పదకొండేళ్లకే ...
- పార్వతి బైరామ్జీ
గుర్రాలు ఎంత దూకుడుగా ఉంటాయో చెప్పక్కర్లేదు. ఇక, పోటీల్లో పాల్గొనేవైతే... మరింత పొగరుగా ఉంటాయి. అలాంటివాటిని కట్టడి చేయడమే కాదు... పోటీల్లో గెలుపొందేలా శిక్షణ ఇస్తున్నారు ఈ మహిళలు. వాళ్లే పార్వతి బైరామ్జీ, నజక్ షెనాయ్. తమ అనుభవాలను వసుంధరతో చెప్పుకొచ్చారిలా...

తండ్రి గుర్రపుస్వారీలో శిక్షణా తరగతులు నిర్వహించడం పార్వతిని ఆకట్టుకుంది. అలా పదకొండేళ్లకే గుర్రపుస్వారీ మొదలుపెట్టి... ఇప్పుడు వాటికి శిక్షణ ఇచ్చే స్థాయికి చేరుకుంది 39 ఏళ్ల పార్వతి. రేసులకు అనుగుణంగా గుర్రాలకు శిక్షణ ఇవ్వడంలో దక్షిణభారతంలో ఆమే తొలి శిక్షకురాలు. ‘ముంబయిలో ఉన్నప్పుడు నాన్న గుర్రపు స్వారీలో శిక్షణా తరగతులు నిర్వహించేవారు. నేనూ ఆయనతోపాటు వెళ్లేదాన్ని. ఆ వాతావరణం నాకు నచ్చేది. ఓసారి దగ్గరుండి గుర్రపుస్వారీ చేయించారు. నా వేగం చూసి, ఇతర మెలకువలు నేర్పారు. అలా గుర్రాలతో నా అనుబంధం పెరిగింది. ఓ వైపు చదువుకుంటూనే ముంబయి హార్స్ క్లబ్లో సభ్యత్వం తీసుకున్నా. అక్కడే ప్రముఖ జాకీ పెసీఫ్రాష్ నుంచి సర్డిక్సన్ అనే గుర్రాన్ని కానుకగా అందుకున్నా. దానిమీదే సాధన చేసేదాన్ని. డిగ్రీ తరువాత మైక్రోబయాలజీలో పీజీ పూర్తిచేశా. ఆ తరువాత నుంచి గుర్రాలే నా ప్రపంచం. రేసు గుర్రాలకు శిక్షణ అందించేవారిలో ఒకరైన రషీద్ ఆర్.బైరామ్జీ కుమారుడు డేరియస్‌తో పెళ్లవడంతో బెంగళూరు వచ్చేశా. అదే నా జీవితాన్ని మలుపు తిప్పింది. ఇక్కడ ఔత్సాహికులకు గుర్రపుస్వారీ నేర్పించేదాన్ని. అక్కడితో ఆగకుండా రేసు గుర్రాలకు శిక్షణ ఇవ్వడానికి సిద్ధమయ్యా. దీనికి ప్రత్యేక లైసెన్సు ఉండాలి. మూడేళ్లక్రితం అసిస్టెంట్ ట్రైనర్ పరీక్షకు హాజరై ఆ అర్హతా సాధించా. ట్రైనర్‌గా మరో పరీక్ష రాసి పూర్తిస్థాయిలో అనుమతి పొందా. దీంతోపాటు పోలో క్రీడాకారిణిగానూ గుర్తింపు పొందా. పోలో పోటీల్లో విజేతగా నిలిచిన సందర్భాలూ ఉన్నాయి.
మాట వినేలా చేసుకోవాలి... కొత్తగా మైదానంలోకి వచ్చిన గుర్రానికి శిక్షణ ఇవ్వాలంటే ముందుగా మనం దాన్ని ప్రేమించాలి. నాన్న చెప్పిన పాఠం అది. దాని కళ్లలోకి ప్రశాంతంగా చూస్తే ఎటువంటి గుర్రమైనా మనతో స్నేహం చేస్తుంది. శిక్షణలో మాట వింటుంది. కొన్ని చాలా చురుకుగా, పొగరుగా ఉంటాయి. వాటిని ముందు మచ్చిక చేసుకుంటా. మైదానంలో నేను అడుగుపెట్టి, మాట్లాడితే చాలు అవి అప్రమత్తం అయిపోతాయి. కదలికల్ని బట్టి వాటి అనారోగ్యాన్నీ అంచనా వేస్తుంటా. ఈ రెండేళ్లలో వందకుపైగా గుర్రాలకు శిక్షణ ఇచ్ఛా ప్రస్తుతం రోజుకి 25 గుర్రాలను రేసులకు అనుగుణంగా తయారుచేస్తున్నా...’.
|