జుట్టుకు మొదటిసారి రంగేస్తున్నారా? - things to consider while before coloring your hair for the first time in telugu
close
Published : 25/08/2021 17:11 IST

జుట్టుకు మొదటిసారి రంగేస్తున్నారా?

కొత్తగా ఏదైనా పని చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం.. తొలిసారి జుట్టుకు రంగేసుకునే క్రమంలో కూడా అమ్మాయిలు ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. అసలు హెయిర్‌ కలర్‌ వేసుకోవడం మంచిదేనా? ఇది మనకు సరిపడుతుందా? నప్పుతుందా? అని దీని గురించి ఓ చిన్నపాటి అధ్యయనమే చేస్తుంటారు. అయితే వీటితో పాటు మొదటిసారి హెయిర్‌ కలర్‌ ప్రయత్నిద్దామనుకునే వారు మరికొన్ని అంశాలను సైతం దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు సౌందర్య నిపుణులు. అప్పుడే ఎలాంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా జుట్టు అందం ఇనుమడిస్తుందంటున్నారు.

ముదురు రంగులే ఎందుకు?!

ఫ్యాషన్‌ పేరుతో జుట్టుకు రంగేసుకోవడం ఇప్పటి ట్రెండ్‌. అయితే ఇందుకోసం వివిధ రకాల హెయిర్‌ కలర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. బ్రౌన్‌, కాపర్‌, చాక్లెట్‌, బర్గండీ.. వంటి ముదురు రంగుల దగ్గర్నుంచి ప్యూర్‌ డైమండ్‌, హనీ, క్యారమెల్‌.. వంటి లైట్‌ కలర్స్‌ దాకా మగువల మనసు దోచుకుంటున్నాయి. అయితే వీటిలో లేత రంగుల కంటే ముదురు రంగులు ఎంచుకోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ముదురు రంగులైతే వెంట్రుకల సహజ రంగు దెబ్బతినకుండా ఉండడంతో పాటు మరింత ఆకర్షణీయంగా కనిపించచ్చు. అదే లేత రంగుల విషయానికొస్తే.. జుట్టు రంగు మార్చేందుకు వీలుగా బ్లీచ్‌, అమ్మోనియా వంటి గాఢమైన రసాయనాలు ఎక్కువ మొత్తంలో వాడతారట! ఫలితంగా వెంట్రుకలు, కుదుళ్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఒకవేళ అది నప్పకపోతే ఎబ్బెట్టుగానూ కనిపిస్తుంది. పైగా లేత రంగుల కంటే ముదురు రంగులే ఎక్కువమందికి నప్పుతాయంటున్నారు నిపుణులు.

నప్పేలా ఉండాలి!

సాధారణంగా ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటేనే జుట్టుకు రంగేసుకోవడానికి ఆసక్తి చూపుతుంటారు చాలామంది అమ్మాయిలు. ఇలాంటప్పుడు లుక్‌ ఇనుమడించాలంటే చర్మతత్వానికి నప్పే రంగులు ఎంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో మీరు ధరించే అవుట్‌ఫిట్స్‌, జ్యుయలరీ.. వంటివీ పరిగణనలోకి తీసుకుంటే మరింతగా మెరిసిపోవచ్చు. అందులోనూ కాస్త తెల్లగా ఉన్న వారికి లేత రంగుల దగ్గర్నుంచి.. డార్క్‌ కలర్స్‌ వరకు నప్పుతాయి.. అదే ఛాయ తక్కువగా ఉన్న వారు మరీ ముదురు రంగులు కాకుండా ఉన్నవి ఎంచుకుంటే న్యాచురల్‌ లుక్‌ను సొంతం చేసుకోవచ్చు.

తలస్నానం చేయాలా వద్దా?

కుదుళ్ల వద్ద చర్మం అతి సున్నితంగా ఉంటుంది. ఇలాంటి చర్మాన్ని కాపాడడంలో అక్కడ ఉత్పత్తయ్యే సహజసిద్ధమైన నూనెలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవి జుట్టుకు వేసే రంగుల్లోని రసాయనాల ప్రభావం కుదుళ్లు, జుట్టుపై పడకుండా రక్షిస్తాయి. అదే హెయిర్‌ కలర్‌ వేసుకునే ముందు తలస్నానం చేయడం వల్ల ఇవి తొలగిపోయి.. కుదుళ్లు పొడిబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జుట్టుకు రంగేసుకోవాలనుకున్న రెండు రోజుల ముందు నుంచే తలస్నానం చేయకపోవడం మంచిది. తద్వారా ఈ సమయంలో కుదుళ్ల వద్ద సహజసిద్ధమైన నూనెలు ఉత్పత్తై హెయిర్‌ కలర్స్‌ వల్ల దుష్ప్రభావాలు తలెత్తకుండా రక్షిస్తాయి. అయితే తలస్నానం చేయాలా వద్దా అనేది వేసుకునే రంగును బట్టి కూడా ఉంటుంది. అందువల్ల ఈ విషయంలో ఒకసారి మీ వ్యక్తిగత హెయిర్ స్టైలిస్ట్ ని సంప్రదించడం మంచిది.

తేమనందించాలి!

జుట్టుకు వేసుకునే రంగుల్లోని రసాయనాల ప్రభావం కుదుళ్లు, జుట్టుపై పడకుండా.. కుదుళ్లు పొడిబారకుండా ఉండాలంటే రంగేసుకోవడానికి ఒకట్రెండు రోజుల ముందు కుదుళ్లకు తేమనందించమంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఇంట్లో లభించే పదార్థాలతోనే హైడ్రేటింగ్‌ హెయిర్‌ మాస్కుల్ని తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. ఇందుకోసం కొబ్బరి నూనె, జొజోబా నూనె.. కొద్ది మొత్తాల్లో తీసుకోవాలి. ఈ మిశ్రమానికి కొన్ని చుక్కల పెప్పర్‌మెంట్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ జతచేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నూనెను కుదుళ్ల దగ్గర్నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించాలి. కొబ్బరి, జొజోబా నూనెలు కుదుళ్లు, వెంట్రుకలకు తేమనందిస్తే.. పెప్పర్‌మెంట్‌ నూనె కుదుళ్లలో వాపు, చుండ్రు సమస్యలకు చెక్‌ పెడుతుంది.

రంగు వెలిసిపోకుండా..!

జుట్టుకు రంగేసుకున్న తర్వాత వెంటనే షాంపూ చేసుకోకుండా కనీసం మూడు రోజుల పాటు ఆగమంటున్నారు నిపుణులు. అప్పుడు జుట్టు రంగు త్వరగా వెలిసిపోకుండా ఎక్కువ రోజుల పాటు ఉండే అవకాశాలున్నాయంటున్నారు. అంతేకాదు.. జుట్టు రంగు ఎక్కువ కాలం పాటు అలాగే ఉండేందుకు వీలుగా ప్రస్తుతం మార్కెట్లో కలర్‌-ఫ్రెండ్లీ షాంపూలు/కండిషనర్లు సైతం లభిస్తున్నాయి. సాధారణ షాంపూలతో పోల్చితే ఇవి గాఢత తక్కువగా ఉంటాయని, వీటిలోని ఫ్యాటీ ఆమ్లాలు రంగు ఎక్కువ రోజులుండేందుకు సహకరిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

వీటితో పాటు జుట్టుకు రంగేసుకున్న తర్వాత ఎంత సమయం పాటు ఉంచుకోవాలన్న విషయం లేబుల్‌ చూసి దాని ప్రకారం ఫాలో కావచ్చు. అలాగే హెయిర్‌ కలర్స్‌ అన్ని చర్మతత్వాల వారికి, జుట్టు తత్వాలకు నప్పచ్చు.. నప్పకపోవచ్చు. ఫలితంగా దుష్ప్రభావాలు రాకుండా ఉండాలంటే ముందుగా ప్యాచ్ టెస్ట్‌ చేయడం మర్చిపోవద్దు.

ఇంకా హెయిర్ కలరింగ్‌ విషయంలో ఎలాంటి సందేహాలున్నా, ఏవైనా ఇబ్బందులు ఎదురైనా సంబంధిత నిపుణుల్ని సంప్రదించి నివృత్తి చేసుకోవడం మంచిది.మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని