పరుగు కోసం ఉద్యోగాన్నే వదులుకుంది! - sufiya khan became the first female runner to complete manali to leh ultra-marathon in telugu
close
Updated : 21/10/2021 16:56 IST

పరుగు కోసం ఉద్యోగాన్నే వదులుకుంది!

(Photo: Instagram)

కాస్త దూరం పరిగెత్తితేనే అలసిపోతాం.. కాళ్లు నొప్పులు పుడుతున్నాయంటూ ఆపసోపాలు పడుతుంటాం.. కానీ ఆమె ఏకధాటిగా రోజుల తరబడి పరిగెడుతూనే ఉంటుంది. కొండ-కోనలు, రాళ్లూ-రప్పలు, మంచు పర్వతాలు, మైనస్‌ డిగ్రీ ఉష్ణోగ్రతలు.. ఇవన్నీ దాటుకుంటూ ఇప్పటికే దేశాన్ని చుట్టేసింది.. ప్రపంచ రికార్డులు ఒడిసిపట్టింది. ఇక ఇటీవలే మనాలీ నుంచి లేహ్‌ వరకు.. రాళ్ల బాటను పూబాటగా మలచుకుంటూ ఆరున్నర రోజుల్లోనే లక్ష్యాన్ని అధిగమించింది. ఈ ఘనత సాధించిన తొలి మహిళా అల్ట్రా మారథానర్‌గా రికార్డు పుటల్లోకి ఎక్కింది. ఆమే అజ్మీర్‌కు చెందిన పరుగుల రాణి సూఫియా ఖాన్‌. ‘పరుగు కోసం ఉద్యోగాన్నే వదులుకున్నా.. ప్రపంచ యాత్ర చేయడం పెద్ద కష్టం కాదంటో’న్న ఈ లేడీ మారథానర్‌ రన్నింగ్‌ జర్నీ గురించి తెలుసుకుందాం..

మనసులో వేరే లక్ష్యమున్నప్పుడు చేసే ఉద్యోగంపై దృష్టి పెట్టలేం. జాబ్‌ వదులుకొనైనా తపనను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతాం. సూఫియా ఖాన్‌ చేసింది కూడా ఇదే! ఇష్టంతోనే మొదట ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగంలో చేరినప్పటికీ.. పలు కారణాల రీత్యా కొన్నేళ్లకే దాన్నుంచి బయటికి వచ్చేసింది. అయితే ముందు నుంచీ ఫిట్‌నెస్‌పై మక్కువ చూపే ఆమె.. ఉద్యోగం చేస్తోన్న క్రమంలో దాన్నే కోల్పోతున్నానన్న విషయం గ్రహించింది. ఈ క్రమంలో ఒత్తిడి, ఆందోళనల్ని కూడా ఎదుర్కొంది. అయితే ఈ సమస్యల్ని అధిగమించడానికి రోజుకో పావుగంట పాటు పరిగెత్తడం అలవాటు చేసుకుంది సూఫియా.

పరుగే ఊపిరైంది!

ఈ జీవనశైలే తనలోని శారీరక, మానసిక ఒత్తిళ్లను దూరం చేసిందని చెప్పే ఆమె.. ఆ తర్వాత దీన్నే తన కెరీర్‌గా మార్చుకున్నానంటోంది. ‘నా పదహారో ఏటే నాన్న చనిపోయాడు. దాంతో కుటుంబ భారమంతా అమ్మ మీదే పడింది. నేను కూడా అమ్మకు ఎంతో కొంత సాయంగా ఉండాలని చదువు పూర్తికాగానే నాకిష్టమైన ఏవియేషన్‌ రంగంలో చేరాను. అయితే నాకు ముందు నుంచీ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై శ్రద్ధ ఎక్కువ. కానీ ఉద్యోగంలో వివిధ షిఫ్టుల్లో పనిచేయాల్సి రావడంతో వాటిపై ప్రతికూల ప్రభావం పడింది. శారీరకంగా ఫిట్‌నెస్‌ని కోల్పోయాను.. మానసికంగా ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కొన్నా. అందుకే ఆ తర్వాత కొన్నేళ్లకు ఉద్యోగానికి స్వస్తి చెప్పి.. ఆరోగ్యం-ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టా. ఈ క్రమంలోనే పరుగును నా ఊపిరిగా భావించా. ఈ వ్యాయామమే నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించిందనిపిస్తోంది..’ అంటోంది సూఫియా.

మూడేళ్ల ప్రయాణంలో..!

పరుగునే తన ఆరోప్రాణంగా భావించిన ఈ మహిళా మారథానర్‌.. 2018లో తన పరుగు ప్రస్థానాన్ని ప్రారంభించింది. అదే ఏడాది మార్చిలో 16 రోజుల్లోనే 720 కిలోమీటర్ల దూరం పరిగెత్తి ‘గోల్డెన్‌ ట్రయాంగిల్‌’ ఫీట్‌ (దిల్లీ, ఆగ్రా, జైపూర్‌లను కలిపే త్రిభుజాకారపు పర్యటక వలయం)ను పూర్తి చేసింది. తద్వారా జాతీయ రికార్డును బద్దలుకొట్టడంతో పాటు ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించిందామె.

ఇక 2019లో ‘కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి’ వరకు (సుమారు 4 వేల కిలోమీటర్ల దూరాన్ని) వేగంగా పరిగెత్తిన మహిళా రన్నర్‌గా గిన్నిస్‌ రికార్డును తన పేరిట లిఖించుకుంది సూఫియా. ఇక ఇప్పుడు మనాలీ నుంచి లేహ్‌ వరకు సుమారు 430 కిలోమీటర్ల దూరాన్ని 6 రోజుల 12 గంటల 10 నిమిషాల్లో పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన తొలి మహిళా అల్ట్రా మారథానర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించిందీ పరుగుల రాణి. వీటితో పాటు ఎన్నో మారథాన్లు, పరుగు పందేల్లో సైతం పాల్గొని సత్తా చాటుతోంది సూఫియా.

రాళ్ల బాటను పూబాటగా..!

సాధారణంగా రోడ్డుపై పరిగెత్తడం వేరు.. రాళ్లు-రప్పలు, ఎత్తు-పల్లాలుండే కొండలెక్కుతూ పరిగెత్తడం వేరు.. వీటికి తోడు ప్రతికూల వాతావరణం, ఆక్సిజన్‌ కూడా అంతంతమాత్రమే ఉండే మనాలీ-లేహ్‌ దారిలో పరిగెత్తాలంటే మాటలు కాదు. అయితే ఇందుకోసం ముందే అక్కడ పాగా వేసి ఆ వాతావరణానికి అలవాటు పడ్డానంటోంది సూఫియా.

‘అక్కడుండే స్థానిక ప్రజలు, ఆర్మీ వాళ్ల దగ్గర్నుంచి ముందే అక్కడి వాతావరణం గురించి తెలుసుకున్నా. ఈ ప్రదేశం సముద్ర మట్టానికి ఎత్తులో ఉండడం వల్ల క్రమంగా ఎత్తుకు వెళ్లే కొద్దీ ఆక్సిజన్‌ స్థాయులు కూడా పడిపోతాయి. అంతేకాదు.. ఒక్కోసారి ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోవచ్చు కూడా! అందుకే ఇలాంటి ప్రతికూల వాతావరణానికి నేను అలవాటు పడాలనే యాత్రకు ముందు పదిహేను రోజుల పాటు కొండలపై టెంట్‌ వేసుకొని గడిపా. ఈ క్రమంలో శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవడానికి కోర్‌ వ్యాయామాలు చేశా. మానసిక ప్రశాంతతను సొంతం చేసుకోవడానికి యోగాను ఆశ్రయించా. మొత్తానికి నా మనసును పూర్తి పాజిటివ్‌గా మార్చుకున్నాకే యాత్రకు బయల్దేరా. విజయం సాధించా. ఏ పని చేయడానికైనా శరీరాన్ని, మనసును ముందే సన్నద్ధం చేసుకుంటే దాదాపు 80 శాతం పని పూర్తయినట్లే!’ అంటూ తన సక్సెస్‌ సీక్రెట్‌ని పంచుకుందీ రన్నింగ్‌ క్వీన్.

ప్రపంచాన్ని చుట్టేస్తా!

ప్రతి మారథాన్‌ను ఓ స్ఫూర్తిదాయక సందేశంతో మొదలుపెట్టే సూఫియా.. ఇటీవలే పూర్తిచేసిన మనాలీ-లేహ్‌ యాత్రకు కూడా ‘Push Your Limits’ అనే థీమ్‌ను ఎంచుకుంది. అంటే.. మహిళలుగా మన చుట్టూ ఎన్నో ఆంక్షలున్నాయి.. స్వీయ ప్రేరణతో వాటిని దాటితేనే మనల్ని మనం నిరూపించుకోగలం అన్న చక్కటి సందేశంతో ఔత్సాహికుల్లో స్ఫూర్తి నింపిందీ అజ్మీర్‌ రన్నర్‌. ‘నేను పాల్గొనే ప్రతి మారథాన్‌/పరుగు పందేల్లో నా భర్త వికాస్‌, నా తల్లి ప్రోత్సాహం ఎంతో ఉంటుంది. వాళ్ల మద్దతుతోనే నేను ఇన్ని విజయాలు సాధించగలిగాను.. ఇక నా ముందున్న లక్ష్యమల్లా.. పరుగుతో ప్రపంచాన్ని చుట్టేయడమే! ప్రస్తుతం అందుకోసమే సన్నద్ధమవుతున్నా..’ అంటోంది సూఫియా.

మరి, ఈ పరుగుల రాణి భవిష్యత్‌ లక్ష్యం నెరవేరాలని మనమూ మనసారా కోరుకుందాం..!

ఆల్‌ ది బెస్ట్‌ సూఫియా!


Advertisement


మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని