వంటల పుస్తకమే దారి చూపింది..! - vasundhara
close
Published : 09/04/2021 00:56 IST

వంటల పుస్తకమే దారి చూపింది..!

సోనమ్‌కి వంట చేయడమంటే పెద్దగా ఇష్టముండేది కాదు. అత్తగారు ఉన్నప్పుడు ఆ అవసరమూ ఉండేది కాదు. కానీ ఆ వంటే ఇప్పుడామెను ఓ విజయవంతమైన వ్యాపారవేత్తగా నిలబెట్టింది. ఇదెలా జరిగిందంటే...
సోనమ్‌ వాళ్ల అత్తగారు ప్రేమలత ఎంతో రుచిగా వండే వంటకాలను చుట్టుపక్కల వాళ్లూ, బంధువులు అడిగి మరీ తినేవాళ్లు. మూడేళ్ల కిందట కొడుకు అజయ్‌ పుట్టినరోజున... ఇడ్లీల్లోకి అతడికి ఎంతో ఇష్టమైన నువ్వుల పొడిని తయారుచేసింది. టిఫిన్‌ తిన్న తర్వాత అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకున్నారు కూడా. ఒంట్లో కాస్త నలతగా ఉందని ప్రేమలత నడుం వాల్చింది. అలాగే శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఈ విషాదం నుంచి తేరుకోవడానికి వారికి చాలా సమయమే పట్టింది.
తర్వాత ఒకరోజు సోనమ్‌ ఇల్లు శుభ్రం చేస్తుండగా అల్మారాలో అత్తగారి వంటల పుస్తకం కనిపించింది. కొత్త కోడలిగా ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టినప్పుడు ప్రేమలత రాసుకున్న పుస్తకం అది. దాన్ని సోనమ్‌ పదిలంగా భద్రపరిచింది. ఆ వంటల పుస్తకం చూసి మెల్లగా చేయడం నేర్చుకుంది. ముఖ్యంగా అత్తగారు చేసే గోంగూర పచ్చడి అంటే ఇంటిల్లిపాదికీ ఎంతో ఇష్టం. సోనమ్‌ గోంగూర పచ్చడి చేయడం నేర్చుకుని ఒకరోజు దాన్ని బంధువులకు రుచి చూడమని ఇచ్చింది. వాళ్లందరూ ‘అచ్చం మీ అత్తగారు చేసినట్టే ఉంది’ అని ఫోన్‌ చేసి మరీ మెచ్చుకున్నారు. ఇంకా ఎక్కువ తయారు చేసి పెట్టమన్నారు. అప్పుడే సోనమ్‌కు ఈ వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. భర్త, మామగారితో తన ఆలోచనను పంచుకుంది. వారిద్దరూ ఆమెను ప్రోత్సహించడంతో వ్యాపారం మొదలుపెట్టింది.

కల నిజమైంది...
ఫుడ్‌ బిజినెస్‌ చేయాలనే ప్రేమలత కోరిక కోడలు సోనమ్‌ ద్వారా నెరవేరింది. అత్తగారి నోట్సును అనుకరిస్తూ పచ్చళ్లు, పొడులను తయారుచేసి వివిధ దుకాణాలు, ఎగ్జిబిషన్లలో అందుబాటులో ఉంచడం ప్రారంభించింది. రూ.పది లక్షలతో ‘ప్రేమ్‌ ఇటాసి’ పేరుతో వ్యాపారాన్ని మొదలుపెట్టింది. ఆన్‌లైన్‌ వేదికగానూ వ్యాపారాన్ని విస్తరించింది. ఇప్పుడు సింగపూర్‌, అమెరికాకు కూడా పచ్చళ్లు, పొడులను ఎగుమతి చేస్తోంది. ‘నెలకు కనీసం ఐదు వందల ఆర్డర్లు వచ్చినా చాలనుకున్నా. మొదటి నెలలోనే రెండు  వేల ఆర్డర్లు వచ్చాయి. ప్రస్తుతం ఇరవై ఒక్క రకాల చట్నీలు, పొడులను తయారు చేస్తున్నా. ‘ప్రేమ్‌ఇటాసి’ పేరుతో వెబ్‌సైట్‌నూ మొదలుపెట్టాం. పచ్చళ్ల ధర రూ.175 నుంచి రూ.225 వరకూ ఉంటుంది.  అత్తయ్య ఇప్పుడు ఉంటే ఎంతో సంతోషించేవారు’ అంటోంది సోనమ్‌.

మరిన్ని

అతివకు ఆరోగ్యం.. ఆమె అభిమతం!

‘సాయం చేయాలంటే కావాల్సింది డబ్బు మాత్రమే కాదు... ఇతరుల కష్టాలకు స్పందించే గుణం’ అది లేకపోతే... మనుషులుగా మనకు గుర్తింపు ఎందుకు అంటారు శ్రీదేవి. ఆమె స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకు. భర్త వృత్తి రీత్యా ఖమ్మంలో స్థిరపడింది వారి కుటుంబం. సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలనే ఆలోచన తాను ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచే వచ్చిందని చెబుతారామె. ‘చీకట్లో కూర్చుని వెలుతురు లేదని బాధపడితే ఎలా? పరిష్కారం కోసం ప్రయత్నించాలి కదా...! నేనూ అదే చేస్తున్నా. కొన్నేళ్ల కిందట తీవ్రమైన గైనిక్‌ సమస్యతో బాధపడ్డా. చికిత్స కోసం తిరగని ఆసుపత్రి లేదు. అప్పుడే విద్యార్థినులు, తోటి మహిళల్లో చాలామందికి నెలసరి విషయాలపై కనీస అవగాహన లేదనే విషయం తెలుసుకున్నా.

తరువాయి

AAAS: ఈ ముగ్గురు... అంతర్జాతీయ ప్రతిభావనులు

అమెరికన్‌ అకాడెమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌.. పేరు చెప్పగానే ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌, ఛార్లెస్‌ డార్విన్‌, విన్‌స్టన్‌ చర్చిల్‌, నెల్సన్‌ మండేలా, అకిరా కురొసావా మొదలైనవారి పేర్లు వినిపిస్తాయి. 240 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రతిష్ఠాత్మక సంస్థలో వీరంతా సభ్యులు మరి! ఈ సంస్థ ఏటా ప్రపంచవ్యాప్తంగా కళలు, శాస్త్ర రంగాల్లో అత్యంత ప్రతిభ చూపినవారిని సభ్యులుగా ఎంపిక చేస్తుంది. ఈ ఏడాది ఈ జాబితాలో మనదేశ మూలాలున్న ఆరుగురు చోటు దక్కించుకున్నారు. వారిలో ముగ్గురు మహిళలే! వారే.. శారదా శ్రీనివాసన్‌,    కవితా రమణన్‌, గాయత్రీ చక్రవర్తి స్పివక్‌. ఈ అంతర్జాతీయ మేధావుల స్ఫూర్తి ప్రయాణం మనమూ చూద్దాం.

తరువాయి