రోడ్లు తుడిచినవాడే..

ఇరాన్ గోల్‌కీపర్ అలీజెరాది అందరికంటే దయనీయమైన గాథ. చిన్నప్పుడే కుటుంబానికి దూరం కావడంతో అతను ఆకలితో అలమటించాడు. రోడ్ల మీద నిద్రపోయేవాడు. కార్లు తుడుస్తూ.. వీధులు శుభ్రం చేస్తూ ఆ వచ్చిన డబ్బులతో పొట్టపోసుకునేవాడు. ఫుట్‌బాల్ మీద ఎంతో ప్రేమతో అతను స్థానిక జట్లతో కలిసి ఆడేవాడు. ఆ ఫుట్‌బాల్ క్లబ్ తలుపు దగ్గరే పడుకునేవాడు. చాలామంది అతణ్ని అడుక్కునేవాడు అనుకుని డబ్బులు వేసి వెళ్లేవాళ్లు. ఆ తర్వాత పిజ్జా షాపులో పని చేసి ఆ వచ్చిన డబ్బులతో ఫుట్‌బాల్ కోసం ఖర్చు పెట్టేవాడు. అలీ అంకితభావం, ఆట పట్ల అతని ప్రేమను చూసిన నాఫ్తా ఎ టెహ్రాన్ క్లబ్ జట్టులో చోటిచ్చింది. అతని కెరీర్‌కు ఇదే మలుపు. ఆ క్లబ్ తరఫున సత్తా చాటిన అలీ.. ఇరాన్ అండర్-23 జట్టుకు ఎంపికయ్యాడు. 2015లో జాతీయ జట్టులోకి కూడా దూసుకొచ్చాడు. ప్రపంచకప్ ఆడుతూ తన కల నెరవేర్చుకున్న అలీ.. రొనాల్డో షాట్‌ను అడ్డుకుని హీరో అయ్యాడు.
సలామో.. సలామో

స్పెయిన్ జట్టు స్టార్ ఆటగాళ్లలో ఒకడైన ఇస్కో ప్రస్తుతం సలామో నామజపం చేస్తున్నాడు. దానికి కారణం అతని ప్రియురాలు పేరు సారా సలామో కావడమే. గత కొన్నేళ్లుగా వీళ్లు సహజీవనం చేస్తున్నారు. 26 ఏళ్ల సలామో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్టులతో తమ ప్రేమను వీళ్లిద్దరు బహిర్గతం చేశారు.
|