ఇంట్లోనే వక్షోజాల్ని ఇలా పరీక్షించుకోండి! - step by step guide for performing a breast self-examination in telugu
close
Published : 17/10/2021 13:18 IST

ఇంట్లోనే వక్షోజాల్ని ఇలా పరీక్షించుకోండి!

మమతకు ఈ మధ్య తరచూ ఎడమవైపు రొమ్ములో నొప్పి వస్తోంది. సాధారణ నొప్పేనేమో అని నిర్లక్ష్యం చేయడంతో రోజురోజుకీ దాని తీవ్రత ఎక్కువవుతోంది.

కొద్ది రోజుల నుంచి తన కుడివైపు రొమ్ములో వాపు, చనుమొనలు ఎరుపెక్కడం గమనిస్తోంది సమత. అయితే ఈ విషయం డాక్టర్‌కి చెప్పి పరీక్ష చేయించుకోవాలంటే బిడియం, సిగ్గు ఆమెకు అడ్డుపడుతున్నాయి.

హార్మోన్ల స్థాయుల్లో మార్పులు, నెలసరి, అసౌకర్యమైన దుస్తులు ధరించడం.. ఇలా కారణమేదైనా రొమ్ముల్లో నొప్పి పుట్టడం చాలామంది మహిళలకు అనుభవమే. కానీ ఈ నొప్పుల్ని నిర్లక్ష్యం చేయడం, రొమ్ముల్లో గడ్డల్లాంటివి తగిలినా పట్టించుకోకపోవడం.. వంటివి చేస్తే మాత్రం ఒక్కోసారి అవి ప్రమాదకర రొమ్ము క్యాన్సర్‌కి కూడా కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా విస్తరిస్తోన్న క్యాన్సర్లలో బ్రెస్ట్‌ క్యాన్సర్‌ మొదటిస్థానంలో ఉందని, ఏటా 12 శాతం కొత్త రొమ్ము క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని ఆదిలోనే గుర్తించడానికి నిర్ణీత వ్యవధుల్లో ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా తమ వక్షోజాలను పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తద్వారా వాటిల్లో ఏవైనా గడ్డల్లాగా తాకినా, రొమ్ముల ఆకృతిలో తేడా ఉన్నా, వాపు-ఎరుపెక్కడం వంటి మార్పులు గమనించినా.. ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం వల్ల తొలి దశలోనే సమస్యను గుర్తించి ప్రాణాలు నిలుపుకోవచ్చని వారు సూచిస్తున్నారు. ‘రొమ్ము క్యాన్సర్‌ అవగాహన మాసం’ సందర్భంగా స్వయంగా వక్షోజాల్ని ఎలా పరీక్షించుకోవాలి? ఎన్ని రోజులకోసారి పరీక్ష చేసుకోవాలి? తదితర విషయాల గురించి తెలుసుకుందాం..

రొమ్ము క్యాన్సర్‌.. వయసుతో సంబంధం లేకుండా మహిళల పాలిట శాపంగా పరిణమిస్తోందీ వ్యాధి. ఏటా నమోదయ్యే అన్ని రకాల క్యాన్సర్‌ కేసుల్లో ఒక్క రొమ్ము క్యాన్సర్‌ కేసులే సుమారు 12 శాతంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతేకాదు.. గతంలో ఊపిరితిత్తుల క్యాన్సర్‌ బారిన పడే వారు ఎక్కువగా ఉండేవారని, ఇప్పుడు ఆ స్థానాన్ని రొమ్ము క్యాన్సర్‌ ఆక్రమించిందని హెచ్చరిస్తోంది. ఇక మన దేశంలోనైతే యుక్తవయసులో ఉన్న అమ్మాయిలే ఎక్కువగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారట! అందుకే నిర్ణీత వ్యవధిలో ఇంట్లోనే ఎవరికి వారే స్వయంగా తమ రొమ్ముల్ని పరీక్షించుకోవడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా తొలి దశలోనే వ్యాధిని గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.

అన్ని గడ్డలూ క్యాన్సర్ కారకాలు కావు!

వక్షోజాల్లో ఏర్పడే గడ్డల్ని రొమ్ము క్యాన్సర్‌ ప్రారంభ సంకేతాల్లో ఒకటిగా పరిగణించవచ్చంటున్నారు నిపుణులు. అయితే అందులోనూ 80-85 శాతం గడ్డలు క్యాన్సర్‌ రహితమైనవేనట! క్యాన్సర్‌కు కారణమయ్యే గడ్డలు అసాధారణ ఆకృతుల్లో ఉండి.. నొప్పి కలిగించకుండా ఉంటాయట..! అలాగని నొప్పి కలిగించే గడ్డల్ని నిర్లక్ష్యం చేయడం కూడా తగదు. ఎందుకంటే అతికొద్ది మందిలో మాత్రమే నొప్పితో కూడిన గడ్డలు క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.

ఎలా పరీక్షించుకోవాలంటే..!

ఇంట్లోనే రొమ్ముల్ని పరీక్షించుకోవడానికి రెండు రకాల పద్ధతుల్ని పాటించాల్సి ఉంటుంది. ఒకటి వక్షోజాల ఆకృతి, పరిమాణం వంటివి పరిశీలించడం; రెండోది వాటిని తాకుతూ సమస్యను పసిగట్టడం.

వక్షోజాలను పరిశీలించడం

* ఇందులో భాగంగా నడుం వరకు దుస్తులేవీ ధరించకుండా చేతుల్ని వెనక్కి పెట్టి అద్దం ముందు నిల్చోవాలి. ఇప్పుడు రొమ్ముల పరిమాణం, ఆకృతి, వాటిపై ఏమైనా ముడతలు, గుంతలు పడుతున్నాయా?, చనుమొనల నుంచి ఏవైనా స్రావాలు వెలువడుతున్నాయా?, రొమ్ములు-చనుమొనల భాగాల్లో ఎరుపెక్కడం, వాపు రావడం.. మొదలైన విషయాలన్నీ ఎవరికి వారే పరిశీలించుకోవాలి.

* ఇప్పుడు రెండు చేతుల్ని పైకెత్తి పై విషయాలన్నీ మరోసారి పరీక్షించుకోవాలి.

* ఆ తర్వాత రెండు చేతుల్ని నడుంపై ఉంచి.. భుజాలను కాస్త ముందుకు నెట్టి పైన సూచించినట్లుగా రొమ్ముల్ని ఇంకోసారి పరిశీలించాలి.

* ఇప్పుడు భుజాలను పైకెత్తి వక్షోజాల్ని చెక్‌ చేసుకోవాలి. ఈ క్రమంలో ముందుగా ఏదో ఒక భుజాన్ని పైకెత్తాలి.. ఉదాహరణకు ఎడమ భుజాన్ని పైకి లేపి.. ఎడమ రొమ్ము పరిమాణం, ఆకృతిలో ఏవైనా తేడాలున్నాయేమో గమనించాలి.. అలాగే నొప్పి, అసౌకర్యంగా అనిపిస్తోందేమో గమనించుకోవాలి. ఆపై కుడి భుజం పైకెత్తి మళ్లీ ఇదే పద్ధతిని పునరావృతం చేయాలి.

తాకుతూ పరీక్షించుకోవడం!

* ముందుగా చెవుల కింది భాగంలో చేతి మూడువేళ్లను ఉంచి గుండ్రంగా తిప్పుతూ (సర్క్యులర్‌ మోషన్‌) మెడ వరకు రావాలి. ఈ క్రమంలో ముందుగా కాస్త నెమ్మదిగా, ఆపై మధ్యస్తంగా, తర్వాత బలంగా ప్రెషర్స్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

* ఇప్పుడు మెడ ఎముకను (కాలర్‌ బోన్‌) బలంగా ఒత్తుతూ ఆ భాగంలో ఏదైనా అసౌకర్యంగా ఉందేమో గమనించాలి.

* ఆపై ఎడమ చేతిని పైకి లేపి మెడ వెనక్కి పెట్టాలి. ఇప్పుడు కుడిచేతి వేళ్ల సహాయంతో ఎడమ రొమ్ము దగ్గర్నుంచి ఒత్తుతూ ఎడమ చంక దాకా రావాలి. ఆపై ఈ భాగంలోనే మరోసారి బలంగా ఒత్తుతూ గుండ్రంగా తిప్పుతూ పరిశీలించాలి. ఇలా చేయడం వల్ల గడ్డలేమైనా ఉంటే గుర్తించచ్చు. ఇదే పద్ధతిని కుడి రొమ్ముకు కూడా ఫాలో అవ్వాలి.

* ఇప్పుడు మంచం మీద వెల్లకిలా పడుకొని ఒక చేతిని తల కింద పెట్టుకోవాలి. అవసరమైతే భుజాల కింద దిండు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మరో చేతి వేళ్ల సహాయంతో రొమ్ముపై ఒక భాగంలో కాస్త నెమ్మదిగా, మధ్యస్తంగా, బలంగా ఒత్తుతూ గుండ్రంగా తిప్పాలి. ఆపై చేతి వేళ్లను కాస్త పక్కకు జరిపి అక్కడా ఇదే పద్ధతిని పాటించాలి. రొమ్ము చుట్టూ ఇలాగే చేయాల్సి ఉంటుంది. ఆఖరుగా చనుమొనల వద్ద కూడా కాస్త ఒత్తుతూ గడ్డలాంటిదేమైనా ఉందేమో పరిశీలించుకోవాలి. ఇలా ఒక రొమ్మును పరీక్షించుకున్న అనంతరం మరో వక్షోజాన్ని కూడా ఇలాగే పరీక్షించుకోవాలి.

 

ఎప్పుడు చేసుకోవాలి?

ఇంట్లోనే స్వయంగా ఎవరికి వారే రొమ్ముల్ని పరీక్షించుకున్నా.. అదీ నిర్ణీత సమయంలోనే చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నెలసరి మొదలైన ఐదారు రోజులకు స్వీయ పరీక్ష చేసుకోవడానికి అనువైన సమయమట! ఎందుకంటే రుతుచక్రం సమయంలో హార్మోన్ల స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవుతాయి. తద్వారా రొమ్ము కణజాలంలో మార్పులొస్తాయి. ఎప్పుడైతే నెలసరి మొదలవుతుందో అప్పుడు రొమ్ములో వచ్చిన వాపు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది. పిరియడ్‌ ముగిసే సమయానికి అంటే ఐదారు రోజుల వరకు రొమ్ములు తిరిగి మామూలు స్థితికి చేరుకుంటాయి. ఈ సమయంలో పరీక్షించుకుంటే వక్షోజాల్లో ఉండే గడ్డల్ని సులభంగా పసిగట్టచ్చంటున్నారు నిపుణులు.

ఇక మెనోపాజ్‌ దశలో ఉన్న మహిళలు నెలలో ఎప్పుడైనా స్వీయ రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. అది కూడా ప్రతి నెలా ఒకే తేదీలో పరీక్ష చేసుకోవాలి. ఉదాహరణకు.. అక్టోబర్ 17న పరీక్షించుకుంటే.. తిరిగి నవంబర్ 17న మళ్లీ పరీక్ష చేసుకోవాలన్నమాట! ఇలా నెలనెలా ఒక నిర్ణీత తేదీని ఫాలో అవ్వాలి.

 

ఎప్పుడు డాక్టర్‌ని సంప్రదించాలి?

ఇలా మీరు ఇంట్లోనే రొమ్ముల్ని పరీక్షించుకున్నప్పుడు వక్షోజాల్లో గడ్డలున్నట్లుగా గమనించడం; అసాధారణ వాపు; ఎరుపెక్కడం; ఆ ప్రదేశంలో చర్మంపై ముడతలు పడడం.. చర్మం మందంగా, గరుకుగా మారడం; చనుమొనల నుంచి స్రావాలు వెలువడడం, రక్తస్రావం కావడం.. వంటి లక్షణాలు గమనిస్తే సిగ్గు, బిడియం అంటూ అలక్ష్యం చేయకుండా.. వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం ఉత్తమం. తద్వారా వైద్యులు అసలు సమస్యేంటో పరీక్షించి చూస్తారు.

Advertisement


మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి