ఉద్యోగ సంక్షోభం నుంచి గట్టెక్కాలా? అయితే ఇవి తెలుసుకోండి! - what you need to know about job searching in 2021 in telugu
close
Published : 07/07/2021 19:15 IST

ఉద్యోగ సంక్షోభం నుంచి గట్టెక్కాలా? అయితే ఇవి తెలుసుకోండి!

కరోనా కారణంగా జీవిత ఉద్యోగం పోయింది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటోన్న ఆమె కొత్త ఉద్యోగ వేటలో ఉంది. ఈ క్రమంలోనే పలు కోర్సులు ఆన్‌లైన్‌లోనే నేర్చుకుంటోందామె.

గీతికకు ప్రస్తుతం చేస్తోన్న ఉద్యోగంలో అస్సలు సంతృప్తి లేదు. అందుకే ఓవైపు కరోనా సంక్షోభం కొనసాగుతోన్నా.. మరోవైపు తన చదువుకు, అనుభవానికి తగ్గ ఉద్యోగం కోసం అన్వేషిస్తోంది. అందుకు కావాల్సిన నైపుణ్యాలు కూడా సంపాదించుకుందామె.

మాయదారి కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది ఉన్న ఉద్యోగాలు కోల్పోయారు. దీంతో చాలా ఇళ్లలో ఉద్యోగ సంక్షోభం నెలకొంది. మరి, ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ కొన్ని కంపెనీలు కొత్త ఉద్యోగుల కోసం అన్వేషణ సాగిస్తున్నాయి. మరి, ఈ సువర్ణావకాశాన్ని అందిపుచ్చుకోవాలంటే.. నిరుద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకుంటూనే, కొన్ని అంశాలపై దృష్టి సారించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి..

ఆ ‘ట్రెండ్స్‌’ ఫాలో అవ్వాల్సిందే!

రెండో దశ తగ్గుముఖం పట్టడంతో కొన్ని కంపెనీలు ఇప్పుడిప్పుడే నియామక ప్రక్రియ చేపడుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ట్రెండ్స్‌ని తప్పనిసరిగా ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో ఎక్కువగా నియామకాలు చేపడుతోన్న కంపెనీలేంటో ముందుగా తెలుసుకోవాలి. ఆపై ఆయా సంస్థలకు సంబంధించిన వెబ్‌సైట్స్‌ని ఫాలో అవ్వడం, వాటి కార్యకలాపాలకు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఆ సైట్‌లోకి లాగిన్‌ అవడం, వారు పోస్ట్‌ చేసే జాబ్‌ నోటిఫికేషన్స్‌ని పరిశీలించడం.. దానికి మీరు అర్హులైతే దరఖాస్తు చేసుకోవడం.. వంటివి చేయాలి. ఒకవేళ ఈ క్రమంలో ఏదైనా సందేహాలు తలెత్తినా, వీటి గురించి మీకు అంతగా అవగాహన లేకపోయినా మీకు తెలిసిన ఇతర ఉద్యోగుల సలహాలు తీసుకోవచ్చు.. లేదంటే సంబంధిత నిపుణుల్ని సంప్రదించినా ఉద్యోగాన్వేషణ గురించి మీకొక ఐడియా వస్తుంది.

పెరిగేవే కానీ.. తరగవు!

కరోనా మహమ్మారి కారణంగా చాలా రంగాలు నష్టాన్నే చవిచూసినా.. కొన్ని మాత్రం లాభాలను ఆర్జించాయని చెప్పుకోవచ్చు. ఉదాహరణకు.. ఆరోగ్య రంగం, ఈ-కామర్స్‌, ఫార్మసీ.. వంటి రంగాలతో పాటు ఐటీ రంగానికి సంబంధించిన కొన్ని కంపెనీలు కూడా ముందంజలోనే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే నష్టం చవిచూడని ఇలాంటి రంగాల్లో ఉద్యోగావకాశాలపై దాదాపుగా కోత పడలేదని చెప్పచ్చు. ఇక ఈ ఆర్థిక సంక్షోభంలోనూ వీటిలోని కొన్ని రంగాల్లో ఉద్యోగుల్ని నియమించుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే ప్రస్తుతం ఉద్యోగాన్వేషణలో ఉన్న వారు ఇలాంటి ఎవర్‌గ్రీన్‌ రంగాలపై దృష్టి పెట్టమంటున్నారు నిపుణులు. అయితే ‘అది మా ఫీల్డ్‌ కాదు కదా.. అందులో మాకేం అవకాశాలుంటాయని’ అనుకునేవారూ లేకపోలేదు. నిజానికి ఏ రంగమైనా అందులో మనం చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగం కాకపోయినా చిన్నదో, పెద్దదో.. ఇలా ఏదో ఒక అవకాశం ఉండకపోదు. కాబట్టి ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల్లో ‘నా చదువుకు తగ్గ ఉద్యోగమే రావాల’ని గిరిగీసుకొని కూర్చోకుండా ఏ ఉద్యోగమైనా కళ్లకు అద్దుకొని మరీ స్వీకరించడం ఉత్తమం. కావాలంటే పరిస్థితులు కాస్త కుదురుకున్నాక మరో ఉద్యోగంలోకి మారచ్చు. అప్పటిదాకా ఖాళీగా ఉండకుండా కాస్త అనుభవాన్నైనా ఆర్జించచ్చు.

‘తాత్కాలికమే కదా’ అనుకోవద్దు!

ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో చాలావరకు కంపెనీలు ఉద్యోగుల్ని నియమించుకున్నా అది తాత్కాలికంగానో, కాంట్రాక్ట్‌ పద్ధతిలోనో, ఫ్రీలాన్సింగ్‌ వర్కర్స్‌గానో మాత్రమే రిక్రూట్‌ చేసుకుంటున్నాయి. దీంతో ‘మళ్లీ వాళ్లు కూడా ఉద్యోగంలో నుంచి తొలగిస్తే మా పరిస్థితేంటి?’ అంటూ తమకు వచ్చిన అవకాశాలను సైతం దూరం చేసుకుంటున్నారు కొంతమంది. కానీ ఇప్పుడు తాత్కాలికంగా ఉన్న ఉద్యోగంలో చక్కటి ప్రతిభ కనబరిస్తే భవిష్యత్తులో అదే ఉద్యోగం శాశ్వతం కావచ్చేమో! అందుకే అనవసరమైన సాకులతో అవకాశాల్ని దూరం చేసుకోకుండా సానుకూల దృక్పథంతో ముందుకు సాగమంటున్నారు నిపుణులు. తద్వారా సమయం వృథా కాకుండా ఉంటుంది.. ఉద్యోగానుభవం కూడా సొంతం చేసుకోవచ్చు. వృత్తిలో మనం ఆర్జించిన ఈ అనుభవం ఎప్పటికీ వృథా కాదు.

ఆ నైపుణ్యాలు పెంచుకోవాల్సిందే!

ప్రస్తుతం కొన్ని చోట్ల మనుషులు చేసే కొన్ని పనుల్ని కూడా యంత్రాలు చేసేస్తున్నాయి. అది కూడా మనిషి కంటే వేగంగా! దాంతో ఆయా కంపెనీల యజమానులు ఉద్యోగుల కోసం అన్వేషించడం, ప్రత్యేకంగా వారికి జీతం చెల్లించాల్సిన అవసరం లేకుండా పోతోంది. ఇది రాబోయే రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. నిజంగా ప్రతి కంపెనీలో ఇలాంటి ఆటోమేషన్‌ పద్ధతి గనుక అందుబాటులోకి వస్తే నిరుద్యోగం పెరిగిపోయి ఇంతకంటే దారుణ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగని భయపడిపోకుండా అందుకోసం ఇప్పట్నుంచే సిద్ధం కమ్మంటున్నారు నిపుణులు. ఇలా మన భవిష్యత్తులో జరగబోయే మార్పుల గురించి అవగాహన తెచ్చుకొని ఆయా విషయాల్లో పరిజ్ఞానం పెంచుకోమని సలహా ఇస్తున్నారు.

ఇలా మీరు సంపాదించిన నైపుణ్యాలను ఉద్యోగాన్వేషణలో కీలక పాత్ర పోషించే రెజ్యుమేలో పొందుపరచడం వల్ల ఉద్యోగావకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఒకవేళ ఆటోమేషన్‌ వల్ల మీ ఉద్యోగం పోయినా ఎలాగూ దాని గురించిన అవగాహన, అనుభవం మీకు ఉంటుంది కాబట్టి మీకు మీరే ఇతర ఉపాధి మార్గాల్ని అన్వేషించుకోగలుగుతారు. తద్వారా సంక్షోభంలోకి కూరుకుపోకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.

‘ఆన్‌లైన్‌’కు సిద్ధపడండి!

కరోనా వచ్చిన దగ్గర్నుంచి ఉద్యోగమైనా, ఉద్యోగ నియామకమైనా అంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతోంది. అయితే ఇప్పటికే వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌, ఆన్‌లైన్‌ ముఖాముఖికి అలవాటు పడిన వారికి ఇది అంత కొత్తగా ఏమీ అనిపించకపోవచ్చు. కానీ మొదటిసారి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకి హాజరుకావాలంటే ఏదో తెలియని బెరుకు, భయం ఉండడం కామనే! అలాగని ఇంటర్వ్యూకి అదే భయంతో హాజరైతే అందులో సక్సెస్‌ సాధించలేరంటున్నారు నిపుణులు. అందుకే ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలో సక్సెస్‌ కావాలంటే ఈ క్రమంలో గుర్తుంచుకోవాల్సిన అంశాలపై అవగాహన ఉండాలి.

ముందుగా ఇంటర్వ్యూకి పూర్తి స్థాయిలో సన్నద్ధమవడం, చక్కగా డ్రస్‌ చేసుకోవడం, ఎలాంటి అంతరాయం లేని చోట కూర్చోవడం, ఇంటర్వ్యూ చేసే వాళ్ల కళ్లలోకి సూటిగా చూస్తూ ఆత్మవిశ్వాసంతో సమాధానాలు చెప్పడం.. వంటివి అందులో ముఖ్యమైనవి. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగం సంపాదించిన తర్వాత కూడా చాలా వరకు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ఆప్షన్‌ ఇచ్చే అవకాశాలే ఎక్కువ! కాబట్టి ‘ఆన్‌లైన్‌లోనే కదా.. మమ్మల్ని ఎవరూ అడిగేవారు లేరు..’ అంటూ సమయం వృథా చేయడం కాకుండా.. చక్కటి పనితీరు కనబరిస్తే ఉద్యోగంలో రాణించవచ్చు. తద్వారా కరోనా వంటి సంక్షోభాలెన్నొచ్చినా మీ ఉద్యోగం పోతుందన్న భయం ఉండదు.

కరోనా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటూ, కంపెనీల ఉద్యోగ నియామకాల తీరుతెన్నులను బట్టి మనమూ మారుతూ ఈ ఉద్యోగ సంక్షోభం నుంచి ఎలా గట్టెక్కాలో తెలుసుకున్నారు కదా! కాబట్టి వీటిని గుర్తుపెట్టుకొని ఫాలో అయితే ఎంతటి ప్రతికూలతల్నైనా సానుకూలంగా ఎదుర్కొనే ఓర్పు-నేర్పు మన సొంతమవుతుంది.. కాదంటారా?!

మరిన్ని

వీటితో పిల్లలకు పాలివ్వడం ఎంతో సులువు!

పసి పిల్లలకు ఆరు నెలలు అంతకుమించి ఏడాది వరకు తల్లిపాలు పట్టడం తప్పనిసరి అంటూ నిపుణులు చెప్పడం మనకు తెలిసిందే. అయితే ఇటు కుటుంబంతో పాటు అటు వృత్తి ఉద్యోగాలకూ సమప్రాధాన్యమిచ్చే అమ్మలున్న ఈ రోజుల్లో ఏడాది వరకు బిడ్డకు తానే నేరుగా పాలివ్వడం అంటే అది కాస్త కష్టమనే చెప్పుకోవాలి. అలాగని బిడ్డలను అలా వదిలేసి తల్లులూ తమ వృత్తిపై దృష్టి పెట్టలేరు. అందుకే అటు నేటి తల్లుల బ్రెస్ట్‌ఫీడింగ్ పనిని సులభతరం చేస్తూ, ఇటు పిల్లలకు తల్లిపాలు అందుబాటులో ఉండేలా చేసేందుకు వివిధ రకాల బ్రెస్ట్‌ఫీడింగ్ గ్యాడ్జెట్లు ప్రస్తుతం మార్కెట్లోకొచ్చేశాయి.

తరువాయి

సైజ్‌ జీరో కాదు.. ఆరోగ్యం ముఖ్యం!

‘మనసులో కలిగే ఆలోచనల్నే శరీరం ప్రతిబింబిస్తుంది..’ అంటోంది ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ అంకితా కొన్వర్‌. సైజ్‌ జీరో గురించి ఆలోచిస్తూ బాధపడితే మరింత బరువు పెరుగుతామని, అదే ఆరోగ్యంపై దృష్టి పెడితే శరీరం, మనసు రెండూ మన అధీనంలో ఉంటాయని చెబుతోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ పెడుతూ.. ఆ చిట్కాల్ని సోషల్‌ మీడియాలో పంచుకుంటూ అందరిలో స్ఫూర్తి నింపే ఈ మిసెస్‌ సోమన్‌.. తాజాగా బాడీ పాజిటివిటీ గురించి ఇన్‌స్టాలో మరో స్ఫూర్తిదాయక పోస్ట్‌ పెట్టింది. సైజ్‌ జీరో కంటే ఆరోగ్యమే ముఖ్యమంటూ ఆమె షేర్‌ చేసిన పోస్ట్‌ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

తరువాయి

ఆఫీసులో కోపం కట్టలు తెంచుకుంటోందా? ఇలా చేసి చూడండి..!

ఉద్యోగినులకు ఇటు ఇంటి పనులు, అటు ఆఫీస్‌ ఒత్తిళ్లు సర్వసాధారణమే అయినా.. కొంతమంది వీటిని అదుపు చేసుకోలేక ఒక్కోసారి పని ప్రదేశంలోనే ఎదుటివారిపై విరుచుకుపడుతుంటారు. దీన్నే ‘వర్క్‌ప్లేస్‌ బర్నవుట్’గా పేర్కొంటున్నారు నిపుణులు. నిజానికి ఇలాంటి దీర్ఘకాలిక ఒత్తిడి ఆరోగ్యానికే కాదు.. కెరీర్ పైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు. అందుకే దీన్ని ఆదిలోనే గుర్తించి మేనేజ్‌ చేసుకోగలిగితే దీనివల్ల కెరీర్‌పై మచ్చ పడకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని