ఈ బీరకాయ రైస్‌ సూప్‌తో బరువు తగ్గేయచ్చు! - try this healthy turai rice soup recipe significantly lower in calories
close
Published : 28/06/2021 16:07 IST

ఈ బీరకాయ రైస్‌ సూప్‌తో బరువు తగ్గేయచ్చు!

అధిక బరువున్న వారు ఎప్పుడెప్పుడు బరువు తగ్గుదామా.. అని ఎదురుచూస్తుంటారు. అందుకోసం అప్పటివరకు అలవాటు లేని వ్యాయామాలు చేయడం, జిమ్‌కి వెళ్లడం మొదలుపెడతారు. డైటింగ్‌ పేరుతో నోరు కట్టేసుకుంటారు. అయితే ఈ డైటింగ్‌ వల్ల బరువు తగ్గడమేమో గానీ లేనిపోని ఆరోగ్య సమస్యలు తలెత్తడం మాత్రం ఖాయమంటున్నారు నిపుణులు. అందుకే డైటింగ్‌కు స్వస్తి చెప్పి ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టమంటున్నారు. క్యాలరీలు తక్కువగా, పోషకాలు మెండుగా ఉన్న ఈ ‘బీరకాయ రైస్‌ సూప్‌’ కూడా అలాంటిదే!

అరగంటలో రడీ!

అతి తక్కువ క్యాలరీలు ఉండే బీరకాయలతో కూర ఒక్కటే కాదు.. చట్నీ, రైతా, జ్యూస్‌ వంటి ఎన్నో రుచికరమైన వంటకాలు సైతం తయారుచేసుకోవచ్చు. అయితే బరువు తగ్గాలనుకునే వారు, బీరకాయలతో ఏదైనా కొత్త వంటకం ట్రై చేద్దామనుకునే వారు ‘బీరకాయ రైస్‌ సూప్‌’ను ఎంచుకోవడం ఉత్తమం. పైగా దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన పని కూడా లేదు. కేవలం 30 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు!

కావాల్సిన పదార్థాలు

* బీరకాయలు (మీడియం సైజు) - 2 (తొక్క చెక్కేసి చిన్న చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి)

* నానబెట్టిన బాస్మతీ బియ్యం - 2 కప్పులు

* నూనె - 2 టేబుల్‌ స్పూన్లు

* పోపు దినుసులు - టీస్పూన్

* ఎండుమిర్చి - 3

* వెల్లుల్లి తరుగు - 2 టీస్పూన్లు

* ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరిగి పెట్టుకోవాలి)

* బంగాళాదుంప – ఒకటి (తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్‌ చేసి పెట్టుకోవాలి)

* ఎర్ర గుమ్మడికాయ ముక్కలు - ఒక కప్పు

* పసుపు - ముప్పావు టీస్పూన్

* నల్ల మిరియాల పొడి - అర టీస్పూన్‌ (బరకగా దంచి పెట్టుకోవాలి)

* కొత్తిమీర తరుగు – 2 టేబుల్‌ స్పూన్లు

* నిమ్మకాయ – ఒకటి

* ఉప్పు - రుచికి సరిపడా

తయారీ

* ముందుగా నాన్‌స్టిక్‌ ప్యాన్‌లో నూనె వేడి చేసి.. అది వేడెక్కాక పోపు దినుసులు వేసి దోరగా వేయించాలి. ఇప్పుడు ఇందులో ఎండు మిర్చి వేసి మరికాసేపు వేయించాలి.

* ఆ తర్వాత వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు జత చేసి వేగనివ్వాలి.

* ఇప్పుడు ఇందులో బంగాళాదుంప, గుమ్మడికాయ, బీరకాయ ముక్కలు, పసుపు, నల్లమిరియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.

* ఇవి కాస్త మగ్గిన తర్వాత బాస్మతీ బియ్యాన్ని కూడా వేసేయాలి. మరోసారి బాగా కలుపుకొని.. ఇందులో 2 లీటర్ల నీళ్లు పోసి కలపాలి. స్టౌ సిమ్‌లో పెట్టి బియ్యంతో పాటు కూరగాయలు బాగా ఉడికే వరకు మధ్యమధ్యలో కలుపుతుండాలి.

* ఆఖర్లో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేసి మరోసారి కలిపి సర్వింగ్‌ బౌల్‌లోకి తీసుకోవాలి. ఈ వర్షాకాలంలో దీన్ని వేడివేడిగా తీసుకుంటే ఆ మజాయే వేరు!

ఆరోగ్య ప్రయోజనాలివే!

* రుచికరమైన ఈ బీరకాయ రైస్‌ సూప్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గే వారికి ఇది మంచి ఆహారం.

* బీరకాయల్లో ఫైబర్‌ అధికంగా ఉండడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది.

* బీరకాయలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా జాగ్రత్తపడచ్చు. కాబట్టి మధుమేహులు దీన్ని నిస్సందేహంగా తీసుకోవచ్చు.

* విటమిన్‌-సి, ఐరన్‌, మెగ్నీషియం, థయమిన్‌.. వంటి పోషకాలతో నిండి ఉండే బీరకాయలతో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* రక్తహీనతతో బాధపడే మహిళలు బీరకాయలను ఆహారంలో భాగం చేసుకుంటే సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.

* ఆరోగ్యానికే కాదు.. అందానికీ బీరకాయ మంచిదంటున్నారు నిపుణులు. ఈ కాయగూరతో చర్మ ఆరోగ్యాన్ని పెంపొందించుకొని ప్రకాశవంతంగా మెరిసిపోవచ్చంటున్నారు.

మరిన్ని

యోగాలో ఈ పొరపాట్లు దొర్లకుండా..!

మానసిక ఒత్తిడి, టెన్షన్ల నుంచి తక్షణమే విముక్తి లభిస్తే బాగుండు.. అనిపిస్తోందా? అధిక పనితో అలసిపోయిన శరీరాన్ని శక్తిమంతం చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ ఒకేసారి సాధ్యమైతే.. అంతకంటే ఆనందమేముంటుంది చెప్పండి.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా సంపూర్ణ దృఢత్వాన్ని సాధించవచ్చు. ఇందుకు సహకరించే ప్రక్రియే 'యోగా'. అయితే ఈ యోగాసనాల వల్ల పూర్తి ఫలితం పొందాలంటే.. చేసే క్రమంలో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తపడాలి. కానీ కొంతమంది మాత్రం అవగాహన లోపంతో యోగా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఫలితంగా యోగా చేసిన ఫలం దక్కకుండా పోతుంది. మరి ఆ పొరపాట్లేంటో ముందే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే పూర్తి ఫిట్‌నెస్‌ను సొంతం చేసుకోవచ్చు.

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని