చీరకట్టులోనే వ్యాయామాలు చేస్తూ..! - pune woman sharvari inamdar saree workout video gone viral
close
Updated : 17/06/2021 18:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చీరకట్టులోనే వ్యాయామాలు చేస్తూ..!

Photo: Instagram

వృత్తిఉద్యోగాల్లో కొనసాగే మహిళలకు క్షణం తీరిక దొరకదు. అలాంటప్పుడు వ్యాయామం చేసే సమయమెక్కడిది! అలాగని దాన్ని దాటవేయకుండా రోజులో కాస్తైనా సమయం కేటాయించుకోవడం అవసరం అంటున్నారు పుణేకు చెందిన డాక్టర్‌ శార్వరి ఇనామ్‌దార్‌. ఓవైపు వృత్తిలో బిజీగా ఉన్నా.. శరీరాన్ని ఫిట్‌గా, చురుగ్గా ఉంచుకునేందుకు ప్రాధాన్యమిచ్చే ఆమె.. తన వర్కవుట్‌ వీడియోలతో మహిళలందరిలో స్ఫూర్తి నింపుతుంటారు. అంతేకాదు.. చీరకట్టులోనూ ఎలాంటి వ్యాయామమైనా అలవోకగా చేసేస్తూ వర్కవుట్‌ చేయడానికి చీర ఏమాత్రం అడ్డు కాదని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే తాను చీరకట్టులో చేసిన వర్కవుట్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరలైంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, మద్దతు ఉంటే మహిళలు అన్నింటా విజయం సాధించగలరంటోన్న శార్వరి.. తన ఫిట్‌నెస్‌ హాబీ గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం రండి..


డాక్టర్‌ శార్వరి ఇనామ్‌దార్‌.. పుణేకు చెందిన ఆమె వృత్తి రీత్యా ఆయుర్వేద వైద్యురాలు. ఎప్పుడూ నవ్వు మొహంతో, చలాకీగా, చురుగ్గా ఉండే ఆమె.. తన యాక్టివ్‌నెస్‌కి ప్రధాన కారణం వ్యాయామమే అంటారు. పుషప్స్‌, పులప్స్‌, బరువులెత్తడం.. వంటి కఠినమైన వ్యాయమాల్ని సైతం అలవోకగా చేసేస్తూ.. ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేస్తూ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుంటారీ డాక్టరమ్మ. అంతేకాదు.. ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే శార్వరి.. మహిళలుగా మనం అన్ని పనుల్ని సమన్వయంతో, సమర్థంగా పూర్తి చేయాలంటే అందుకు ఫిట్‌గా ఉండడం ఎంతో ముఖ్యమంటున్నారు.


చీరకట్టులో వర్కవుట్.. వీడియో వైరల్‌!
మహిళలకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, పోషకాహార ప్రాముఖ్యం.. తదితర అంశాల గురించి వివరిస్తూ వీడియోలు పోస్ట్‌ చేసే శార్వరి.. తన ఫిట్‌నెస్‌ వీడియోలను సైతం ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవలే చీరకట్టులో వ్యాయామాలు చేస్తోన్న ఓ వీడియోను సైతం పోస్ట్‌ చేశారామె. సంప్రదాయ చీరకట్టు, ఆభరణాలు ధరించి ముస్తాబైన ఆమె.. ఈ అవుట్‌ఫిట్‌లో పుషప్స్‌, పులప్స్‌, బరువులెత్తడం.. వంటి వ్యాయామాలు చేశారు. చీరలో ఉన్నా ఎంతో కంఫర్టబుల్‌గా వర్కవుట్స్‌ చేస్తూ ఆకట్టుకున్నారామె.
‘మనం రోజూ చీరలో ముస్తాబవ్వం.. కానీ మన సంప్రదాయం ప్రకారం చేసుకునే ప్రతి వేడుకలోనూ చీరకట్టుకు ప్రాధాన్యమిస్తుంటాం. ఇక ఇంట్లో ఉండే చాలామంది మహిళలు రోజంతా చీరలోనే కనిపిస్తుంటారు.. ఆ డ్రస్‌లోనే ఇంటి పనులన్నీ కంఫర్టబుల్‌గా పూర్తి చేస్తారు. అందుకే చీరకట్టులో వ్యాయామం చేయడం కూడా సులభమే అని నిరూపించాలనుకున్నా..’ అంటారు శార్వరి.


మనమూ బరువులెత్తచ్చు!
ఇలా తన ఫిట్‌నెస్‌ వీడియోలతో ఎంతోమందిలో స్ఫూర్తి నింపే ఈ డాక్టరమ్మ.. బరువు తగ్గి నాజూగ్గా మారిన కొంతమంది మహిళల వెయిట్‌ లాస్‌ జర్నీని సైతం ఇన్‌స్టాలో పంచుకుంటుంటారు. అంతేకాదు.. బరువులెత్తడం గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తుంటారామె. ఎందుకంటే ఇది మగాళ్ల వ్యాయామం అనుకునే వారే చాలామంది ఉంటారు. కానీ నిజానికి ఈ వ్యాయామం చేయడానికి ఆడ-మగ అన్న తేడా లేదని, పైగా దీనివల్ల మహిళలకు శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయంటున్నారు శార్వరి.
‘చాలామంది అమ్మాయిలు, మహిళలు.. యోగా, ధ్యానం, నడక, డ్యాన్స్‌.. వంటి వ్యాయామాలు ఎంచుకుంటుంటారు.. బరువులెత్తడానికి అంతగా ఆసక్తి చూపరు. కానీ వయసు పెరిగే కొద్దీ మనలో ఎముకల సామర్థ్యం క్రమంగా తగ్గిపోతుంటుంది. ఆ సమస్య రాకూడదంటే ముందు నుంచే వెయిట్‌ లిఫ్టింగ్‌ చేయడం మంచిది. అయితే ఈ క్రమంలో చక్కటి పోషకాహారం తీసుకోవడమూ ముఖ్యమే! తద్వారా అటు శారీరకంగా, ఇటు మానసికంగా, ఎమోషనల్‌గానూ దృఢంగా మారచ్చు..’ అంటూ బరువులెత్తే వ్యాయామాలపై మహిళల్లో ఉన్న అపోహలు, మూసధోరణుల్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నారామె.


‘ఏ పని చేయడానికైనా చీరకట్టు అడ్డు కానే కాదు.. అలాగే వ్యాయామం చేయడానికి కూడా!’ అంటోన్న శార్వరి.. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ విషయాల్లో మహిళల్లో స్ఫూర్తి నింపడానికి తానెప్పుడూ రడీగానే ఉంటానంటున్నారు. వృత్తిరీత్యా డాక్టర్‌, ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్‌ అయిన ఆమె భర్త, ఇద్దరు కొడుకుల అండతోనే.. అటు ఇంటిని, ఇటు వృత్తిని సమన్వయం చేసుకోగలుగుతున్నానంటోన్న శార్వరి.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే మహిళలు అన్నింటా విజయం సాధించగలరంటున్నారు. 17, 14 ఏళ్ల వయసున్న ఇద్దరు కొడుకులకు తల్లైన శార్వరి.. తన చలాకీతనం రహస్యం కూడా ఫిట్‌నెస్సే అని చెప్పకనే చెబుతున్నారు.


మరిన్ని

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని