అమ్మాయి పుట్టింది.. అంబాసిడరైంది! - meet jashneet kaur punjab poster child for education programs
close
Updated : 06/07/2021 18:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మాయి పుట్టింది.. అంబాసిడరైంది!

Photo: Facebook

‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. ఇంట్లో బోసి నవ్వులతో తిరుగుతున్న మహాలక్ష్మిని చూస్తూ ‘మాకు మగబిడ్డను ఎందుకు ప్రసాదించలేదు దేవుడా?’ అని మథనపడేవారూ లేకపోలేదు. పంజాబ్‌కు చెందిన జష్నీత్‌ కౌర్‌ పుట్టినప్పుడు ఆమె తల్లి కూడా ఇలాగే బాధపడిందట!

కానీ కాలం గిర్రున తిరిగింది.. చూస్తుండగానే ఆ చిన్నారికి ఆరేళ్లు వచ్చాయి. ఈక్రమంలో అందమైన రూపం, ముద్దులొలికే మాటలతో చూడగానే ఆకట్టుకుంటోన్న జష్నీత్‌ను పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం విద్యాశాఖ రాయబారి (ఎడ్యుకేషన్‌ అంబాసిడర్‌)గా నియమించింది. అప్పటి నుంచి టీవీలు, పేపర్లు, వెబ్‌సైట్లు.. ఇలా రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆ పాప ఫొటోలే దర్శనమిస్తున్నాయి. దీంతో అమ్మాయే వద్దనుకున్న జష్నీత్‌ తల్లి తన ముద్దుల కూతురును చూసి ఎంతో మురిసిపోతోంది. తాను తప్పుగా ఆలోచించానంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకుంటూ అపరాధ భావనకు గురవుతోంది.

అబ్బాయి కావాలనుకున్నాను!

పంజాబ్‌లోని ఫరీద్‌ కోట్‌ జిల్లా వారా భాయ్‌కా గ్రామానికి చెందిన జగ్జీత్‌ సింగ్‌, సుఖ్‌దీప్‌ల ముద్దుల కూతురే జష్నీత్‌. ఇంటర్‌ వరకు చదువుకున్న జగ్జీత్‌ ఓ ప్రైవేటు కంపెనీలో రూ.7వేల జీతానికి పనిచేస్తున్నారు. సుఖ్‌దీప్‌ కౌర్‌ ఇంటి దగ్గరే ఉంటూ గృహిణిగా బాధ్యతలు నెరవేరుస్తోంది. కొంచెం వ్యవసాయ పొలమున్నప్పటికీ ఇతరులకు కౌలుకు ఇచ్చేశారు. అయితే తన కడుపులో నలుసు పడగానే అబ్బాయే పుట్టాలని కోరుకుందట సుఖ్‌దీప్‌. మొదటి సంతానం కాబట్టి కొడుకు పుడితే బాగుంటుందని ఊహించుకుందట. కానీ చివరకు జష్నీత్‌ పుట్టింది. దీంతో అమ్మాయి పుట్టిందని తీవ్ర నిరాశకు లోనైందట సుఖ్‌దీప్‌. అదే సమయంలో తమకు అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటేనని జగ్జీత్‌, అతని తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. జష్నీత్‌ను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

బ్రాండ్‌ అంబాసిడర్‌గా!

ఒక్కగానొక్క కూతురు కావడంతో ఖర్చుకు వెనకాడకుండా ఓ ప్రైవేటు పాఠశాలలో జష్నీత్‌ను చదివించాలని ఆమె తల్లిదండ్రులు భావించారు. అయితే అప్పుడే వారా భాయ్‌కా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సకల సదుపాయాలతో స్మార్ట్‌ స్కూల్‌గా తీర్చిదిద్దింది ప్రభుత్వం. దీంతో 2017లో అదే పాఠశాలలో జష్నీత్‌ను చేర్పించారు. ఈక్రమంలో 2018లో రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ఒకసారి ఆ పాఠశాలను సందర్శించారు. అప్పుడే అందమైన రూపం, ముద్దులొలికే మాటలతో ఆకట్టుకుంటోన్న జష్నీత్‌తో మాట్లాడారు. తనతో ఫొటోలు దిగి ఆ చిన్నారి పూర్తి సమాచారం తెలుసుకున్నారు. ఆ తర్వాత పంజాబ్‌ విద్యాశాఖకు రాయబారి (ఎడ్యుకేషన్‌ అంబాసిడర్‌)గా జష్నీత్‌ను నియమిస్తున్నట్లు ప్రకటించారు.

ఎక్కడ చూసినా పాప ఫొటోలే!

ఇక అప్పటి నుంచి విద్యాశాఖకు సంబంధించిన ఏ ప్రకటనలోనైనా జష్నీత్ ఫొటో కనిపించడం ప్రారంభమైంది. స్కూల్‌ యూనిఫాం, మెడలో టై, రిబ్బన్లు చుట్టిన రెండు జళ్లతో అమాయకంగా చిరునవ్వులు చిందిస్తోన్న జష్నీత్‌ ఫొటో విద్యాశాఖ నిర్వహించిన పలు కార్యక్రమాల్లోనూ కనిపిస్తోంది. ఇక దిన పత్రికలు, టీవీలు, సోషల్‌ మీడియా.. చివరకు అధికారుల వాట్సప్‌ డీపీల్లోనూ ఈ ఫొటోనే దర్శనమిస్తోంది. ఈక్రమంలో ప్రస్తుతం పంజాబ్‌ విద్యాశాఖ అమలుచేస్తోన్న ‘ఈచ్‌ వన్‌, బ్రింగ్‌ వన్‌ (ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించే కార్యక్రమం)’, ‘ఘర్‌ బైటే శిక్షా (ఆన్‌లైన్‌ విద్య)’, ‘లైబ్రరీ లంగర్‌’, ‘మిషన్‌ సాత్‌ పరిషత్‌’ తదితర కార్యక్రమాలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తోంది జష్నీత్.

మాకు ఎవరైనా ఒకటే!

ఈక్రమంలో పంజాబ్‌ అంతటా పాపులర్‌ అయిన తన గారాల పట్టిని చూసి తెగ సంబరపడిపోతోంది తల్లి సుఖ్‌దీప్‌. ‘జష్నీత్‌ పుట్టినప్పుడు అబ్బాయి పుట్టలేదని ఎంతో ఆవేదన చెందాను. ఓ తల్లిగా తనను ప్రేమగా చూడలేకపోయాను. అయితే నేనెంత తప్పుగా ఆలోచించానో ఇప్పుడు నాకు అర్థమవుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా నా కూతురు ఫొటోలే కనిపిస్తున్నాయి. టీచర్లందరూ తనను ప్రశంసిస్తుంటే ఎంతో సంతోషంగా, గర్వంగా అనిపిస్తోంది. ఒకవేళ మాకు అబ్బాయి పుట్టినా ఇంత చిన్న వయసులో ఇంతటి పేరు తీసుకువచ్చేవాడు కాదేమో. గతంలో రెండో సంతానమైనా అబ్బాయి పుట్టాలనుకున్నాం. అయితే ఇప్పుడు అలాంటి కోరికలేమీ లేవు. మాకు అమ్మాయైనా, అబ్బాయైనా ఒకటే’ అంటూ పుత్రికోత్సాహంతో ఉప్పొంగిపోతోందా తల్లి హృదయం.


మరిన్ని

ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!

నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్‌. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్‌ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్‌స్టాగ్రాం, యూట్యూబ్‌ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్‌స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్‌డాట్‌కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.

‘స్పెల్లింగ్స్‌’ చెప్పి సెన్సేషనయ్యారు!

పిల్లల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్‌ స్పెల్లింగ్‌-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్‌-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్‌ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్‌ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్‌ గర్ల్‌.

కథ చెబుతాను... ఊ కొడతారా..!

రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్‌ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్‌పేరెంట్స్‌ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్‌. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్‌ఫామ్‌కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్‌సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్‌ ఆంత్రప్రెన్యూర్‌ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..

చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!

ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్‌. జమ్మూకశ్మీర్‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఫైటర్‌ పైలట్‌గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్‌ సెన్సేషన్.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని