టైలరింగ్‌ వ్యర్థాలతో విభిన్న వస్తువులు తయారుచేస్తోంది! - namrutha ramanathan upcyclie story in telugu
close
Published : 24/11/2021 18:03 IST

టైలరింగ్‌ వ్యర్థాలతో విభిన్న వస్తువులు తయారుచేస్తోంది!

(Photo: Instagram)

‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. వృథాగా పడేసే మెటీరియల్‌తోనూ విభిన్న వస్తువులు తయారుచేయచ్చని నిరూపిస్తోంది చెన్నైకి చెందిన నమృతా రామనాథన్‌. తద్వారా పర్యావరణాన్ని కాపాడడమే కాదు.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. వ్యాపారమే తన అంతిమ లక్ష్యంగా నిర్ణయించుకున్న నమృత.. ఇందుకోసం తన ఉద్యోగాన్ని సైతం వదులుకుంది. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా.. మనం చేసే పనిపై స్పష్టత, మక్కువ ఉంటే కచ్చితంగా అందులో విజయం సాధించగలమంటోన్న ఈ ఆంత్రప్రెన్యూర్‌ తన బిజినెస్‌ గురించి ఏం చెబుతోందో తెలుసుకుందాం రండి..

మనసులో ఒక లక్ష్యం పెట్టుకొని.. మరో పనిపై దృష్టి పెట్టడమంటే.. మనల్ని మనం మోసం చేసుకున్నట్లే! పైగా చేసే పనికీ న్యాయం చేయలేం. తొమ్మిదేళ్లు ఉద్యోగం చేశాక గానీ ఈ విషయాన్ని నేను గ్రహించలేకపోయా. ఈ క్రమంలోనే ఉద్యోగానికి రాజీనామా చేసి నాకు ఆసక్తి ఉన్న వ్యాపారంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నా. కానీ ఎలాంటి బిజినెస్‌ చేయాలన్న దానిపై మాత్రం నాకు పూర్తి స్పష్టత రాలేదు.

నాయనమ్మ స్ఫూర్తితో..!

అయితే నా బిజినెస్‌ ఆలోచనకు మా నాయనమ్మే స్ఫూర్తి అని చెప్తా. ఎందుకంటే తను ఓ రోజు తన నైట్‌ గౌన్‌ను ఆల్ట్రేషన్‌ చేసుకుంది. ఈ క్రమంలో మిగిలిపోయిన చిన్న ముక్కలతో మాకు మాస్కులు కుట్టిచ్చింది. అప్పుడర్థమైంది.. మనం వృథా అంటూ పడేసే చిన్న చిన్న గుడ్డ ముక్కలతో ఎన్నో ఉపయోగకరమైన వస్తువులు తయారుచేయచ్చని! పైగా మన ఇంట్లో మిగిలిపోయిన టైలర్‌ వ్యర్థాల కంటే.. పెద్ద పెద్ద టైలర్‌ షాపుల్లో ఇలాంటి కట్‌ పీసుల్ని ఎక్కువ మొత్తంలో వృథాగా పడేస్తుంటారు. అలాంటి వాటిని సేకరిస్తే బోలెడన్ని కొత్త వస్తువుల్ని రూపొందించచ్చు. ఈ ఆలోచనతోనే ‘Upcyclie’ పేరుతో నా సొంత వ్యాపారానికి నాంది పలికా.

కోర్సు నేర్చుకున్నా!

నిజానికి నాకు అప్పటికి కుట్టు మిషన్‌ పని తెలియదు. అలాంటప్పుడు టైలరింగ్‌ వ్యర్థాలకు ఓ రూపు ఎలా తీసుకురాగలను? అని ఆలోచించా. ఈ క్రమంలోనే బ్యాగులు కుట్టడంలో మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నా. అలాగే రబ్బర్‌ బ్యాండ్‌లు, పౌచ్‌లు, బొమ్మలు, కీ-చెయిన్లు.. ఇలా విభిన్న వస్తువులు తయరుచేయడంలో మెలకువలు నేర్చుకున్నా. ఇక టైలరింగ్‌ వ్యర్థాల కోసం స్థానికంగా ఉన్న టైలరింగ్‌ షాపులకు వెళ్లేదాన్ని. అక్కడ్నుంచి వృథా పీసుల్ని/కాస్త పెద్ద పెద్ద గుడ్డ ముక్కల్ని సేకరించి.. వాటితో ఆకర్షణీయమైన హ్యాండ్‌ బ్యాగ్‌లు, హ్యాండ్‌ పౌచ్‌లు, ట్యాబ్లెట్‌ పీసీ కవర్లు, హెడ్‌సెట్‌ హోల్డర్స్‌, దిండు కవర్లు, ఆప్రాన్స్‌.. ఇలా చెప్పుకుంటూ బోలెడన్ని వస్తువులు మా వద్ద రూపుదిద్దుకుంటున్నాయి. వృథా అంటూ పడేసే టైలరింగ్‌ వ్యర్థాలతో నిత్యం ఉపయోగపడే వస్తువుల్ని అందంగా, ఆకర్షణీయంగా తయారుచేసి అందరికీ చేరువ చేయడమే మా సంస్థ ముఖ్యోద్దేశం. దీనివల్ల పర్యావరణానికీ కొంత వరకు మేలు జరుగుతుంది.

అప్పుడు కాస్త కష్టమైంది!

ప్రస్తుతం మా ఉత్పత్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లోనూ లభ్యమవుతున్నాయి. ఈ క్రమంలో రోజురోజుకీ డిమాండ్‌ పెరుగుతుందనే చెప్పుకోవాలి. కేవలం ఇతర రాష్ట్రాల నుంచే కాదు.. విదేశాల నుంచీ ఆర్డర్లొస్తున్నాయి. సంగీత వాయిద్య పరికరాలు, ఇతర వస్తువుల కోసం రీసైక్లింగ్‌ చేసిన బ్యాగ్స్‌ కావాలంటూ అడుగుతున్నారు. అయితే ఇప్పుడు వ్యాపారం సజావుగా సాగుతున్నప్పటికీ.. కరోనా సమయంలో కాస్త ఆటుపోట్లు ఎదురయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే లాక్‌డౌన్‌లో మా వద్ద పనిచేసే కొంతమంది మహిళలు ఉన్నట్లుండి పని మానేశారు. దీంతో వాళ్ల ఇంట్లో వాళ్లకు నచ్చజెప్పి నేనే తిరిగి వారిని పనిలోకి రప్పించాను. అయితే ఇది కేవలం నా స్వార్థం కోసమే చేసిన పని అనుకోకండి.. మహిళా సాధికారతను కోరుకునే నేను.. మా సంస్థ ద్వారా ఎంతోమంది స్త్రీలకు ఉపాధి కల్పిస్తున్నా.. వాళ్లు ఆర్థిక స్థిరత్వం పొందడానికి నేను ఈ విధంగా సహాయపడుతున్నానంటే నాకు అంతకంటే సంతృప్తి మరొకటి లేదనే చెప్తా.

ఒక్క టైలరింగ్‌ వ్యర్థాలనే కాదు.. భవిష్యత్తులో ఇతర వ్యర్థాల్నీ రీసైక్లింగ్‌ చేసి.. ఉపయోగకరమైన వస్తువులుగా మార్చాలన్న ఆలోచనైతే ఉంది.. ప్రస్తుతం ఆ దిశగా స్పష్టత తెచ్చుకోవడానికే ప్రయత్నాలు చేస్తున్నా. ఎవరికైనా చేసే పని పట్ల ఒక స్పష్టమైన ఆలోచన ఉన్నప్పుడే అందులో సక్సెస్‌ సాధించగలం.. నా వ్యాపార ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయం కూడా అదే!


Advertisement


మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని