పంచదారను వీటికోసం కూడా వాడచ్చు! - other uses of sugar for home in telugu
close
Updated : 12/06/2021 21:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పంచదారను వీటికోసం కూడా వాడచ్చు!

నిత్య జీవితంలో చక్కెర పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కేవలం ఆహార పదార్ధాల్లోనే కాకుండా ఇతరత్రా వివిధ సందర్భాలలో చక్కెరను ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. ఎలా అంటారా? మీరే చదవండి..
దుర్వాసనను పోగొట్టడానికి..
మిక్సీ జార్లు, కాఫీ గ్రైండర్స్, ఇతర డబ్బాలు.. వంటివన్నీ ఎక్కువ రోజులు వాడకుండా మూతపెట్టి అలాగే ఉంచడం వల్ల కొన్ని రోజులకు వాటినుంచి అదో రకమైన వాసన వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాసనను తొలగించడానికి చక్కెర బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం కాఫీ గ్రైండర్స్, మిక్సీ జార్ల.. వంటి వాటిలో పావు కప్పు చక్కెర వేసి కాసేపు గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేయడం వల్ల అందులోని వాసనను చక్కెర గ్రహిస్తుంది. ఇక ఇతర డబ్బాల విషయంలో అయితే ఒక టీస్పూన్ చక్కెరను వాటిలో వేసి మూత పెట్టాలి. తిరిగి ఆ బాక్సులను ఉపయోగించుకునే ముందు శుభ్రంగా కడిగితే వాటి నుంచి ఎలాంటి వాసన రాకుండా ఉంటుంది.


మరకలు మాయం..
చేతులకు గ్రీజు అంటుకున్నప్పుడు ఒక్కోసారి ఎంత కడిగినా వదలదు. అలాంటప్పుడు లిక్విడ్ హ్యాండ్‌వాష్‌లో కాస్త చక్కెర వేసి ఆ మిశ్రమంతో చేతుల్ని శుభ్రం చేసుకుంటే గ్రీజు మరకలు మటుమాయమవుతాయి. ఇక మనం గార్డెన్‌లో పనిచేస్తున్నప్పుడు దుస్తులకు మట్టి అంటుకోవడం సహజం. దీన్ని సులభంగా వదిలించుకోవాలంటే కొన్ని గోరువెచ్చటి నీటిలో కాస్త చక్కెర వేసి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. దీన్ని మరక ఉన్న చోట పూసి గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.


వెండి వస్తువులు మెరిసిపోవాలంటే..
ఉప్పుగాలి, నీరు కారణంగా వెండి వస్తువులు కొన్ని రోజులకు మెరుపును కోల్పోతాయి. మరి, అలాంటి వాటిని తిరిగి మెరిపించడానికి చక్కెర ఉపయోగపడుతుంది. ఇందుకోసం.. ఒక పాత్రలో మూడు టేబుల్ స్పూన్ల చక్కెర తీసుకొని అందులో టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి చక్కెర కరిగేంత వరకుబాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వెండి వస్తువులు కడగడానికి ఉపయోగిస్తే సరి.. అవి తళతళా మెరిసిపోవడం ఖాయం.


తుప్పు వదలగొట్టండిలా..!
సామాన్లకు పట్టిన తుప్పును వదలగొట్టే శక్తి చక్కెరకు ఉంది. దీనికి మీరు చేయాల్సిందల్లా.. ఒక నిమ్మకాయ రసాన్ని తీసుకొని అందులో మూడు టేబుల్‌స్పూన్ల చక్కెర వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తుప్పు పట్టిన వస్తువులపై వేసి కడిగితే అవి సులభంగా శుభ్రపడతాయి.


ఫ్లోర్‌పై మరకలు పడ్డాయా?
టైల్స్‌పై ఏదైనా మరక పడితే అంత సులభంగా వదలదు. అలాంటప్పుడు ఆ మరకను చక్కెరతో శుభ్రపరిస్తే సరి. ఇందుకోసం ఒక గిన్నెలో నాలుగు టేబుల్‌స్పూన్ల వెనిగర్, కొద్దిగా చక్కెర తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి, మరక ఉన్న చోట రుద్దాలి. అంతే.. మరక ఇట్టే వదిలిపోతుంది.
మరిన్ని..
* ఉల్లిపాయలు కట్‌చేసిన తర్వాత చేతులకు అంటుకున్న వాసన పోవాలంటే.. టేబుల్‌స్పూన్ చక్కెరకు టీస్పూన్ లిక్విడ్ హ్యాండ్‌వాష్ కలిపి ఆ మిశ్రమంతో చేతుల్ని రుద్దుకోవాలి. ఫలితంగా చేతుల నుంచి వాసన రాకుండా జాగ్రత్తపడచ్చు.
* మూడు టేబుల్ స్పూన్ల చక్కెరకు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ కలిపి కొన్ని నీళ్లు పోసి చిక్కగా చేసుకోవాలి. ఈ మిశ్రమంతో పాత్రలను శుభ్రం చేస్తే అవి మరింతగా శుభ్రపడతాయి. ఎందుకంటే ఇది సహజసిద్ధమైన డిటర్జెంట్‌లా పనిచేసి.. వాటిని మెరిపిస్తుంది.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని