ఇల్లు పరిమళభరితం అవుతుందిలా! - natural fragrances for your home
close
Published : 02/08/2021 20:37 IST

ఇల్లు పరిమళభరితం అవుతుందిలా!

'అబ్బబ్బబ్బా.. ఏంటో ఈ వాసన.. గత నాలుగు రోజుల నుంచి ఇంట్లో నుంచి వస్తోన్న ఈ వాసన భరించలేకపోతున్నా. అంతా నీట్‌గానే ఉంది.. మరి ఇదెక్కడి నుంచి వస్తోంది' అంటూ తెగ సతమతమైపోతోంది సుప్రజ. ఇంట్లోకి గాలి సరిగ్గా ప్రసరించకపోవడం, ఇల్లు శుభ్రంగా లేకపోవడం.. వంటి పలు కారణాల వల్ల అప్పుడప్పుడూ ఇంట్లోంచి చెడువాసన రావడం సహజం. మరి దీన్ని తొలగించుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రూమ్ ఫ్రెష్‌నర్స్ వాడుతుంటారు. అయితే వివిధ రసాయనాలతో తయారైన వీటి కంటే ఇంట్లో లభించే పదార్థాలతోనే ఇంటిని సువాసనభరితం చేసుకోవడం ఎంతో ఆరోగ్యకరం. ఈ క్రమంలో ఇంటిని పరిమళభరితంగా తీర్చిదిద్దేందుకు దోహదపడే అలాంటి కొన్ని సహజసిద్ధమైన పదార్థాలేంటో తెలుసుకుందాం రండి.

చెడు వాసనకు చెక్!

ఒక చిన్న పాత్రలో కొన్ని నీళ్లు పోసి దాన్ని స్టవ్ మీద చిన్న మంటపై మరిగించాలి. అందులో కొన్ని దాల్చిన చెక్క ముక్కలు లేదా పొడి వేయాలి. దీంతో ఇంట్లోని చెడువాసన తొలగిపోయి.. మంచి వాసన వస్తుంది. దాల్చిన చెక్కకు బదులుగా కాఫీ గింజలు లేదా నిమ్మ, ఆరెంజ్, యాపిల్ తొక్కల్ని లవంగాలతో కలిపి వేసి మరిగించొచ్చు.

క్యాండిల్స్ వెలిగించండి..

క్యాండిల్స్ వెలిగించడం వల్ల ఇల్లు సువాసనభరితం అవుతుందా?? అని ఆశ్చర్యపోతున్నారా?? మరి మేం రోజూ వెలిగిస్తున్నాం కదా! అంటారా?? మామూలు క్యాండిల్స్ వెలిగించడం కాదు.. సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి చూడండి.. సువాసనని ఆస్వాదించండి. ప్రస్తుతం వివిధ రకాల డిజైన్లు, మోడళ్లలో ఉన్న సెంటెడ్ క్యాండిల్స్ మార్కెట్లో విరివిగా లభ్యమవుతున్నాయి.

కర్పూరంతో..

ఒక గిన్నెలో కొన్ని నీళ్లు పోసి అందులో కర్పూరం వేసి ఓ మూలకు ఉంచండి. ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. దీనివల్ల మరో ఉపయోగం కూడా ఉందండోయ్.. అదేంటంటే.. ఇంట్లోకి దోమలు రాకుండా ఉంటాయి.

తాజా పూలతో..

మంచి వాసన వెదజల్లే తాజా పువ్వుల్ని (ఉదాహరణకి.. మల్లె, లిల్లీ పూలు..) ఏ రోజుకారోజే ఫ్లవర్‌వాజ్‌ల్లో అమర్చండి. మరింత సువాసన రావాలంటే ఆ ఫ్లవర్‌వాజ్‌లో ఉండే నీటిలో కాస్త పెర్‌ఫ్యూమ్ చల్లండి.. అంతే ఇల్లంతా ఆహ్లాదభరితమైన వాసనతో నిండిపోతుంది.

వెనిగర్‌తోనూ..

కిచెన్‌లో నాన్‌వెజ్ వండినప్పుడు వచ్చే నీచు వాసన వెంటనే పోదు.. ఇదేవిధంగా కిచెన్‌లో నుంచి ఇంకా ఏమైనా చెడు వాసన వస్తున్నట్లయితే.. ఒక చిన్న గిన్నెలో వైట్ వెనిగర్‌ని తీసుకుని దాన్ని కిచెన్ ప్లాట్‌ఫాంపై ఉంచండి.. అది చెడు వాసనలన్నింటినీ తొలగిస్తుంది.

కిటికీలు తెరవండి..

కొంతమంది ఎప్పుడు చూసినా కిటికీలు, తలుపులు మూసే ఉంచుతారు. దీనివల్ల బయటి గాలి లోపలికి రాదు.. లోపలి గాలి బయటికి పోదు. దీంతో ఇంట్లోని గాలి తాజాదనాన్ని సంతరించుకోదు. అందుకే చెడు వాసన వస్తుంటుంది. కాబట్టి వేడిగా ఉన్నప్పుడు కిటికీలు ఎక్కువ సేపు తెరిచి ఉంచాలి. చల్లగా ఉన్న సమయాల్లో కాసేపు తెరిస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల కేవలం ఇంట్లోని వాసనే కాదు.. బాత్‌రూమ్స్‌లో ఉండే వాసన కూడా బయటికి పోతుంది.

నూనెలతోనూ..

సబ్బులు, క్యాండిల్స్ తయారీలో వాడే కల్తీ లేని ఎసెన్షియల్ ఆయిల్స్‌ని కూడా ఇంటిని సువాసనభరితం చేయడానికి వాడొచ్చు. వీటి ప్రభావం చాలా సేపటి వరకు ఉంటుంది.

ఆకులతో..

కొన్ని సువాసనాభరిత ఆకులు (ఉదాహరణకి.. రోజ్‌మేరీ) కూడా మార్కెట్లో లభిస్తాయి. వీటిని తెచ్చుకుని ఇంట్లో ఎక్కడో ఒక చోట ఉంచండి. ఇళ్లంతా మంచి వాసనతో నిండిపోతుంది. ఫలితంగా మనసుకు ప్రశాంతంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని