ధైర్యంగా ఉన్నా.. అందుకే కరోనా నుంచి త్వరగా కోలుకున్నా! - patna woman shares her covid experience which is inspiration for all of us
close
Published : 24/06/2021 16:45 IST

ధైర్యంగా ఉన్నా.. అందుకే కరోనా నుంచి త్వరగా కోలుకున్నా!

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ వహించినా.. ఏదో ఒకలా కరోనా బారిన పడుతోన్న వారు ఎందరో! ఈ విషయం తెలుసుకొని ‘ఇంత జాగ్రత్తగా ఉన్నా నాకెలా వైరస్‌ సోకిందో అర్థం కావట్లేదు’ అన్న సందిగ్ధం చాలామందిలో నెలకొంది. తన పరిస్థితీ ఇదేనంటోంది పాట్నాకు చెందిన మాసుమ్‌. మాస్క్‌, శుభ్రత, సామాజిక దూరం పాటించడం.. ఇవన్నీ కచ్చితంగా పాటించిన తనకు కొవిడ్‌ పాజిటివ్ ఎలా వచ్చిందో ఇప్పటికీ ప్రశ్నార్థకమే అంటోందామె. అయితే ఈ క్రమంలో స్వల్ప లక్షణాలు ఉండడంతో హోమ్‌ ఐసొలేషన్‌లోనే చికిత్స తీసుకున్న ఆమె.. ఇటీవలే కోలుకొని తిరిగి తన విధులకు హాజరవుతోంది. ప్రస్తుతం మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ప్రతికూలమే! అయినప్పటికీ వాటిలోనే సానుకూల దృక్పథాన్ని వెతుక్కోవాలని, ఆ పాజిటివిటీయే తనను ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకునేలా చేసిందంటూ తన కొవిడ్‌ అనుభవాలను పంచుకోవడానికి ఇలా మన ముందుకొచ్చిందీ పాట్నా మహిళ.

హమ్మయ్య.. వ్యాక్సిన్‌ వచ్చింది.. ఇక కరోనా పీడ విరగడైనట్లే.. అనుకుంటూనే గతేడాది నవంబర్‌ నుంచి తిరిగి విధులకు హాజరవుతున్నా..! పట్టి పట్టి ప్రతిదాన్నీ శానిటైజ్‌ చేసే బాధ తప్పింది.. దీంతో కాస్తైనా సమయం దొరుకుతుందని సంబరపడిపోయా! అయితే ఇలా కాస్త ఊపిరి పీల్చుకున్నామో, లేదో.. రెట్టింపు వేగంతో దూసుకొచ్చింది రెండో దశ మహమ్మారి! ఎంతోమందికి ఊపిరి సలపకుండా చేస్తోంది. నిజానికి రోజూ వార్తలు చూస్తుంటే ఒక రకమైన భయమేసేది.. అదే సమయంలో టీకా తీసుకున్నా కదా.. కనీస జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందన్న ధైర్యం కూడా ఉండేది..

ఇంట్లో నేను, మా వారు, మా అబ్బాయి, అత్తామామ ఉంటాం. గతేడాది లాక్‌డౌన్ సమయంలో చాలా రోజుల పాటు ఇంటి నుంచే పనిచేశా. కానీ ఇప్పుడా ఆప్షన్‌ కూడా లేదు. కచ్చితంగా ఆఫీస్‌కి వెళ్లాల్సిందే! అయితే నా భయమంతా నా కొడుకు, అత్తామామ గురించే! వాడేమో పసివాడు, వీళ్లేమో వయసులో పెద్దవాళ్లు! కొవిడ్‌తో ఇద్దరికీ రిస్కే. బయటికి వెళ్లిన ప్రతిసారీ ఇదే విషయం గుర్తు పెట్టుకునేదాన్ని. మా వారికీ ఇదే మాట చెప్పేదాన్ని. ముఖానికి డబుల్‌ మాస్క్‌, శానిటైజర్‌ బాటిల్‌, స్కార్ఫ్‌.. ఇవేవీ లేనిదే గడప దాటకపోయేదాన్ని! ఆఫీస్‌లో కూడా 50 శాతం మంది స్టాఫే కాబట్టి దూరదూరంగా కూర్చొని ఎవరి పని వారు పూర్తి చేసేసుకొని ఇంటికొచ్చేసే వాళ్లం. పైగా నేను ఆఫీస్‌కి నా స్కూటీపైనే వెళ్లొచ్చేదాన్ని. లంచ్‌ బాక్స్‌ కూడా కట్టుకెళ్లేదాన్ని. గుంపులో, క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ల కంటే నేను సేఫ్‌ జోన్లోనే ఉన్నా అనుకునేదాన్ని. కానీ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొవిడ్‌ వస్తుందని అప్పుడు నాకు తెలియలేదు. రోజూలాగే ఆ రోజూ ఆఫీస్‌కి బయల్దేరా. అక్కడికి చేరే దాకా నార్మల్‌గానే ఉన్నా.. ఆ తర్వాతే నా ఆరోగ్యం విషయంలో ఏదో తేడాగా అనిపించింది. శరీరం తేలికైనట్లుగా అనిపించింది. ఇంటా బయటా పనితో శరీరం అలసిపోయిందేమో అనుకున్నా.

******

ఆ లోపే లంచ్‌ సమయమైంది.. ఆ రోజు నాకిష్టమైన చికెన్‌ ఫ్రై చేసుకొని తీసుకెళ్లా. కానీ ఎందుకో బాక్స్‌ ఓపెన్‌ చేసి ఆ కూర మొహం చూడగానే వెగటుగా అనిపించింది.. బలవంతంగా రెండు ముద్దలు తిన్నా.. రుచీ-పచీ ఏదీ లేదు.. కర్రీ వండేటప్పుడు వచ్చే ఘుమఘుమలూ పసిగట్టలేకపోయా. ఎందుకిలా జరుగుతోంది.. ఇంటా బయటా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కదా.. భయపడాల్సిందేమీ లేదు. అదే ఆలోచనతో ఇంటికెళ్లిపోయా. ఎందుకైనా మంచిదని ఆ రోజు మా వాళ్లకు కాస్త దూరంగానే ఉన్నా. నా కొడుకునీ అత్తామామల దగ్గరే ఉంచా. కానీ ఆ మరుసటి రోజుకు నా ఆరోగ్యం ఇంకా క్షీణించింది. వాసన-రుచి కోల్పోవడానికి తోడు ఒంటి నొప్పులు, అలసట, నీరసం వేధించాయి. ఇక ఆలస్యం చేయకూడదని దగ్గర్లోని పీహెచ్‌సీకి వెళ్లి కొవిడ్‌ పరీక్ష చేయించుకున్నా. ఆ తర్వాత నన్ను నేనే సెల్ఫ్‌ ఐసొలేట్‌ చేసుకున్నా. సాయంత్రానికల్లా కొవిడ్‌ రిపోర్ట్‌ మెసేజ్‌ వచ్చింది. నా అనుమానమే నిజమైంది. పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

నా సంగతి సరే.. నా నుంచి ఈ వైరస్‌ నా కుటుంబానికి సోకితే.. అన్న భయమే నన్ను ఎక్కువగా వేధించేది. అలాగని ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో వారిలో ఏ లక్షణాలూ లేకుండా టెస్టులకు పంపడానికి నా మనసు ఒప్పుకోలేదు. అయినా మా వారి ఫ్రెండ్‌ ఒకరు ఇక్కడే ఓ ఆస్పత్రిలో పనిచేస్తుండడంతో ఆస్పత్రి వాళ్లే వచ్చి మా వాళ్లందరి కొవిడ్‌ శాంపిల్స్‌ తీసుకెళ్లడంతో సగం బరువు దిగినట్లనిపించింది. నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలగకూడదని, అందరికీ నెగెటివ్‌ రావాలని ఆ భగవంతుడిని వేడుకుంటూనే ఉన్నా.. అంతలోనే రిపోర్టులొచ్చాయి.. దేవుడి దయో, నా ప్రార్థనల ఫలమో తెలియదు గానీ.. అనుకున్నట్లుగానే అందరికీ నెగెటివ్‌ వచ్చింది. అప్పటిదాకా గుర్తు రాని నా ఆరోగ్య పరిస్థితి గురించి అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టా. వెంటనే ఆన్‌లైన్‌లో డాక్టర్‌ని సంప్రదించి నా కొవిడ్‌ రిపోర్టును పంపించా.. నా లక్షణాలన్నీ వివరించా. అయితే స్వల్ప లక్షణాలే ఉండడంతో హోమ్‌ ఐసొలేషన్‌లోనే ఉంటూ చికిత్స తీసుకోవడం మంచిదని డాక్టర్‌ సూచించారు.. కోలుకోవడానికి కొన్ని మందులు కూడా ఇచ్చారు.

******

ఇక అప్పట్నుంచి సుమారు రెండు వారాల పాటు నా గదిలోనే బందీ అయిపోయా. ఇంట్లో వాళ్లను చూసుకునే భారమంతా మా అత్తగారి పైనే పడింది. అంతేకాదు.. ఈ సమయంలో ఆవిడ నాకూ అన్ని సౌకర్యాలూ సమకూర్చారు.. మరోవైపు నా రెండేళ్ల కొడుక్కి నేను దూరంగా ఉన్న లోటు తెలియకుండా చేశారు. అయినా తల్లి మనసు ఆగుతుందా చెప్పండి.. రాత్రుళ్లు వాడు నాకోసం ఏడుస్తుంటే నాకూ ఏడుపొచ్చేసేది.. కానీ వాడి ఆరోగ్యం కోసం ఈ ఎడబాటు తప్పదు అని గుండె రాయి చేసుకునేదాన్ని. ఇలా కుటుంబానికి దూరంగా ఒకే గదిలో ఉండడమంటే నిజంగా అది నరకమే! అప్పటిదాకా ఒంటరితనం గురించి అక్కడా ఇక్కడా వినడం తప్ప అసలు అది ఎలా ఉంటుందో హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్నప్పుడే నాకు అర్థమైంది. ఒక్కోసారి ఏవేవో ప్రతికూల ఆలోచనలు వచ్చేవి. వాటన్నింటినీ దూరం చేసుకుంటూ సానుకూల దృక్పథంతో ఉన్నానంటే అందుకు మా వారే కారణం..!

 

ఇలా కోలుకున్నా!

ఇలా మానసికంగా కొవిడ్‌ను జయించడంలో నా ఫ్యామిలీ నా వెన్నంటే నిలిచింది. మరోవైపు డాక్టర్‌ సలహా మేరకు నేను వాడిన మందులు, పాటించిన ఇంటి చిట్కాలు శారీరకంగా నన్ను మరింత దృఢంగా చేశాయి. బహుశా.. ఈ టిప్స్‌ మీకూ ఉపయోగపడతాయనుకుంటున్నా..!

* రోజుకు రెండుసార్లు ఆవిరి పట్టడం, గార్‌గ్లింగ్‌ చేయడం, పరగడుపునే నిమ్మరసం కలిపిన గోరువెచ్చటి నీళ్లు తాగడం.. కచ్చితంగా పాటించా.

* ఆక్సిజన్‌ స్థాయులు సాధారణంగానే ఉన్నా వాటిని తరచూ చెక్‌ చేసుకోవడం చాలా ముఖ్యం. అందుకే ఆక్సిజన్‌ శ్యాచురేషన్‌తో పాటు శరీర ఉష్ణోగ్రత ప్రతి రెండు మూడు గంటలకోసారి పరీక్షించుకునేదాన్ని.

* కొవిడ్‌ నుంచి ఇంత త్వరగా కోలుకున్నానంటే అందుకు నేను తీసుకున్న పోషకాహారం కూడా ఓ కారణమే! ఈ క్రమంలో చికెన్‌ సూప్‌, పప్పులు, విటమిన్‌-సి అధికంగా ఉండే పండ్లు-కాయగూరలు, రోజుకు రెండు కోడిగుడ్లు, కిచిడీ, చపాతీ, రాత్రి పడుకునే ముందు పసుపు పాలు, మధ్యమధ్యలో ఏదైనా తినాలనిపిస్తే పండ్లు, నట్స్‌ ఎక్కువగా తినేదాన్ని.

* ఇక రోజుకు రెండుసార్లు అరగంట చొప్పున ధ్యానం, శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా సాధన చేసేదాన్ని.

* అయితే నాకొచ్చిన సమస్యల్లా ఒక్కటే.. వైరస్‌ వల్ల రుచి-వాసన కోల్పోయాను కాబట్టి ఏది తిన్నా దాని రుచి ఇసుమంతైనా తెలియకపోయేది.. దాంతో తినాలనిపించకపోయినా.. శరీరానికి పోషకాలు అందాలి కాబట్టి బలవంతంగా మింగేదాన్ని.

ఇలాగే వారం గడిచిపోయింది. ఈ క్రమంలో ఏ రోజుకారోజు నా ఆరోగ్యం గురించి డాక్టర్‌తో చెప్పడం, ఆయన సూచించిన సలహాలు పాటించడంతో ఎంతో రిలీఫ్‌గా అనిపించేది. పది రోజుల్లోనే ఒంటి నొప్పులు, అలసట, నీరసం అన్నీ తగ్గుముఖం పట్టాయి. ఎప్పటిలాగే చురుగ్గా అనిపించేది. అయితే రుచి-వాసన విషయంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇదే విషయాన్ని డాక్టర్‌తో చెప్పా. దాంతో ఆయన చెప్పిన ఒక రెమెడీ నాకు అద్భుతంగా వర్కవుట్‌ అయింది. అదే ‘స్మెల్‌ ట్రైనింగ్‌’! యూకలిప్టస్‌ ఆయిల్‌ను రోజూ రెండు గంటలకోసారి ఐదు నిమిషాల పాటు వాసన చూసేదాన్ని. అంతే.. వారం రోజుల్లో వాసన చూసే సామర్థ్యం ఎప్పటిలాగే తిరిగొచ్చేసింది. ప్రాణం లేచొచ్చినట్లనిపించింది!

 

ఏంటీ స్మెల్‌ ట్రైనింగ్?

ప్రస్తుతం కరోనా సోకిన వారిలో చాలామంది రుచి, వాసనను కోల్పోతున్నారు. ఈ క్రమంలో వారు వైరస్‌ నుంచి బయటపడినా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పడుతోంది. ఇదే సమయంలో వాసన చూసే శక్తిని తిరిగి పొందేందుకు కూడా చాలా రోజులు పడుతోంది. ఇలాంటి వారికి Smell Training/Olfactory Training (అత్యవసర నూనెల్ని వాసన చూడడం) అనే పద్ధతిని సూచిస్తున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజ్‌, లెమన్‌, లవంగం, యూకలిప్టస్‌.. ఈ నాలుగు నూనెల్ని ఒక్కో నూనెను సుమారు 20 సెకన్ల పాటు వాసన చూడాల్సి ఉంటుంది. ఇలా రోజుకు రెండుసార్లు నాలుగు నెలల పాటు చేస్తే వాసన చూసే శక్తిని తిరిగి పొందచ్చట!

ఇక గర్భం ధరించిన మహిళలు, చిన్న పిల్లలు ఈ నూనెలకు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఒకవేళ గర్భిణులు అంతగా వాడాలనుకుంటే ముందుగా నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి!

ప్రస్తుతం నేను శారీరకంగా, మానసికంగా ఎంతో ఫిట్‌గా ఉన్నా. నా కుటుంబం అందించిన సహకారం, మానసిక స్థైర్యంతోనే కొవిడ్‌ను జయించానని సంతోషంగా, గర్వంగా చెప్పగలను. నా బాబును చూసుకోవడం, కుటుంబ బాధ్యతలు, ఆఫీస్‌ పనులు అన్నీ ఎప్పటిలాగే యాక్టివ్‌గా చేసుకోగలుగుతున్నా. అయితే కొవిడ్‌ వల్ల నేను అటు మానసికంగా, ఇటు శారీరకంగా కాస్త ఇబ్బంది పడినా.. అది అంత తీవ్రంగా ఏమీ పరిణమించలేదన్నది మాత్రం వాస్తవం! ఇందుకు నేను ముందు వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్లనే దీన్నుంచి సురక్షితంగా బయటపడ్డానేమో అనిపిస్తుంది. కాబట్టి నా స్వీయ అనుభవంతో నేను మీ అందరినీ కోరేది ఒక్కటే! ఇంకా టీకా తీసుకోని వాళ్లుంటే మీ మీ ఆరోగ్యస్థితిని వైద్యుల దగ్గర పరీక్షించుకొని వెంటనే వ్యాక్సిన్‌ వేయించుకోండి! ఈ విషయంలో మీ చుట్టూ ఉన్న వారిని చైతన్యపరచండి.. మాస్క్‌-పరిశుభ్రత మరవకండి.. మానసికంగా దృఢంగా ఉండండి.. ఇవి చాలు కొవిడ్‌ని సమూలంగా అంతమొందించడానికి!

మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని