Break Up : ప్రేమ లేనప్పుడు విడిపోవడానికి భయమెందుకు? - tips to overcome fear of breakup in telugu
close
Published : 15/08/2021 09:29 IST

Break Up : ప్రేమ లేనప్పుడు విడిపోవడానికి భయమెందుకు?

తరుణ్‌-తన్వి తమ ఐదేళ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుదామని నిర్ణయించుకున్నారు. కానీ విడాకులు తీసుకున్నాక ఈ సమాజం నుంచి ఎలాంటి ఈసడింపులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్నది తన్వి భయం.

వినయ్‌-విద్యదీ ఇదే పరిస్థితి. గత కొన్నేళ్లుగా ఎడమొహం పెడమొహంగానే తమ అనుబంధాన్ని కొనసాగిస్తోన్న ఈ జంట పిల్లల కారణంగా ఇన్నేళ్లూ సర్దుకుపోయారు. కానీ ఇక మా వల్ల కాదంటూ విడాకులు తీసుకోవడానికి నిర్ణయించుకున్నారు. కానీ ఆ తర్వాత పిల్లల పరిస్థితి ఏంటన్న భయం విద్యలో స్పష్టంగా కనిపిస్తోంది.

దాంపత్య జీవితంలో కలహాలు కామన్‌! అయితే ఇవి హద్దుల్లో ఉన్నంత వరకే ఇద్దరూ సర్దుకుపోగలరు. అదే హద్దు దాటినా, ‘ఇక తనతో వేగడం నా వల్ల కాదు’ అన్న ఆలోచన ఏ ఒక్కరి మనసులో వచ్చినా ఇక ఆ బంధం క్రమంగా బలహీనపడుతుంది. అప్పటికీ పిల్లల కోసమో, కుటుంబాల కోసమో.. బంధాన్ని కొనసాగించే వారూ లేకపోలేదు. కానీ విడిపోదామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రం వారిని కలిపి ఉంచడానికి ఇతరులు చేసే ప్రయత్నాలన్నీ వృథానే అవుతుంటాయి.

అయితే ప్రేమ లేని అనుబంధం నుంచి విడిపోతున్నామన్న ఆలోచన మనసుకు కాస్త ఊరటనిచ్చినా.. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న భయం చాలామంది మహిళల్లో తలెత్తుతుంటుంది. దీన్నే Fear Of Break Up (FOBU)గా పేర్కొంటున్నారు నిపుణులు. మరి, ఈ క్రమంలో చాలామందిలో తలెత్తే భయాలేంటి? వాటిని ఎలా అధిగమించాలో తెలుసుకుందాం రండి..

నేను ఓడిపోయానా?

ఇద్దరూ విడిపోవడానికి కారణమేదైనా.. ఈ విషయంలో మగవాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువగా బాధపడతారని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. తమ భాగస్వామి నుంచి విడిపోయే క్రమంలో తాము జీవితంలో ఓడిపోయినట్లుగా భావించే వారూ లేకపోలేదు. ఇది వారిలో ఒక రకమైన అభద్రతా భావానికి, లేనిపోని భయాలకు దారితీస్తుంది. ఫలితంగా ఆత్మవిశ్వాసం కోల్పోయి, మానసిక కుంగుబాటుకు లోనయ్యే ప్రమాదమూ ఉంది. ఇలా ఈ సమయంలో మన ఆలోచనలే మనకు బద్ధ శత్రువులుగా మారతాయి. కాబట్టి ముందుగా వాటిని జయించే ప్రయత్నం చేయాలంటున్నారు నిపుణులు. ప్రేమ చూపించని వ్యక్తితో కలిసి ఉన్నా, విడిపోయినా ఒక్కటే అని మనసుకు సర్ది చెప్పుకోవాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలంటే మనల్ని మనం ప్రేమించుకోవాలి. ఈ క్రమంలో మనసుకు నచ్చిన పనులు చేయడం, అభిరుచులపై దృష్టి పెట్టడం, నచ్చినట్లుగా తయారవడం.. ఇవన్నీ మనలోని ప్రతికూలతల్ని దూరం చేసి మనసును ఉత్సాహపరిచేవే!

ఇక సమాజంలో నాకు గౌరవం ఉండదు!

‘భర్త నుంచి విడిపోయానంటే ఈ సమాజంలో నాకు గౌరవం ఉండదు.. ఇరుగుపొరుగు వాళ్లు, బంధువులు సూటిపోటి మాటలతో కాకుల్లా పొడుస్తుంటారు.. ఇలాంటి పరిస్థితిని నేను ఎదుర్కోగలనా..?’ అంటూ భయపడిపోతుంటారు చాలామంది ఆడవాళ్లు. మరి, ఈ భయానికి తలొగ్గి ప్రేమ లేని అనుబంధంలో, ‘నువ్వు నాకొద్దు’ అన్న వ్యక్తితో కొనసాగగలరా? అంటే కొనసాగలేమనే సమాధానమే వస్తుంది. అలాంటప్పు్డు సమాజం ఏమంటుందో అన్న భయాన్ని వీడి మనసు చెప్పినట్లుగా నడుచుకోవడమే మేలంటున్నారు నిపుణులు.

ఎందుకంటే మీరు మీ అనుబంధంలో ఎలాంటి గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారో ఈ సమాజానికి తెలియదు. అసలు విషయం తెలుసుకోకుండా ఎవరో ఏదో అన్నారని మీలో మీరే బాధపడితే దాని వల్ల సమాజానికంటే ఎక్కువ నష్టపోయేది మీరే అంటున్నారు నిపుణులు. అందుకే ‘ఎవరేమనుకున్నా పర్లేదు.. ఇది నా జీవితం.. నాకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది’ అన్న ధైర్యాన్ని మనసులో నింపుకోవాలి. అప్పుడే బ్రేకప్‌ బాధ నుంచి త్వరగా బయటపడి మీ జీవితం, మీ పిల్లల భవిష్యత్తు గురించి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు.

తండ్రి లేకపోతే వీళ్ల పరిస్థితేంటి?!

పిల్లల్ని పెంచి ప్రయోజకుల్ని చేసే బాధ్యత తల్లిదండ్రులిద్దరిపై సమానంగా ఉంటుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల పేరెంట్స్‌ ఇద్దరూ విడిపోవాల్సి వచ్చినా.. తల్లి మాత్రం పిల్లల్ని వదులుకోదు. ఎన్ని కష్టాలెదురైనా ఒంటరిగానైనా వాళ్లను సాకడానికి సిద్ధపడుతుంది. అయితే ఈ విషయంలో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ.. సింగిల్‌ పేరెంట్‌గా ఇది సాధ్యమయ్యే పనేనా అన్న భయం ఏదో ఓ మూల తల్లుల్లో ఉంటుందంటున్నారు నిపుణులు.

అయితే ఈ భయాన్ని జయించాలంటే.. తండ్రి దూరమైనా పిల్లల విషయంలో ఆయన నిర్వర్తించే బాధ్యతలు యథావిధిగా కొనసాగేలా ఒప్పందం కుదుర్చుకోవడం ఒక పద్ధతి అంటున్నారు నిపుణులు. దీంతో పాటు మీరూ ఉద్యోగం చేయడం వల్ల ప్రతి దానికీ మరొకరిపై ఆధారపడే అవకాశం రాదు. ఈ స్వతంత్ర భావాలే మనసులో ఉన్న భయాలన్నింటినీ తొలగించి నిండైన ఆత్మవిశ్వాసాన్ని నింపుతాయి.

ఆర్థికంగా నిలదొక్కుకోగలనా?!

ఇప్పటికే ఉద్యోగం చేస్తోన్న మహిళలైతే పలు కారణాల రీత్యా భర్త నుంచి విడిపోయినా ఆర్థికంగా వారికి అంతగా ఇబ్బందులేమీ ఎదురుకాకపోవచ్చు. కానీ అప్పటిదాకా భర్త ఆదాయంపై ఆధారపడిన వారికి మాత్రం.. ‘ఉద్యోగం లేకుండా ఆ తర్వాత నా పరిస్థితి ఏంటి?’ అన్న భయం మదిలో ఉంటుంది. అయితే దాన్ని జయించాలంటే ముందు మీలో దాగున్న నైపుణ్యాలేంటో గ్రహించగలగాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఒకరికి వంటల్లో నైపుణ్యాలుంటే, మరొకరికి బ్యూటీ-ఫ్యాషన్‌పై పట్టుండచ్చు.. మరొకరు ఏ పార్ట్‌టైమ్‌ ఉద్యోగమైనా చేయడానికి సిద్ధంగా ఉండచ్చు. అలా మీలో ఉన్న నైపుణ్యాలతో ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకోవచ్చు.. లేదంటే సొంతంగా మీరే వ్యాపారం ప్రారంభించచ్చు. ఈ క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్తే అంతిమ విజయం మీదే!

అదే మీ అంతిమ నిర్ణయమా?!

ఒకసారి వైవాహిక బంధంలో దెబ్బతిన్న మహిళలు.. మరోసారి ప్రేమ, పెళ్లి అంటే.. అస్సలు ఒప్పుకోరు. రెండోసారీ ఇలాంటి చేదు జ్ఞాపకాలే ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని భయపడుతుంటారు. అంతేకాదు.. ఒకవేళ ఇతరుల బలవంతం మీద రెండోసారి పెళ్లికి ఒప్పుకున్నా.. ఈ సమాజం ఏమంటుందోనన్న భయం వారిని అక్కడే ఆపేస్తుంది. కానీ ఇవేవీ పట్టించుకోకుండా నిజమైన ప్రేమ పలకరిస్తే లేదంటే మంచి మనసుతో ఆ వ్యక్తి మిమ్మల్ని తన జీవితంలోకి ఆహ్వానించడానికి ముందుకొస్తే అంగీకరించడంలో తప్పు లేదంటున్నారు నిపుణులు. ఇక ఆపై గత జ్ఞాపకాలన్నీ పక్కన పెట్టి.. పొరపాట్లేవీ దొర్లకుండా, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, సర్దుకుపోతూ ముందుకు సాగితే అలాంటి అనుబంధంలో విడాకుల ప్రస్తావనే ఉండదు.

మరి, విడాకుల తర్వాత మహిళ్లలో కలిగే ఇలాంటి భయాలపై మీ స్పందనేంటి? కలిసున్నా, విడిపోయినా.. భార్యా-భర్త సమానమేననుకుంటోన్న ఈ రోజుల్లో మహిళలు ఇలాంటి భయాల్ని ఎలా అధిగమించాలి? పాజిటివ్‌గా ఎలా అడుగు ముందుకేయాలి? మీ అభిప్రాయాల్ని, సలహాల్ని మాతో పంచుకోండి. మీరిచ్చే చిట్కాలు ఇలాంటి సమస్యను ఎదుర్కొంటోన్న మహిళల్లో స్ఫూర్తి రగిలించచ్చు!మరిన్ని

పిల్లలకు ఆ నైపుణ్యాలు ఒంటబట్టాలంటే..!

ఇలాంటి సూపర్‌ యాక్టివ్‌ కిడ్స్‌ని చూసి తమ పిల్లల్నీ ఇలా చురుగ్గా తీర్చిదిద్దాలని అనుకోని తల్లిదండ్రులుండరంటే అతిశయోక్తి కాదు. అందుకే ప్రస్తుతం తమ పిల్లలు పాఠ్యాంశాలతో కుస్తీ పట్టడమే కాదు.. కరెంట్‌ అఫైర్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌.. వంటి అంశాల్లోనూ పట్టు సాధించాలని ఆరాటపడుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు. వారిని ఆ దిశగానే ప్రోత్సహిస్తున్నారు కూడా! అయితే మహాసముద్రమంత జీకే సబ్జెక్టును ఒంటబట్టించుకోవడం.. అదీ అంత చిన్న వయసులో అంటే మాటలు కాదు. కానీ తల్లిదండ్రులు పిల్లలకు కాస్త సహకరిస్తే ఆ సమాచారమంతా వారు తమ చిన్ని బుర్రలో పదిలపరచుకుంటారని చెబుతున్నారు నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని