యోగా మా జీవితాన్ని మార్చేసింది..! - these celebs are addicted to yoga
close
Updated : 22/06/2021 15:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

యోగా మా జీవితాన్ని మార్చేసింది..!

యోగా.. కొంతమందికి అది వ్యాయామం అయితే.. మరికొందరికి అది ఓ జీవన శైలి.. యోగా వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలుంటాయని అంతా చెబుతారు. కానీ దాన్ని చేయడానికి ఆసక్తి చూపే వాళ్లు మాత్రం కొందరే.. అయితే యోగా చేస్తే లాభాలుంటాయని గుర్తించి.. దాన్ని తమ జీవన శైలిగా మార్చుకొన్నవారు, దాని ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందిన వారిని మనం చూస్తుంటాం. అలాంటివారిలో మన సెలబ్రిటీలు కూడా ఎక్కువగానే ఉంటారు. యోగా వల్ల తమ శరీరాన్ని పూర్తిగా మార్చుకొని, తద్వారా జీవితాన్ని కూడా మార్చుకొన్న కొందరు సెలబ్రిటీల గురించి తెలుసుకుందాం రండి..

శిల్పా శెట్టి
ఈ బాలీవుడ్ బ్యూటీ ఎన్నో ఏళ్లుగా యోగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆమె సౌందర్యానికి, చక్కటి శరీరానికి అదే కారణమని చెబుతుంది. అయితే చక్కటి శరీరాకృతిని పొందడానికి ఆమె దీన్ని ప్రారంభించలేదట. కొన్నేళ్ల క్రితం సర్వైకల్ స్పాండిలైటిస్ సమస్యతో బాధపడిందామె. ఈ సమయంలోనే యోగా తన సమస్యను తగ్గిస్తుందని భావించిన ఆమె, దాన్ని ప్రయత్నించింది. అనుకున్నట్లే తన ఆరోగ్య సమస్య తగ్గడంతో ఇక దాన్ని తన జీవనశైలిలో భాగం చేసుకుంది. వెయిట్ ట్రైనింగ్ కూడా చేసే శిల్ప.. రిలాక్స్ అవ్వడానికి వెయిట్ ట్రైనింగ్ సెట్స్ మధ్య యోగా కూడా చేస్తుంటుందట. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి యోగా మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందని చెప్పే ఈ బ్యూటీ.. తన కొడుక్కి కూడా చిన్నతనం నుంచే యోగా నేర్పిస్తోంది.

అనుష్క
టాలీవుడ్ బ్యూటీ అనుష్క సన్నగా, జాజితీగలా ఉండడానికి కారణం యోగా అని చాలా తక్కువ మందికి తెలుసు. సినిమాల్లోకి రాకముందు యోగా గురువుగా పనిచేసిందీ అందాల భామ. ఆమె ప్రముఖ యోగా గురువు భరత్ ఠాకూర్ వద్ద యోగాలో శిక్షణ తీసుకుంది. దీనివల్ల జీవితంలో ఎంతో ప్రశాంతత దొరుకుతుందని తెలుసుకొని యోగా గురువుగా మారాలని నిర్ణయించుకుంది. యోగా తన జీవితాన్ని మార్చేసిందని, దాన్ని నేర్పించాలని నిర్ణయం తీసుకోవడం తాను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటని చెబుతుంది అనుష్క. సినిమాలతో బిజీగా ఉన్నా.. రోజూ తప్పనిసరిగా యోగా చేసే ఆమె తన ప్రశాంతమైన జీవితానికి, పాజిటివ్ థింకింగ్‌కి, ఫిట్‌గా ఉన్న శరీరానికి యోగానే కారణమంటుందామె..

బిపాసా బసు
ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యను తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం ప్రారంభించిన బిపాసా ఫిట్‌నెస్‌ని తన జీవన శైలిగా మార్చేసుకుంది. ముఖ్యంగా యోగా అంటే ఆమెకు ఎంతో ఇష్టం. 'చిన్నవయసులో ఆరోగ్య సమస్యలు రావడంతో నేను దాని గురించి చదవడం ప్రారంభించా. యోగా వల్ల తగ్గే అవకాశముందని తెలిసి నేర్చుకున్నా. ఆ తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే యోగా ఒక్కొక్కటిగా నా ఆరోగ్య సమస్యలన్నింటినీ తగ్గించి, నన్ను పూర్తి ఫిట్‌గా మార్చింది. యోగా ప్రతి ఒక్కరినీ ఒక బ్యాలన్స్‌డ్ పర్సన్‌గా మారుస్తుంది. గాలిని సరిగ్గా పీల్చుతూ, వదులుతూ సరైన పద్ధతిలో యోగా చేస్తే అది మనకు ఆరోగ్యాన్ని అందించడంలో ఎంతగానో సాయపడుతుంది. అంతేకాదు.. బరువును కూడా తగ్గిస్తుంది. యోగా వల్ల చర్మం, జుట్టు ఆరోగ్యం బాగుంటుంది. పూర్తిగా యోగాసనాలన్నీ చేయలేకపోయినా కనీసం ప్రాణాయామం చేయగలిగినా చాలు.. రోజులో ఇరవై నిమిషాల పాటు మంద్రస్థాయి సంగీతం పెట్టుకొని మెడిటేషన్ చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది' అంటుంది బిపాసా.

కరీనా కపూర్
ఒకప్పుడు బొద్దుగా ఉండే కరీనా.. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి బరువు తగ్గింది. ఆ తర్వాత 'తషాన్' సినిమా సమయంలో సైజ్ జీరోకి తగ్గి.. అమ్మాయిలందరికీ కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్‌ని పరిచయం చేసింది. తన ఫిట్‌నెస్‌కి కారణం యోగానే అంటుందీ బ్యూటీ.. అయితే సన్నగా కావడానికి యోగాను ప్రారంభించలేదట కరీనా.. ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండడానికి.. రోజంతా ఎనర్జిటిక్‌గా ఉండేందుకు యోగా ఉపయోగపడుతుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్ ద్వారా తెలుసుకున్న కరీనా దాన్ని చేయడం ప్రారంభించింది. రోజూ యాభై సూర్యనమస్కారాలు, 45 నిమిషాల పాటు ఇతర యోగాసనాలు చేస్తుందట ఈ బ్యూటీ. అంతేకాదు.. వూపిరితిత్తుల పనితీరు మెరుగుపడేలా కపాలభాతి ప్రాణాయామం చేయడం కరీనాకు అలవాటట. ఈ యోగా వల్ల తన రోజంతా బాగుంటుందని, ఒక్కరోజు ఏదైనా కారణం వల్ల దీన్ని చేయలేకపోయినా.. ఏదో కోల్పోయినట్లు అనిపిస్తుందని చెబుతుంది ఈ బాలీవుడ్ బ్యూటీ.

లారా దత్తా
గత పన్నెండేళ్లుగా యోగాను ప్రాక్టీస్ చేస్తోంది లారా. తన ఆరోగ్యాన్ని కాపాడేందుకు, సీ సెక్షన్ తర్వాత తిరిగి కొన్ని రోజుల్లోనే ఫిట్‌గా తయారయ్యేందుకు యోగానే ఉపయోగపడిందని చెబుతుంది లారా. గర్భం దాల్చిన తర్వాత యోగా చేయడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఎన్నో మంచి ప్రయోజనాలు అందుతాయట. అంతేకాదు.. సహజ ప్రసవం కావడానికి కూడా ఎక్కువ అవకాశాలుంటాయట. అందుకే గర్భం దాల్చిన తర్వాత యోగా ఎలా చేయాలి? అలా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటి? వంటివన్నీ వివరిస్తూ ఓ యోగా డీవీడీని కూడా విడుదల చేసిందామె. ఇందులో కేవలం గర్భవతులకే కాకుండా.. బాలింతలకు కూడా యోగాసనాలను వివరించింది లారా.

సోనమ్ కపూర్
సినిమాల్లోకి రాకముందు సోనమ్ చాలా బరువు ఉండేదని మీకు తెలుసా? దాన్ని తగ్గించుకోవడానికి యోగాను మార్గంగా ఎంచుకుంది సోనమ్.. మొదట సాధారణ యోగాతోనే శ్రీకారం చుట్టినా ఆ తర్వాత బిక్రమ్ యోగా అని పిలిచే హాట్ యోగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించిందామె. దీని ద్వారా తన బరువు ఎప్పుడూ అదుపులో ఉంటుందని చెప్పే సోనమ్ దీన్ని ప్రతిరోజూ తప్పక చేస్తుందట. తానెక్కడ ఉన్నా.. ఈ యోగా చేయడం మాత్రం తప్పనిసరి అని చెప్పే సోనమ్ యోగా చేయని రోజు సాధారణంగా ఉండలేదట. అందుకే హాలిడేకి వెళ్లినా తప్పనిసరిగా యోగా చేస్తుంటుందీ భామ. తన తండ్రి ఫిట్‌నెస్ సీక్రెట్ కూడా ఇదే అని చెబుతుంది సోనమ్. బిక్రమ్ యోగాతో పాటు ఇటీవల సోనమ్ ఏరియల్ యోగా చేయడం కూడా ప్రారంభించింది. గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాల్లో వేలాడుతూ చేసే ఈ యోగా వల్ల బరువు తగ్గడం చాలా సులభమట. అంతేకాదు.. ఇది మన ఫ్లెక్సిబిలిటీని కూడా పెంచుతుందట.

వీరితో పాటు సమంత, రకుల్‌ప్రీత్‌ సింగ్, శ్రియ, సంజన, మంచులక్ష్మి తదితర టాలీవుడ్ భామలు సైతం తమ అందానికి, ఆరోగ్యానికి యోగానే  కారణమంటున్నారు.


మరిన్ని

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని