నేనూ, నా... కాదు! - vasundhara
close
Published : 05/04/2021 00:36 IST

నేనూ, నా... కాదు!

ఎన్నో ఊహలు... మరెన్నో ఆశలతోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెడతారు ఎవరైనా. కానీ కొందరు మాత్రమే ఆ బంధాన్ని పదిలంగా కాపాడుకుంటారు. అలా మీరూ ఉండాలంటే కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడానికి ఎన్నో కారణాలుంటాయి. ఆర్థిక విషయాలే గొడవలకు మూలమని చాలామంది అనుకుంటారు. కానీ ఇవేకాదు.. మనసులోని మాటను స్పష్టంగా చెప్పలేకపోవడం, ఒకరిమీద మరొకరికి నమ్మకం లేకపోవడం, ఒకరి సమస్యల్లో మరొకరు సాయం చేయకపోవడం... వంటివెన్నో. ఇబ్బంది వచ్చినప్పుడు ముందు దాని మూలాన్ని గుర్తించండి. అభద్రతకు కారణమైన విషయాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎవరి అభిప్రాయంతో వారు వాదించుకుంటూ ఉండొద్దు. కలిసి కూర్చుని మాట్లాడుకోండి. మధ్యే మార్గంగా రాజీకి రావడానికి వెనుకాడకండి.
కలతలు రాకుండా...
ప్రతి ఒక్కరికీ ఎంతో కొంత స్వార్థం ఉంటుంది. కానీ ఇది శృతి మించితే కాపురంలో కలతలు రాకమానవు. ‘నేను చాలా ప్రత్యేకం. నా విలువైన సమయాన్ని ఎవరికీ కేటాయించలేను. నా పనులే నాకు ముఖ్యం’ ... ఇలా ఆలోచించేవాళ్లూ చాలామంది ఉంటారు. తమ గురించి తమ ఆశలు, కలలు, కోరికల గురించే నిత్యం ఆలోచించేవాళ్లు వైవాహిక బంధంలో అసలు ఇమడలేరు. నేను, నా అని మాత్రమే అనుకోకుండా...మనం అనుకుంటే మేలు. ఇలాంటి ఆలోచనా ధోరణిని కాస్త పెంచుకుని మీ ప్రపంచంలో ఎదుటివాళ్లకూ స్థానం ఇస్తే సంతోషం రెట్టింపు అవుతుంది.
ఆలోచనలు మారాలి...
భిన్న నేపథ్యాలున్న ఆలుమగల కోరికలు, ఇష్టాయిష్టాలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే భాగస్వామి అభిప్రాయాల్ని గౌరవించడం, వారి ఇష్టాల్ని మన్నించడం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలు, ఆకాంక్షలు ఏమిటో తెలుసుకోవాలి. భార్య/భర్త...ఆశలు, ఆశయాల సాధనలో కలిసి అడుగులేయాలి. అప్పుడు స్వార్థరహితంగా ఆలోచించడం అలవాటవుతుంది. దాంతో మీ ప్రపంచమూ విశాలమవుతుంది. మీకోసం మీరే కాకుండా ఇతరుల కోసం జీవించడంలోని ఆనందాన్నీ ఆస్వాదించగలుగుతారు.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి