అలా 78 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా మారింది! - meet sheela bajaj who becomes an entrepreneur at 78 years old
close
Published : 26/10/2021 19:20 IST

అలా 78 ఏళ్ల వయసులో వ్యాపారవేత్తగా మారింది!

(Photo: Instagram)

‘కలలు, ఆసక్తులు సాకారం చేసుకునేందుకు వయసుతో సంబంధం లేదు’ అని నిరూపిస్తూ ఇటీవల ఎందరో మహిళలు తమ మనసుకు నచ్చిన పనులు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మలి వయసులోనూ తమ సృజనాత్మకతను చాటుకుంటూ మన్ననలు అందుకుంటున్నారు. ఈ కోవకే చెందుతారు 78 ఏళ్ల షీలా బజాజ్‌. చిన్నప్పుడు తన మనవరాలి కోసం సరదాగా స్కార్ఫులు, స్వెటర్లు అల్లిన ఈ బామ్మ... ఇప్పుడు అదే నైపుణ్యం, అదే మనవరాలి సహకారంతో వ్యాపారవేత్తగా మారిపోయింది.

78 ఏళ్ల వయసులో ‘స్మార్ట్’గా!

ఏడు పదుల వయసు దాటిందంటే కొందరికి శరీరం ఏ మాత్రం సహకరించదు. కొందరికి చేతులు, కాళ్లు కూడా వణుకుతుంటాయి. అయితే దిల్లీకి చెందిన షీలా మాత్రం వీరికి భిన్నం. 78 ఏళ్ల వయసులోనూ ఆమె ఎంతో ఉత్సాహంగా పని చేస్తున్నారు. చిన్నపిల్లలకు అవసరమైన దుస్తులు, స్వెటర్లు, సాక్సులు, గ్లోవ్స్‌లు, స్కార్ఫ్‌లు అల్లుతున్నారు. ‘CaughtCraftHanded’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ద్వారా ‘స్మార్ట్‌’ గా వాటిని విక్రయిస్తూ తగిన ఆదాయం ఆర్జిస్తున్నారు.

మనవరాలికి అన్నీ తానై!

ఏడు పదుల వయసున్న షీలా బజాజ్‌ జీవితం గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదొడుకులకు లోనైంది. పున్నామ నరకం తప్పిస్తాడనుకున్న కుమారుడు కొన్నేళ్ల క్రితం హఠాత్తుగా కన్ను మూశాడు. అప్పటి నుంచి తన మనవరాలి (యుక్తి బజాజ్) రూపంలోనే తన కొడుకును చూసుకుంటూ కాలం గడుపుతున్నారు. దురదృష్టవశాత్తూ గతేడాది కోడలు కూడా అనారోగ్యంతో మరణించింది. ఈ క్రమంలో పిన్న వయసులోనే తల్లిదండ్రుల అనురాగానికి దూరమైన తన మనవరాలికి ఆ లోటు తెలియనీయకుండా పెంచారు షీలా. అన్నీ తానై వ్యవహరించారు.

ఒంటరిగా మిగిలిపోయారు!

యుక్తి తనతో ఉన్నన్ని రోజులు ఎంతో ధైర్యంగా ఉన్నారు షీలా. అయితే ఎప్పుడైతే ‘లాంగ్వేజ్‌ ఎక్స్‌పర్ట్‌’ గా ఓ సంస్థలో తన మనవరాలికి ఉద్యోగం వచ్చిందో అప్పటి నుంచి ఆమె ఒంటరిగా మిగిలిపోయారు. మలి వయసులో ఏం చేయాలో తోచలేదు. అయితే కరోనా కారణంగా యుక్తి మళ్లీ నానమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచే పని చేయడం ప్రారంభించింది. అప్పుడే ఆమెలోని ఒంటరితనాన్ని గుర్తించిన యుక్తి...తనను ఏదైనా పనిలో నిమగ్నం చేయాలనుకుంది. అప్పుడే తన చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి.

సృజనాత్మకతను జోడించి!

‘నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు నానమ్మ నా కోసం స్వయంగా తన చేతులతో స్వెటర్లు, స్కార్ఫ్‌లు అల్లేది. లాక్‌డౌన్‌లో ఇంటికొచ్చినప్పుడు మళ్లీ వాటిని తయారుచేయమని ఆమెను అడిగాను. దీంతో ఊలుతో చిన్నపిల్లల దుస్తులు, స్కార్ఫ్‌లు అల్లడం ప్రారంభించింది. అదేవిధంగా చలికాలంలో పిల్లల చేతులు, పాదాలకు తొడిగే గ్లోవ్స్‌, సాక్స్‌లను కూడా అల్లింది. ఆ తర్వాత ‘CaughtCraftHanded’ అనే ఓ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని క్రియేట్‌ చేసి అందులో వాటి ఫొటోలను అప్‌లోడ్‌ చేశాను. ప్రారంభంలో ఎవరూ స్పందించలేదు. అయితే నానమ్మ వెనక్కు తగ్గలేదు. తనకు తెలిసిన విద్యకు మరింత సృజనాత్మకతను జోడించింది. ఆకట్టుకునే దిండు కవర్లు, కుషన్‌ కవర్లు, వాటర్‌ బాటిళ్లు, మగ్‌ వార్మర్లు, హెడ్‌ బ్యాండ్స్‌, చెవిరింగులు, బ్యాగ్‌లను వివిధ రంగుల్లో రూపొందించింది. వీటికి ఊహించని స్పందన రావడంతో ఇక వెనక్కు తిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది’..

ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది!

‘మేం గతేడాది ‘CaughtCraftHanded’ పేజీని ప్రారంభించాం. ప్రారంభంలో నెలకు 8-10 ఆర్డర్లు వచ్చేవి. అయితే క్రమంగా ఆర్డర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం నెలకు 20కు పైగా ఆర్డర్లు వస్తున్నాయి. ఆదాయం కూడా బాగానే ఉంటోంది. విక్రయాలు, ఆదాయాల సంగతెలా ఉన్నా నానమ్మ ఇప్పుడు సంతోషంగా ఉంటోంది. విశ్రాంతి తీసుకునే వయసులో ఒక వ్యాపకం కల్పించుకుని సంపాదిస్తున్నందుకు ఎంతో సంతృప్తిగా ఉందంటోంది. రోజూ పొద్దున లేవగానే ఇంటి పనులన్నీ పూర్తి చేస్తోంది. ఆ తర్వాత అల్లికల పనుల్లో మునిగిపోతోంది. ఎక్కడా ‘ఒంటరి’ అన్న భావన ఆమెలో కనిపించడం లేదు. నానమ్మను అలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నేను కూడా త్వరగా పని ముగించుకుని నానమ్మతో ఎక్కువ సమయం గడిపేందుకు ట్రై చేస్తున్నాను. తన పనుల్లో పాలుపంచుకుంటున్నాను’ అని అంటోంది యుక్తి.మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని