మాది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్’ కాదు..! - yami gautam shares her love story with aditya dhar
close
Updated : 21/07/2021 17:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మాది ‘లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్’ కాదు..!

Photo: Instagram

కెరీర్‌ పరంగా వారిద్దరి దారులు ఒకటే. అందుకే మనుషులు కలిసినంత తొందరగా మనసులు కూడా కలిశాయి... ఏళ్ల పాటు స్నేహం చేశారు... ప్రేమించుకున్నారు... ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నారు. ప్రేమలో పూర్తిగా మునిగినా మూడో కంటికి తమ బంధం గురించి తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అంతే రహస్యంగా తమ ప్రేమ బంధాన్ని శాశ్వత బంధంగా మార్చుకున్నారు. ఆ క్యూట్‌ కపుల్‌ మరెవరో కాదు... కొన్ని రోజుల క్రితం సీక్రెట్‌గా ఏడడుగులు నడిచిన అందాల భామ యామీ గౌతమ్‌ - ప్రముఖ దర్శకుడు ఆదిత్యధర్.

సోషల్‌ మీడియాలో వీరి పెళ్లి ఫొటోలను చూసినప్పుడు మొదట అందరూ ఆశ్చర్యపోయారు. వీరిది ‘ప్రేమ వివాహమా?’ ‘పెద్దలు కుదిర్చిన వివాహమా?’ అని చాలామంది మనసుల్లో ఎన్నో ప్రశ్నలు తలెత్తాయి. తాజాగా వాటన్నింటికీ సమాధానాలిచ్చింది యామీ. తమ ప్రేమ-పెళ్లి గురించి బోలెడన్ని కబుర్లు పంచుకుంది. మరి, ఈ మేడ్‌ ఫర్ ఈచ్‌ అదర్‌ ప్రేమ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి.

ఆ సినిమాయే మా ఇద్దరినీ కలిపింది!

‘ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌’... 2019లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల ప్రశంసలతో పాటు పురస్కారాలు అందుకుంది. ఆదిత్యధర్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో అండర్‌ కవర్‌ ‘రా’ ఏజెంట్‌గా ఓ కీలక పాత్రలో నటించింది యామీ. ఈ చిత్రంలో తన అభినయంతో యామీ పలువురి ప్రశంసలు అందుకుంటే...తన డైరెక్షన్‌ ప్రతిభతో ఏకంగా జాతీయ ఉత్తమ దర్శకుడి పురస్కారం గెల్చుకున్నాడు ఆదిత్య. అలా తమ ఇద్దరి జీవితాల్లో మరపురాని చిత్రంగా మిగిలిపోయిన ‘ఉరి’ సినిమా ప్రమోషన్‌ సమయంలోనే యామీ, ఆదిత్య ప్రేమలో పడ్డారట.

‘మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌ కాదు. డేటింగ్‌ అని కూడా చెప్పను. ఎందుకంటే మాది స్నేహం అనే పునాదులపై పుట్టిన ప్రేమ. ‘ఉరి’ సినిమా షూటింగ్‌లో మేం పెద్దగా మాట్లాడుకోలేదు. అయితే షూటింగ్‌ పూర్తయ్యాక సినిమా ప్రమోషన్‌ కోసం నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో మేం పాల్గొన్నాం. అప్పుడే మా మధ్య మాటల ప్రవాహం పెరిగింది. మంచి స్నేహితులుగా మారిపోయాం. ఒకరి గురించి ఒకరు పూర్తిగా తెలుసుకున్నాకే మా బంధాన్ని ముందుకు తీసుకెళ్లాం. మేం సుమారు రెండేళ్లకు పైగానే ప్రేమలో ఉన్నాం. అయితే కొన్ని వ్యక్తిగత కారణాలతో మా ప్రేమబంధాన్ని రహస్యంగా ఉంచాలనుకున్నాం. మా స్నేహితుల్లో కొందరికి నా ప్రేమ విషయం తెలిసినా వారు నా ప్రైవసీని అర్థం చేసుకున్నారు. అందుకు వారందరికీ థ్యాంక్స్’.

లాక్‌డౌన్‌కు రెండు గంటల ముందు..

‘ఇక పెళ్లి ప్రణాళికల్లో భాగంగా నేను, ఆదిత్య ముందుగానే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గానే పెళ్లిపీటలెక్కాలనుకున్నాం. ఈ క్రమంలో చండీగఢ్‌లో పూర్తి లాక్‌డౌన్‌ విధించడానికి రెండు గంటల ముందే వెడ్డింగ్‌ షాపింగ్‌కు వెళ్లాం. ఇక నా పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లన్నీ సురిలీ గౌతమ్ (యామీ సోదరి) దగ్గరుండి చూసుకుంది. వేడుకలో అమ్మ చీర కట్టుకోవడం, అమ్మమ్మ ముక్కుపుడక పెట్టుకోవడం, సొంతంగా మేకప్‌...ఈ నిర్ణయాలన్నీ తను తీసుకున్నవే’.

వారంతా ఆశ్చర్యపోయారు!

‘ముందుగా అనుకున్నట్లుగానే మేం ఎలాంటి హడావిడి లేకుండా పెళ్లిపీటలెక్కాం. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, పరిమిత సంఖ్యలో సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. మీడియాకు కూడా సమాచారం అందించలేదు. పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో షేర్‌ అయిన మా పెళ్లి ఫొటోలు చూసి చాలామంది జర్నలిస్టులు, మీడియా మిత్రులు ‘మేం నమ్మలేకపోతున్నాం’ అంటూ మెసేజ్‌లు పంపారు.’

‘ఇక పెళ్లి తర్వాత కూడా మేం ఎక్కడికీ వెళ్లలేదు. నాలాగే మావారు కూడా బయటకు వెళ్లడానికి పెద్దగా ఇష్టపడరు. ప్రస్తుతం ఆయన తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా తిరుగుతున్నారు. నేను కూడా ‘భూత్‌ పోలీస్‌’ సినిమా షూటింగ్‌లో తీరిక లేకుండా గడుపుతున్నాను. అయితే వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా ఇద్దరమూ కలిసే భోజనం చేస్తున్నాం. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూస్తున్నాం. అయితే మా బంధాన్ని మరింత బలంగా మార్చుకునేందుకు మేం మరింత సమయం కేటాయించుకోవాలనుకుంటున్నాం. అందుకే త్వరలో మా బిజీ షెడ్యూల్‌ నుంచి కాస్త బ్రేక్‌ తీసుకోవాలనుకుంటున్నాం’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.


మరిన్ని

దాని గురించి పుట్టిన వెంటనే తెలిసిపోతుందట!

తల్లిపాలు అందుతున్న పాపనో.. బాబునో.. అమ్మకు దగ్గరగా తీసుకువెళ్లండి.. వారంతట వారే తల్లి స్తన్యాన్ని అందుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. రొమ్ముని అందుకొని తాగేంతవరకు తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తుంటారు. అయితే ఈ లక్షణం చిన్నారుల్లో ఎప్పుడు మొదలవుతుందో తెలుసా? అమ్మపేగు తెంచుకొన్న మరుక్షణమే తల్లిపాల కోసం ఆరాటపడుతుంటారు. ఇంకా వూహ సైతం తెలియని వారు తమ తల్లిని గుర్తుపట్టడం మాత్రమే కాదు.. పాలు ఎక్కడ నుంచి వస్తాయో కూడా తెలుసుకొంటారు. మరి దీనికి కారణం ఏమిటి? చిన్నారులు ఇలా చేయడం మంచిదేనా? అది వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందా? వంటి విషయాలు తెలుసుకొందాం రండి..

ఆరోగ్యమస్తు

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని