చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది! - mawya sudan becomes the first iaf woman fighter pilot from jammu kashmir
close
Updated : 22/06/2021 18:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

Image for Representation

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

12వ మహిళగా!

ప్రపంచంలో అతిపెద్ద వైమానిక దళాల్లో ఒక్కటైన భారత వాయుసేన (ఐఏఎఫ్)కు సుమారు 90 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. కానీ ఐదేళ్ల క్రితం వరకు కేవలం హెలికాప్టర్‌, విమానాలు..వంటి వాయు రవాణా సర్వీసుల్లో మాత్రమే మహిళల్ని పైలట్లుగా నియమించుకునేది. ఈ క్రమంలో మహిళా శక్తిసామర్థ్యాలకు తగిన గుర్తింపునిస్తూ 2016 నుంచి దేశ రక్షణ కోసం పోరాడే యుద్ధ విమానాల్లో సైతం మహిళల్ని పైలట్లుగా నియమించుకుంటోంది. అవనీ చతుర్వేది, మోహనా సింగ్‌, భావనాకాంత్‌, శివాంగీ..ఇలా ఇప్పటివరకు 11 మంది మహిళలు ఫైటర్‌ పైలట్లుగా నియమితులయ్యారు. కశ్మీర్‌కు చెందిన మావ్యా సూదన్‌ తాజాగా ఈ జాబితాలోకి చేరింది.

ఏడాది శిక్షణ పూర్తి చేసుకుని!

మావ్యాది జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలోని లంబేరి అనే గ్రామం. తన కష్టానికి తోడు తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రోత్సాహం కూడా జతవ్వడంతో ఆమె ఈ స్థాయికి చేరుకుంది. ఫైటర్‌ పైలట్‌గా ఎంపికైన ఆమె సుమారు ఏడాది కాలంగా కఠినమైన శిక్షణ తీసుకుంటోంది. ఇటీవల హైదరాబాద్‌లోని దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ను కూడా పూర్తి చేసుకుంది. తద్వారా యుద్ధ విమాన పైలట్‌గా పూర్తిస్థాయి బాధ్యతలు నిర్వర్తించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.

ఏదైనా సాధిస్తారు!

ఈ క్రమంలో తమ కూతురుని చూసి తెగ సంబరపడిపోతున్నారు మావ్యా తల్లిదండ్రులు. ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్‌ పరేడ్‌ పూర్తయిందో అప్పటినుంచే ఆమెకు, ఆమె తల్లిదండ్రులకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 
‘మా అమ్మాయిని చూస్తుంటే గర్వంగా ఉంది. ఆమె తన కష్టంతోనే నేడు ఈ స్థాయికి చేరుకుంది. తల్లిదండ్రులు తమ కూతుళ్లను ప్రోత్సహిస్తే ఏదైనా సాధిస్తారు.. అందుకు మా అమ్మాయే నిదర్శనం. ఇప్పుడు తను కేవలం మా అమ్మాయి మాత్రమే కాదు. ఈ దేశ ప్రజలందరి ముద్దు బిడ్డ’ అని ఆమె తండ్రి వినోద్‌ సూదన్‌ ఉప్పొంగిపోయారు.

రోల్‌ మోడల్‌గా నిలిచింది!

‘నా చిన్న కూతురు బాగా కష్టపడింది. తన కలను సాకారం చేసుకుంది. మావ్యాను చూస్తుంటే నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది’ అని తల్లి సుష్మ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక జూనియర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్న మావ్యా సోదరి మాట్లాడుతూ ‘పైలట్‌ కావాలని తను చిన్నప్పటి నుంచి కలలు కంటూ ఉండేది. తన హార్డ్‌వర్క్‌తో తన కోరిక నెరవేర్చుకుంది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమే. తను సాధించాల్సి చాలా ఉంది. ప్రస్తుతం మావ్యాను ప్రతి ఒక్కరూ సొంత కూతురిలా భావిస్తున్నారు. మాకు అభినందనలు తెలుపుతూ ఎక్కడెక్కడి నుంచో సందేశాలు వస్తున్నాయి. నేటి తరం అమ్మాయిలందరికీ నా చెల్లి రోల్‌మోడల్‌గా నిలిచింది’ అంటోంది.

ఈ క్రమంలో- సోషల్‌ మీడియా వేదికగా మావ్యాకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, జమ్మూ కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా లాంటి ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని