పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి! - tips to reduce malnutrition in kids amid pandemic in telugu
close
Updated : 18/06/2021 16:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లల్లో పోషకాహార లోపమా? ఇలా భర్తీ చేయండి!

ఆరోగ్యకరం అంటూ మనం ఎంతో ప్రేమగా చేసి పెట్టిన ఆహార పదార్థాలు పిల్లలకు ఓ పట్టాన నచ్చవు. ఏమున్నా చిరుతిండ్లు, జంక్‌ఫుడ్‌ అంటూ వాటి వెంట పడుతుంటారు. ఇక వాటితో కడుపు నింపుకొని అసలు ఆహారాన్ని పక్కన పెడుతుంటారు. చిన్నారుల్లో ఉండే ఇలాంటి అనారోగ్యపూరిత ఆహారపుటలవాట్లే వారిలో పోషకాహార లోపానికి కారణమంటున్నారు నిపుణులు. ఇలా పోషకాలు లోపిస్తే రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుందని, తద్వారా వైరస్‌ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కాబట్టి వారిలో ఉండే పోషక లోపాన్ని దూరం చేయమని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. అసలే మూడో దశ ముప్పు పిల్లలపై అధికంగా ఉండచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతోన్న ప్రస్తుత తరుణంలో వారిలో ఇమ్యూనిటీని పెంచడం అత్యవసరం. ఇది జరగాలంటే సంపూర్ణ పోషకాలు నిండిన ఆహార పదార్థాల్ని వారి రోజువారీ మెనూలో చేర్చాలి.
చిన్నారులు తీసుకునే ఆహారంలో ఐరన్‌, అయొడిన్‌, ఫోలేట్‌, విటమిన్‌ ‘ఎ’, జింక్‌.. వంటి సూక్ష్మ పోషకాలు లోపించడం వల్ల వారిలో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, తక్కువ తెలివితేటలు కలిగి ఉండడంతో పాటు కొవిడ్‌ బారిన పడే అవకాశాలూ ఎక్కువేనంటున్నారు నిపుణులు. పోషకాహార లోపం కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడమే ఇందుకు ప్రధాన కారణం అంటున్నారు. కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవాలంటే వారి ఆహారపుటలవాట్లలో మార్పులు చేర్పులు చేయడం అత్యవసరం అంటున్నారు.

ప్రొటీన్‌తో ప్రారంభం!
పిల్లలకైనా, పెద్దలకైనా.. రోజులో తీసుకునే తొలి ఆహారమే ముఖ్యం. ఎందుకంటే ఇదే మనల్ని రోజంతా ఉత్సాహంగా, యాక్టివ్‌గా ఉండేందుకు దోహదం చేస్తుంది. కాబట్టి పిల్లలకు ఉదయాన్నే అందించే అల్పాహారంలో భాగంగా ప్రొటీన్‌ అధికంగా ఉండే పదార్థాలకే ప్రాధాన్యమివ్వమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎగ్‌ శాండ్‌విచ్‌, హోల్గ్రెయిన్‌ బ్రెడ్‌పై పీనట్‌ బటర్‌ అప్లై చేసివ్వడం, యాపిల్‌, ఇతర సీజనల్‌ పండ్లు.. వంటివి అందించాలి. తద్వారా ఎక్కువ సమయం పొట్ట నిండుగా ఉండి ఇతర చిరుతిండ్ల పైకి మనసు మళ్లకుండా చేయచ్చు. ఇక స్థూలకాయం, అధిక బరువు సమస్యలతో బాధపడుతోన్న చిన్నారులకు బరువు తగ్గడంలో ఈ తరహా అల్పాహారం సహకరిస్తుంది.


వాటికి ప్రత్యామ్నాయంగా ఇవి!
పిల్లలు కొన్ని పదార్థాలు ఇష్టంగా తింటుంటారు. ఉదాహరణకు.. వైట్‌ బ్రెడ్‌, ఐస్‌క్రీమ్‌, బంగాళాదుంప చిప్స్‌, శీతల పానీయాలు.. వంటివి. కానీ ఇవి వారి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అలాగని తినొద్దని చెబితే ఊరుకోరు. చాటుగానైనా కొనుక్కొని తినేస్తుంటారు. అయితే వీటికి ప్రత్యామ్నాయంగా అలాంటి రుచిని అందించే పదార్థాలను వారి మెనూలో భాగం చేయడం వల్ల ఇటు వారు రుచినీ ఆస్వాదిస్తారు.. అటు పోషకాలు కూడా వారి శరీరానికి అందుతాయి. ఇంతకీ అవేంటంటే..!
* వైట్‌ బ్రెడ్‌కు బదులుగా హోల్‌వీట్‌/హోల్‌గ్రెయిన్‌ బ్రెడ్‌ అందించచ్చు.
* ఐస్‌క్రీమ్‌ తింటామని మారాం చేస్తే పండ్లతో అచ్చం ఐస్‌క్రీమ్‌ అంత మృదువుగా ఉండేలా స్మూతీ చేసిస్తే సరి!
* బంగాళా దుంప చిప్స్‌ కావాలని అడుగుతున్నారా? అయితే వాటిని నూనెలో వేయించడం కాకుండా బేక్‌ చేసి ఇవ్వచ్చు.. లేదంటే నట్స్‌ని నూనె లేకుండా వేయించి అందించచ్చు.
* శీతల పానీయాలు కోరుకుంటే.. వాటికి బదులుగా ఫ్లేవర్డ్‌ వాటర్‌ ఇవ్వచ్చు..
ఇలా ఆలోచిస్తే అనారోగ్యకరమైన ఆహార పదార్థాలకు ప్రత్యామ్నాయాలెన్నో దొరుకుతాయి.


కొవ్వులూ అవసరమే!
కొవ్వులు అనగానే మన మదిలో ఏదో ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయి.. ఇవి శరీరానికి మంచివి కావని.. వీటిని తీసుకుంటే లావైపోతామని! కానీ మన శరీరానికి కొవ్వుల అవసరం కూడా ఉందంటున్నారు నిపుణులు. అది కూడా మంచి కొవ్వులే తీసుకోవాల్సి ఉంటుంది. అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులుగా పిలిచే ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో, మనసును ప్రశాంతపరచడంలో సహకరిస్తాయట. కాబట్టి ఆలివ్‌ ఆయిల్‌, అవకాడో, నట్స్‌, గింజలు.. వంటి మోనో అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులు; అవిసె గింజలు, వాల్‌నట్స్‌, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. వంటి పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వుల్ని పిల్లల రోజువారీ ఆహారంలో భాగం చేయడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. ఇక ఫ్రైడ్‌ ఫుడ్స్‌, ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాలు, ప్యాక్‌ చేసిన వాటిలో అనారోగ్యకరమైన ట్రాన్స్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లల్ని వీటికి దూరంగా ఉంచాలి.


లేబుల్‌ చదివించండి!
మనం చెప్పిన మాటల కంటే కంటితో చూసిన వాటినే పిల్లలు ఎక్కువగా నమ్ముతుంటారు. కాబట్టి పోషకాహారం, దాని ప్రాధాన్యం గురించి తల్లిదండ్రులు వారికి వివరించడంతో పాటు నిత్యావసరాల షాపింగ్‌, కాయగూరల్ని కొనుగోలు చేయడం.. వంటి పనుల్లో వారినీ భాగం చేయమంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వారికి నచ్చిన పండ్లు, కాయగూరల్నే ఎంచుకోమని చెప్పండి. అలాగే వాటిలో ఉండే పోషకాల గురించి అంతర్జాలాన్ని ఉపయోగించి తెలుసుకునే ప్రయత్నం చేయమనండి. ఇక నిత్యావసర సరుకుల విషయానికొస్తే.. వారు ఎంచుకునే పదార్థాల్లో ఏ మేర పోషకాలున్నాయి? ఎలాంటి అనారోగ్యకరమైన పదార్థాలున్నాయి? అనే విషయాలు లేబుల్‌ చూసి చదవమనండి. దాంతో పోషకాహారం, అది తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు.. పోషకాలు లేని పదార్థాలు తీసుకుంటే ఏమవుతుంది? వంటి విషయాలన్నీ వాళ్లకు వాళ్లే నేరుగా తెలుసుకోగలుగుతారు. తద్వారా పోషకాహారంపై వారికి ఒక అవగాహన ఏర్పడుతుంది.

 

ఇవి గుర్తుంచుకోండి!

పిల్లలకు ఆహారపుటలవాట్లు నేర్పించడమే కాదు.. వాటిని తల్లిదండ్రులే ఆచరించి చూపించాలంటున్నారు నిపుణులు. అప్పుడే వారిలో మార్పొస్తుందంటున్నారు. ఈ క్రమంలో పేరెంట్స్‌ కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలని చెబుతున్నారు.
* ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు తల్లిదండ్రుల దగ్గర్నుంచే మొదలవ్వాలి.. అప్పుడే మిమ్మల్ని చూసి వారు నేర్చుకునే అవకాశం ఉంటుంది.
* పెద్దయ్యే క్రమంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలంటే చిన్నతనం నుంచే వారికి సంపూర్ణ పోషకాహారం, ఎలాంటి ఆహార నిబంధనలు పెట్టకుండా అన్ని రకాల పదార్థాల్ని వారికి అందించాలి. అప్పుడే చక్కటి ఫలితం ఉంటుంది.
* పిల్లలు తీసుకునే ఆహారంపై నిఘా ఉంచడం తప్పనిసరి! లేదంటే వారు ఏది పడితే అది, ఎంత పడితే అంత తినడానికి అలవాటు పడతారు. అది అస్సలు మంచిది కాదు. ఏదైనా మోతాదులో ఉంటేనే మంచిది.
* కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలు మరింత ఆరోగ్యంగా ఉండాలి, బొద్దుగా ఉండాలన్న ఆలోచనతో అమితంగా తినమని బలవంత పెడుతుంటారు. వారి చిన్ని పొట్టకు అది అస్సలు మంచిది కాదు. కడుపు నిండుగా తిని ఆయాసపడడం బదులు ఓ ముద్ద తక్కువగా తిని యాక్టివ్‌గా ఉండడమే ఉత్తమం.
* ఈ పండు పూర్తిగా తింటే బహుమతిస్తా, కానుకలిస్తా.. అంటూ పిల్లల్ని మభ్యపెట్టడం అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే దీనివల్ల వారు ఇష్టం లేకున్నా ఆ పదార్థం బలవంతంగా తిని లేనిపోని జీర్ణ సంబంధిత సమస్యల బారిన పడతారు. కాబట్టి ఇలాంటి రివార్డులు వద్దే వద్దు!
* టీవీ చూస్తూ, కంప్యూటర్‌లో గేమ్స్‌ ఆడుతూ తినడం అస్సలు ఆరోగ్యకరం కాదు. పైగా ఇలా తినడం వల్ల ఎక్కువ ఆహారం తీసుకొని లావయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఆ తిన్న కొంచెమైనా ఆస్వాదిస్తూ తినమని వారికి చెప్పడం, మీరు పాటిస్తూ వారికి అలవాటు చేయడం మంచిది.

మరిన్ని

ఇంట్లో పదే పదే తాకే వాటిని ఇలా శుభ్రం చేయాల్సిందే!

ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో రోజూ మనం ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్లొచ్చినా వ్యక్తిగత శుభ్రత పాటించడం, మనతో పాటు తెచ్చిన వస్తువుల్ని శానిటైజ్‌ చేయడం.. వంటివి కచ్చితంగా పాటిస్తున్నాం.. మరి, మనం ఇంట్లో పదే పదే తాకే వస్తువుల సంగతేంటి? మనం బయటికెళ్లినా అవి ఇంట్లోనే ఉంటున్నాయి కదా.. అంటారా? అయినా సరే.. వాటిని రోజూ శుభ్రం చేయాల్సిందే అంటున్నారు నిపుణులు. తద్వారా వాటిపై చేరే వైరస్‌, బ్యాక్టీరియా, క్రిములు ఒకరి నుంచి మరొకరికి అంటుకోకుండా జాగ్రత్తపడచ్చు. ఇంతకీ మనం ఇంట్లో తరచూ తాకే ప్రదేశాలు, వస్తువులేంటి? వాటిని ఎలా శానిటైజ్‌ చేయాలి? రండి తెలుసుకుందాం..!

అందుకే టవల్స్ విషయంలోనూ శుభ్రంగా ఉండాల్సిందే!

ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి నిద్రపోయే వరకు రోజులో ఎన్నోసార్లు ముఖాన్ని, చేతుల్ని కడుక్కుంటూ ఉంటాం. ఇలా కడిగిన ప్రతిసారీ కచ్చితంగా టవల్‌తో తుడుచుకోవాల్సిందే. ఇలా మనకు తెలియకుండానే రోజులో చాలాసార్లు టవల్‌ను వాడుతూనే ఉంటాం. మరి, మీరు నిత్యం ఉపయోగించే ఈ టవళ్లు బ్యాక్టీరియాలకు మంచి ఆవాసాలనే విషయం మీకు తెలుసా? కరోనా విలయ తాండవం చేస్తున్న నేపథ్యంలో - ప్రతి రోజూ మీరు ఉపయోగించే టవల్ విషయంలో ఎంతవరకు జాగ్రత్త వహిస్తున్నారు? ఇంతకీ టవళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోకపోతే కలిగే నష్టాలేంటి..? వీటిని అధిగమించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. రండి తెలుసుకుందాం..

మాడ్యులర్ కిచెన్ ఎలా ఉండాలంటే..

కొత్త ట్రెండ్స్ కేవలం ఫ్యాషన్‌కు మాత్రమే పరిమితం అనుకుంటే పొరపాటే. మనం కొత్తగా సిద్ధమవ్వడమే కాదు.. మన ఇంటినీ కొంగొత్త ఇంటీరియర్స్‌తో సరికొత్తగా మార్చేయవచ్చు. అందులోనూ.. ప్రస్తుతం మహిళలందరూ మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా తమ ఇంటిని ట్రెండీగా, స్త్టెలిష్‌గా తీర్చిదిద్దుకోవాలని భావిస్తున్నారు కూడా.. ఈ నేపథ్యంలో చాలామంది మాడ్యులర్ కిచెన్స్‌కు ఓటేస్తున్నారు. అయితే వీటి నిర్మాణ క్రమంలో కొన్ని ముఖ్యమైన అంశాలు దృష్టిలో పెట్టుకుంటేనే వంటగది సౌకర్యవంతంగా నిర్మించుకోవడానికి అవకాశం ఉంటుందంటున్నారు ఇంటీరియర్ నిపుణులు. మరి, ఆ అంశాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

కరోనా వేళ నగల్ని కూడా ఇలా శానిటైజ్ చేయాల్సిందేనట!

కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నంత మాత్రాన వైరస్‌ పీడ విరగడైంది అనుకోవడానికి లేదు.. ఎందుకంటే ఈ మాయదారి మహమ్మారి ఎప్పుడెలా విరుచుకుపడుతుందో ఎవరికీ అంతు చిక్కట్లేదు. అందుకే కొవిడ్‌ తగ్గుముఖం పట్టినా, టీకా వేసుకున్నా కనీస జాగ్రత్తలు పాటించాల్సిందే అని నిపుణులు పదే పదే చెబుతున్నారు. ఇక బయటి నుంచి తెచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేయాల్సిందే అంటున్నారు. మనం రోజూ ధరించే వివిధ రకాల ఆభరణాలూ ఇందుకు మినహాయింపు కాదంటున్నారు. ఎందుకంటే కరోనా వైరస్‌ లోహాలపై మూడు గంటల నుంచి మూడు రోజుల దాకా జీవించి ఉంటుందని సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ (సీడీసీ) సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో మనం రోజూ ధరించే ఆభరణాలను ఎలా శానిటైజ్‌ చేయాలో తెలుసుకుందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని