ఈ మహిళలు.. బిలియనీర్లు! - women in forbes world s billionaires list
close
Updated : 15/07/2021 13:49 IST

ఈ మహిళలు.. బిలియనీర్లు!

తమదైన వ్యాపార దక్షతతో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ పేరుప్రఖ్యాతులు సంపాదిస్తున్నారు ఎంతోమంది అతివలు. అంతేకాదు.. తమ వ్యాపారాన్ని పరుగులు పెట్టిస్తూ ఆర్జనలోనూ మగవారితో సమానమేనని నిరూపిస్తున్నారు. అందుకే ప్రముఖ పత్రిక ఫోర్బ్స్‌ ఏటా ప్రకటించే ప్రపంచ బిలియనీర్ల జాబితాలో కొందరు మహిళలూ చోటు దక్కించుకుంటారు. ఈ క్రమంలో- ఫోర్బ్స్ 'రియల్ టైం బిలియనీర్ల' జాబితాలో చోటు సంపాదించుకున్న కొంతమంది మహిళల గురించి తెలుసుకుందాం రండి..


ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్

లోరియల్‌ ప్యారిస్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద సౌందర్య సాధనాల సంస్థగా పేరు గాంచిందీ కాస్మెటిక్‌ కంపెనీ. 1909లో Eugene Schullerనెలకొల్పిన ఈ కంపెనీ నిర్వహణ బాధ్యతలు వంశపారంపర్యంగా చేతులు మారుతున్నాయి. అయితే 1997లో ఆయన మనవరాలు ఫ్రాంకోయిస్‌ బెటెన్‌కోర్ట్‌ మేయర్స్‌ ఈ కంపెనీ బోర్డు సభ్యుల్లో ఒకరిగా చేరారు. తల్లి బతికున్నప్పుడే అంటే 2017లో ఈ సంస్థ ఛైర్‌ఉమన్‌గా బాధ్యతలు అందుకున్నారు. చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం, మేకప్‌, పెర్‌ఫ్యూమ్‌.. వంటి సౌందర్య సాధనాల్ని ఉత్పత్తి చేస్తోన్న ఈ సంస్థను సమర్థంగా నడిపించడంతో పాటు కుటుంబం నెలకొల్పిన సేవా సంస్థకు అధ్యక్షురాలిగానూ కొనసాగుతున్నారామె. సైన్స్‌, ఆర్ట్స్‌ విభాగాల్లో ఔత్సాహికుల్ని ప్రోత్సహించడమే ఈ సేవా సంస్థ ముఖ్యోద్దేశం. అంతేకాదు.. 2019 ఏప్రిల్‌లో ప్యారిస్‌లోని ఓ చర్చి అగ్నిప్రమాదానికి గురైతే.. దాన్ని తిరిగి రిపేర్‌ చేయించడానికి సుమారు 226 మిలియన్‌ డాలర్లను విరాళంగా అందించారు ఫ్రాంకోయిస్‌. ప్రస్తుతం లోరియల్‌లో 33 శాతం షేర్లు కలిగి ఉన్న ఆమె కుటుంబం ఆస్తిపాస్తుల విలువ 87.9 బిలియన్‌ యూఎస్‌ డాలర్లు. ఫోర్బ్స్ 'రియల్ టైం బిలియనీర్ల' జాబితాలో 10 వ స్థానం (మహిళల్లో మొదటి స్థానం) దక్కించుకున్నారామె.


అలైస్‌ వాల్టన్

Photo: alicewalton.org

వాల్‌మార్ట్‌ వ్యవస్థాపకుడు సామ్‌ వాల్టన్‌ ఏకైక పుత్రికే అలైస్‌ వాల్టన్‌. తన సోదరుల్లా తండ్రి స్థాపించిన కంపెనీ వ్యవహారాలపై దృష్టి పెట్టకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలనుకున్నారామె. తనకు ఆసక్తి ఉన్న క్యురేటింగ్‌ ఆర్ట్‌పై శ్రద్ధ పెట్టిన ఆమె.. 2011లో తన స్వస్థలం బెంటన్‌విల్లేలో ‘క్రిస్టల్‌ బ్రిడ్జెస్‌ మ్యూజియం ఆఫ్‌ అమెరికన్‌ ఆర్ట్‌’ అనే ఆర్ట్‌ మ్యూజియంను ప్రారంభించారు. ఆండీ వార్హోల్‌, నోర్మన్‌ రాక్‌వెల్‌, మార్క్‌ రోథ్కో.. వంటి ప్రముఖ కళాకారుల పెయింటింగ్స్‌/కళలకు ప్రతిరూపంగా నిలుస్తోందీ మ్యూజియం. కరోనా లాంటి మహమ్మారుల కారణంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు తన స్వస్థలంలో సకల సదుపాయాలతో కూడిన వైద్యారోగ్య సంస్థను నెలకొల్పేందుకు గతేడాదే ప్రణాళికలు రచించారామె. ఇలా వ్యాపార రంగంలో తనదైన రీతిలో దూసుకుపోతోన్న అలైస్‌.. 64 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో 17వ స్థానంలో నిలిచారు.


మెకంజీ స్కాట్

Photo: Twitter

రచయిత్రిగా పేరుగాంచిన మెకంజీ స్కాట్‌.. 2019లో తన పాతికేళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ నుంచి విడాకులు తీసుకుంది. దీంతో భరణం కింద అమెజాన్‌ సంస్థలో స్కాట్‌కు నాలుగు శాతం వాటాలు లభించాయి. విడాకుల సమయంలోనే తన సంపదలో అత్యధిక భాగాన్ని వితరణకు వెచ్చించేందుకు వీలుగా రూపొందించిన వీలునామాపై సంతకం కూడా చేసింది మెకంజీ. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో అమెజాన్‌ షేర్ల ధర భారీగా పెరగడంతో ఆమె సంపద కూడా మూడింతలు పెరిగి 60.7 బిలియన్లకు చేరుకుంది. ఇక కరోనా ప్రతికూల పరిస్థితుల్లో నష్టపోయిన అమెరికన్‌ మహిళల్ని ఆదుకునేందుకు ముందుకొచ్చిన మెకంజీ.. ఫుడ్‌ బ్యాంకులు, ఎమర్జెన్సీ రిలీఫ్‌ ఫండ్స్‌కు భారీ విరాళాలు అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇక ఈ ఏడాది డాన్‌ జెవెట్‌ అనే స్కూల్‌ టీచర్‌ని మళ్లీ పెళ్లి చేసుకున్న మెకంజీ.. అవసరార్థుల్ని ఆదుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధమే అంటారు. ప్రస్తుతం 61.8 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపదతో తాజా ఫోర్బ్స్‌ లిస్టులో 19వ స్థానాన్ని ఆక్రమించారీ సూపర్‌ ఉమన్.


జూలియా కోచ్

Photo: Instagram

కోచ్‌ ఇండస్ట్రీస్‌ అనేది అమెరికన్‌ రసాయన తయారీ సంస్థ. దీన్ని నడిపించిన డేవిడ్‌ కోచ్‌ 2019లో మరణించిన తర్వాత ఆ సంస్థలోని 42 శాతం వాటాలు ఆయన భార్య జూలియా కోచ్‌, తన ముగ్గురు పిల్లలకు వారసత్వంగా సంక్రమించాయి. ఫ్యాషన్‌ రంగంపై తనకున్న మక్కువతో 1980ల్లో ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసిన జూలియా.. అమెరికన్‌ ప్రథమ మహిళ (1981-1989) నాన్సీ రీగన్‌ వంటి ప్రముఖులకు విభిన్న దుస్తులు రూపొందించి అందించింది. ఆ తర్వాత డేవిడ్‌ను కలుసుకొని.. అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కేవలం ఫ్యాషన్‌ రంగంలోనే కాదు.. సేవలోనూ ముందుంటుంది జూలియా. గతంలో తన భర్తతో కలిసి.. మౌంట్‌ సినాయ్‌ మెడికల్‌ సెంటర్‌, స్టాన్‌ఫోర్డ్‌ చిల్డ్రన్స్‌ హాస్పిటల్‌కు.. ఫుడ్‌ అలర్జీలపై పరిశోధన చేసేందుకు తలా 10 మిలియన్‌ యూఎస్‌ డాలర్ల చొప్పున విరాళంగా అందించిందామె. ప్రస్తుతం 46.3 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల ఆస్తితో ఫోర్బ్స్‌ జాబితాలో 28 వ స్థానం దక్కించుకుంది జూలియా.


మిరియం అడల్సన్

ఇజ్రాయిలీ ఫిజీషియన్‌గా పేరుపొందిన మిరియం.. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లాస్‌ వేగాస్‌ సాండ్స్‌లోని క్యాసినో కంపెనీ సీఈవో/ఛైర్మన్‌ షెల్డన్‌ అడల్సన్‌ను 1991లో వివాహం చేసుకుంది. ఈ ఏడాది భర్త మరణించాక ఆయన కంపెనీలో సగానికి పైగా వాటాలు (సుమారు 48 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపద) ఆమెకు దక్కాయి. వృత్తిరీత్యా డాక్టర్‌ అయిన ఆమె.. ప్రస్తుతం రీహ్యాబిలిటేషన్‌పై దృష్టి పెట్టారు. మత్తు పదార్థాలకు బానిసైన వారికి చికిత్స అందించడం కోసం ఈ దంపతులిద్దరూ లాస్‌ వేగాస్‌లో ‘షెల్డన్‌ జి. అడెల్సన్‌ రీసెర్చ్‌ క్లినిక్‌’ని సైతం నెలకొల్పారు. ప్రస్తుతం 33 బిలియన్‌ యూఎస్‌ డాలర్ల సంపదతో ఫోర్బ్స్‌ జాబితాలో 43వ స్థానంలో కొనసాగుతున్నారు మిరియం.

వీరితో పాటు జాక్వెలిన్‌ మార్స్, యాంగ్‌ హుయాన్, సుసానే క్లాటెన్ తదితరులు ఆ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరిన్ని

నారీ... వ్యాయామ దారి!

ఇంట్లో పనే ఎక్సర్‌సైజు... ఒక గృహిణి అభిప్రాయం. ఆఫీసుకెళ్లొచ్చే సరికే టైం అయిపోతుంది. మళ్లీ జిమ్‌కు వెళ్లే తీరిక ఎక్కడిది? ఒక ఉద్యోగిని ఆవేదన. జిమ్‌ కెళ్లినా అక్కడ మగవాళ్లతో పాటు చేయలేం... ఇదో యువతి సమస్య... ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన ఉంటే మార్గాలు బోలెడు ఉన్నాయంటున్నారు...జీరోసైజ్‌ లేదా సన్నగా, నాజూగ్గా ఉండాల్సిన అవసరం సినీతారలు, మోడల్స్‌కు మాత్రమే. మేమెందుకు నోరు కట్టేసుకోవాలి, కసరత్తులంటూ చెమటోడ్చాలి అనే భావన చాలా మంది మహిళల్లో ఉండేది. గృహిణులకు ఇంటిపనే సరిపోతుందిలే’ అనే అపోహ ఉండేది. ఇప్పుడు మహిళలకూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగటంతో జీవనశైలిలో మార్పులు వచ్చాయి.

తరువాయి

చదువుల రాణి.. పసిడి కొల్లగొట్టింది..!

సాధారణంగా చదువులో ముందున్న వారు ఆటల్లో వెనకబడతారు.. అదే ఆటల్లో ముందున్న వారు చదువులో రాణించరు.. అంటుంటారు. కానీ చదువులో, ఆటల్లో.. రెండింట్లోనూ సత్తా చాటే వారు చాలా అరుదుగానే ఉంటారు. ఆస్ట్రియా సైక్లిస్ట్‌ అన్నా కిసెనోఫర్‌ కూడా అలాంటి మహిళే! వృత్తిరీత్యా గణిత విద్యావేత్త అయిన ఆమె.. అండర్‌ డాగ్‌గా టోక్యో ఒలింపిక్స్‌ బరిలోకి దిగింది. అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఫైనల్‌ ఫేవరెట్‌ను చిత్తు చేసి పసిడి పతకాన్ని కొల్లగొట్టింది. ఫలితంగా 125 ఏళ్లలో సైక్లింగ్‌ విభాగంలో ఒలింపిక్స్‌ పతకం గెలుచుకున్న తొలి ఆస్ట్రియా అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె పేరు ప్రపంచమంతా మార్మోగిపోతోంది.

తరువాయి

సైకిల్‌ తొక్కితే రాళ్లు విసిరారు.. చంపేస్తామన్నారు!

అఫ్గానిస్థాన్‌కు చెందిన ఆమె చిన్నతనంలోనే సైకిల్‌ నేర్చుకుంది. అందులోనే జీవితాన్ని వెతుక్కోవాలనుకుంది. కానీ అక్కడి తాలిబన్లు, మత ఛాందసవాదులు ‘ఆడపిల్లలు సైకిల్‌ తొక్కడమేంటి?’ అంటూ ఆమె ఆశయానికి అడ్డుపడ్డారు. ధైర్యం చేసి సైకిల్‌తో రోడ్డుపై కొస్తే రాళ్లు విసిరారు. చంపేస్తామని బెదిరించారు. అందుకే ఉన్న వూరును విడిచిపెట్టి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఫ్రాన్స్‌కు వలస వెళ్లిపోయింది. అక్కడే తన సైక్లింగ్‌ లక్ష్యానికి మెరుగులు దిద్దుకుంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో శరణార్థుల జట్టు తరఫున పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమే 24 ఏళ్ల మసోమా అలీ జాదా.

తరువాయి

సృజనాత్మక పరిష్కారానికి అరుదైన పురస్కారం!

యూరోపియన్‌ ఇన్వెంటర్‌ అవార్డ్‌.. వివిధ రంగాల్లో ఆవిష్కరణలు చేసి ఓ సరికొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన వారికి ఏటా అందించే ప్రతిష్ఠాత్మక పురస్కారమిది! ఐరోపాతో పాటు ఇతర దేశాల వారు చేసిన అద్భుత ఆవిష్కరణల్ని గుర్తించి.. వాటి సృష్టికర్తలకు బహూకరించే ఈ పురస్కారం ఈసారి భారత సంతతికి చెందిన రసాయన శాస్త్రవేత్త సుమితా మిత్రాను వరించింది. ‘నాన్‌ యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ కంట్రీస్‌’ విభాగం కింద యూరోపియన్‌ పేటెంట్‌ ఆఫీస్‌ (EPO) ఆమెకు ఇటీవలే ఈ అవార్డు అందించింది. దంత వైద్యంలో భాగంగా ఆమె చేసిన ఓ అసాధారణ ఆవిష్కరణతో ఎంతోమంది దంత సమస్యలకు పరిష్కారం దొరికినట్లయింది. ఈ నేపథ్యంలోనే ఈ అరుదైన అవార్డు అందుకున్న సందర్భంగా ఈ ఇండో-అమెరికన్‌ గురించి కొన్ని విశేషాలు మీకోసం..

తరువాయి

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని