అమ్మే కాదు.. నాన్న కూడా మార్గదర్శే! - parenting lessons from fathers in telugu
close
Updated : 20/06/2021 13:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మే కాదు.. నాన్న కూడా మార్గదర్శే!

కష్టసుఖాలలో, కుటుంబ బాధ్యతలలో దంపతులు ఎలాగైతే సమానంగా పాలుపంచుకుంటారో.. పిల్లల పెంపకంలోనూ ఇద్దరికీ సమాన భాగస్వామ్యం ఉంటుంది. అయితే పిల్లలు పుట్టినప్పట్నుంచీ.. పెంచి పెద్ద చేసి స్కూలుకు పంపే వరకు తల్లి పాత్రే ఎక్కువగా ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ దశలో తల్లిదండ్రుల పాత్ర సమానంగా ఉంటే ఆ పిల్లలు మరింత క్రమశిక్షణతో, సంతోషకరమైన వాతావరణంలో పెరుగుతారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే వివిధ అంశాలలో తెలివితేటలతో వ్యవహరించడం, భావోద్వేగాల నియంత్రణ, విలువలు ఒంట పట్టించుకోవడం.. మొదలైన విషయాల్లో చిన్నతనం నుంచే పిల్లలు మరింత నేర్పరులుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర గురించి చర్చిద్దామా..

ప్రవర్తనపరంగా..

పిల్లలు చిన్నతనం నుంచి తండ్రి పర్యవేక్షణలో పెరగడం వల్ల వారి ప్రవర్తనలో కూడా పలు మార్పులు చోటుచేసుకుంటాయి. ఉదాహరణకు.. రోజూ ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత ఖాళీ సమయాల్లో పిల్లలతో ఆడుకునే క్రమంలో వారికి తండ్రి ప్రేమ, ఆప్యాయత పొందే అవకాశం ఉంటుంది. దీంతో రోజంతా నాన్నను మిస్సయ్యామన్న భావన వారిలో కలగకుండా జాగ్రత్తపడచ్చు. అలాగే తండ్రి పిల్లలతో ఆడుకునేటప్పుడు పిల్లలే గెలవాలనే వారి ఆతృత, భావోద్వేగాల నియంత్రణ.. వంటివన్నీ పిల్లలకు అలవడే అవకాశం ఉంటుంది. ఫలితంగా పెద్దయ్యాక ఇలాంటి అంశాల్లో పిల్లలు కూడా తండ్రిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు.

వెంట తీసుకెళితే..

చాలామంది పిల్లలు చిన్నతనంలో తండ్రి ఎక్కడికి వెళ్తే అక్కడికి తామూ వస్తామంటూ మారాం చేస్తుంటారు. అయితే అలాంటి సందర్భాలలో కొన్ని చోట్లకైనా పిల్లల్ని తీసుకెళ్లడం వల్ల సమాజంలో తమ తండ్రి ఎలా ప్రవర్తిస్తున్నారన్న విషయాన్ని పిల్లలు గ్రహించగలుగుతారు. దాన్ని బట్టి నలుగురిలో ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో వారికి కూడా ఒక అవగాహన వస్తుంది. కాబట్టి పిల్లల్ని సాధ్యమైనంత వరకు తమ వెంట తీసుకెళ్లడం మంచిది. (ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పిల్లల్ని వెంట తీసుకెళ్లకపోయినా, ఈ మహమ్మారి అంతమయ్యాకైనా ఇలా చేయడం మంచిది)

నేర్చుకుంటారు..

వీలైనప్పుడల్లా పిల్లల్ని తండ్రి సంరక్షణలో వదిలేయడం మంచిదే. ఫలితంగా వారి నుంచి కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం దొరుకుతుంది. ఉదాహరణకు.. ఉదయం న్యూస్‌పేపర్ చదివేటప్పుడు పిల్లల్ని దగ్గరికి తీసుకుని ఏ వార్తలొచ్చాయో వారికి చెప్పడం, సాంకేతికతకు సంబంధించిన విషయాలు చర్చించడం, కొత్త కొత్త పదాలు చెబుతూ వారితో పలికించడం.. వంటివి చేయడం వల్ల పిల్లలు నాన్న నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోగలుగుతారు. అలాగే ఆఫీసు పనుల్లో తండ్రులు ఎదుర్కొనే ఒత్తిళ్లు, టెన్షన్ల.. గురించి కూడా పిల్లలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. పెద్దయ్యాక అలాంటి సందర్భాల్లో ఎలా ప్రవర్తించాలో కూడా వారు ముందునుంచే అలవరచుకొంటారు.

పెరిగే అవగాహన..

సాధారణంగా తండ్రితో కూతురికి అనుబంధం కాస్త ఎక్కువగానే ఉంటుందని మనందరికీ తెలుసు. అయితే అమ్మాయిలు తండ్రులతో ఎక్కువ క్లోజ్‌గా ఉండడం వల్ల వారు ఎదుర్కొనే భావోద్వేగాలు, ఒత్తిళ్లు.. వంటివి దగ్గర్నుంచి గమనించే అవకాశం ఉంటుంది. దీంతో వారికి ఇలాంటి విషయాలపై అవగాహన పెరుగుతుంది. తద్వారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు సులభంగా వాటిని ఎదుర్కొంటారని.. దాంతో మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెబుతున్నారు.

మార్గదర్శకుడిగా..

తల్లి మాదిరిగానే తండ్రి పెంపకం వల్ల కూడా పిల్లలకు కష్టసుఖాలు, బరువు-బాధ్యతలు, ప్రేమానుబంధాలు.. మొదలైనవన్నీ చిన్నతనం నుంచే అలవడతాయి. ఎదుగుతున్న కొద్దీ వీటన్నింటిపై పిల్లలకు పూర్తి అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుంది. చిన్నప్పట్నుంచీ ఇలాంటి ఎన్నో విషయాలను తండ్రులను చూసి నేర్చుకోవడం వల్ల క్రమంగా తండ్రులే వారికి మార్గదర్శకులుగా మారే అవకాశం ఉంటుంది. ఫలితంగా కెరీర్‌లో, సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకోగలుగుతారు. తమ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలుగుతారు. తద్వారా తండ్రికి తగ్గ పిల్లలుగా పేరు సంపాదించుకుంటారు. దీనికంతటికీ మూలకారణం ఎవరనుకుంటున్నారు.. ఇంకెవరు ముందు నుంచీ నడిపించిన తండ్రే!

చూశారుగా.. పిల్లల పెంపకంలో తండ్రి పాత్ర ఎంత కీలకమైందో. చిన్నతనం నుంచే పిల్లలు తండ్రి ప్రవర్తనను ఒడిసి పట్టుకొని, తననే మార్గదర్శకుడిగా ఎంచుకొని, భవిష్యత్తులో తాము ఉన్నత స్థితిలో ఉండడానికి కారణం తమ తండ్రే అని గొప్పగా చెప్పుకుంటుంటే.. ఓ తండ్రిగా అంతకంటే సంతోషించదగ్గ విషయం ఏముంటుంది చెప్పండి.. అందుకే మీ భర్త కూడా మీ పిల్లలతో అనుబంధాన్ని పెంచుకునే విధంగా వారిని ప్రోత్సహించండి. అన్ని రకాలుగా అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించండి.


మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని