ఇంటి నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే! - reasons to dress up daily even during work from home
close
Published : 13/07/2021 20:02 IST

ఇంటి నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారవ్వాల్సిందే!

కరోనా కారణంగా అప్పటిదాకా అలవాటు లేని కంపెనీలు సైతం ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ని అలవాటు చేసుకున్నాయి. దీంతో ఇంటి నుంచే ఉద్యోగులు సౌకర్యవంతంగా తమ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఎలాగూ ఇంటి నుంచే పని చేయడం కదా అని చాలామంది బద్ధకిస్తూ ఆలస్యంగా నిద్ర లేవడం, లాగిన్‌ అవ్వాల్సిన టైమ్‌ దాటిపోతుందని గబగబా బ్రష్‌ చేసుకొని ల్యాప్‌టాప్‌ ముందు కూర్చోవడం, కొంతమందైతే ఏదో ఒకటిలే అన్నట్లు ఇంట్లో వేసుకునే నైట్‌ సూట్స్‌ ధరించి పని మొదలుపెట్టేయడం.. వంటివి చేస్తుంటారు. అయితే నీట్‌గా డ్రస్‌ వేసుకోకపోయినా పనిపై ఏకాగ్రత కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు ఆర్గనైజేషనల్‌ నిపుణులు. మనం ఎలాగైతే ఆఫీసుకెళ్లేటప్పుడు ప్రొఫెషనల్‌గా తయారవుతామో.. ఇంటి నుంచి పనిచేసినా అలాగే తయారవ్వాలంటున్నారు వారు. తద్వారా ఇంటి నుంచి పనిచేసినా నీరసించిపోకుండా.. మన పూర్తి దృష్టంతా పనిపైనే నిలిపి మంచి అవుట్‌పుట్‌ అందించచ్చంటున్నారు. మరి, ఇంతకీ ఇంటి నుంచి పనిచేసినా నీట్‌గా, ప్రొఫెషనల్‌గా ఎలా తయారుకావాలి? ఫలితంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి? తెలుసుకుందాం రండి..

నచ్చిన దుస్తులతో ఉత్సాహంగా..!

చాలామంది ఎలాగూ ఇంటి నుంచే పనిచేయడం కదా ఏ డ్రస్‌ వేసుకుంటే ఏమవుతుందిలే అంటూ ఏ నైటీనో లేదంటే నైట్‌ సూటో వేసేసుకొని కంప్యూటర్‌ ముందు వాలిపోతారు. అయితే మనం వేసుకునే దుస్తులు, వాటి రంగులు మన మనసుపై ప్రభావం చూపుతాయంటున్నారు మానసిక నిపుణులు. ఇంట్లో ఉన్నా సరే.. మనకు నచ్చిన, సౌకర్యవంతంగా ఉండే దుస్తులు వేసుకోవడం వల్ల మన మనసు మరింత చురుగ్గా మారుతుంది. దీని ప్రభావం మనం చేసే పనిపై కూడా పడుతుంది. కాబట్టి ఇంట్లో ఉన్నా కూడా వార్డ్‌రోబ్‌లో మీకు నచ్చిన డ్రస్‌ తీసుకొని ధరించండి. అప్పుడు మీకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. తద్వారా రోజంతా ఎలాంటి ఇబ్బంది లేకుండా చురుగ్గా పనిచేసుకోవచ్చు. ఇలా పనిచేయడం వల్ల రోజు పూర్తయ్యే సరికి మీరు చేసిన పనికి సంబంధించిన నాణ్యమైన అవుట్‌పుట్‌ను మీరు అందించవచ్చు.

కొత్త ప్రయోగాలు చేయండి..!

కొన్ని కార్పొరేట్‌ ఆఫీసుల్లో డ్రస్‌ కోడ్‌ ఉంటుంది. మరికొన్ని ఆఫీసుల్లో ధరించే దుస్తులు ఏవైనా సరే ప్రొఫెషనల్‌గా ఉండాలంటూ కొన్ని నిబంధనలు పెడుతుంటారు. ఇంకొన్ని ఆఫీసుల్లో జీన్స్‌ వేసుకోవడం నిషిద్ధం. అలాంటప్పుడు మన మనసుకు నప్పే డ్రస్‌ ధరించే అవకాశం రాకపోవచ్చు. అయితే అందుకు ఈ సమయమే సరైంది. ఇంటి నుంచి పని చేసే క్రమంలో అలాంటి ప్రొఫెషనల్‌ డ్రస్‌ నిబంధనలు ఉండవు. కాబట్టి మనకు నచ్చిన దుస్తులు వేసుకోవచ్చు. అందుకే మీరు ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు వేసుకోవడానికి వీలు కావట్లేదు అనుకున్న దుస్తులన్నీ ఇప్పుడు బయటికి తీయండి. రోజుకొకటి చొప్పున ధరించి.. ఆయా దుస్తులు ధరించినప్పుడు మీరు ఎలా రడీ కావాలనుకున్నారో అలా తయారైపోండి. ఇలా మీకు నచ్చినట్లుగా తయారవడం వల్ల మీలో కొత్త ఉత్సాహం వస్తుంది. అదే ఆనందంతో పని మొదలుపెడితే ఇక మీకు తిరుగుండదు.

కాస్త పట్టించుకోండి!

లేచామా, ఇంటి పనులన్నీ చేసుకున్నామా, ఆఫీసుకెళ్లామా.. ఉద్యోగం చేసే ఆడవారికి ఈ పనులతోనే సరిపోతుంది. ఇక వాళ్ల గురించి వాళ్లు పట్టించుకోవడానికి అసలు సమయమే ఉండదు. అయితే ఇలా మన గురించి మనం పట్టించుకోనప్పుడు ఇక మిగతా విషయాలపై కూడా అంతగా శ్రద్ధ పెట్టలేకపోవచ్చంటున్నారు నిపుణులు. కాబట్టి ఎలాగూ ఆఫీస్‌కి వెళ్లేటప్పుడు మీకు నచ్చినట్లుగా తయారవడానికి సమయం ఉండట్లేదు కాబట్టి ఇప్పుడు ఇంటి నుంచి పనిచేసే క్రమంలోనైనా ఉదయం అన్ని పనులు త్వరత్వరగా ముగించుకొని ఒక అరగంట మీకోసం మీరు కేటాయించుకునేలా సమయం మిగుల్చుకునే ప్రయత్నం చేయండి. ఆ సమయాన్ని మీకు నచ్చినట్లుగా తయారవడానికి కేటాయించండి. తద్వారా మనకోసం మనం కాస్త సమయం కేటాయించామన్న భావనతో మనసుకు ఏదో తెలియని సంతోషం, సంతృప్తి కలుగుతాయి. అవి రోజంతా మీరు చేసే పనిపై సానుకూల ప్రభావం చూపుతాయి. కావాలంటే ఓసారి ఇలా ప్రయత్నించి చూడండి.

బాడీ ఫ్రెష్‌.. ఆలోచనలు ఫ్రెష్‌..

ఇంట్లో నుంచే పని చేస్తున్నాం కదా.. అవతలి వారికేమన్నా మనం కనబడతామా.. ఏంటి? అలాంటప్పుడు రడీ అయితే ఏంటి.. కాకపోతే ఏంటి? అసలు ఉన్న సమయమే ఇంటి పనులు చేసుకోవడానికి సరిపోవట్లేదు.. ఇంకా ఆఫీస్‌కి వెళ్లేటప్పటిలా రడీ కావాలంటే దానికి ఇంకాస్త సమయం వృథా.. అనే భావన మనలో చాలామందిలో ఉంటుంది. అందుకు ఇంటి పనులతో తీరిక లేకపోవడమే కారణం. కానీ అలాంటి భావన నుంచి బయటికొచ్చి ఓసారి మీరు ఆఫీసుకు వెళ్లినప్పుడు ఎలా తయారయ్యారో ఇప్పుడూ అలా రడీ అయి చూడండి.. ఎందుకంటే మన శరీరం ఎంత తాజాగా, ఉత్సాహంగా ఉంటుందో.. మన మనసులో కూడా అంత క్రియేటివ్‌ ఆలోచనలు పుట్టుకొస్తాయంటున్నారు నిపుణులు. కాబట్టే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒకటి వేసుకుందాంలే అంటూ ఆ విషయాన్ని దాటేయకుండా రోజంతా తాజాగా, చురుగ్గా ఉండాలంటే ప్రొఫెషనల్‌గా రడీ అవడం తప్పనిసరి. ఫలితంగా మీరు చేసే పనిలో నాణ్యత కూడా పెరుగుతుంది. అది మీ కెరీర్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.

అలాంటప్పుడు తడబడరు!

ఇంటి నుంచి పనిచేసినా సరే.. ఒక్కోసారి వర్కింగ్‌ టీమ్‌ అంతా కలిసి వీడియో కాన్ఫరెన్సుల్లో పాల్గొనాల్సి రావచ్చు.. అయితే ఈ కాన్‌ కాల్స్‌లోనూ ముందే నిర్ణయించుకున్నవి కొన్నుంటాయి.. మరికొన్ని సందర్భాల్లో అనుకోకుండా అందరూ కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి రావచ్చు.. లేదంటే ఇతర కంపెనీ టీమ్‌లతో కలిసి కాన్ఫరెన్స్‌లో మాట్లాడాల్సి రావచ్చు. అలాంటప్పుడు మీరు ప్రొఫెషనల్‌గా రడీ కాకపోతే అందరి ముందు ఏదో తెలియని అసౌకర్యంగా ఫీలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సడెన్‌గా కాన్‌ కాల్‌ అంటే ఆదరాబాదరాగా తయారయ్యే సమయం కూడా ఉండకపోవచ్చు. మరి, ఈ సమస్యలన్నీ తప్పాలంటే.. ఎంచక్కా వర్క్‌ ప్రారంభించడానికి ముందే ప్రొఫెషనల్‌గా తయారవడం మంచిది. తద్వారా మీ పైఅధికారులకు మీపై చక్కటి అభిప్రాయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో మీరు ఎంత కంఫర్ట్‌గా ఉంటే మీటింగ్‌లో అంత చురుగ్గా పాల్గొంటారు.. మీ ఆలోచనల్ని అందరితో అంత బాగా పంచుకోగలుగుతారు.

సో.. ఇంట్లో నుంచి పనిచేసినా ప్రొఫెషనల్‌గా తయారైతే ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకున్నారుగా! కాబట్టి ఇంట్లో ఉన్నామనే నిర్లక్ష్యంతో ఏదోలా తయారై నిస్సత్తువగా పని మొదలుపెట్టే కంటే.. కాస్త ప్రొఫెషనల్‌గా, మీ మనసుకు నచ్చినట్లుగా తయారై చూడండి.. మీలో ఏదో తెలియని ఉత్సాహం ఉప్పొంగుతుంది. అది ఫైనల్‌గా మీ అవుట్‌పుట్‌పై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది.. ఇంకెందుకాలస్యం.. ఈరోజు నుంచే మొదలుపెట్టేయండి మరి!

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని