చీమలు చెప్పే 'టీమ్ మేనేజ్‌మెంట్' సూత్రాలివే..! - team management skills we can learn from ants in telugu
close
Published : 24/06/2021 16:05 IST

చీమలు చెప్పే 'టీమ్ మేనేజ్‌మెంట్' సూత్రాలివే..!

చీమ చూడటానికే చిరుజీవి... అయితే తెలివితేటల్లో మానవమాత్రులకే అంతుబట్టని ఎన్నో జీవిత ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగల మేధావి. చీమల జీవనశైలిని పరిశీలించి ఓ వ్యక్తిత్వ వికాస గ్రంథమే రాసేయచ్చేమో.. మేనేజ్‌మెంట్ గురూలకే పాఠాలు చెప్పగల చిత్రమైన ప్రొఫెసర్ చీమ. అందుకే చీమలు పని చేసే విధానాన్ని పెద్ద పెద్ద మేనేజ్‌మెంట్ కాలేజీల్లో సైతం పాఠాలుగా చెప్పడం విశేషం. ఈ క్రమంలో మనం కూడా చీమల నుంచి కొన్ని టీమ్ మేనేజ్‌మెంట్ సూత్రాలు నేర్చేసుకుందామా..

నాయకత్వ లక్షణాలు

ఒక బృందాన్ని సమర్థంగా ముందుకు నడిపించాలంటే నాయకత్వం పటిష్టంగా ఉండాలనే పాఠాన్ని మనం చీమ నుంచి నేర్చుకోవచ్చు. 'ఐకమత్యమే మహాబలం', 'కలిసుంటే కలదు సుఖం' అనే సామెతలు చీమలు కలిసికట్టుగా ఉండే పద్ధతిని చూసే కనిపెట్టారేమో. ఒకే మాటకి బృందమంతా కట్టుబడి ఉండడం, నియమ నిబంధనలను పాటించే విషయంలో అందరూ ఒకేలా వ్యవహరించడం లాంటివన్నీ నాయకత్వం బలంగా ఉన్నప్పుడే జరుగుతాయి.

ఒక లక్ష్యం కోసం

చీమల ప్రధాన లక్ష్యం ఆహారాన్ని సేకరించడం. అందుకోసం ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకొని అన్నీ కలిసి శక్తివంచన లేకుండా శ్రమిస్తాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఒక నిర్ణీత బాటలో నడుస్తాయి. చలికాలంలో ఆహారం కోసం వేసవి కాలం నుంచే శ్రమిస్తాయి చీమలు. ఈ పద్ధతి ఒక రకంగా ముందస్తు ప్రణాళిక లాంటిది. దీర్ఘకాలిక లక్ష్యాల కోసం ముందుగానే సిద్ధమవ్వడం విజయానికి బాటను నిర్మించడమే కదా!

సమయపాలన

సమయపాలన పాటించడం, క్రమశిక్షణతో ముందుకు సాగడం.. వంటి విషయాల్లోనూ చీమలను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఏ సమయంలో పని చేయాలో, ఏ సమయంలో పని ముగించాలో, ఏ సమయంలో నిద్రపోవాలో చీమలకు బాగా తెలుసు. నిరంతరాయంగా పని చేయడం, ఆ తర్వాత చాలాకాలం నిద్రపోవడం చీమల నైజం. ఇది మానవులకు పూర్తిగా వర్తించనప్పటికీ పని విషయంలో ఎంత ప్రణాళికాబద్ధంగా ఉండాలన్న అంశంలో చీమలను ఆదర్శంగా తీసుకోవచ్చు.

నిర్మాణాత్మకంగా వ్యవహరించడం

చీమలు తమ పుట్టను నిర్మించుకొనే క్రమంలో కూడా అన్నీ కలిసికట్టుగానే ముందుకు సాగుతాయి. ఒక పుట్ట నిర్మించడం కోసం కొన్ని వందల చీమలు శ్రమిస్తాయి. అలాగే ఒక సంస్థ నిర్మాణం ఏ ఒక్క వ్యక్తి వల్లో సాధ్యం కాదని, అనేకమంది ఉద్యోగుల పాత్ర కూడా అందులో ఉంటుందనే విషయాన్ని చీమలు స్పష్టంగా తేటతెల్లం చేస్తున్నాయి.

శక్తివంచన లేకుండా పనిచేయడం

శక్తివంచన లేకుండా పనిచేయడం అనే విషయాన్ని మనం చీమల నుంచే నేర్చుకోవాలేమో. తమ శక్తి సామర్థ్యాలేమిటో చీమలకు బాగా తెలుసు. ఒక్కొక్క చీమ తన కంటే అనేక రెట్లు ఎక్కువ ఉన్న బరువును ఇట్టే మోయగలదు. చేపట్టిన బాధ్యతలను విస్మరించకుండా నూటికి నూరు శాతం పరిశ్రమించే జీవి ఏదైనా ఉందంటే అది చీమ మాత్రమే.

స్నేహశీలురంటే ఇవే

స్నేహశీలతతో వ్యవహరించడం చీమలకు బాగా తెలుసు. ఒక చీమకు ఆరోగ్యం బాగా లేకపోతే దాని పని కూడా మరో చీమ చేయడానికి సంకోచించదు. దాని ఆరోగ్యం కుదుటపడే దాకా మిగతా చీమలన్నీ కలిసి ఆ ఒక్క చీమ చేసే పనిని మొత్తం విభజించుకొని మరీ పూర్తి చేస్తాయి.

ఏ వాతావరణానికైనా అలవాటు పడడం

చీమలు ఒక ప్రాంతానికే పరిమితమై జీవించవు. అలాగే అన్ని వాతావరణాలకు తగ్గట్టుగానే తమ జీవన విధానాన్ని అవి మలుచుకుంటాయి. ఈ క్రమంలో ఎలాంటి క్లిష్టమైన పని వాతావరణంలోనైనా సమస్యలను ఎదుర్కొని రాణించాలనే సందేశాన్నీ మనకు చీమలు ఇవ్వడం గమనార్హం.

చూశారుగా... చీమలు చెప్పే టీమ్ మేనేజ్‌మెంట్ సూత్రాలు. ఒక శక్తిమంతమైన సామ్రాజ్యం నెలకొనాలంటే.. ఏ ఒక్కరివల్లో కానేకాదు.. ఐకమత్యంతో అందరూ కలిసికట్టుగా కృషి చేస్తేనే అద్భుతాలు సైతం సుసాధ్యమవుతాయి.

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని