మీరు ఏ దువ్వెన వాడుతున్నారు? - surprising benefits of using a wooden comb for your hair and scalp
close
Updated : 14/08/2021 21:06 IST

మీరు ఏ దువ్వెన వాడుతున్నారు?

సాధారణంగా జుట్టు దువ్వుకోవడానికి మీరు ఏ దువ్వెన వాడతారు? అయినా అదేం ప్రశ్న.. అది అందరూ వాడేదేగా.. ప్లాస్టిక్‌ దువ్వెన! అంటారా? అది నిజమే అనుకోండి.. కానీ ప్లాస్టిక్ దువ్వెన వల్ల పర్యావరణానికే కాదు.. జుట్టుకూ నష్టమేనంటున్నారు సౌందర్య నిపుణులు.

జిడ్డుదనం నుంచి విముక్తికి..

సాధారణంగా కుదుళ్ల నుంచి సహజసిద్ధమైన నూనెలు విడుదలవుతుంటాయి. ఈ క్రమంలో మనం ప్లాస్టిక్‌ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనలను ఉపయోగించినా ఆ నూనెలు కేశాలకు అందకుండా ఆయా దువ్వెనలకు అంటుకుపోతాయి. అదే చెక్కతో చేసిన దువ్వెనైతే.. ఈ నూనెల్ని సులభంగా జుట్టంతా పరచుకునేలా చేస్తుంది. తద్వారా కేశాలకు పోషణ అందుతుంది. అలాగే జుట్టు జిడ్డుగా మారకుండా, అదే సమయంలో నిర్జీవంగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. ఫలితంగా కేశాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి.

కుదుళ్లకు ‘మర్దన’!

ప్లాస్టిక్‌ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనల కంటే చెక్కతో చేసిన దువ్వెనలు అత్యంత సున్నితంగా ఉంటాయి. మన కుదుళ్లకు కావాల్సింది కూడా ఆ సున్నితత్వమే! అలాకాకుండా కొందరు కుదుళ్లు దురదగా ఉందని పదునుగా ఉండే దువ్వెనతో బలంగా దువ్వుతుంటారు. దానివల్ల కుదుళ్లు డ్యామేజ్ అవుతాయి. అలాకాకుండా సున్నితమైన చెక్క దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవడం వల్ల ఈ ప్రక్రియ కుదుళ్లకు మసాజ్‌లా ఉపయోగపడుతుంది. అలాగే ఈ దువ్వెన బ్రిజిల్స్‌ కుదుళ్లపై ఉండే ఆక్యుపంక్చర్‌ పాయింట్స్‌కి సున్నితంగా ఒత్తిడి కలగజేసి.. తద్వారా అక్కడ రక్తప్రసరణ సవ్యంగా జరిగి జుట్టు ఒత్తుగా పెరిగేందుకు దోహదం చేస్తుంది. కావాలంటే ఓసారి ట్రై చేసి చూడండి.. చెక్క దువ్వెనతో దువ్వినప్పుడు ఎంత హాయిగా అనిపిస్తుందో!!

చుండ్రుకు చెక్!

కుదుళ్లు పొడిబారిపోవడం, జిడ్డుదనం, ఆ భాగంలో రాపిడి వల్ల చుండ్రు రావడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో- చెక్కతో చేసిన దువ్వెనతో దువ్వడం మంచిదట. ఎందుకంటే- చెక్క దువ్వెన
బ్రిజిల్స్‌ సున్నితంగా ఉంటాయి.. దీనితో దువ్వినప్పుడు కుదుళ్లలో విడుదలయ్యే సహజ నూనెల్ని జుట్టంతా పరచుకునేలా చేస్తుంది. కాబట్టి ఆ భాగంలో జిడ్డుగా మారదు. తద్వారా కుదుళ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండి.. చుండ్రు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

అలర్జీలకు బైబై!

కొంతమందికి కుదుళ్లలో చర్మం సున్నితంగా ఉంటుంది. అలాంటి వారికి ప్లాస్టిక్‌ లేదా ఏ ఇతర లోహాలతో తయారుచేసిన దువ్వెనలైనా అలర్జీలను కలిగించచ్చు. కాబట్టి అలాంటి వారు చెక్కతో తయారుచేసిన దువ్వెనలు వాడడం వల్ల చెక్కలోని సహజసిద్ధమైన సమ్మేళనాలు కుదుళ్లకు ఎలాంటి హానీ కలిగించవు. ఫలితంగా అటు కుదుళ్లు, ఇటు జుట్టు ఆరోగ్యం దెబ్బతినకుండా జాగ్రత్తపడచ్చు.

ఇవి కూడా!

* ప్లాస్టిక్‌ దువ్వెనతో బలంగా దువ్వడం వల్ల జుట్టు చివర్లు చిట్లిపోతుంటాయి. అదే చెక్క దువ్వెన సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ సమస్య ఉండదు.

* వెంట్రుకల్లో చిక్కుకున్న దుమ్ము, ధూళిని చెక్క దువ్వెనలు ఈజీగా తొలగిస్తాయి. అదే ప్లాస్టిక్‌ దువ్వెనలైతే ఈ దుమ్ము, ధూళిని ఆకర్షించి.. మరోసారి దువ్వినప్పుడు అవి మళ్లీ జుట్టులోకి చేరడం, వెంట్రుకలు చిక్కులు పడేలా చేయడం, కేశాల ఆరోగ్యాన్ని దెబ్బతీయడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి.

* చెక్క దువ్వెనలు ఎక్కువ కాలం మన్నడంతో పాటు అన్ని జుట్టు తత్వాల వారికీ చక్కగా సరిపోతాయి. అలాగే వీటివల్ల పర్యావరణానికీ ఎలాంటి నష్టమూ జరగదు.

చెక్క దువ్వెనను ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసుకున్నారుగా! అయితే ఆలస్యమెందుకు.. ప్లాస్టిక్‌ వాటికి స్వస్తి చెప్పి చెక్క దువ్వెనను ఎంచుకుందాం.. మన కురుల ఆరోగ్యాన్ని కాపాడుకుందాం..!


Advertisement


మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని