టీకా రోజున డైట్ ఇలా..! - meal chart to eat and avoid on the day you are getting the vaccine
close
Published : 22/06/2021 15:44 IST

టీకా రోజున డైట్ ఇలా..!

కంటికి కనిపించని కరోనా మహమ్మారి నుంచి రక్షణ పొందాలంటే టీకా తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ వ్యాక్సిన్‌ వేయించుకున్నాక వైరస్‌ సోకినా అది అంత తీవ్రంగా పరిణమించట్లేదని నిపుణులు పదే పదే చెబుతూనే ఉన్నారు. అయితే ఒక పక్క టీకాల లభ్యత తక్కువగా ఉండడం ఒక సమస్య అయితే, మరోపక్క వ్యాక్సినేషన్‌ ప్రారంభమై నెలలు గడుస్తోన్నా, ప్రభుత్వాలు, ఆరోగ్య నిపుణులు, సెలబ్రిటీలు దీనిపై అవగాహన కల్పిస్తోన్నా ఇప్పటికీ కొంతమంది టీకా తీసుకోవడానికి భయపడుతున్నారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలతో పాటు టీకా తీసుకున్న కొందరిలో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఎదురవ్వడమే ఇందుకు ప్రధాన కారణం.

వాటిని తగ్గించవచ్చు!

అయితే టీకా తీసుకునే రోజు కొన్ని రకాల ఆహార పదార్థాల్ని తీసుకోవడం ద్వారా వ్యాక్సిన్‌ వల్ల ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను చాలావరకు తగ్గించవచ్చంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రత్యేకించి వికారం, వాంతులు లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల హెల్దీ ఫుడ్‌ తీసుకుంటే సరిపోతుందని వారు సూచిస్తున్నారు. మరి టీకా రోజున ఏం తినాలో, తినకూడదో తెలుసుకుందాం రండి.

రోజును ఇలా ప్రారంభించండి!

టీకా రోజున నిద్ర లేవగానే పరగడుపునే కొన్ని వెల్లుల్లి రెబ్బలను నీటితో కలిపి తీసుకోవాలి. వెల్లుల్లిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలతో పోరాడేందుకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. ఆ తర్వాత అల్లం, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తులసి ఆకులతో తయారుచేసిన హెర్బల్‌ టీని తాగాలి. టీని వడపోసే ముందు కొద్దిగా నిమ్మరసం, ఒక టీ స్పూన్‌ను తేనెను జోడిస్తే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. హెర్బల్‌ టీ తయారుచేయాలంటే పైన చెప్పిన పదార్థాలన్నీ కచ్చితంగా ఉండాలనేం లేదు. అందులో కొన్ని ఉన్నా సరిపోతుంది.

బ్రేక్‌ఫాస్ట్‌

టీకా రోజున తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమివ్వాలి. ఇందులో భాగంగా  కూరగాయలు కలిపి తయారు చేసిన పోహా లేదా  ఉప్మాను బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవడం ఎంతో ఉత్తమం. వీటితో పాటు శెనగపిండితో చేసిన దోశలను కూడా తినచ్చు. ధనియాలు, పుదీనా, ఉసిరి కలిపి తయారుచేసిన చట్నీతో వీటిని తీసుకుంటే మరింత రుచిగా ఉంటాయి. అలాగే ఎగ్స్ తీసుకోవడం కూడా మంచిదే.

మిడ్‌ మీల్‌

బ్రేక్‌ఫాస్ట్‌, లంచ్‌కు మధ్యలో ఉసిరి, పుదీనా ఆకులతో కలిపిన ఫ్రూట్‌ జ్యూస్‌లు తీసుకుంటే మంచిది. ఇవేవీ అందుబాటులో లేకపోయినా కనీసం కొబ్బరి నీళ్లైనా తాగాలి.

లంచ్‌

మధ్యాహ్నం రోటీలు లేదా అన్నం, పప్పు, ఏదైనా సబ్జీ, చట్నీ, పెరుగును తీసుకోవాలి. కూరగాయలతో చేసిన కిచిడీ కూడా తీసుకోవచ్చు. చట్నీని తీసుకోవడం వల్ల రుచితో పాటు కొన్ని సూక్ష్మపోషకాలు శరీరానికి అందుతాయి. ఇక పెరుగుతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది.

ఈవెనింగ్‌ స్నాక్స్‌

ఉదయం పరగడుపునే తీసుకున్న హెర్బల్‌ టీతో పాటు కొన్ని నట్స్‌ను సాయంత్రం పూట స్నాక్స్‌గా తీసుకోవచ్చు. పాప్‌కార్న్‌ వంటి వాటికి బదులు మఖానా (తామర గింజలు) తినాలి. అదేవిధంగా అప్పడాలను ధనియాల చట్నీతో కలిపి తీసుకోవచ్చు.

డిన్నర్‌

మధ్యాహ్న భోజనం లానే రాత్రి భోజనంలోకి రోటీలు లేదా అన్నం, పప్పు, సబ్జీ, చట్నీ తీసుకోవచ్చు. వెజిటబుల్‌ కిచిడీ కూడా తినచ్చు.

పడుకునే ముందు..

ఇక పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్‌ పసుపు, నల్లమిరియాల పొడిని కలుపుకొని తాగాలి.

ఇవి కూడా గుర్తుంచుకోండి!

* టీకా రోజున మాంసం, పాలను తీసుకోకపోవడం ఉత్తమం. ఎందుకంటే వీటివల్ల జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

* ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌, టీ, బిస్కట్లకు కూడా దూరంగా ఉండండి.

* బాగా నిద్రపోవాలి.
* నీరసంగా ఉంటే చక్కెర సంబంధిత పదార్థాలను అసలు తీసుకోవద్దు. వీటికి బదులు పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి.

 టీకా రోజున ఏం తినాలో, తినకూడదో తెలుసుకున్నారుగా! మరి మీరూ ఈ డైట్‌ను ఫాలో అవ్వండి. ఏ మాత్రం భయపడకుండా వ్యాక్సిన్‌ వేయించుకోండి. కరోనా నుంచి రక్షణ పొందండి.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని