ఎర్ర గౌను బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే! - try these red color stylish outfits on this valentines day
close
Published : 17/06/2021 17:47 IST

ఎర్ర గౌను బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!

మనసుకు నచ్చిన వాడు ఎదుటే ఉంటే మాటల కంటే చేతలతోనే తమ మనసులోని భావాలను వ్యక్తపరచాలనుకుంటారు చాలామంది అమ్మాయిలు. అందమైన ఆహార్యంతో అవతలి వారిని కట్టిపడేస్తూనే.. తమ మనోహరుడికి గుండె లోతుల్లో దాగున్న ప్రేమను తెలియజేస్తుంటారు. ఇలా ప్రేమను పంచుకునే ప్రేమికుల దినోత్సవం రోజున అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తుల్ని ఎంచుకోవడం కొత్తేమీ కాదు. అయితే మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా సరికొత్త ఫ్యాషన్లను ఎంచుకోవడానికి, సౌకర్యవంతంగా మెరిసిపోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏటికేడు కొత్త కొత్త రెడ్‌ కలర్‌ ట్రెండీ అవుట్‌ఫిట్స్ మగువల మనసు దోచుకుంటున్నాయి. మరి, అలాంటి కొన్ని ఎరుపు రంగు అవుట్‌ఫిట్స్‌ గురించి ఈ ‘వేలంటైన్స్‌ డే’ సందర్భంగా తెలుసుకుందాం రండి..
వేలంటైన్స్ డే.. ఈ ప్రత్యేకమైన రోజున ఎర్రటి గులాబీలు అందించుకుంటూ ప్రేమికులు, భార్యాభర్తలు.. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను తెలుపుకోవడం మనకు తెలిసిందే! అయితే ఈ రోజున ప్రేమలో మునిగితేలే అమ్మాయిలు ఎరుపు రంగు దుస్తుల్ని ఎంచుకుంటుంటారు. ఇలా తమ దుస్తులతోనే తమ మనసులో దాగున్న ప్రేమను ఎదుటివారికి తెలియజేస్తుంటారు. మీరూ అదే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ ట్రెండీ అవుట్‌ఫిట్స్‌ మీకోసమే..!
లెదర్‌.. ఇప్పుడిదే ట్రెండ్!
లెదర్‌ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేవి హ్యాండ్‌ బ్యాగులు, లగేజ్‌ బ్యాగులు. కానీ ఇదే లెదర్‌తో ఇప్పుడు డ్రస్సులు కూడా రూపొందుతున్నాయి. పైగా ఇప్పుడిదే ట్రెండ్‌ కూడా! మరి, అలాంటి లేటెస్ట్‌ ఫ్యాషనబుల్‌ లెదర్‌ మెటీరియల్‌తో.. అదీ ఎరుపు రంగులో రూపొందించిన డ్రస్‌ని ఈ వేలంటైన్స్‌ డేకి ఎంచుకుంటే మరింత ప్రత్యేకంగా మెరిసిపోవచ్చు కదూ!! ఇదిగో ఇలాంటి లెదర్‌ డ్రస్సునే మనందరికీ పరిచయం చేస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా.


బాడీకాన్‌ డ్రస్‌లా రూపొందించిన ఈ ఎరుపు రంగు లెదర్‌ డ్రస్‌కు మెడ వద్ద పెద్ద కాలర్‌, వదులైన స్లీవ్స్‌, ముందు భాగంలో జిప్‌.. వంటివి అదనపు హంగులద్దాయి. ఇక తన అవుట్‌ఫిట్‌కు మ్యాచింగ్‌గా ఎరుపు రంగు ఐషాడో, మ్యాచింగ్‌ లిప్‌స్టిక్‌తో మెరుపులు మెరిపించిన తమ్మూ.. వేవీ హెయిర్‌తో మరింత క్యూట్‌గా కనిపించింది. ఇలా మీరు కూడా మీ వేలంటైన్‌కి డ్రస్‌ ద్వారా మీ మనసులోని ప్రేమను తెలియజేయాలనుకుంటే ఎరుపు రంగు లెదర్‌ డ్రస్‌ని ఎంచుకోవచ్చు. అయితే ఇలా పొట్టిగా ఉండే డ్రస్‌ మీకు అసౌకర్యంగా అనిపిస్తే.. కాస్త పొడవాటి డ్రస్‌ ఎంచుకోవచ్చు.. లేదంటే మ్యాచింగ్‌/అపోజిట్‌ కలర్‌ లెదర్‌ ప్యాంట్‌ని కూడా వేసుకోవచ్చు.. అదీ కాదంటే లాంగ్‌ జాకెట్‌ ఆప్షన్‌ ఉండనే ఉంటుంది. ఇలా మీకు నప్పిన, నచ్చినట్లుగా రెడ్‌ కలర్‌ లెదర్‌ అవుట్‌ఫిట్‌ ధరించి మీ వేలంటైన్‌ను సర్‌ప్రైజ్‌ చేయచ్చు.
చీరలో చక్కనమ్మలా..!
ఈసారి ట్రెండీ డ్రస్‌ వద్దు.. చీరలో ముస్తాబై మీ మనోహరుడిని ఫిదా చేయాలనుకుంటున్నారా? అయితే ఎరుపు రంగు చీరను ఎంచుకుంటే సరి! అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ ధరించిన ఈ రెడ్‌ కలర్‌ శారీపై ఓ లుక్కేయండి.


ఎరుపు రంగు ప్లెయిన్‌ చీరకు మిర్రర్‌ వర్క్‌, లేస్‌ వర్క్‌ చేసిన బోర్డర్‌ మరింత హైలైట్‌గా నిలిచింది. ఇక చీరకు మ్యాచింగ్‌గా ధరించిన హైనెక్‌ లేస్‌ బ్లౌజ్‌.. చీర సింపుల్‌గా ఉన్నా.. బ్లౌజ్‌తో వన్నెలద్దచ్చన్న విషయం చెప్పకనే చెప్పింది. ఇలా రెడ్‌ రోజ్‌లా మెరిసిపోయిన కాజల్‌ సింపుల్‌ మేకప్‌, వదులైన హెయిర్‌స్టైల్‌, మ్యాచింగ్‌ బ్యాంగిల్స్‌లో అదరగొట్టేసింది. వేలంటైన్స్ డే రోజున ట్రెడిషనల్‌గా మెరిసిపోవాలనుకునే అమ్మాయిల కోసం చీరలతో పాటు లెహెంగా, గాగ్రా.. వంటి ప్రత్యామ్నాయ ఫ్యాషన్లు ఉండనే ఉన్నాయి. అందుకే మీరు చేయాల్సిందల్లా మీకు బాగా నప్పిన, నచ్చిన అవుట్‌ఫిట్‌ను ఎంచుకోవడమే!
బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే!
అకేషన్‌ ఏదైనా ఈ కాలపు అమ్మాయిలు మోజు పడుతోన్న ఫ్యాషనబుల్‌ అవుట్‌ఫిట్స్‌లో గౌన్లు కూడా ఒకటి. చూడ్డానికి స్టైలిష్‌గా, వేసుకుంటే కంఫర్టబుల్‌గా ఉండే ఈ ఫ్యాషన్‌ని ఈ ప్రేమికుల దినోత్సవం రోజున మీరూ ఎంచుకోవాలని ముచ్చటపడుతున్నారా? అయితే అనుపమ ధరించిన ఈ రెడ్‌ గౌన్‌ని ఓసారి చూసేయండి!


ఎరుపు రంగు గౌన్‌కి నడుము భాగంలో రెండు లేయర్లలా రావడం, ఎద భాగంలో వచ్చిన త్రెడ్‌ వర్క్‌, మెడ-స్లీవ్స్‌ బోర్డర్‌ను త్రెడ్‌ వర్క్‌తో డిజైన్‌ చేయడం.. ఇలా గౌన్‌ మొత్తం గుబురుగా, అందంగా రూపొందించారు డిజైనర్లు. ఇలాంటి గౌన్‌ ధరించి మీ వేలంటైన్‌కి ఎదురుపడ్డారంటే ‘బుట్టబొమ్మా.. నన్ను సుట్టూకుంటివే’ అంటూ మిమ్మల్ని చుట్టేసుకోవడం ఖాయం. ఈ తరహా గౌన్లు, మ్యాక్సీలు ఎంచుకున్నప్పుడు మేకప్‌, హెయిర్‌స్టైల్‌ ఎంత సింపుల్‌గా ఉంటే లుక్‌ అంత బాగుంటుందని గుర్తుపెట్టుకోండి.
ఎరుపు ఎబ్బెట్టుగా ఉంటుందనుకుంటే..!
అన్ని రంగులు అందరికీ నప్పకపోవచ్చు.. కొంతమందికి ఫలానా రంగు నప్పినా వేసుకోవడానికి ఇష్టపడరు. ఈ క్రమంలోనే మీకు ఎరుపు అంటే ఇష్టం లేదనుకుంటే అందులోనే మెరూన్‌, బర్గండీ, క్రిమ్సన్‌.. వంటి షేడ్స్‌ని ఎంచుకొని ఈ వేలంటైన్స్‌ డే సందర్భంగా మెరిసిపోవచ్చు. అందాల అలియా భట్‌ కూడా అదే చేసింది.


మెరూన్‌ కలర్‌ బాందనీ మ్యాక్సీ స్కర్ట్‌ వేసుకున్న అలియా.. దానికి జతగా మ్యాచింగ్‌ ఆఫ్‌-షోల్డర్‌ టాప్‌ ధరించింది. ఇలా తన డ్రస్‌ని ఓ ట్రెండీ బెల్టుతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. హెవీ చాంద్‌బాలీ ఇయర్ రింగ్స్‌, వదులైన హెయిర్‌స్టైల్‌, సింపుల్‌ మేకప్‌తో తళుక్కుమంది. ఇక తన డ్రస్‌కు మ్యాచింగ్‌గా రెడ్‌ కలర్‌ హీల్స్‌తో టాప్‌ టు బాటమ్ అదరగొట్టేసిందీ క్యూటీ. మరి, మీరూ ఇలా లాంగ్‌ స్కర్ట్‌ ఎంచుకున్నట్లయితే టాప్‌ మ్యాచింగ్‌ కలర్‌ కాకుండా అపోజిట్‌ కలర్‌లో లేదంటే రెడ్‌ టాప్‌, అపోజిట్‌ కలర్‌ బాటమ్‌.. ఇలా మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌గా ధరించి అదరగొట్టేయచ్చు.
డెనిమ్‌తో స్టైలిష్‌గా..!
ఎన్ని దుస్తులున్నా, ఎన్ని రంగులున్నా.. డెనిమ్‌ లేనిదే అమ్మాయిల వార్డ్‌రోబ్‌ పూర్తికాదంటే అది అతిశయోక్తి కాదు. అయితే వేలంటైన్స్‌ డే సందర్భంగా అలా డెనిమ్‌తో మెరుపులు మెరిపించే అమ్మాయిలూ లేకపోలేదు. అయితే దానికి జతగా ఎంచుకునే టాప్‌/క్రాప్‌టాప్‌ మాత్రం ఎరుపు రంగులో ఉండేలా చూసుకుంటే ఆ రోజు మరింత ప్రత్యేకంగా కనిపించేయచ్చు. కావాలంటే బాలీవుడ్‌ బ్యూటీ హీనా ఖాన్‌ అవుట్‌ఫిట్‌పై ఓ లుక్కేయండి.

డెనిమ్‌ షార్ట్‌ స్కర్ట్‌ ఎంచుకున్న ఈ ముద్దు గుమ్మ.. దానిపై రెడ్‌ కలర్‌ డాటెడ్‌ ప్రింటెడ్‌ క్రాప్‌టాప్‌ని జత చేసి వెస్ట్రన్‌ స్టైల్‌లో అదరగొట్టేసింది. ఇక హూప్‌ ఇయర్‌ రింగ్స్‌, క్యూట్‌ హెయిర్‌స్టైల్‌, వైట్‌ స్నీకర్స్‌ ఆమె క్యూట్‌నెస్‌ని రెట్టింపు చేశాయని చెప్పచ్చు. అయితే మీకు ఇలా డెనిమ్‌ షార్ట్స్ ధరించడం ఇష్టం లేకపోయినా, అసౌకర్యంగా అనిపించినా డెనిమ్‌ ప్యాంట్‌ ఎంచుకోవచ్చు.. లేదంటే కాస్త పొడవుగా ఉండే డెనిమ్‌ స్కర్ట్‌ని కూడా ధరించచ్చు.

ఇలా మీరు ధరించిన డ్రస్ ఏదైనా సరే కొనే ముందు మీకు నప్పిందా లేదా ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఆయా దుస్తులు ధరించినప్పుడు వాటికి నప్పేలా సింపుల్‌ జ్యుయలరీ, తక్కువ మేకప్‌, నప్పే హెయిర్‌స్టైల్‌ వేసుకుంటే.. మీ వేలంటైన్‌ని ఇట్టే ఫిదా చేసేయచ్చు.. కావాలంటే ట్రై చేసి చూడండి..! అయితే మీ అవుట్‌ఫిట్‌ గురించి మీ లవర్‌బాయ్‌ ఇచ్చిన కాంప్లిమెంట్స్‌ని మాత్రం కింది కామెంట్‌ బాక్స్‌ ద్వారా పంచుకోవడం మర్చిపోవద్దు..!
హ్యాపీ వేలంటైన్స్‌ డే!

మరిన్ని

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా? 

ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్‌ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్‌ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్‌ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.

తరువాయి

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని