ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది.. ఇద్దరం ఒక్కటయ్యాం..! - jasprit bumrah marries sanjana ganeshan in goa
close
Published : 07/07/2021 20:00 IST

ప్రేమ వెతుక్కుంటూ వచ్చింది.. ఇద్దరం ఒక్కటయ్యాం..!

Photo: Instagram

అతనేమో బంతితో మాయ చేసే యంగ్‌ అండ్‌ డైనమిక్‌ క్రికెటర్... ఆమేమో అందం, అంతకు మించి వాక్చాతుర్యం కలగలిసిన స్పోర్ట్స్‌ యాంకర్‌. అతను వేసే మ్యాజిక్‌ బంతులకు ఆమె ఫిదా అయితే...ఆమె అందానికి, మాటల పరవళ్లకు క్లీన్ బౌల్డయ్యాడు ఆ క్రికెటర్‌. ఓ కార్యక్రమంలో భాగంగా అనుకోకుండా కలుసుకున్న వారిద్దరూ మంచి స్నేహితులుగా మారారు. ఆ స్నేహం కాస్తా ప్రేమగా చిగురించడంతో ప్రేమికులుగా మారారు. తాజాగా పెద్దల అనుమతితో ఈ ప్రేమ బంధాన్ని శాశ్వాతం చేసుకున్నారు. వారే హ్యాండ్‌సమ్‌ క్రికెటర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా... ప్రముఖ స్పోర్ట్స్‌ యాంకర్‌ సంజనా గణేశన్‌. గత కొద్దికాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ తాజాగా గోవా వేదికగా పెళ్లిపీటలెక్కారు.

‘పింక్‌’ కలర్‌లో మెరిసిపోయారు!

స్టువర్ట్‌ బిన్నీ-మయంతీ లాంగర్‌, మోర్నే మోర్కెల్‌ - రోజ్‌ కెల్లీ (దక్షిణాఫ్రికా), మార్టిన్‌ గుప్టిల్‌-లారా మెక్‌గోల్డ్‌రిక్‌ (న్యూజిలాండ్‌), బెన్‌ కటింగ్‌- ఎరిన్‌ హోలాండ్‌ (ఆస్ట్రేలియా), షేన్‌ వాట్సన్‌-లీ ఫుర్లాంగ్‌(ఆస్ట్రేలియా)... ఇలా పెళ్లితో పెనవేసుకున్న క్రికెట్‌- స్పోర్ట్స్‌ యాంకరింగ్‌ బంధాల్లో మరో జంట చేరింది. వారే టీమిండియా స్పీడ్‌స్టర్ బుమ్రా-ప్రముఖ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజన. గత కొద్దికాలంగా సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తాజాగా గోవా వేదికగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన పెళ్లి వేడుకలో వధూవరులిద్దరూ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. ఈ సందర్భంగా ఫ్లోరల్‌ ఎంబ్రాయిడరీ పేస్టల్‌ పింక్‌ కలర్‌ లెహెంగా, పింక్‌ కలర్‌ బ్లౌజ్‌తో ముస్తాబైన సంజన... దీనిపై సేమ్ షేడ్స్‌ కలిగిన షీర్‌ దుపట్టాను ధరించింది. ఇలా పెళ్లికూతురు దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించింది సంజన. ఇక పెళ్లి దుస్తులకు తగ్గట్టుగా ధరించిన బంగారు, వజ్రాభరణాలు ఆమె అందాన్ని రెట్టింపు చేశాయని చెప్పుకోవచ్చు. ఇక వరుడు బుమ్రా కూడా పేస్టల్‌ పింక్‌ కలర్ షేర్వాణీలో సూపర్బ్‌ అనిపించాడు. కరోనా ఆంక్షల నేపథ్యంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ క్రమంలో పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించిన బుమ్రా-సంజన దంపతులను అతిథులందరూ ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

గోప్యత పాటిస్తూ..

బుమ్రా-సంజన పెళ్లి చేసుకోనున్నారని గత కొద్దిరోజులుగా సోషల్‌ మీడియాలో విపరీత ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బుమ్రా-సంజనలు కానీ, వారి కుటుంబ సభ్యులెవరూ ఈ వివాహంపై అధికారిక ప్రకటనలు చేయలేదు. ఇక బుమ్రా కూడా ‘వ్యక్తిగత కారణాలు’ అని చెప్పి ఇంగ్లండ్‌తో సిరీస్‌ నుంచి తప్పుకున్నాడే కానీ తన పెళ్లి గురించి ఏ మాత్రం నోరు విప్పలేదు. కారణాలేవైనా కానీ ఇలా పెళ్లి ముందు రోజు వరకు ఎంతో గోప్యత పాటించారు.

కొత్త ప్రయాణం ప్రారంభించాం!

అయితే గోవా వేదికగా ఏడడుగులు నడిచిన వెంటనే తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకున్నారు సంజన-బుమ్రా. ‘ప్రేమ... అది మనల్ని వెతుక్కుని వస్తే ఎంతో విలువైనది. అదే మన జీవితానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుంది. మేమిద్దరం జీవితంలో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. ఈ రోజు మా జీవితాల్లో అత్యంత సంతోషకరమైన రోజు. మా పెళ్లి విషయాన్ని, మా ఆనందాన్ని మీ అందరితో పంచుకోవడాన్ని ఆశీర్వాదంగా భావిస్తున్నాం’ అంటూ తమ ఆనందానికి అక్షర రూపమిచ్చారీ లవ్లీ కపుల్‌. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల నుంచి నూతన వధూవరులకు శుభాకాంక్షలు, అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అలా మొదలైంది!

బుమ్రా-సంజనల పరిచయం అనుకోకుండా జరిగింది. ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంబంధించిన ఓ కార్యక్రమంలో వీరు మొదటిసారిగా కలుసుకున్నారట. ఆ తర్వాత ఇద్దరూ మంచి స్నేహితులుగా మారిపోయారని, ఆపై క్రమంగా ఆ బంధాన్ని ప్రేమ బంధంగాను... తాజాగా పరిణయ బంధంగానూ మార్చుకున్నారని సంజన సన్నిహితులు చెబుతున్నారు. ఇక 2020 లో జరిగిన ఓ అవార్డుల కార్యక్రమంలో బుమ్రాను ప్రత్యక్షంగా ఇంటర్వ్యూ చేసింది సంజన. అప్పట్లో పెద్దగా ఎవరూ ఈ ఇంటర్వ్యూ వీడియోను పట్టించుకోలేదు. ఎప్పుడైతే వీరిద్దరూ పెళ్లి చేసుకోనున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయో... అప్పుడే ఈ వీడియో సోషల్‌ మీడియా సర్కిళ్లలో బాగా వైరలైంది.

ఆకట్టుకునే అందం, మాటల పరవళ్లు!

సంజనా గణేశన్... సామాన్య ప్రజలకు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు. కానీ క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ మ్యాచ్‌లు చూసే వారికి ఈమె బాగా పరిచయమే.

* క్రికెట్‌, బ్యాడ్మింటన్‌, ఫుట్‌బాల్‌తో పాటు అన్ని రకాల క్రీడలపై మంచి పట్టున్న సంజన ప్రస్తుతం ప్రముఖ స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో టీవీ ప్రజెంటర్ గా పని చేస్తోంది.

* క్రికెట్‌, బ్యాడ్మింటన్‌ టోర్నీల సమయంలో ప్రముఖ క్రీడాకారులతో నిర్వహించిన వివిధ కార్యక్రమాలు, ఈవెంట్లకు హోస్ట్‌గా వ్యవహరించింది సంజన.

* చూడగానే ఆకట్టుకునే రూపం, గలగలా మాట్లాడే వాక్చాతుర్యం సంజన సొంతం. ఈ ప్రతిభతోనే ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన 2019 వరల్డ్‌ కప్‌లో టీవీ ప్రజెంటర్ గా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. ఈ టోర్నమెంట్‌లో ఆమె హోస్ట్‌ చేసిన ‘మ్యాచ్‌ పాయింట్‌’, ‘ఛీకీ సింగిల్స్‌’ లాంటి కార్యక్రమాలు క్రికెట్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

* ఇక గతేడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌లోనూ స్టార్‌ స్పోర్ట్స్‌ బ్రాడ్‌కాస్ట్‌ టీం సభ్యురాలిగా కూడా విధులు నిర్వర్తించిందీ అందాల తార.

* సంజనా గణేశన్‌ స్వస్థలం మహారాష్ట్రలోని పుణె. 1991 మే 6న జన్మించిన ఆమె సింబయోసిస్‌ యూనివర్సిటీ నుంచి ఇంజినీరింగ్‌లో గోల్డ్‌ మెడల్‌ అందుకుంది. ఐటీ, డిజిటల్‌ మార్కెటింగ్‌ కంపెనీల్లో కొద్ది రోజుల పాటు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేసింది.

* మోడలింగ్‌లోనూ మంచి అనుభవమున్న సంజన గతంలో ‘ఫెమినా అఫీషియల్లీ గార్జియస్‌’ టైటిల్‌ను గెలుచుకుంది. 2014లో జరిగిన ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లోనూ ఆమె పాల్గొంది. ఫైనల్‌ రౌండ్‌ వరకూ వెళ్లి దురదృష్టవశాత్తూ కొద్దిలో కిరీటం కోల్పోయింది.

* అదే ఏడాది జరిగిన ఎంటీవీ రియాలీటీ షో స్ప్లిట్స్ విల్లా సీజన్‌-7 తో మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది సంజన. సన్నీలియోనీ హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా తప్పుకుందీ ముద్దుగుమ్మ.

* బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కి వీరాభిమాని అయిన సంజన షారుఖ్ సహ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ టీం తరఫున ఎక్స్‌క్లూజివ్‌ షోలు, ఈవెంట్లు చేసింది. గతేడాది ఐపీఎల్‌ సందర్భంగా కేకేఆర్‌ తరఫున ఆమె హోస్ట్‌ చేసిన ‘ద నైట్‌ క్లబ్‌’ క్రికెట్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది.

* తన మాటల పరవళ్లతో అశేష అభిమానం సంపాదించుకున్న సంజనకు సోషల్‌ మీడియాలోనూ భారీగానే ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. కేఎల్‌ రాహుల్‌, యుజువేంద్ర చాహల్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి క్రికెటర్లతో పాటు సుమారు 3.47 లక్షల మంది ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెను అనుసరిస్తున్నారు.

మరి పెళ్లితో కొత్త ప్రయాణం ప్రారంభించిన బుమ్రా-సంజనలకు మనమూ శుభాకాంక్షలు తెలుపుదాం. వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని కోరుకుందాం.

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని