Money Management: ప్రతి దశలోనూ ఇది అవసరమే! - money management tips to women at every stage of life in telugu
close
Published : 18/08/2021 15:27 IST

Money Management: ప్రతి దశలోనూ ఇది అవసరమే!

కీర్తనకు బీటెక్‌ పూర్తవగానే ఓ మంచి ఎమ్మెన్సీలో ఉద్యోగం వచ్చింది. నెలనెలా ఐదంకెల జీతం చేతికందుతుండడంతో తనకు అవసరం ఉన్నా లేకపోయినా నచ్చిందల్లా కొనేస్తుంది.

మృదుల సింగిల్‌ మదర్. తన భర్త ఇటీవలే కాలం చేయడంతో ఇద్దరు పిల్లల బాధ్యత తనపై పడింది. దీంతో చిరుద్యోగి అయిన తను ఆ డబ్బుతో వాళ్ల అవసరాలు ఎలా తీర్చాలో ఆమెకు అర్థం కావట్లేదు.

పురుషులతో సమానంగా డబ్బు సంపాదించడం ఈ తరం మహిళలకూ అలవాటైపోయింది. అయితే ‘డబ్బు పొదుపు చేయడం, ఖర్చుకు సంబంధించిన వ్యవహారాలన్నీ తమ తండ్రులో, భర్తలో చూసుకుంటారు కదా.. మాకెందుకు ఇవన్నీ.. వచ్చిన జీతంతో హాయిగా ఎంజాయ్‌ చేయచ్చ’న్న ఆలోచనతో ఉంటారు కొందరు మహిళలు. కానీ డబ్బు సంపాదించడమే కాదు.. డబ్బు నిర్వహణ గురించి కూడా మహిళలకు తెలిసుండాలంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. అప్పుడే కుటుంబం ఆర్థికంగా దృఢంగా ఉంటుందంటున్నారు. అంతేకాదు.. మహిళలు ప్రతి దశలోనూ కొన్ని పొదుపు సూత్రాలు పాటించాలని సూచిస్తున్నారు. మరి, అవేంటో మనమూ తెలుసుకుందాం రండి..

‘మేం ఉద్యోగం చేసేది మా కోసం.. మా అవసరాల కోసం.. ఇతరులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా ఖర్చు పెట్టుకోవడం కోసం..’ అన్న ఆలోచనతో ఉంటారు కొంతమంది మహిళలు. మరికొందరు.. తమ కుటుంబ ఆర్థిక అవసరాలకు ఆసరాగా ఉండడానికి ఉద్యోగం చేస్తుంటారు. అయితే ఎవరి మనసులో ఏమున్నా.. ఉద్యోగం చేస్తున్నా, గృహిణిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా.. మహిళలకు ప్రతి దశలోనూ డబ్బు నిర్వహణ, పొదుపు సూత్రాలకు సంబంధించిన పలు విషయాలు తెలిసుండడం అవసరం అంటున్నారు నిపుణులు.

‘తొలి’ మోజులోంచి బయటపడండి!

తొలి ఉద్యోగం, తొలి సంపాదన.. ఎవరికైనా ఇది ప్రత్యేకమే! ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు 20ల్లోనే ఉద్యోగం సంపాదించడం, ఐదంకెల జీతం అందుకోవడం.. కామనైపోయింది. అయితే ఈ వయసులో తమపై బరువు బాధ్యతలేవీ ఉండవు కాబట్టి సంపాదించిన మొత్తాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టచ్చు, తమకు నచ్చిన వస్తువులన్నీ కొనేసుకోవచ్చన్న భావనతో ఉంటారు చాలామంది అమ్మాయిలు. అదిగో ఆ పొరపాటే చేయొద్దంటున్నారు నిపుణులు. వయసు చిన్నదే అయినా పరిణతితో ఆలోచించమంటున్నారు. వచ్చిన డబ్బుతో అత్యవసరమైన ఖర్చులకు కొంత డబ్బును వెచ్చించి.. మిగతా సొమ్మును పొదుపు-మదుపు చేయమంటున్నారు. ఈ క్రమంలో స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని.. వాటిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం మంచిది. ఇందుకు నష్టభయం లేని మ్యూచువల్‌ ఫండ్స్‌, సిప్‌.. వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా ఎప్పుడు ఏ అవసరం వస్తుందో చెప్పలేం కాబట్టి.. ఓ మంచి ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడమూ ఉత్తమమే! రిటైర్మెంట్‌, ఇల్లు-బంగారం కోసం కూడా కొంత మొత్తం చొప్పున కేటాయించుకుంటే.. భవిష్యత్తుపై పూర్తి భరోసా ఉంటుంది.

ఖర్చులూ కలిసి పంచుకోవాలి!

పెళ్లయ్యాక పెరిగే కుటుంబ బాధ్యతల రీత్యా డబ్బు నిర్వహణ తమ వల్ల కాదనుకుంటారు కొందరు మహిళలు. నిజానికి భర్త సంపాదనకు భార్య ఉద్యోగం కూడా తోడైతే ఆ కుటుంబం ఆర్థికంగా మరింత పటిష్టంగా ఉంటుందంటున్నారు నిపుణులు. అయితే ఈ క్రమంలో భవిష్యత్తు అవసరాలు, పిల్లల బాధ్యతల్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చులు, ఆర్థిక అవసరాల్ని కలిసి పంచుకుంటే మెరుగైన ఫలితం ఉంటుందంటున్నారు. ఇప్పటికే నిత్యావసర ఖర్చులు, గృహ రుణం చెల్లించడం, పొదుపు పథకాలు.. వంటివి భర్త నిర్వర్తిస్తున్నప్పుడు.. భార్య తన సంపాదనను పిల్లల చదువులు, వారి పెళ్లిళ్లు, బంగారంపై పెట్టుబడులు పెట్టడం, రిటైర్మెంట్‌ ప్లానింగ్‌.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాలపై వెచ్చించచ్చు. వీటితో పాటు ఎవరికి వీలైనట్లుగా వారు కొంత అత్యవసర నిధిని కూడా ఏర్పాటుచేసుకోవడం మంచిది. పెళ్లయ్యాక ఇలాంటి ప్రణాళిక ఉంటే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆర్థికంగా ఇబ్బంది తలెత్తదు.

ప్రతి రూపాయీ లెక్కే!

పెళ్లయ్యాక అందరు మహిళలు ఉద్యోగం చేయాలని లేదు. కుటుంబ బాధ్యతలు, ఇతర కారణాల రీత్యా వివాహం తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి గృహిణిగా కొనసాగాల్సి రావచ్చు. అలాంటప్పుడు ‘మేం సంపాదించట్లేదు.. కాబట్టి పొదుపు-మదుపుతో మాకు సంబంధం లేదు’ అంటూ చేతులు దులుపుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇంట్లో ఉన్నా డబ్బు నిర్వహణపై దృష్టి పెట్టి ప్రతి రూపాయీ వృథా కాకుండా బడ్జెట్‌ వేసుకోవడం ఎంతో ముఖ్యమంటున్నారు. ఈ క్రమంలో నెలనెలా ఇంటి అవసరాలు, ఖర్చులకు సంబంధించి భార్యాభర్తలిద్దరూ చర్చించుకొని కొంత బడ్జెట్‌ను నిర్దేశించుకోవాలి. అందులో అత్యవసరమైన వాటికే ఖర్చు పెట్టి మిగిలిన మొత్తాన్ని పోస్టాఫీస్‌ ఆర్డీ, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌, చిట్స్‌.. వంటి నెలవారీ పొదుపు పథకాల్లో పెడితే నష్టభయం ఉండదు.. దీర్ఘకాలంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీకు బంగారమంటే మక్కువ ఉంటే.. సిప్‌ ద్వారా గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌/ఈటీఎఫ్‌లలో ఈ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టచ్చు.

వాళ్ల అవసరాలే ముఖ్యం!

అనుకోకుండా భర్తను కోల్పోవడం లేదంటే భర్త నుంచి విడిపోవడం.. ఈ రెండు సందర్భాల్లో సింగిల్‌ మదర్‌గానే మహిళలు తమ పిల్లల బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు పిల్లల చదువు, పెళ్లి.. వంటి దీర్ఘకాలిక లక్ష్యాల పైనే ఎక్కువ దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో అప్పటికే వీటికి సంబంధించిన పొదుపు పథకాల్లో డబ్బు జమ చేస్తుంటే వాటిని కొనసాగించడం.. కొత్తగా చేయాలనుకుంటే టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవడం చక్కటి మార్గమంటున్నారు. దీనివల్ల పిల్లల భవిష్యత్తు అవసరాలను తీర్చచ్చంటున్నారు. దీంతో పాటు ఆరు నెలలకు సరిపడా అత్యవసర నిధిని జమ చేసుకోవడమూ ముఖ్యమేనంటున్నారు. అలాగే మీ పెట్టుబడులు, వాటిలోని లాభ-నష్టాల గురించి కూడా ఏ నెలకానెల చెక్‌ చేసుకోవడమూ మర్చిపోవద్దు.

రిటైర్మెంట్‌ తర్వాతా..!

సాధారణంగా చాలామంది విషయంలో.. రిటైర్మెంట్‌ వయసొచ్చే నాటికే పిల్లల చదువులు-పెళ్లిళ్లు, ఇంటి రుణం.. వంటి పెద్ద లక్ష్యాలన్నీ తీరిపోయి ఉంటాయి. ఆ సమయంలో ఉద్యోగం లేకపోయినా నెలనెలా పెన్షన్‌ చేతికందుతుంది.. కాబట్టి ఎలాంటి చింతా ఉండదు. అలాగని వచ్చిన పెన్షన్‌ను, అద్దె రూపంలో వచ్చిన డబ్బును వృథా చేయకుండా సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌, పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌, ఎఫ్‌డీ, మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టచ్చు. అలాగే పన్ను రహిత బాండ్లలోనూ పెట్టుబడి పెట్టడం వల్ల ఎక్కువ రాబడి పొందడంతో పాటు.. రాబడిపై ఎలాంటి పన్ను ఉండదు. ఇలా మీరు పొదుపు చేసిన డబ్బును ఇటు మీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మీ పిల్లలకూ అందించి సాయపడచ్చు.

ఇవన్నీ చదువుతుంటే మనకూ ప్రతి దశలోనూ డబ్బు నిర్వహణ ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. డబ్బును వృథా చేయకుండా ఇలా ఓ పక్కా ప్రణాళిక ప్రకారం కూడబెట్టుకుంటే ఇక భవిష్యత్తులో ఆర్థికంగా నష్టాలొచ్చే అవకాశాలు చాలా అరుదుగా ఉంటాయి. అలాగే డబ్బు నిర్వహణ, పొదుపు-మదుపు.. వంటి విషయాల్లో మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే నిపుణుల్ని అడిగి నివృత్తి చేసుకోవచ్చు.



మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని