మాయ చేశాడు
బెంగళూరుతో రాజస్థాన్ మ్యాచ్.. వర్షం పడడంతో మ్యాచ్‌ను ఐదు ఓవర్లకు కుదించారు. మొదట బెంగళూరు బ్యాటింగ్‌కు దిగింది. 9 బంతుల్లోనే ఆర్సీబీ 35 పరుగులు చేసింది. స్కోరు 5 ఓవర్లకే 100 చేరుతుందేమో అనిపిస్తోంది. ఆ స్థితిలో అప్పటికే ఓవర్లో మూడు బంతులు వేసిన ఆ కుర్రాడు అద్భుతం చేశాడు. వరుసగా కోహ్లి, డివిలియర్స్, స్టాయినిస్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఈ సంచలన ప్రదర్శన చేసిన ఆటగాడు శ్రేయస్ గోపాల్. తీవ్ర ఒత్తిడి ఉన్న మ్యాచ్‌లో ఇలా ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ను వరుస బంతుల్లో ఔట్ చేయడం మామూలు విషయం కాదు. గోపాల్ ప్రతిభ ఎలాంటిదో చెప్పడానికి ఈ ప్రదర్శన చాలు. ఆ మ్యాచ్ ఒక్కటనే కాదు.. చాలా మ్యాచ్‌ల్లో మెరిశాడతను. 25 ఏళ్ల ఈ కుర్రాడు 14 మ్యాచ్‌ల్లో 20 వికెట్లతో ఈ సీజన్ అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో బౌలింగ్ చేస్తూ పవర్‌ప్లేలో బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేయడం.. మధ్య ఓవర్లలో పరుగుల ప్రవాహాన్ని ఆపడంలో అతను కీలక పాత్ర పోషించాడు. గోపాల్ ఉపయుక్తమైన లోయరార్డర్ బ్యాట్స్‌మన్ కూడా.
|
ఆ జట్టులో అతడి మెరుపులు
ఈ ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రదర్శన పేలవమే కానీ.. ఆ జట్టులో ఒక యువ బౌలర్ మాత్రం చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అతనే నవ్‌దీప్ సైని. 26 ఏళ్ల ఈ దిల్లీ బౌలర్ ఇప్పటికే దేశవాళీ క్రికెట్లో మెరుపులు మెరిపించాడు. 2017-18 రంజీ సీజన్లో 34 వికెట్లు పడగొట్టి సత్తా చాటుకున్నాడు. ఈ ప్రదర్శనతో ఐపీఎల్లో అవకాశం దక్కించుకున్న సైని.. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 11 వికెట్లు పడగొట్టాడు. సహచర బౌలర్ల నుంచి సరైన సహకారం ఉంటే సైని ఇంకా మెరుగైన ప్రదర్శన చేసేవాడే. ఆర్సీబీ వైఫల్యం వల్ల సైని ప్రతిభ గురించి పెద్ద చర్చ జరగలేదు కానీ.. ప్రతి మ్యాచ్‌లోనూ బౌలింగ్ మెరుపులతో ఆకట్టుకున్నాడు. నిలకడగా 140 కి.మీ.కి పైగా వేగంతో సాగే సైని బౌలింగ్‌లో కచ్చితత్వమూ ఉంది. భారత జట్టులో ప్రస్తుతం ఫాస్ట్‌బౌలింగ్ వనరులు బాగా అందుబాటులో ఉండటం వల్ల సైనికి ఇంకా అవకాశం దక్కలేదు కానీ.. త్వరలోనే అతను టీమ్ఇండియాకు ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
|
బహు‘పరాగ్’
అమ్మ జాతీయ స్థాయి స్విమ్మర్.. నాన్న మాజీ క్రికెటర్.. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఆ కుర్రాడు కూడా ఆట వైపు అడుగులు వేశాడు. క్రికెట్‌పై మనసు పారేసుకున్నాడు. పద్నాలుగేళ్ల వయసులోనే రాష్ట్ర స్థాయి సీనియర్ జట్టుకు ఎంపికై సత్తాచాటాడు. 17 ఏళ్ల వయసులో ఐపీఎల్లో అర్ధశతకం చేసి ఆ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్. ఐపీఎల్ అరంగేట్రంలోనే అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడీ కుర్రాడు. కొన్ని మ్యాచ్‌ల్లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గొప్ప పట్టుదలతో పోరాడి పరుగులు రాబట్టిన ఈ అసోం కుర్రాడు.. బౌలింగ్‌లోనూ జట్టుకు ఉపయోగపడ్డాడు. ఇంత చిన్న వయసులోనే బుమ్రా, మలింగ లాంటి ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను తడబాటు లేకుండా ఎదుర్కోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో జట్టంతా పెవిలియన్ బాట పట్టినా కూడా.. గొప్ప పట్టుదలతో క్రీజులో నిలిచి అతను అర్ధసెంచరీ సాధించిన తీరు ప్రశంసలందుకుంది. ఈ సీజన్లో అతను ఐదు ఇన్నింగ్స్‌ల్లో 126.98 స్ట్రైక్‌రేట్‌తో 160 పరుగులు చేశాడు. తన లెగ్‌స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందులకు గురి చేశాడు. టీమ్ఇండియాకు ఆడడమే తన అంతిమ లక్ష్యమని చెబుతున్న పరాగ్.. ఇదే జోరు కొనసాగిస్తే త్వరలోనే జాతీయ జట్టులో కనిపించే అవకాశం ఉంది.
|
పేసర్ కాదు..స్పిన్నర్
అన్నను స్ఫూర్తిగా తీసుకొని పేసర్ అవుదామనుకున్న ఆ ఆటగాడు.. పెదనాన్న సూచనతో స్పిన్నర్ అవతారమెత్తాడు. బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరపున సత్తాచాటుతున్న లెగ్‌స్పిన్నర్ రాహుల్ చాహర్ గురించే ఈ ఉపోద్ఘాతమంతా! 2017 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ జట్టుతో ఐపీఎల్ అరంగేట్రం చేసిన రాహుల్‌ను ఆ తర్వాత ఏడాది వేలంలో ముంబయి రూ.1.9 కోట్లకు దక్కించుకుంది. అతడికి అంత రేటా అని ఆశ్చర్యపోయిన వాళ్లు.. ఈ సీజన్లో ప్రదర్శన చూసి ముంబయి చాలా తక్కువ రేటుతో మంచి ఆటగాడిని పట్టేసిందే అభిప్రాయానికి వస్తున్నారు. రాజస్థాన్‌కు చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లాడి 6.83 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. క్వాలిఫయర్-1లో చెన్నైని దాని సొంతగడ్డపై రాహుల్ ఎలా తిప్పలు పెట్టాడో తెలిసిందే. 2018-19 సీజన్ విజయ్ హజారె ట్రోఫీలో 9 మ్యాచ్‌ల్లో 20 వికెట్లు పడగొట్టిన రాహుల్.. రాజస్థాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నిలిచాడు. వికెట్లు తీయడంలో, పరుగులు కట్టడి చేయడంలో అతను నేర్పరి. తన బౌలింగ్ మెరుగవడానికి దక్షిణాఫ్రికా స్పిన్నర్ తాహిర్ సూచనలు తోడ్పాడ్డాయని చెబుతున్న రాహుల్.. భారత జాతీయ జట్టులో చోటు సంపాదించడమే తన లక్ష్యమంటున్నాడు.
|
అదే జోరు
గత ఏడాది అండర్-19 ప్రపంచకప్‌లో తన మెరుపులతో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా నిలిచి జట్టుకు ట్రోఫీ అందించాడు.. టీమ్ఇండియా తరపున వన్డేల్లో అరంగేట్రం చేశాడు.. ఐపీఎల్లో సొగసైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.. అతనే కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్. ప్రస్తుత సీజన్లో ఆరంభ మ్యాచ్‌ల్లో అంతగా ఆకట్టుకోలేకపోయిన గిల్.. రెండో అర్ధభాగంలో ఓపెనర్‌గా వచ్చి వరుసగా అర్ధశతకాలు నమోదు చేశాడు. బంతిని బలంగా బాదే పొట్టి క్రికెట్లో.. బలానికి సొగసును జతచేసి చూడముచ్చటైన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. 19 ఏళ్ల ఈ పంజాబ్ క్రికెటర్ ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 296 పరుగులు చేశాడు. కోల్‌కతా చివరి మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శన చేసిన అతను తనలో సత్తాను మరోసారి చాటాడు. ఇప్పటికే తన ప్రతిభతో క్రికెట్ దిగ్గజాలను ఆకట్టుకున్న గిల్ సీనియర్ జట్టులో స్థానానికి గట్టి పోటీ ఇస్తున్నాడు. జోరు కొనసాగిస్తే మరోసారి టీమ్ఇండియాకు ఎంపికయ్యే అవకాశం ఉంది. టాప్ఆర్డర్లో కీలక ఆటగాడిగా ఎదిగే లక్షణాలు శుభ్‌మన్‌లో కనిపిస్తున్నాయ్!
|