటి నుంచి తాను గడిపిన విలాసవంతమైన జీవితాన్ని వద్దని ఒక మాములు వ్యక్తితో పెళ్లిపీటలెక్కాలనుకుంటోంది.

ఆ డబ్బు కూడా వద్దట!

తన కుటుంబ సభ్యులను ఒప్పించి నాలుగేళ్ల క్రితం తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకుంది మాకో. ఈ ఏడాది చివరలో పెళ్లితో తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో సాహసోపేత నిర్ణయం తీసుకుందీ ప్రిన్సెస్‌. సంప్రదాయం ప్రకారం సామాన్యుడిని పెళ్లి చేసుకుంటే రాచ కుటుంబం నుంచి బహుమతిగా వచ్చే సుమారు రూ. 9 కోట్ల రూపాయలను తీసుకోకూడదని మాకో నిర్ణయం తీసుకుందట.

కాలేజీలో ప్రేమ పాఠాలు!

జపాన్‌ ప్రస్తుత రాజు నరుహిటో సోదరుడు ప్రిన్స్‌ అకిషినో కూతురే మాకో. 29 ఏళ్లున్న మాకో టోక్యోలోని ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీ నుంచి 2014లో కళలు, సాంస్కృతిక వారసత్వంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. ఆ తర్వాత లండన్‌ వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ లీసెస్టర్‌ నుంచి మ్యూజియాలజీ (మ్యూజియం స్టడీస్‌)లో మాస్టర్స్ పట్టా అందుకుంది. అయితే ఇంటర్నేషనల్‌ క్రిస్టియన్‌ యూనివర్సిటీలో డిగ్రీ చదువుతున్న సమయంలోనే మాకోకు పరిచయమయ్యాడు కొమురో. తొలిచూపులోనే ఒకరికి ఒకరు నచ్చేశారు. మొదట మాటలు కలిశాయి. ఆ తర్వాత మనసులు కలిశాయి.

చూడగానే ప్రేమలో పడిపోయా!

‘2013లో నా స్నేహితురాలి ద్వారా నాకు పరిచయం అయ్యాడు కొమురో. మొదట తనని ఓ రెస్టారెంట్లో చూశా.. చూడగానే నేను తనకు ఆకర్షితురాలినైపోయా.. అతనిలోని ప్రతి గుణమూ నన్ను తన దిశగా ఆకర్షించేది.. కొమురో చాలా చక్కగా వయొలిన్ వాయిస్తాడు. వంట కూడా అద్భుతంగా చేస్తాడు.. ఇవన్నీ నన్ను ఆకట్టుకున్నాయి. అలా నేను తన ప్రేమలో పడిపోయా.. తనకీ నేనంటే ఇష్టమని ఆ తర్వాత తెలిసింది.. ఆ తర్వాత ఐదేళ్ల పాటు ప్రేమించుకున్నాం’ అని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది మాకో.

అందుకే రాచరికాన్ని వదులుకున్నా!

పెళ్లితో తమ బంధాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలనుకున్న మాకో- కొమురో తమ ప్రేమ గురించి ఇంట్లో వాళ్లకు చెప్పాలనుకున్నారు. అయితే కొమురో ఒక సామాన్య వ్యక్తి. మాకోదేమో రాజ కుటుంబం. అందుకే తమ పెద్దల్ని ఒప్పించేందుకు తీవ్రంగా శ్రమించారీ లవ్‌ బర్డ్స్‌. ముఖ్యంగా మాకో తన అమ్మానాన్నల్ని ఒప్పించేందుకు ఎన్నో అష్టకష్టాలు పడింది.

‘మా ఇంట్లో నా తర్వాత పెళ్లి కావాల్సిన రాకుమార్తెలు ఆరుగురు ఉన్నారు. అందుకే మా ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పేందుకు మొదట సంకోచించాను. కానీ ధైర్యంగా చెప్పేశాను. అయితే మా రాచరికపు చట్టాల ప్రకారం రాజ కుటుంబంలో పుట్టిన వ్యక్తులెవరూ సామాన్యులను పెళ్లాడకూడదు. ఒకవేళ అలా పెళ్లాడాలనుకుంటే రాచరికాన్ని త్యజించి కోట దాటి బయట ఓ సామాన్య వ్యక్తిలా జీవించాల్సి ఉంటుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన కొమురో ముందు నా రాచరికం, రాణివాసం నాకు ముఖ్యం అనిపించలేదు. మా ప్రేమని గెలిపించుకొని, అతడ్ని పెళ్లాడి కలిసి సంతోషంగా జీవించాలన్నదే నా ఆశ. అందుకే కష్టమైనా రాచరికాన్ని వదులుకునేందుకే సంసిద్ధమయ్యా’ అని గతంలో చెప్పుకొచ్చిందీ ప్రిన్సెస్.

2017 మేలో తన ప్రేమ విషయాన్ని అధికారికంగా బయటపెట్టింది మాకో. అదే ఏడాది సెప్టెంబర్‌లో మాకో- కొమురోలకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు ఇంపీరియల్‌ హౌస్‌హెల్డ్‌ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. 2018 నవంబర్‌లో వీరిద్దరి వివాహం జరుగుతుందని అందులో తెలిపింది. అయితే కొమురో కుటుంబంలో ఆర్థిక సమస్యలు తలెత్తడంతో ఆ పెళ్లి కాస్తా 2020కి వాయిదా పడింది. ఇప్పుడది ఈ ఏడాది చివరకు వెళ్లిపోయింది.

పెళ్లి తర్వాత అక్కడికే వెళ్లిపోతాం..!

జపాన్‌ రాచరిక సంప్రదాయాల ప్రకారం సామాన్యుడిని పెళ్లి చేసుకునే రాకుమారికి వివాహం సందర్భంగా రాయల్‌ ఫ్యామిలీ నుంచి ఎంతోకొంత డబ్బును బహుమతిగా అందజేస్తారట. అలా మాకోకు కూడా సుమారు రూ.8.77 కోట్లు ఇవ్వాలనుకున్నారట. అయితే ఇప్పటికే రాచరిక హోదాను వదులుకునేందుకు సిద్ధమైన మాకో ఈ మొత్తాన్ని తీసుకునేందుకు కూడా తిరస్కరించిందట. ప్రస్తుతం అమెరికాలో న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నాడు కొమురో. ఈ నేపథ్యంలో పెళ్లి తర్వాత యూఎస్‌లోనే స్థిరపడతామంటోంది మాకో.

‘2021 చివరలో మా పెళ్లి జరిగేలా ప్రణాళికలు వేసుకుంటున్నాం. అత్యంత నిరాడంబరంగా, అతి తక్కువమంది అతిథుల సమక్షంలోనే మా వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత మేం అమెరికాలోనే సెటిల్‌ అవ్వాలనుకుంటున్నాం’ అని అంటోందీ జపాన్‌ యువరాణి.మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని