ప్రేమించలేదని.. ఆ ఫొటోలతో పరువు తీయాలనుకున్నాడు! - mumbai woman shared her blackmailing story and how parents supported her to overcome this threat
close
Published : 08/07/2021 17:34 IST

ప్రేమించలేదని.. ఆ ఫొటోలతో పరువు తీయాలనుకున్నాడు!

ఆడపిల్లలంటేనే మన సమాజానికి ఒక రకమైన చిన్న చూపు! ఆడ-మగ మధ్య ఏ విషయంలో తప్పు జరిగినా ఆఖరికి అది అమ్మాయి మీదకే వస్తుంది. తనది తప్పు కాకపోయినా ఈ లోకం తన పైనే నిందలేస్తుంది.. ఇక కొంతమంది అమ్మానాన్నలైతే తమ కుటుంబ పరువు ఎక్కడ గంగలో కలుస్తుందో అని కూతురు నోరు నొక్కేస్తుంటారు. నా తల్లిదండ్రులు ఇలాంటి వారు కాకపోవడం నేను చేసుకున్న పూర్వ జన్మ సుకృతం అంటోంది ముంబయికి చెందిన సాయేషా షానో. తనకు గడ్డు పరిస్థితులు ఎదురైనప్పుడు తన తల్లిదండ్రులు సమాజం నుంచి కాకుండా తన వైపు నుంచి ఆలోచించారని, అసలు తప్పెవరిదో తెలుసుకున్నారని, అమ్మానాన్నలందరూ ఇలా ఉంటే ఆడపిల్లలకు తల దించుకునే అవసరమే రాదంటోంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం తన జీవితంలో జరిగిన ఓ చేదు అనుభవాన్ని ఇలా గుర్తు చేసుకుందామె.

అత్యాచారం జరిగితే.. చేసింది మగాడే అయినా.. అమ్మాయి వేసుకున్న దుస్తులు, చూసే చూపుల వల్లే అలా జరిగిందంటారు. ఇక ఓ ఆకతాయి ఓ అమ్మాయి ఫొటోను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే.. తప్పు చేసిన వాడు కాకుండా అమ్మాయే తలదించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో సపోర్ట్‌ చేయాల్సిన తల్లిదండ్రులు సమాజానికి భయపడి తమ కూతురిదే తప్పన్నట్లుగా వారిని నాలుగ్గోడలకే పరిమితం చేస్తున్నారు. రోజుకు ఇలాంటివెన్నో చూస్తున్నాం. అయితే అందరు అమ్మానాన్నల్లా మా పేరెంట్స్‌ కూడా వెనకా ముందూ ఆలోచించకుండా కూతురిదే తప్పంటే ఇప్పుడు ఇలా నేను మీ ముందుకు వచ్చేదాన్నే కాదు.

నేను, అమ్మ, నాన్న, తమ్ముడు.. చీకూ చింతా లేని అందమైన కుటుంబం మాది. మా మధ్య ఎలాంటి దాపరికాలూ ఉండవు. ఒక్కమాటలో చెప్పాలంటే చిన్నా పెద్దా తేడా లేకుండా ఇంట్లో మేమంతా పేర్లతోనే పిలుచుకుంటాం. అందుకే ఒక్క రోజు ఏదైనా పని మీద వేరే ఊరు లేదంటే బంధువులిళ్లకు వెళ్లాల్సి వచ్చినా నా ఫ్యామిలీని ఎంతో మిస్సవుతుంటా. ఇక నాన్ననైతే ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేనంటే నమ్మండి. ఇలా మా కుటుంబంలోని అన్యోన్యతను చూసి కొంతమంది స్ఫూర్తి పొందితే.. మరికొందరు కుళ్లుకునేవారు. ఇలాంటి కుళ్లు బుద్ధి మా ఫ్రెండ్‌ సర్కిల్‌లో సాకేత్‌కి ఉందని మొదట్లో నాకు తెలియలేదు. నిజానికి తను నాకు ఇంటర్‌ క్లాస్‌మేట్‌. ఇంజినీరింగ్‌లోనూ కలిసే చదువుకున్నాం. అలా మా మధ్య పరిచయం పెరిగింది..

******

అయితే నేను తనను మంచి స్నేహితుడిగానే చూశాను తప్ప.. తను నన్ను ప్రేమిస్తున్నాడన్న విషయం నేను ఊహించలేకపోయా. ఓ రోజు కాలేజ్‌లో ఎదురుపడి తన మనసులోని మాట నాతో చెప్పాడు. ‘నిన్ను ప్రేమిస్తున్నా.. నువ్వు ఓకే అంటే మీ పెద్దవాళ్లతో మాట్లాడతా..’ అనేశాడు. ఆ వెంటనే నేనూ నా మనసులో ఏముందో చెప్పాను. ‘నేను నిన్ను ఓ బెస్ట్‌ ఫ్రెండ్‌గా చూశానే తప్ప.. నువ్వు నా లైఫ్‌లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు.. ఐ యామ్‌ సారీ..’ అని! దాంతో తను నిజంగానే హర్ట్‌ అయినట్లున్నాడు.. చాన్నాళ్ల పాటు ఒకే క్లాస్‌రూమ్‌లో కూర్చున్నా మాట్లాడకుండా ఉండేవాడు. మా మధ్య జరిగిన సంఘటన గురించి పట్టించుకోకుండా నేనే మాట్లాడడానికి ప్రయత్నించినా ఏదో అలా పైపైన మాట్లాడి నా నుంచి దూరంగా వెళ్లిపోయే వాడు. ఇక ఆ తర్వాత నేను కూడా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకొని వదిలేశా.

అయితే ఓ రోజు ఉన్నట్లుండి నాతో మునుపటిలా మాట కలిపాడు సాకేత్‌. ‘జరిగిందేదో జరిగిపోయింది.. ఇకపై మన స్నేహాన్ని కొనసాగిద్దాం’ అన్నాడు. నా మనసులో తనపై ఎలాంటి ద్వేషం లేదు.. అలాంటప్పుడు నేనెందుకు ఒప్పుకోకూడదు.. సరే అన్నా! అలా కొన్నేళ్లు గడిచిపోయాయి. చదువు పూర్తి చేసుకొని ఎవరి ఉద్యోగాల్లో వారు స్థిరపడ్డాం. ఈ క్రమంలోనే తనకు పెళ్లి కుదిరిందని, కార్డు ఇవ్వడానికి మా ఇంటికొచ్చాడు. ఆ తర్వాత అమ్మానాన్నలతో కలిసి సాకేత్‌ పెళ్లికి కూడా వెళ్లాం. అయితే అన్ని విషయాల్లో మా కుటుంబ సభ్యులతో పారదర్శకంగా ఉండే నేను.. సాకేత్‌ నాకు చేసిన లవ్‌ ప్రపోజల్‌ని మాత్రం ఇంట్లో చెప్పకుండా దాచా. నేను మా అమ్మానాన్నల దగ్గర దాచిన మొదటి, ఆఖరి సీక్రెట్‌ అదే!

******

సాకేత్‌ పెళ్లయ్యాక దిల్లీ వెళ్లిపోయాడు. అక్కడే కాపురం పెట్టాడు. ఈ క్రమంలో అప్పుడప్పుడూ తనతో, తన భార్యతో మాట్లాడేదాన్ని. అయితే మాటల సందర్భంలో ‘ఈసారి మీరు ముంబయి వస్తే మా ఇంటికి తప్పకుండా రావాలి..’ అని ఆ కొత్త జంటను ఆహ్వానించా. కొన్నాళ్లు పోయాక వెకేషన్‌ కోసమని సాకేత్‌ వాళ్ల ఆవిడను తీసుకొని ముంబయి వచ్చాడు. పని పూర్తయ్యాక ఇద్దరూ కలిసి మా ఇంటికొచ్చారు. రెండు మూడు రోజులు మా ఇంట్లోనే గడిపారు. అయితే వాళ్లు వెళ్లిపోయాక సరిగ్గా నెల రోజులకు నాకు తెలియని ఓ నంబర్ నుంచి నాకు వాట్సప్‌ మెసేజ్‌ వచ్చింది. నిజానికి అలాంటి నంబర్లకు నేను అస్సలు స్పందించను. కానీ ఆ నంబర్ నుంచి వచ్చిన మెసేజ్‌ చూసి నేను షాకయ్యా. ఎందుకంటే అందులో ఉంది నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు. నా ఫొటోలు మార్ఫింగ్‌ చేసి.. ఎవరో నాకు తెలియని అబ్బాయితో వాటిని జత చేసి అసహ్యంగా చిత్రీకరించారు.. అసభ్యంగా ఉన్న ఫొటోలకు నా ముఖాన్ని తగిలించారు. ఇలా మార్ఫింగ్‌ చేసిన ఫొటోలు చూడగానే ఏం చేయాలో నాకు పాలుపోలేదు. వెంటనే అమ్మానాన్న దగ్గరికి పరిగెత్తుకెళ్లా.

ఆ ఫొటోలన్నీ వారికి చూపించా. అంతలోపే మా ఫ్రెండ్స్‌, బంధువుల దగ్గర్నుంచి ఫోన్లు రావడం మొదలైంది. ‘ఆ ఫొటోల్లో ఉంది సాయేషానేనా? ఇంతకీ ఆ అబ్బాయెవరు?’ అంటూ సమాధానం చెప్పడానికి మాకు సమయమివ్వకుండా ప్రశ్నలేయడం మొదలుపెట్టారు. నిజానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెవరైనా పేరెంట్స్‌ అయితే తమ కూతురినే నిలదీస్తారు. ‘ఎవడే వాడు? ఈ ఫొటోలేంటి అసహ్యంగా.. మా పరువు తీశావు కదే!’ అంటూ ముందూ వెనకా ఆలోచించకుండా, అసలు నిజమేంటో తెలియకుండా విరుచుకుపడుతుంటారు. కానీ మా అమ్మానాన్న అలా చేయలేదు. ఓ గంట ఫోన్లన్నీ పక్కన పెట్టేసి.. తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించడం మొదలుపెట్టారు. అంతలోనే నాకెందుకో సాకేత్‌ మీద సందేహం కలిగింది. వాళ్లు మా ఇంట్లో ఉన్నప్పుడు వెకేషన్‌లో దిగిన ఫొటోల కోసమని మా ల్యాప్‌టాప్‌ వాడుకున్నారు. బహుశా.. ఇదంతా అతని పనే అయి ఉంటుందేమో అనుకున్నా. పైగా వాళ్లు మా ఇంటి నుంచి వెళ్లాకే ఇలాంటి ఘటన జరగడంతో నా అనుమానం మరింత బలపడింది.

******

వెంటనే నాన్నకు గతంలో జరిగిన విషయమంతా చెప్పాను. అదంతా విన్నాక తొందరపడడం మంచిది కాదని ఆ నంబర్ ఎవరిదో ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని పోలీస్‌ కంప్లైంట్‌ ఇచ్చారు. నేను అనుమానించిందే నిజమైంది. ఈ కుట్ర వెనక ఉన్నది సాకేత్‌ అని, తనే వాళ్ల ఆవిడతో ఇదంతా చేయించాడన్న విషయం విచారణలో తేలింది. అది విన్న నాన్న కోపం కట్టలు తెంచుకుంది.. వెంటనే వాడికి ఫోన్‌ చేసి నిలదీశాడు.

‘నా కూతురు నీకు ఏం అన్యాయం చేసింది.. నువ్వు ప్రేమించినంత మాత్రాన తను నిన్ను ప్రేమించాలని లేదు కదా.. అది తన నిర్ణయం! అంత చిన్న విషయానికే ఇంత నీచమైన పనికి దిగజారావ్‌’ అంటూ చెడామడా కడిగేశాడు. నిజానికి నాన్నలో అంత కోపం నేనెప్పుడూ చూడలేదు. చేసిన తప్పుకు పోలీసులు ఇచ్చిన ట్రీట్‌మెంట్‌తో ఏయే నంబర్లకైతే నా మార్ఫింగ్‌ ఫొటోలు పంపించాడో.. వాటన్నింటికీ అసలు ఫొటోలు పంపించాడు సాకేత్. అంతేకాదు.. ‘అందులో ఉన్నది సాయేషా కాదు.. ఈ ఫొటోలకు తనకు ఎలాంటి సంబంధం లేదు.. నన్ను క్షమించండి!’ అని వివరణాత్మకంగా సందేశం పెట్టాడు. అప్పుడు కానీ నా మనసు కుదుటపడలేదు.. నాన్న శాంతించలేదు. అప్పటిదాకా ఫోన్లలో వేధించిన మా బంధువులు, ఫ్రెండ్స్‌ కూడా మళ్లీ ఫోన్‌ చేసి తాము అన్న మాటలకు క్షమించమని అడిగారు.

******

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పటికీ గుర్తొస్తుంటుంది.. ఫొటో మార్ఫింగ్‌ అనేది అంత సిల్లీగా తీసుకునే విషయం కాదు.. ఇప్పుడు ఎంతోమంది అమ్మాయిలు ఈ సమస్యతో తప్పు తమది కాకపోయినా వాళ్లే తలదించుకోవాల్సి వస్తోంది. పేరెంట్స్‌ కూడా సమాజానికి భయపడి తమ కూతుళ్లనే తప్పుపడుతున్నారు. కానీ మా పేరెంట్స్‌ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా.. అసలు తప్పెవరిదో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అందరు తల్లిదండ్రులకు, నా తల్లిదండ్రులకు తేడా అదే! ఇలాంటి అమ్మానాన్నలకు కూతురిగా పుట్టడం నా అదృష్టం. ఇలా మా పేరెంట్స్‌ని చూసి కొంతమందిలోనైనా మార్పు రావాలని, తమ పిల్లల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా.

ఈ విషయం చెప్పడానికే నా కథంతా మీ అందరితో పంచుకున్నా. ఇక ఆఖరుగా అమ్మానాన్నలందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. ప్రతి దానికీ కూతురిదే తప్పు అన్నట్లుగా చూడకండి. ఇలాంటి పక్షపాత ధోరణి వల్ల ఎంతోమంది అమ్మాయిలు తమ బాధల్ని, సమస్యల్ని తమలోనే దాచుకుంటున్నారు. ప్రస్తుతం జరిగే అఘాయిత్యాలకు ఇదీ ఓ కారణమే! కాబట్టి కూతుళ్ల మనసు తెలుసుకోండి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ వాళ్లకు అండగా నిలబడండి..!

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని