మనసు మెచ్చేలా సర్దేద్దాం! - stress relief home decoration ideas in telugu
close
Published : 29/08/2021 12:43 IST

మనసు మెచ్చేలా సర్దేద్దాం!

ఇంటిని పొందిగ్గా సర్దడంలో మనకంటే నేర్పరి ఇంకెవరుంటారు చెప్పండి! ఏ వస్తువు ఎక్కడుంటే నీట్‌గా ఉంటుంది.. ఎక్కడ ఎలాంటి అలంకరణ వస్తువులు అమర్చాలి.. అన్న విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటాం. నిజానికి ఇలా మనకు నచ్చినట్లుగా ఇంటిని తీర్చిదిద్దుకునే ప్రక్రియ మనసు పైనా సానుకూల ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. అందుకే ఒత్తిడిగా, ఆందోళనగా అనిపించినప్పుడల్లా ఇంటి అలంకరణపై శ్రద్ధ పెడితే మనసు తిరిగి కుదుటపడుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో మనసు మెచ్చేలా ఇంటిని ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుసుకుందాం రండి..

పచ్చదనంతో ఆహ్లాదం!

ఉద్యోగం చేసే మహిళలకు రోజూ ఇంటిని సర్దడం కుదరకపోవచ్చు. దాంతో ఆ సమయంలో అవసరమున్న పనులే చేసి.. మిగతా వాటిని పక్కన పెట్టేస్తుంటారు. ఫలితంగా వారం తిరిగే సరికల్లా ఇల్లంతా చిందరవందరగా తయారవుతుంది. అది చూసి మన మనసొప్పదు. ఆ కోపంలో ‘నువ్వు కాస్త సహాయపడితే ఇల్లు ఇలా ఎందుకు తయారవుతుంది..’ అని భాగస్వామిని ఓ మాట అన్నా అంటాం. అయితే ఇలాంటి కోపాన్ని, ఒత్తిడిని అదుపు చేసే శక్తి పచ్చదనానికి ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఇంట్లోని ప్రతి గదిలో ఇండోర్‌ ప్లాంట్స్‌, మనీ ప్లాంట్స్‌, సువాసన వెదజల్లే పూల మొక్కలు.. వంటివి ఏర్పాటు చేసుకోమంటున్నారు. ఇక ఇందుకోసం ఇంట్లో ప్రత్యేకంగా స్థలం కూడా కేటాయించక్కర్లేదు.. ఎందుకంటే పై నుంచి వేలాడదీసే హ్యాంగింగ్‌ ప్లాంట్స్‌, గోడకు అమర్చే ప్లాంట్స్‌ కూడా ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇక ఇవి అమర్చుకున్న దగ్గర్నుంచి మీ దృష్టి వీటి పైనే ఉంటుంది.. కాబట్టి ఒత్తిడి దరిచేరకుండా జాగ్రత్తపడచ్చు. అలాగని ఇంటిని అలాగే వదిలేయకుండా మీకు వీలు చిక్కినప్పుడల్లా వారానికోసారి లేదంటే రెండు వారాలకోసారి సర్దే పని పెట్టుకుంటే సరిపోతుంది.

నచ్చిన ప్రదేశం.. నచ్చినట్లుగా!

ప్రతి ఒక్కరి ఇంట్లో వాళ్లకు నచ్చిన ప్రదేశమంటూ ఒకటి ఉంటుంది.. అది బాల్కనీ కావచ్చు.. వంటగది కావచ్చు.. లేదంటే ఇంటి ముంగిట్లో కావచ్చు.. కాస్త మూడ్‌ బాగోలేకపోయినా, పని ఒత్తిడితో సతమతమైనా.. ఇక్కడికొచ్చి సేదదీరుతుంటాం. అయితే ఈ ప్రదేశం మరింత ఆహ్లాదాన్ని పంచాలంటే మన అభిరుచుల్ని, నైపుణ్యాల్ని ఇక్కడ పెట్టుబడిగా పెట్టచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కొంతమందికి వింటేజ్‌ స్టైల్‌ అంటే ఇష్టముంటే.. మరికొంతమందికి నచ్చిన రంగులు వేసుకోవడం ఇష్టముంటుంది.. పుస్తకాల పురుగైతే ఆ ప్రదేశాన్ని గ్రంథాలయంగా మార్చేస్తుంటారు. ఇంకొందరు ఆ పర్సనల్‌ స్పేస్‌నే వర్కింగ్‌ స్పేస్‌గానూ మార్చుకుంటారు. ఇలా మీ ఇష్టాయిష్టాలకు తగినట్లుగా ఆ ప్రదేశంలో అందమైన అలంకరణ వస్తువులకు చోటిస్తే ఇక ఆ ప్రదేశాన్ని మీరు వదలనే వదలరు.

మీ ఇంటికి మీరే డిజైనర్!

ఈ మధ్య చాలామంది మహిళలు యూట్యూబ్‌ ద్వారా తమ డ్రీమ్‌ హోమ్‌ని ‘హోమ్‌ టూర్‌’ పేరుతో అందరికీ పరిచయం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలా వారు పెట్టిన వీడియోలు చూసినప్పుడల్లా.. అరే ఈ డెకరేటివ్‌ పీస్‌ బాగుంది.. కిచెన్‌ను భలే నీట్‌గా సర్దారే.. అంటూ మనమూ మన ఇంటిని అదే విధంగా సర్దాలనుకుంటాం. కానీ అలాంటి అలంకరణ మన ఇంటికి నప్పచ్చు.. నప్పకపోవచ్చు.. కాబట్టి ఎవరి ఇంటికి వారే ఇంటీరియర్‌ డిజైనర్‌ కావాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఇతరుల దగ్గర్నుంచి ఐడియాలు తీసుకోవడంలో తప్పు లేదు.. కానీ మీలో ఉన్న Unique Ideas కి ఎక్కువ ప్రాధాన్యమిస్తే మీ మనసు మరింత సంతృప్తి పడుతుంది. అంతేకాదు.. కొంతమందికి ఆర్ట్‌ వేయడం, క్రాఫ్ట్స్‌ తయారుచేయడం.. వంటి కళల్లో పట్టుండచ్చు. వాటిని వృథా చేయకుండా మీ ఇంటికోసం చక్కటి థీమ్‌తో కూడిన అందమైన డెకరేటివ్‌ పీసెస్‌ని తయారుచేసుకొని ఇంట్లో అమర్చుకోవచ్చు. పైగా ఎవరైనా బయటి వ్యక్తులు ఇంటికొచ్చినప్పుడు మీరు తయారుచేసిన వస్తువులు/ఇంటిని అలంకరించిన విధానాన్ని మెచ్చుకుంటే మనసు ఎగిరి గంతేస్తుందంటే నమ్మండి!

కిచెన్‌ కంఫర్టబుల్‌గా!

మనమంతా రోజులో ఎక్కువ సమయం గడిపేది కిచెన్‌లోనే! అందుకే ఇతర గదుల మాట ఎలా ఉన్నా.. కిచెన్‌ నీట్‌గా కనిపిస్తే మనసుకు సంతృప్తిగా, సంతోషంగా అనిపిస్తుంటుంది. అయితే దీన్ని సర్దడంలోనూ పలు మెలకువలు పాటిస్తే.. మరింత కంఫర్టబుల్‌గా, హ్యాపీగా ఫీలవ్వచ్చంటున్నారు నిపుణులు.

* ఇప్పుడు చాలామంది ఇళ్లలో మాడ్యులర్‌ వంటగదులే ఉంటున్నాయి.. వార్డ్‌రోబ్స్‌ లోపలే సరంజామా ఉంటుంది కదా అని ఇష్టమొచ్చినట్లుగా పడేయడం కాకుండా.. రోజూ అవసరమున్నవి మీకు అందుబాటులో, ఎక్కువగా వాడనివి పై ర్యాక్స్‌లో లేదంటే వెనకవైపు అమర్చుకోవచ్చు.

* కిచెన్‌లో ఏ వస్తువైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా త్వరగా జిడ్డు పడుతుంది. ఈ క్రమంలో జిడ్డుగా మారిన ప్లాస్టిక్‌ డబ్బాల్ని శుభ్రం చేయడానికి అదనంగా శ్రమ పడాలి. అదే వాటికి బదులు అన్నీ ఒకే తరహా గాజు డబ్బాలు/సీసాలు ఎంచుకొని సరుకులన్నీ వాటిలో నింపుకుంటే చూడ్డానికి నీట్‌గా కనిపిస్తుంది. అది చూసి మన మనసు నిండుతుంది.

* ఇక స్టౌ వెనక గోడలు, కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌ జిడ్డు పట్టకుండా ఉండాలంటే యాంటీ గ్రీజ్‌ షీట్స్‌ అతికించడం మంచిది. అవసరం తీరాక వాటిని తొలగిస్తే సరిపోతుంది.

ఇవి కూడా!

* కొన్ని పరిమళాలు మన మనసును ఉత్తేజపరుస్తుంటాయి. అలాంటి వాటిని ఇంట్లోనూ అమర్చుకోవచ్చు. ఈ క్రమంలో సెంటెడ్‌ క్యాండిల్స్‌, సెంటెడ్‌ డిఫ్యూజర్స్‌, సాల్ట్‌ ల్యాంప్స్‌.. వంటివి ఇంట్లో ఏర్పాటు చేసుకోవచ్చు.

* కొన్ని ఇంటీరియర్‌ కలర్స్‌ కూడా మనసుపై సానుకూల ప్రభావం చూపుతాయని కలర్‌ సైకాలజీ చెబుతోంది. అందుకే మనసుకు ప్రశాంతతనిచ్చే నీలం, ఆకుపచ్చ, పసుపు.. వంటి రంగుల్ని ఇంట్లో భాగం చేసుకోమంటున్నారు నిపుణులు. అది కాకపోతే.. మీ ప్రైవేట్‌ స్పేస్‌లో వీటికి చోటివ్వచ్చు.

మరి, మీలోని ఒత్తిడి-ఆందోళనల్ని దూరం చేసుకోవడానికి మీరు మీ ఇంటిని ఎలా సర్దుకున్నారు? నలుగురికీ ఉపయోగపడే ఆ చిట్కాలు మాతో పంచుకోండి!


Advertisement


మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని