ఆ ముప్పు నుంచి చిన్నారుల్ని కాపాడుకుందాం! - tips to help children maintain a healthy weight amid pandemic
close
Published : 29/06/2021 19:52 IST

ఆ ముప్పు నుంచి చిన్నారుల్ని కాపాడుకుందాం!

పదేళ్ల ప్రణయ్‌కి వీడియో గేమ్స్‌ అంటే మహా ఇష్టం. కరోనా కారణంగా గతేడాది కాలంగా ఇంట్లోనే ఉండడంతో రోజులో ఎక్కువ సమయం వీటితోనే గడుపుతున్నాడు. దీంతో శరీరానికి శ్రమ తగ్గిపోయి కాస్త బరువు కూడా పెరిగాడు.

నేహ కూడా అంతే! కొవిడ్‌ కారణంగా బయటికి వెళ్లి తన ఫ్రెండ్స్‌తో ఆడుకునే వీల్లేక ఎక్కువ సమయం టీవీకే అతుక్కుపోతోంది. ఇది తనలో బద్ధకాన్ని పెంచడమే కాదు.. బరువూ పెరిగేలా చేస్తుంది.

కొవిడ్‌ కారణంగా దాదాపు ఏడాది కాలంగా పిల్లలంతా ఇంటికే పరిమితమయ్యారు.. మొన్నటిదాకా ఆన్‌లైన్‌ క్లాసులున్నా అంతంతమాత్రమే.. ఫ్రెండ్స్‌తో బయటికి వెళ్లి ఆడుకోలేని పరిస్థితి.. అమ్మానాన్న ఎవరి పనుల్లో వారు నిమగ్నమైతే వేధించే ఒంటరితనం.. వీటన్నింటినీ దూరం చేసుకోవడానికి చాలామంది చిన్నారులు మొబైల్స్‌, టీవీలు, ల్యాప్‌టాప్‌లతోనే కాలక్షేపం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి అనారోగ్యకరమైన జీవనశైలి వారిలో క్రమంగా బరువు పెరిగేలా చేసి.. కొన్నాళ్లకు వారిని ఊబకాయులుగా మార్చినా ఆశ్చర్యం లేదంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా అధిక బరువుతో బాధపడే చిన్నారులకు కరోనా ముప్పు ఎక్కువే అంటున్నారు. అందుకే అలాంటి పరిస్థితి రాకూడదంటే వారికి ఇప్పట్నుంచే ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని, ఆహార-వ్యాయామ నియమాలను అలవాటు చేయాలంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులే తమ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెబుతున్నారు.

ఆహారంతో బరువు అదుపులో!

ఏడాది కాలంగా పిల్లలు ఇంటికే పరిమితమవడం వల్ల వారిలో శారీరక శ్రమ తగ్గిపోవడం, బద్ధకం పెరిగిపోవడమే వారిని క్రమంగా ఊబకాయం బారిన పడేలా చేస్తుందంటోంది సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ. ఈ బద్ధకాన్ని దూరం చేసి తిరిగి వారిని యాక్టివ్‌గా మార్చే శక్తి చక్కటి పోషకాహారానికే ఉందంటోంది. ఈ క్రమంలో..

* సీజనల్‌ పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలు, వెన్న తొలగించిన పాలు, పాల పదార్థాలు, పెరుగు, మాంసం, కోడిగుడ్లు.. వంటి పదార్థాల్లో ప్రొటీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియల పనితీరును వేగవంతం చేస్తుంది.. ఆకలిని అదుపులో ఉంచుతుంది.. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల బరువును అదుపులో ఉంచే హార్మోన్లు శరీరంలో విడుదలవుతాయి. ఫలితంగా బరువు పెరగకుండా జాగ్రత్తపడచ్చు.

* శరీరం డీహైడ్రేషన్‌కి గురైనప్పుడు శక్తిస్థాయులు క్షీణించి అలసిపోతాం. ఈ అలసటను తీర్చుకునే క్రమంలో ముందూ వెనకా చూడకుండా ఏదో ఒకటి లాగించేస్తాం. తద్వారా బరువు పెరుగుతాం. అలా జరగకుండా ఉండాలంటే నీళ్లు ఎక్కువగా తాగేలా పిల్లల్ని ప్రోత్సహించాలి. ఈ క్రమంలో వారికి పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ.. వంటివీ అందించచ్చు.

* సాయంత్రమైతే చాలు.. పిల్లలకు ఏదో ఒక స్నాక్‌ ఐటమ్‌ ఉండాల్సిందే! అలాగని కొవ్వులు, చక్కెరలు, నూనె పదార్థాలు అధికంగా ఉండే స్నాక్స్‌ తింటామంటే అది వారికి ఆరోగ్యానికే చేటు చేస్తుంది.. కాబట్టి వాటికి ప్రత్యామ్నాయంగా తల్లులు ఇంట్లోనే వారికి రుచికరమైన స్నాక్స్‌ చేసి అందించాలి. ఈ క్రమంలో నట్స్‌ని కాస్త వేయించి ఉప్పు, కారం చల్లి అందించడం, పాప్‌కార్న్‌, పండ్ల ముక్కల్ని వారికి నచ్చిన బొమ్మల ఆకృతిలో కట్‌ చేసి ఇవ్వడం, ఒవెన్‌లో బేక్‌ చేసిన చిప్స్‌.. వంటివి అందించచ్చు.

* పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చాలంటే పదార్థాలన్నీ మీరే చేసి అందించడం కాకుండా.. అప్పుడప్పుడూ వారినే వారికి నచ్చిన హెల్దీ వంటకాల్ని ప్రిపేర్‌ చేసుకోమని చెప్పాలి. ఈ క్రమంలో మీరూ సహాయం చేయచ్చు. తద్వారా వారికీ ఆరోగ్యంపై స్పృహ పెరుగుతుంది.

రోజుకు రెండు గంటలు చాలు!

స్కూల్స్‌ మూతపడడం, వేసవి సెలవులు, బయట ఆడుకునే పరిస్థితులు లేకపోవడం కారణంగా.. పిల్లలంతా ఇంట్లోనే బందీలు కావాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారిలో ఒంటరితనం పెరిగిపోతోంది. దీంతో గ్యాడ్జెట్స్‌నే తమ నేస్తాలుగా మార్చుకుంటున్నారు చిన్నారులు. ఇలా ఎటూ కదలలేని పరిస్థితులు వారిలో బద్ధకాన్ని పెంచుతున్నాయి.. క్రమంగా కొన్నాళ్లకు బరువు పెరిగిపోయి వారిని ఊబకాయం బారిన పడేలా చేస్తున్నాయి. మరి, ఈ సమస్య తలెత్తకూడదంటే వారి స్క్రీన్‌ టైమ్‌ని క్రమంగా తగ్గించడమొక్కటే మార్గమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో రోజుకు రెండు గంటలు మాత్రమే వారికి నచ్చిన వీడియో గేమ్స్‌ ఆడుకోవడం, కాల్స్‌-వీడియో కాల్స్‌.. వంటి వాటికి కేటాయించేలా చూడమంటున్నారు. ఇక మిగతా సమయంలో కాసేపు చదువు, ఇంకాసేపు వారికి నచ్చిన వ్యాపకాలపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలు ఎంతో చురుగ్గా, తెలివిగా ఎదుగుతారట!

ముందు జాగ్రత్తగా..!

కరోనా మహమ్మారి ఊపిరితిత్తులనే టార్గెట్‌ చేసుకుంటోంది. అసలే చిన్నారుల్లో న్యుమోనియా ముప్పు అధికంగా ఉంటుంది కాబట్టి.. వారిలో ఈ వైరస్‌ మరింత తీవ్రంగా పరిణమించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే ఈ సమస్య రాకూడదంటే ముందు నుంచే వారికి చక్కటి ఎక్సర్‌సైజ్‌ రొటీన్‌ను అలవాటు చేయాలంటున్నారు. ఈ క్రమంలో శ్వాస వ్యవస్థను పటిష్టపరిచే శ్వాస సంబంధిత వ్యాయామాలు, యోగా, ధ్యానం.. మేలు చేస్తాయి. తద్వారా వారు ఆరోగ్యంగానే కాదు.. రోజంతా చురుగ్గానూ ఉంటారు. కాబట్టి రోజూ మీరు వ్యాయామాలు సాధన చేస్తున్నప్పుడు మీ చిన్నారుల్నీ ఇందులో భాగం చేస్తే సరిపోతుంది.

పది గంటల నిద్ర!

అనారోగ్యకరమైన జీవనశైలి చిన్నారుల్లో నిద్రలేమికీ దారితీస్తుంది.. ఇది కూడా అధిక బరువుకు ఓ కారణమవుతుందంటున్నారు నిపుణులు. అందుకే వారికి రాత్రుళ్లు తగినంత నిద్ర అవసరం అంటున్నారు. ఈ క్రమంలో 5-12 ఏళ్ల వయసున్న చిన్నారులకు రోజుకు కనీసం 10 గంటల నిద్రైనా ఉండాలట! అప్పుడే అటు వారు శారీరకంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు.. ఇటు మానసికంగానూ వారిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా ఉంటుంది. తద్వారా వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్యాలూ దరిచేరకుండా వారిని కాపాడుకోవచ్చు.

ఇక వీటన్నింటితో పాటు మాస్క్‌ ధరించడం, పరిశుభ్రంగా ఉండడం, సామాజిక దూరం పాటించడం.. వంటివన్నీ వారు కొనసాగించేలా చూసే బాధ్యత తల్లిదండ్రులదే! అలాగే వారి వ్యాక్సినేషన్‌ ఛార్ట్‌ను బట్టి ఆయా వయసుల్లో వారికి టీకాలు వేయించడం మాత్రం మర్చిపోవద్దు. తద్వారా వారిలో రోగనిరోధక శక్తి పెరిగి పలు ఆరోగ్య సమస్యలు వారి దరిచేరకుండా వారిని రక్షించుకోవచ్చు.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

తరువాయి

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

తరువాయి

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

తరువాయి

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని