మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇవి మీకోసమే..! - some tips for second pregnancy planning in telugu
close
Updated : 10/08/2021 19:19 IST

మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే ఇవి మీకోసమే..!

ఉష-ఉత్తేజ్ దంపతులకు రెండేళ్ల పాప ఉంది. ప్రస్తుతం వారు మరో బిడ్డ కోసం ప్రయత్నిద్దామనుకుంటున్నారు. కానీ అందుకు ఇది సరైన సమయమేనా.. అని తేల్చుకోలేకపోతున్నారు.

ఇలా రెండో సంతానం కోసం ప్రయత్నించే దంపతుల్లో చాలామందిని కొన్ని రకాల ప్రశ్నలు తికమకపెడుతుంటాయి. జనరేషన్ గ్యాప్ లేకుండా ఉండాలంటే ఇద్దరు పిల్లలకు మధ్య రెండేళ్ల కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదు అని కొందరనుకుంటే.. మొదటి బిడ్డ కాస్త పెద్దయ్యాక రెండో సంతానం గురించి ఆలోచిద్దాంలే అని మరికొందరు భావిస్తుంటారు. ఏదేమైనా మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్న దంపతుల్ని ఇలాంటి సందేహాల నుంచి బయటపడేసే ఉద్దేశంతోనే నిపుణులు కొన్ని విలువైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. మరి అవేంటో మనమూ తెలుసుకుందామా..

స్థిరపడ్డాకే..

కుటుంబం పెరిగేకొద్దీ క్రమంగా ఆర్థిక అవసరాలు కూడా పెరుగుతూ వస్తాయి. కాబట్టి మరో బిడ్డకు జన్మనిచ్చే ముందు మీ ఆర్థిక స్థితిగతులు, స్తోమత.. వంటివి కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో మరో బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడం, వారి కనీస అవసరాలు తీర్చడం, ఇంటి అవసరాలు, మీపై ఆధారపడిన వారు.. వంటి వాటి గురించి ఆలోచించాలి. ఈ అవసరాలన్నిటితో పాటు పొదుపు చేయడానికి కూడా డబ్బు సరిపోయి.. ఎలాంటి సమస్యా లేదు అనుకున్నప్పుడు మాత్రమే మరో బిడ్డ గురించి ఆలోచించడం మంచిదనేది నిపుణుల అభిప్రాయం. లేదంటే కాస్త ఇబ్బందిపడే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తపడాలి..

మరో బిడ్డ కోసం ప్రయత్నించడమనేది దంపతుల్లో కేవలం ఎవరో ఒకరికి మాత్రమే సంబంధించిన విషయం కాదు.. అది ఇద్దరి ఇష్టప్రకారమే జరగాలి. లేదంటే ఆలుమగల మధ్య లేనిపోని గొడవలు, కలతలకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలిద్దరిలో ఒకరికి బిడ్డ కావాలని, మరొకరికి అప్పుడే వద్దని.. ఇలా భిన్నాభిప్రాయాలున్నట్లయితే ముందుగా వాటి గురించి ఇద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకోవడం, ఒకరి ఆలోచనలను మరొకరు అర్థం చేసుకుని ముందుకెళ్లడం ఉత్తమం. అయినా కూడా ఇంకా దంపతులిద్దరూ సందిగ్ధంలోనే ఉన్నట్లయితే కుటుంబ పెద్దలు లేదంటే సంబంధిత నిపుణుల సలహాలు, కౌన్సెలింగ్.. వంటివి తీసుకోవడం చాలా మంచిది. దీంతో సందేహాలన్నీ నివృత్తి అయి, రెండో బిడ్డ విషయంలో మంచి నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంటుంది.

ఆరోగ్యమూ చూసుకోవాలి..

మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు కొందరు మహిళలకు సిజేరియన్ అయ్యే అవకాశముంటుంది. ఇలాంటి వారు ఆరోగ్యరీత్యా కోలుకొని తిరిగి మామూలు స్థితికి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. దీంతో పాటు పుట్టినప్పటి నుంచి బిడ్డ అవసరాలన్నీ తీర్చే క్రమంలో ఎదురయ్యే మానసిక, శారీరక ఒత్తిళ్లు.. ఇవన్నీ తల్లి ఆరోగ్యంపై కాస్త ఎక్కువగానే ప్రభావితం చేస్తాయి. దీంతో పాటు తల్లికి మరే ఇతర అనారోగ్యాలైనా ఉంటే మరో బిడ్డ కోసం ప్రయత్నించడం కష్టమవుతుంది. ఇలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో మరో బిడ్డ కోసం ప్రయత్నించడం అంటే ఇటు తల్లికి, అటు పుట్టబోయే బిడ్డకీ మంచిది కాదు. కాబట్టి తల్లి శారీరకంగా, మానసికంగా సంపూర్ణ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ని పొందిన తర్వాత మరో బిడ్డ కోసం ప్రయత్నించడం శ్రేయస్కరం.

కనీసం మూడేళ్లు..

రెండో బిడ్డ కోసం ప్రయత్నించే దంపతులు దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. అందులో ఇద్దరు పిల్లల వయసుల మధ్య తేడా కూడా చాలా ముఖ్యమైంది. ఈ క్రమంలో బిడ్డలిద్దరి మధ్య వయసులో తేడా కనీసం మూడు నుంచి ఐదేళ్లుండేలా చూసుకోవడం మంచిది. ఇలాంటప్పుడే పిల్లలు జనరేషన్ గ్యాప్ లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ప్రేమగా కలిసిపోవడం.. వంటివి చేస్తారట. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. మొదటి బిడ్డ వయసు మరీ చిన్నగా ఉన్నప్పుడే మరో బిడ్డ పుట్టిందనుకోండి.. ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవడం ఇబ్బందవుతుంది. కాబట్టి పిల్లలు కొన్ని చిన్న చిన్న పనులు తమకు తాముగా చేసుకోవడం ప్రారంభించాక మరో బిడ్డ పుట్టినా తల్లిదండ్రులపై అంతగా భారం ఉండకపోవచ్చనేది నిపుణుల అభిప్రాయం.

అనుభవం వచ్చాకే..

కుటుంబంలో తొలి సంతానం అంటే ఎవరికైనా కాస్త ప్రత్యేకంగా, ప్రేమగానే ఉంటుంది. పూర్తి శ్రద్ధంతా వారిపైనే పెట్టి కంటికి రెప్పలా పెంచుతారు. ఈ క్రమంలో చిన్నారుల అలవాట్లు, వారి అవసరాలు, వారి మనస్తత్వం గురించి కూడా పూర్తి అవగాహన వస్తుంది. ఫలితగా పిల్లల పెంపకం విషయంలో కొంత అనుభవం సంపాదించి రెండో సంతానాన్ని చక్కగా చూసుకునే సామర్థ్యం వస్తుంది. అందుకే పిల్లలిద్దరికీ మధ్య కనీసం మూడు నుంచి ఐదేళ్ల ఎడం ఉండాలన్నది నిపుణుల అభిప్రాయం. అలాగే బిడ్డలిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండడం వల్ల పని ఒత్తిడి, ఆందోళన వంటివి ఉండవు. ఉన్న సమయాన్నే ఇద్దరు పిల్లల సంరక్షణకు చక్కగా వినియోగించుకోవచ్చు.

అర్థమైందిగా.. రెండో బిడ్డ కోసం ప్రయత్నించే ముందు ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మరీ ప్లాన్ చేసుకోండి.. ఓకేనా?


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని