ప్రత్యర్థి ఎవరైనా సరే గోడ కట్టేస్తుంది.. బంతిని ఆపేస్తుంది! - meet the great wall of indian women hockey team savita punia in telugu
close
Updated : 03/08/2021 19:58 IST

ప్రత్యర్థి ఎవరైనా సరే గోడ కట్టేస్తుంది.. బంతిని ఆపేస్తుంది!

(Photo: Instagram)

ఆమె కుటుంబానికి హాకీ అంటే ప్రాణం. అందుకే తరచూ రేడియోలో హాకీ కామెంట్రీ వినేవారు. అలా వినీ వినీ ఆమెకూ చిన్నతనం నుంచే హాకీ క్రీడంటే మక్కువ పెరిగింది. అయితే ఈ క్రీడపై ఇష్టం ఉన్నా.. ఆమె మనసు మాత్రం జూడో, బ్యాడ్మింటన్‌ వైపే లాగేది. కానీ తాతయ్య ప్రోత్సాహంతో ముందు అయిష్టంగానే హాకీలో శిక్షణ తీసుకుంది.. ఆపై ఆ ఆట పైనే ప్రాణం పెట్టింది.. ఇప్పుడు భారత మహిళల హాకీ జట్టులో కీలక సభ్యురాలిగా మారి.. జట్టు విజయాల్లో ముఖ్య భూమిక పోషిస్తోంది. ఆమె మరెవరో కాదు.. మహిళల హాకీ జట్టు గోల్‌కీపర్‌ సవితా పూనియా.

గోల్‌పోస్ట్‌ ముందు గోడలా మారి విశ్వవేదికపై జట్టును సెమీస్కు చేర్చడంలో ఈ హరియాణా అమ్మాయి చూపిన క్రీడా ప్రదర్శనపై దేశవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. అందుకే హాకీ ఇండియా కూడా ‘వాల్‌ అనే పదానికి సరికొత్త అర్థం సవిత’ అంటూ కొనియాడింది. మరి, వద్దు వద్దంటూనే హాకీని ఎంచుకొని.. జట్టు విజయాల్లో తనదైన ముద్ర వేస్తోన్న సవిత క్రీడా ప్రస్థానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం..!

హరియాణా.. ఆడపిల్లలపై వివక్ష ఉన్న రాష్ట్రమది. అక్కడి సిర్సా నగరంలోని జోధ్‌కన్‌ అనే గ్రామంలో 1990లో పుట్టింది సవితా పూనియా. రాష్ట్రమంతా ‘ఆడపిల్లలకు చదువు, ఆటలెందుకు.. ఈడొచ్చాక పెళ్లి చేస్తే భారం దిగిపోతుంది..’ అన్న ధోరణే! కానీ సవిత కుటుంబం ఇందుకు మినహాయింపు. ముఖ్యంగా ఆమె తాతయ్యకు తన పిల్లలు చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి అని ఉండేదట! అలా సవిత తండ్రి పెద్ద చదువులు చదువుకున్నారు. ప్రస్తుతం అక్కడి దింగ్‌ గ్రామంలోని పీహెచ్‌సీలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్నారు. ఇదే చదువును తన పిల్లలకూ అందించాలనుకున్నారాయన.

అయిష్టంగానే హాకీలోకి..!

ఆడపిల్లలకు చదువే కాదు.. వారికి ఇష్టమైతే ఆటల్లోనూ తగిన ప్రోత్సాహం అందించాలనే ఆలోచన సవిత కుటుంబంలో ముందు నుంచీ ఉంది. ఇది సవితకు కలిసొచ్చింది. అయితే హాకీ మ్యాచ్‌ జరిగినప్పుడల్లా ఆ కామెంట్రీని రేడియోలో వింటుండే వారు ఆమె కుటుంబ సభ్యులు. అలా తనకూ ఆ కామెంట్రీ వినడం అలవాటైంది. అదే హాకీపై ఆమెకు ఇష్టం ఏర్పడేలా చేసింది. కానీ మనసులో ఏదో మూల అసంతృప్తి. ఎందుకంటే హాకీ కంటే ఆమె మనసు జూడో లేదా బ్యాడ్మింటన్‌ను ఎంచుకోమని కోరింది. కానీ తాతయ్య ప్రోత్సాహంతో హాకీనే తన అంతిమ కెరీర్‌గా మలచుకోవాల్సి వచ్చింది సవిత. అది కూడా ముందు అయిష్టంగానే హిసర్‌లోని స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAI) లో చేరింది.

కిట్‌ ధర తెలుసుకొని మనసు మార్చుకున్నా!

వద్దని మనసు చెప్పినా తాతయ్యను, కుటుంబాన్ని బాధ పెట్టడం ఇష్టం లేక హాకీ శిక్షణలో చేరిన సవిత.. కొన్నాళ్ల పాటు అయిష్టంగానే అందులో శిక్షణ పొందింది. కానీ ఎప్పుడైతే తన తండ్రి తనకు హాకీ కిట్‌ కొనిచ్చాడో అప్పుడు తన మనసును పూర్తిగా మార్చుకున్నానంటోందీ హరియాణా అమ్మాయి.

‘నేను హాకీలోకి రావడానికి, ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నానంటే అది మా తాతయ్య ప్రోత్సాహమే! నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు అమ్మకు ఆరోగ్యం బాగోలేదు. ఆర్థ్రైటిస్‌ కారణంగా ఆ సమయంలో అమ్మను ఆస్పత్రిలో చేర్చాల్సి వచ్చింది. దాంతో ఇంటి పనులన్నీ నా మీదే పడ్డాయి. కానీ అలా నేను పనులు చేయడం, ఇంటికే పరిమితమవడం తాతయ్యకు నచ్చలేదు.

‘నీలో ఉన్న తృష్ణను తట్టి లేపు.. నువ్వు అనుకున్నది సాధించు!’ అంటూ ఆయన నన్ను ప్రోత్సహించారు. హాకీలో శిక్షణ ఇప్పించేందుకు నన్ను సాయ్‌లో చేర్పించారు. అయితే హాకీ ఆడడం నాకు ఇష్టం లేదని తాతయ్యతో చెప్పే ధైర్యం చేయలేకపోయా.. కానీ ఇదే విషయం నాన్నకు చెప్పా. ఆయన మారు మాట్లాడకుండా రూ. 20 వేలు పెట్టి నాకు గోల్‌కీపింగ్‌ కిట్‌ కొనిచ్చారు. నిజానికి మా నాన్న నెల జీతం అప్పుడు రూ. 12 వేలు. కానీ అదనంగా డబ్బు పోగేసి కిట్‌ కొనడంతో వాళ్లు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకూడదనుకున్నా.. ఇక అప్పట్నుంచి హాకీపై పూర్తి దృష్టి పెట్టా..’ అంటూ చెప్పుకొచ్చింది సవిత.

ఎత్తు కలిసొచ్చింది!

స్పోర్ట్స్‌ అకాడమీలో శిక్షణలో చేరాక ఇంటి నుంచి శిక్షణ స్థలానికి రోజూ పోను రెండు గంటలు, రాను రెండు గంటల పాటు వెచ్చించేదామె. ఈ క్రమంలో హాకీ కిట్‌ బ్యాగ్‌, ఇతర దుస్తులు-వెంట తీసుకెళ్లే వస్తువులు.. ఇలా మొత్తంగా 20 కిలోల పైనే బరువును మోస్తూ కిక్కిరిసిన బస్సుల్లో ప్రయాణం చేసేదామె. ఇక తన టీమ్‌లో అందరికన్నా సవిత ఎత్తే ఎక్కువ (5’7’’)! దాంతో కోచ్‌ ఆమెకు గోల్‌ కీపర్‌గా నైపుణ్యాలు నేర్పించారు. 2007లో లక్నోలో నిర్వహించిన ‘నేషనల్‌ క్యాంప్‌’కు ఎంపికైన సవితకు అక్కడ అత్యుత్తమ కోచ్‌ల పర్యవేక్షణలో శిక్షణ ఇప్పించారు. అప్పుడామె వయసు 17 ఏళ్లు. ఇలా తన గోల్‌కీపింగ్‌ మెలకువల్ని మెరుగుపరచుకున్నా.. జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడానికి సవిత నాలుగేళ్ల పాటు నిరీక్షించక తప్పలేదు.

గోల్‌పోస్ట్‌ ముందు గోడలా..!

హాకీలో ప్లేయర్స్‌ చురుగ్గా కదులుతూ, ప్రత్యర్థుల్ని ఎదుర్కొంటూ గోల్‌ చేయడం ఎంత కష్టమో.. గోల్‌పోస్ట్‌ ముందు నిలబడి ప్రత్యర్థి విసిరే గోల్‌ని ఆపడం అంతకంటే కష్టమైన పని! ఈ బాధ్యతను సవిత సమర్థంగా నిర్వర్తిస్తోందని చెప్పాలి. 2011లో జాతీయ జట్టులో ప్రవేశించి తొలి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన ఆమె.. 2013లో ఆసియా కప్‌లో టీమిండియా కాంస్య పతకం అందుకోవడంలో, 2015 FIH Hockey World League లో జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసి 2016 రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో కీలక భూమిక పోషించింది. ఆ తర్వాత 2016 ఆసియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2017 ఆసియా కప్‌, 2018 ఏషియన్‌ గేమ్స్‌లో రజతం, 2018 ప్రపంచకప్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకూ భారత మహిళ హాకీ జట్టు చేరుకోవడంలో ఆమె తనదైన క్రీడాప్రతిభను చూపింది.

ఇలా ఎన్నో మ్యాచుల్లో గోల్‌పోస్ట్‌ ముందు గోడలా నిలిచి ప్రత్యర్థిని శాసించిన సవిత.. తాజా ఒలింపిక్స్‌లోనూ చెలరేగుతోంది. ఆసీస్‌తో జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థికి ఎనిమిది పెనాల్టీ షూటౌట్స్‌ కొట్టే అవకాశం వచ్చినా.. ఒక్కసారి కూడా బంతిని లోపలికి వెళ్లనివ్వకుండా గోడ కట్టేసింది సవిత. అందుకే హాకీ ఇండియా కూడా ‘వాల్‌కు సరికొత్త అర్థం సవిత’ అంటూ ఆమె క్రీడాస్ఫూర్తిని కొనియాడింది. ఫలితంగా టీమిండియా మరపురాని విజయంతో, విజయగర్వంతో సెమీస్‌లోకి అడుగుపెట్టింది.

తన అద్భుతమైన క్రీడా ప్రతిభకు గుర్తింపుగా 2015లో ‘హాకీ ఇండియా యాన్యువల్ అవార్డ్స్‌’లో భాగంగా ‘బాల్‌జిత్‌ సింగ్‌ గోల్‌కీపర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు, 2018లో ‘అర్జున అవార్డు’ అందుకుంది సవిత.

మన అమ్మాయిలు ఇదే దూకుడును, నిండైన ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించి దేశానికి ‘పసిడి’ పంట పండించాలని, సరికొత్త చరిత్ర సృష్టించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..!

చక్‌ దే ఇండియా!

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని