జుట్టుకి మెంతులు ఎంత మంచివో తెలుసా? - methi hair packs for healthy hair in telugu
close
Updated : 17/08/2021 16:53 IST

జుట్టుకి మెంతులు ఎంత మంచివో తెలుసా?

నళిని కొంత కాలంగా చుండ్రు సమస్యతో బాధపడుతోంది. ఎన్ని షాంపూలు ప్రయత్నించినా సమస్య తగ్గట్లేదు సరికదా.. జుట్టు ఎక్కువగా రాలిపోవడం ప్రారంభించింది. ఇదే విషయం తన స్నేహితురాలితో చెబితే.. మెంతులు, పెరుగు కలిపి ప్యాక్ వేసుకోమని, అది చుండ్రుని నివారించడంలో బాగా పనిచేస్తుందని సూచించింది.

ఈమధ్య జుట్టు బాగా రాలిపోతోందని తల్లితో చెబుతూ బాధపడుతోంది రవళి. ఎందుకు దిగులు పడతావ్.. మెంతుల్ని మెత్తగా రుబ్బి కుదుళ్లకు పట్టించు.. మంచి ఫలితం ఉంటుందని అమ్మ చెప్పడంతో వెంటనే ఆ చిట్కా ఆచరణలో పెట్టింది రవళి.

కుదుళ్లలో విపరీతమైన దురద, జుట్టు చివర్లు చిట్లి పోవడం, పొడిబారిపోవడం.. ఇలా కేశాలకు సంబంధించి ఒక్కొక్కరూ ఒక్కో సమస్యతో బాధపడుతుంటారు. వీటన్నింటినీ దూరం చేయడంలో మన వంటింట్లో లభించే మెంతుల పాత్ర కీలకమనే చెప్పుకోవచ్చు. అంతేకాదు.. జుట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఈ పదార్థం ద్వారా అందుతాయి. మనం చేయాల్సిందల్లా జుట్టు సమస్యను బట్టి మెంతులతో కొన్ని ప్యాక్‌లు తయారుచేసుకొని ఉపయోగించడమే..!

తేమనందించడానికి..

చలికాలంలో జుట్టు పొడిబారిపోవడం, నిర్జీవంగా తయారవడం సహజమే. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతులతో తయారుచేసిన ప్యాక్ ఉపయోగించాల్సిందే. అయితే జుట్టుకు తేమనందించడానికి కొబ్బరి నూనె చాలా బాగా ఉపయోగపడుతుందన్న విషయం తెలిసిందే. అందుకే మెంతులతో తయారుచేసే హెయిర్ ప్యాక్‌లో కొబ్బరి నూనెను కూడా చేర్చితే సరిపోతుంది. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతుల పొడిలో ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. ఈ ప్యాక్ పొడిబారిపోయిన జుట్టుకు తేమనందించడంతో పాటు జుట్టు రాలే సమస్యను అరికడుతుంది.

నూనెల్ని నియంత్రిస్తుంది..

కుదుళ్లలో నూనెలు ఎక్కువగా విడుదల కావడం వల్ల చుండ్రు సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. మరి, కుదుళ్లలో నూనెల్ని నియంత్రించాలంటే మెంతులతో తయారుచేసిన ఈ ప్యాక్ ఉపయోగించాల్సిందే! ఇందుకోసం గుప్పెడు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో రెండు చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్, తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పోసి కాసేపు ఉంచాలి. ముఖ్యంగా యాపిల్ సిడార్ వెనిగర్ కుదుళ్లలో పేరుకుపోయిన ఎక్కువ నూనెల్ని పీల్చుకుంటుంది. ఫలితంగా కుదుళ్లలో అధికంగా విడుదలయ్యే నూనెల శాతం తగ్గుతుంది.

దురద తగ్గాలంటే..

కుదుళ్లు పొడిబారిపోవడం, చుండ్రు.. తదితర సమస్యల వల్ల కుదుళ్లలో విపరీతమైన దురద వస్తుంటుంది. తద్వారా చిరాగ్గా అనిపిస్తుంది. మరి ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మెంతులతో తయారుచేసిన ఈ ప్యాక్ ప్రయత్నించండి. ఒక కప్పు మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని మెత్తటి పేస్ట్‌లా చేసి అందులో గుడ్డులోని పచ్చసొన వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు ప్యాక్‌లా వేసి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కుదుళ్లలో దురద క్రమంగా తగ్గుతుంది. అంతేకాదు.. జుట్టు ప్రకాశవంతంగానూ మారుతుంది.

జుట్టు తెల్లబడకుండా..

ప్రస్తుతం పలువురు ఎదుర్కొంటున్న కేశ సంబంధిత సమస్యల్లో సమస్యల్లో చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు రావడం ఒకటి. మరి, దీన్ని నివారించడంలో మెంతులు చాలా బాగా తోడ్పడతాయి. కొన్ని కరివేపాకుల్ని నీళ్లలో వేసి బాగా మరిగించాలి. మెంతుల్ని రాత్రంతా నీటితో నానబెట్టాలి. ఉదయాన్నే మెంతులు, మరిగించిన కరివేపాకు రసం కలిపి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై చల్లటి నీళ్లతో, గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు తెల్లబడే సమస్యను నివారించుకోవచ్చు.

చివర్లు చిట్లుతున్నాయా?

వాతావరణ కాలుష్యం వల్ల తలెత్తే జుట్టు సమస్యలు అన్నీ ఇన్నీ కావు. అందులో జుట్టు చివర్లు చిట్లడం కూడా ఒకటి. మరి ఈ సమస్య నుంచి బయటపడాలంటే మెంతుల్ని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్ట్‌లా నూరుకోవాలి. దీన్ని జుట్టుకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల జుట్టు చివర్లు చిట్లకుండా కాపాడుకోవచ్చు. మెంతుల్లోని ఆమ్లాలు కేశాలు ఒత్తుగా పెరిగేందుకూ సహాయపడతాయి. అంతేకాదు.. ఈ ప్యాక్ జుట్టుకి కండిషనర్‌గానూ పనిచేస్తుంది.

కురుల దృఢత్వానికి..

కురుల పోషణలో భాగంగా వాటిని దృఢంగా ఉంచుకోవడానికి ఎన్నో రకాల చిట్కాలు ప్రయత్నిస్తుంటారు అమ్మాయిలు. ఈ క్రమంలో మీరెప్పుడైనా మెంతులతో తయారుచేసిన ఈ ప్యాక్‌ని ఉపయోగించారా? నాలుగు టేబుల్ స్పూన్ల మెంతుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. దీనికి సరిపడా కొబ్బరి పాలను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు, జుట్టుకు అప్త్లె చేసి, షవర్ క్యాప్ పెట్టుకొని అరగంట పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే కేశాలు కుదుళ్ల నుంచి దృఢంగా తయారవుతాయి.

ఒత్తుగా పెరగడానికి..

జుట్టు రాలకుండా కాపాడుకోవడమే కాదు.. ఒత్తుగా పెరిగేందుకు కూడా మెంతులు సహకరిస్తాయి. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల మెంతుల్ని ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెలో వేసి మెంతులు ఎర్రగా మారేంత వరకూ బాగా మరిగించాలి. ఆ తర్వాత మెంతుల్ని నూనెలోంచి తొలగించి.. నూనెను గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కన పెట్టాలి. ఆపై రాత్రి పడుకునే ముందు దీంతో కుదుళ్లకు, జుట్టుకు మర్దనా చేసి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఉదయం లేచాక గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా మెంతుల్లోని లెసిథిన్ అనే పదార్థం జుట్టుకు పోషణనందించడంతో పాటు కుదుళ్లను బలంగా తయారుచేస్తుంది.


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని