ఇవే నా ఫిట్‌నెస్ సీక్రెట్స్! - masaba gupta reveals her impressive weight loss transformation
close
Published : 27/06/2021 12:55 IST

ఇవే నా ఫిట్‌నెస్ సీక్రెట్స్!

మసాబా గుప్తా... ఫ్యాషన్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. విభిన్న ఫ్యాషన్లతో మగువల మనసు దోచుకునే ఈ ఫ్యాషనర్‌.. సోషల్‌ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఆహారపుటలవాట్లు, ఫిట్‌నెస్‌ విశేషాలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతుంటుంది. గతంలో పలుమార్లు బాడీ పాజిటివిటీ సందేశాలతో మహిళల్లో స్ఫూర్తి నింపిన మసాబా.. ఇన్‌స్టాలో తాజాగా మరో పోస్ట్ పెట్టింది. తన శరీరం గత పదేళ్లలో ఎన్నడూ లేనంత తేలికగా, నాజూగ్గా మారిపోయిందంటోంది. ఇలా తన వెయిట్‌లాస్ జర్నీ గురించి తాజాగా ఆమె పెట్టిన పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘కరేబియన్‌ బాడీ’ అంటూ..!

బాలీవుడ్‌ అలనాటి నటి నీనా గుప్తా, వెస్టిండీస్‌ దిగ్గజ క్రికెటర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ల ప్రేమ బంధానికి ప్రతిరూపమే మసాబా గుప్తా. సోనమ్‌ కపూర్‌ లాంటి పలువురు సినీ సెలబ్రిటీలకు ఫ్యాషన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తోన్న ఆమె ‘మసాబా మసాబా’ సిరీస్‌తో సినిమా రంగంలోకీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తండ్రి రిచర్డ్స్‌ జీన్స్‌ కారణంగా ‘కరేబియన్‌ బాడీ’ అంటూ గతంలో బాడీ షేమింగ్‌ను సైతం ఎదుర్కొందీ ముద్దుగుమ్మ. ఈ విషయాన్ని ఆమే పలు సందర్భాల్లో బయటపెట్టింది. అయితే తాజాగా ఓ ఇన్‌స్టా ఫొటోలో మల్లెతీగలా దర్శనమిచ్చిన మసాబా.. తన ఫిట్‌నెస్‌ జర్నీ వెనకున్న అసలు రహస్యాన్ని బయటపెట్టింది.

ఆ రెండూ మార్చుకోను!

అద్దం ముందు నిలబడి తీసుకున్న తన సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్‌ చేసిన మసాబా.. ‘నేను నా జీవితంలో వ్యాపారానికి, అనుబంధాలకు ఎంత విలువిస్తానో.. ఆరోగ్యానికీ అంతే ప్రాధాన్యమిస్తాను. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే నాలో మార్పు దాంతోనే మొదలైంది. రోజూ ఉదయం 7-9 గంటల మధ్య ఏదైనా వ్యాయామం లేదా నడక.. అదీ కాదంటే యోగా చేస్తాను. అలాగే బయటి ఆహారం అస్సలు తినను. ఇంట్లో ఆరోగ్యకరంగా తయారుచేసుకున్న ఆహారానికే ప్రాధాన్యమిస్తాను. రాత్రివేళల్లో పార్టీలకు దూరంగా ఉంటాను. అలాగే ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్తపడతా. ఫోన్‌ కాల్‌ మాట్లాడడం కంటే ఈ రొటీన్‌కే ప్రాధాన్యమిస్తాను. నిజానికి ఈ నిబద్ధత వల్లే మందులు వాడడం మానేసినా పీసీఓఎస్‌ నియంత్రణలోకొచ్చింది.

ఇక వారాంతాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో సరదాగా గడపడాన్ని ఎంజాయ్‌ చేస్తా.. ఈ క్రమంలోనూ ఆరోగ్యకరమైన ఆహారానికే ఓటేస్తా.. అందుకే గత పదేళ్లలో నా శరీరం ఎన్నడూ లేనంత తేలిగ్గా అనిపిస్తోంది. ఈ రోజుల్లో హార్మోన్ల సమస్యలు చాలామంది అమ్మాయిలకు సవాలుగా మారుతున్నాయి. వాటిని అధిగమించాలంటే చక్కటి పోషకాహారం తీసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సిందే!’ అంటోందీ ఫ్యాషన్‌ డిజైనర్.

సూపర్బ్‌ మసాబా!

ఇలా మసాబా పెట్టిన స్ఫూర్తిదాయక పోస్ట్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. కరీనా కపూర్‌, శిల్పాశెట్టి, మలైకా అరోరా, సాగరికా ఘట్గే.. వంటి తారలు స్పందిస్తూ.. ‘సూపర్బ్‌ మసాబా’ అంటూ ఆమెను అభినందిస్తున్నారు.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని