బతుకమ్మ పాటల్లో స్త్రీ జీవనచిత్రం..! - telangana bathukamma songs in telugu
close
Published : 11/10/2021 16:35 IST

బతుకమ్మ పాటల్లో స్త్రీ జీవనచిత్రం..!

‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో..’ అంటూ రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి.. పాటలు పాడుతూ, పాటలకు తగ్గట్లుగా లయబద్ధంగా చప్పట్లు కొడుతూ మహిళలందరూ ఎంతో సరదాగా బతుకమ్మ పండగ జరుపుకొంటున్నారు. బతుకమ్మలో పూలు, నైవేద్యాలు ఒకెత్తయితే.. బతుకమ్మ పాటల సందడి మరో ఎత్తు. వినసొంపుగా ఉండే ఈ పాటలు ఆడవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయి.. ఆడవారి జీవితాల్లోని వివిధ సంఘటనలను వివరిస్తూ.. వారి జీవన చిత్రానికి అద్దం పట్టే అలాంటి కొన్ని బతుకమ్మ పాటల గురించి ‘బతుకమ్మ పండగ’ సందర్భంగా తెలుసుకుందాం..

ఏ రాష్ట్రానికి లేని విశిష్టత తెలంగాణకు ఉంది. అదే బతుకమ్మ పండగ. బతుకమ్మ పాటల్లో ఆనాటి స్త్రీల జీవితాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. అందుకే బతుకమ్మ అంటే స్త్రీ.. స్త్రీ అంటే బతుకమ్మ అన్నట్లుగా ఈ పండగ మన సంస్కృతిలో మమేకమైంది. బతుకమ్మ పండగలో అణువణువునా స్త్రీత్వం ఉట్టిపడుతుంది. బతుకమ్మ పాటల్లో వారి నిత్యజీవితం.. అస్తిత్వ పోరాటం వంటివి దాగి ఉంటాయి.

*'కలవారి కోడలూ ఉయ్యాలో.. కనకమహాలక్ష్మి ఉయ్యాలో..'
'కడుగుతున్నది పప్పు ఉయ్యాలో.. కడవలో బోసి ఉయ్యాలో..'

లాంటి పాటల్లో అప్పటి సామాజిక స్థితిగతుల గురించి అవగతమవుతుంది. ఆ కాలంలో అమ్మాయిలు పెళ్లయిన తర్వాత పుట్టింటికి వచ్చేది కేవలం బతుకమ్మ పండగకి మాత్రమే.. ఆ పండక్కి ఆమెను ఇంటికి తీసుకురావడానికి పుట్టింటివారు ఎవరో ఒకరు బహుమతులతో వెళ్లి తీసుకురావాల్సి వచ్చేది. అప్పుడైనా పంపుతారా? అంటే ఇంట్లో వాళ్లందరి అనుమతి తీసుకొంటే గానీ ఇల్లు దాటలేని పరిస్థితి వారిది. ఇదే ఇతివృత్తంలో సాగే పాటలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిలో ముఖ్యమైనది ఈ పాట. ఈ పాటలు అప్పటి కాలంలో స్త్రీల జీవన చిత్రాన్ని వివరిస్తాయి.

*'కట్టమీద రెండు ఉయ్యాలో.. కల్యాప చెట్లు ఉయ్యాలో..'
గాలి వానలొచ్చె ఉయ్యాలో.. కొమ్మలే వల్లాడు ఉయ్యాలో..

వర్షాకాలంలో చక్కటి వానలు పడితే స్త్రీలు ఎలాంటి పనుల్లో భాగం పంచుకుంటారో తెలిపే పాట ఇది. స్త్రీలు కుటుంబ ఆదాయంలో పాలుపంచుకోవడం ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు.. అప్పట్లోనూ స్త్రీలు ఆర్థిక వ్యవస్థలో ముఖ్యపాత్ర పోషించేవారు. ఇప్పటిలాగానే అప్పుడూ మగవారితో పాటు వారూ పొలం పనులకు వెళ్లి.. తమ కుటుంబ ఆదాయం కోసం పాటుపడేవారు. ఇదే ఈ పాటలోనూ అర్థమవుతుంది. అంతేకాదు.. దీని ద్వారా అప్పటి సామాజిక పరిస్థితులు కూడా అవగతమవుతాయి.

* 'చిన్న చేతికి రెండు ఉయ్యాలో.. సన్నపు గాజులు ఉయ్యాలో..' వంటి పాటలు స్త్రీలకు అలంకరణపై ఉన్న మోజును చూపుతాయి. అంతేకాదు.. ముత్త్తెదువు ఎలా ముస్తాబవ్వాలో కూడా ఇలాంటి పాటలు వివరిస్తాయి. ఇవే కాదు.. 'శుక్రవారం నాడు ఉయ్యాలో.. లేచెనే గౌరమ్మ ఉయ్యాలో.. చన్నీటి జలకాలు ఉయ్యాలో.. ఆడెనే గౌరమ్మ ఉయ్యాలో..' వంటి పాటల్లోనూ అప్పటి స్త్రీల కట్టూబొట్టు వంటివి కనిపిస్తాయి.. బతుకమ్మ పాటలన్నీ స్త్రీల జీవితాల నుంచి తీసుకున్నవే.. ఇవన్నీ అప్పటికప్పుడు ఆశువుగా పాడే పాటలు.. అందుకే చాలాకాలం వరకూ బతుకమ్మ పాటలకు ఎక్కడా రాత రూపం లేకుండా పోయింది. ఆ తర్వాతే కొంతమంది నడుం కట్టి బతుకమ్మ పాటలను భవిష్యత్ తరాలకు అందించేందుకు వాటిని రాత రూపంలోకి తీసుకురావడం ప్రారంభించారు.

* కేవలం సామాజిక ముఖచిత్రమే కాదు.. స్త్రీలు తమ బిడ్డలకు చెప్పే కథలు, మహిళలు నిత్యజీవితంలో చేసే పనులు.. వారు మెట్టినింట్లో పడే కష్టాలు.. ఇలా ఒకటేమిటి? ఏదైనా బతుకమ్మ పాటగా మారేది.. చాలావరకూ బతుకమ్మ పాటల్లో అనుబంధాల సౌరభాలు ఎక్కువగా కనిపిస్తాయి. స్త్రీలు తమ బంధాలను ఎంత జాగ్రత్తగా పెంచిపోషిస్తారో బతుకమ్మ పాటల ద్వారా పూర్తిగా అవగతమవుతుంది.

'శ్రీరాముని తల్లి ఉయ్యాలో.. ప్రేమతో శాంతను ఉయ్యాలో..' వంటి పాటల్లో పెళ్లి అయిన తర్వాత బిడ్డ అత్తారింట్లో ఎలా ఉండాలో.. ఒక కూతురికి తల్లి చెబుతున్నట్లుగా సాగుతాయి.

* 'ఇద్దరక్క చెల్లెళ్లు ఉయ్యాలో.. ఒక్కూరికిచ్చి ఉయ్యాలో..'
'ఒక్కడే మాయన్న ఉయ్యాలో.. వచ్చన్న పోడు ఉయ్యాలో..'

పూర్వం ఒక ఇంట్లో ఇద్దరు అక్కాచెల్లెళ్లుంటే వారిద్దరినీ ఒకే వూరికి కోడళ్లుగా పంపేవారట. ఇదే విషయాన్ని నేటి తరానికి కళ్లకు కట్టినట్లు చూపుతుందీ అద్భుతమైన బతుకమ్మ పాట. పండగలైనా, ప్రత్యేక సందర్భాలైనా ఆడపిల్లల్ని మెట్టినింటి నుంచి పుట్టింటికి తీసుకురావడంలో అన్న పాత్ర ఎంత కీలకమైందో తెలుపుతూ.. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అసలు సిసలైన అర్థం చెబుతుందీ పాట. ఇలా తోబుట్టువుల ప్రేమను చాటే బతుకమ్మ పాటలు కోకొల్లలు.

* కేవలం నాటి కాలంలో స్త్రీల జీవితాలను కళ్లకు కట్టినట్లు చూపడమే కాదు.. పురాణ కాలపు ఇతివృత్తాలను చాటేలా కూడా ఈ బతుకు పాటలు సాగుతాయి.

'జనకు జనకునింట్ల ఉయ్యాలో.. సత్య జనకునింట్ల ఉయ్యాలో..'
పుట్టింది సీతమ్మ ఉయ్యాలో.. పూరుడేగోరింది ఉయ్యాలో..'

ఇలా సీతమ్మ పుట్టుక గురించి వివరిస్తూ సాగే ఓ మనోహరమైన పాట ఇది.
అలాగే 'ఆనాటి కాలాన ఉయ్యాలో.. ధర్మాంగుడను రాజు ఉయ్యాలో..'
'ఆ రాజు భార్యయు ఉయ్యాలో.. అతి సత్యవతియండ్రు ఉయ్యాలో..'

ఆ వరాల తల్లి లక్ష్మీదేవే బతుకమ్మగా పుట్టినట్లు ప్రాచుర్యంలో ఉన్న ఈ పాట వీనుల విందు చేస్తుంది.

అలాగే 'చిత్తూ చిత్తుల బొమ్మ శివునీ ముద్దుల గుమ్మ..'
'బంగారు బొమ్మ దొరికెనమ్మో ఈ వాడలోన..'
ఇలా పార్వతీ దేవి మహిమల్ని కొలుస్తూ, ఆమెనే స్మరిస్తూ సాగుతుందీ పాట. ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల బతుకమ్మ పాటలు స్త్రీల నోళ్లలో నానుతుంటాయి.

* బతుకమ్మ ఆడే క్రమంలోనే కాదు.. రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలు రూపుదిద్దుకునే క్రమంలోనూ అతివలు పాటలు పాడుతుంటారు.

'ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునే గౌరమ్మ..'
'తంగేడు పువ్వొప్పునే గౌరమ్మ.. తంగేడు కాయొప్పునే గౌరమ్మ..'
అంటూ ఆ గౌరీ దేవిని మనసారా కీర్తిస్తూ సాగే ఈ పాట.. బతుకమ్మ పేర్చడానికి ఏమేం పూలు ఉపయోగిస్తాం, అందులోని వైశిష్ట్యం ఏంటో తెలియజేస్తుంది.
* ఇలా తనివి తీరా బతుకమ్మ ఆడిన తర్వాత నిమజ్జనం చేసే క్రమంలో సాగే అందమైన పాట ఇది.
'శ్రీలక్ష్మి నీ మహిమలూ గౌరమ్మ.. చిత్రమై తోచునమ్మా గౌరమ్మ..'
'భారతీ దేవివై బ్రహ్మకిల్లాలివై.. పార్వతీ దేవివై పరమేశు రాణివై..'

అంటూ ఆ శక్తి స్వరూపిణి గౌరీ దేవి మహిమల్ని చాటుతూ పాడే ఈ అందమైన పాటను ఒకరు పాడుతూ.. మిగిలిన వారంతా అందుకుంటూ ఉంటే ఎంతో వీనుల విందుగా అనిపిస్తుంటుంది.

ఇవే కాదు.. సుమారు వెయ్యికి పైగా ఉన్న బతుకమ్మ పాటల్లో ప్రజలపై జరిగిన అన్యాయాలు.. దానిపై స్త్రీల పోరాటాలు, గర్భం దాల్చిన మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. యువతులకు తల్లుల, అమ్మమ్మల సలహాలు.. ఇలా రకరకాల నేపథ్యాలతో పాటలు కొనసాగుతాయి. అంతేకాదు.. ప్రకృతితో మమేకమై ఉండే స్త్రీలు.. ప్రకృతి గురించి పాడిన పాటలు కూడా ఎన్నో.. తోటలు, పంటలు.. ఇలా చుట్టూ ఉండే వాటన్నింటి గురించి చాలా పాటల్లో వివరిస్తారు. మొత్తానికి స్త్రీల జీవన చిత్రానికి, వారి ఆలోచనలకు ప్రతిరూపంగా బతుకమ్మను చెప్పుకోవచ్చు. ఎన్నో శతాబ్దాల క్రితం రాసిన ఈ పాటల్లో చాలావరకూ ఇప్పటి తరానికి కూడా అన్వయించుకునేలా ఉండడం విశేషం.మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని