ఆరేళ్లకే హెన్రీతో ..
ఆరేళ్ల వయసులో.. ఫుట్‌బాల్ ఆడటం మొదలుపెట్టిన కొన్ని నెలలకే కిలియన్ ఎంబపె పేరు ఫ్రాన్స్‌లో మార్మోగింది. ఆ వయసుకే అతడి వేగం.. ఫుట్‌బాల్‌తో విన్యాసాలు చూసి అందరూ అబ్బుర పడ్డారు. ఫుట్‌బాల్ వండర్ కిడ్ అంటూ అతడి గురించి పత్రికల్లో, టీవీల్లో చూపించారు. ఫ్రాన్స్ ఫుట్‌బాల్ సమాఖ్య కూడా అతడి ప్రతిభను కొనియాడింది. థియెరీ హెన్రీ లాంటి మేటి ఆటగాడు కూడా కిలియన్తో ఫొటో దిగడాన్ని బట్టి అతడు అప్పటికే ఎంత పేరు తెచ్చుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఐతే చిన్నతనంలో ఇలా మెరిసి అలా మాయమైన వాళ్లు కోకొల్లలు. కానీ కిలియన్ ఆ కోవలోకి చేరలేదు. ఆటనే జీవితంగా మార్చుకున్నాడు. ఎదిగే వయసులో కలిగే ఆకర్షణలిన్నంటికీ దూరమయ్యాడు. ఎంత పేరొచ్చినా ఆటను నిర్లక్ష్యం చేయలేదు. గాడ్జెట్లకు దూరం, అమ్మాయిలకు దూరం.. ఆ మాటకొస్తే ఆట ముందు చదువు, కుటుంబం కూడా పక్కకే అంటే అతిశయోక్తి కాదు! కాబట్టే ఈ రోజు ప్రపంచ మేటి ఫుట్‌బాలర్లలో అతనొకడు!
24×7 అదే ద్యాస కిలియన్ ఎంబపె ఫ్రాన్స్ 1998 ప్రపంచకప్ గెలిచిన ఆరు నెలలకు పుట్టాడు. ఫుట్‌బాల్ కోచ్ అయిన తండ్రి విల్ఫ్రెడే అతడికి ఆటలో ఓనమాలు దిద్దాడు. ఒక స్థాయికి వచ్చే వరకు అతనే కిలియన్కు కోచ్‌గా ఉన్నాడు. చిన్నతనంలో దక్కిన ప్రచారంతో కొడుకు పక్కదోవ పట్టకుండా చూసుకున్నాడు విల్ఫ్రెడ్. కిలియన్కు కూడా తన కెరీర్ ఏంటో త్వరగా అర్థమైంది. అతడికి ఫుట్‌బాల్‌పై విపరీతమైన ఇష్టం ఏర్పడింది. ఇంట్లో, బయట ఎక్కడ చూసినా ఫుట్‌బాల్‌తోనే కనిపించేవాడు. ఆటలో పడి సరిగా పాఠశాలకు కూడా వెళ్లేవాడు కాదు. పగలంతా ఆడటం, రాత్రంతా ఫుట్‌బాల్ వీడియోలు చూడటం ఇదీ వరస! పన్నెండేళ్లకే క్లబ్ స్థాయిలో మ్యాచ్‌లు ఆడే స్థాయికి ఎదిగిపోయాడు. అర్హత వయసు 16 ఏళ్లకే ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ అయ్యాడు. ముందుగా అతను మొనాకో క్లబ్‌కు ఆడాడు. తర్వాత అతడిని పారిస్-సెయింట్ జర్మన్ క్లబ్ ఏకంగా 180 మిలియన్ యూరోల బదిలీ ఫీజులతో అతడిన రేటుకు సొంతం చేసుకుంది. వెచ్చించింది. నెయ్మార్ తర్వాత ప్రపంచ ఫుట్‌బాల్‌లో ఓ ఆటగాడి బదిలీకి దక్కిన అత్యధిక రేటు ఇది. ఇటు క్లబ్ ఫుట్‌బాల్‌లో సంచలనాలు రేపుతూనే.. అటు ఫ్రాన్స్ అండర్-17 జట్టులోనూ సభ్యుడడైన కిలియన్.. ఆ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పుడు సీనియర్ ప్రపంచకప్‌లోనూ అరంగేట్రంలోనే మెరుపులు మెరిపిస్తున్నాడు. ప్రిక్వార్టర్స్‌లో కొన్ని నిమిషాల వ్యవధిలో రెండు మెరుపు గోల్స్‌తో మెస్సి జట్టును ముంచేశాడతను. రొనాల్డో, మెస్సిల తర్వాతి తరం సూపర్ స్టార్ కిలియనే అంటున్నారు ఫుట్‌బాల్ పండితులు. ప్రతిభకు తోడు క్రమశిక్షణ వల్లే అతనీ స్థాయికి ఎదిగాడంటారు అతడి కోచ్‌లు. ఫ్రాన్స్ అండర్-17 ప్రపంచకప్ గెలిచినపుడు అతడి దగ్గర మొబైలే లేదట. తనంటే పడి చచ్చే అమ్మాయిలు ఎందరో ఉన్నా వాళ్ల జోలికి వెళ్లడు. ఎంబపె ఒకమ్మాయితో ప్రేమలో ఉన్నట్లు చెబుతారు కానీ.. దాన్ని కూడా బహిరంగపరచలేదు. వందల కోట్లు ఆర్జిస్తున్న తన కొడుక్కి విలాసవంతమైన విల్లాలో ఉండే అవకాశమున్నా.. సహచరులతో కలిసి శిక్షణ కేంద్రంలో సాధారణ వసతుల మధ్యే ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడతాడని అంటాడు అతడి తండ్రి విల్ఫ్రెడ్.
|
కామెరూన్ తండ్రి.. నైజీరియా తల్లి.. జైర్ సోదరుడు!
ఎంబపె కుటుంబం నాలుగు దేశాల సంగమం! ఎంబపె తండ్రి విల్ఫ్రెడ్ ఆఫ్రికా దేశం కామెరూన్ నుంచి ఫ్రాన్స్‌కు శరణార్థిగా వచ్చాడు. ఫ్రాన్స్ పౌరసత్యం కోసం ఇక్కడి అమ్మాయి అయిన ఫేజాను పెళ్లాడాడు. ఆమె కుటుంబం నైజీరియా నుంచి వచ్చి ఫ్రాన్స్‌లో స్థిరపడింది. ఫేజా హ్యాండ్‌బాల్ క్రీడాకారిణి కాగా.. విల్ఫ్రెడ్ ఫుట్‌బాల్ ఆడి కోచ్ అయ్యాడు. తన మిత్రుడి కొడుకు, ఫుట్‌బాలరే అయిన జైర్స్ ఎకోకోను విల్ఫ్రెడ్ దత్తత తీసుకున్నాడు. ఎకోకోది ఆఫ్రికా దేశమైన జైర్. ఇప్పుడు వీళ్లందరూ కలిసి ఫ్రాన్స్ పౌరులుగా కొనసాగుతున్నారు. ఎంబపెకు ఒక చిట్టి తమ్ముడున్నాడు. అతడి పేరు ఎథాన్. అతడంటే ఎంబపెకు అమితమైన ఇష్టం. వీళ్లిద్దరూ కలిసి మొబైల్ ఫుట్‌బాల్‌లో పోటీపడుతుంటారు. అందులో ఎక్కువసార్లు ఎథాన్ గెలుస్తాడట. అప్పుడు రెండు చేతుల్ని గుండెలపై ‘×’ ఆకారంలో మడత పెట్టి సంబరాలు చేసుకుంటాడట. ఇదే విన్యాసాన్ని కిలియన్ మైదానంలో ప్రదర్శిస్తుంటాడు. మొన్న అర్జెంటీనాపై రెండు గోల్స్ కొట్టినపుడూ అదే విన్యాసం చేశాడు.
|
కడుపేమో ఖాళీ.. మనసంతా ఫుట్‌బాల్!
అప్పటికి ఆ పిల్లాడికి ఆరేళ్లు. అతను పొద్దునపూట బ్రేక్‌ఫాస్ట్ చేయడు. చేయడనడం కంటే, ఇంట్లో తినడానికేమీ ఉండేది కాదు అనడం సబబేమో. ఆ పిల్లాడి భోజనం ఎప్పుడూ నేరుగా మధ్యాహ్నమే మొదలవుతుంది. అదీ గ్లాసుడు పాలు, ఓ బ్రెడ్ ముక్క మాత్రమే. ఓ రోజు స్కూలు నుంచి ఆ పిల్లాడు ఇంటికొచ్చే సమయానికి వాళ్లమ్మ పాల డబ్బా తీసి, అందులో ఏదో కలిపి అటూ ఇటూ బాగా కలియదిప్పి ఓ గ్లాసులో పోసి, బ్రెడ్ ముక్క చేతికిచ్చింది. ఫ్రిజ్‌లోంచి తీసిన ఆ డబ్బాలో పాలు పాతాళంలో ఉన్నాయనీ, ఆ కాసిన్ని పాలకే నీళ్లు కలిపి గ్లాసులో పోసి తనకిచ్చిందని ఆ పిల్లాడికి అర్థమైంది. ఆ బ్రెడ్డు కూడా కిరాణా దుకాణంలో అప్పు పెట్టి తెచ్చిందని తనకు తెలుసు. అందుకే నిశ్శబ్దంగా పాలు తాగేసి, బ్రెడ్ ముక్క తినేసి స్కూలుకెళ్లిపోయాడు. తన ఆకలి గురించి ఎప్పుడూ ఎవరిమీదా ఫిర్యాదు చేసేవాడు కాదు. ఇంతటి కటిక పేదరికంలోనూ, అనునిత్యం ఆకలి దహించి వేస్తున్నా, ఆ పిల్లాడు తనకిష్టమైన వ్యాపకం.. ఫుట్‌బాల్‌ను మాత్రం వదల్లేదు. ఎందుకంటే అది వంశపారంపర్యంగా తనకు సంక్రమించిన జన్యుక్రీడ. ఆ ఫుట్‌బాల్ ఆటే తనను, తన కుటుంబాన్ని కష్టాల కడలి నుంచి గట్టెక్కిస్తుందని ఆ పిల్లాడి గట్టి నమ్మకం. ఆ లేతప్రాయంలోనే అతడు అమ్మానాన్నలతో ఓ శపథం చేశాడు.. త్వరలోనే తాను ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా అయ్యితీరుతానని, భవిష్యత్తులో తనింట్లో ఎవరూ ఆకలితో పస్తులుండాల్సిన అవసరం లేకుండా చేస్తానని! ఇచ్చిన మాట ప్రకారం 16 ఏళ్ల వయసులోనే బెల్జియం జాతీయ ఫుట్‌బాల్ జట్టులో ప్రొఫెషనల్ ఆటగాడయ్యాడు. ఇక ఆ కుర్రాడు వెనుదిరిగి చూసింది లేదు. అతడే.. ప్రస్తుతం ప్రపంచంలోనే అతికొద్ది మంది అత్యుత్తమ స్ట్రైకర్లలో ఒకడిగా పేరొందిన బెల్జియం సాకర్ క్రీడాకారుడు.. రొమేలు లుకాకు!!
ప్రస్తుతం ప్రపంచ మేటి ఫుట్‌బాల్ జట్లలో ఒకటైన బెల్జియం ప్రస్తావన రాగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పేరు.. లుకాకు. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలో బెల్జియం తరపున అత్యధిక గోల్స్ (5) చేసినవాడు.. లుకాకునే. ప్రస్తుత టోర్నీ లీగ్ దశలోనే నాలుగు గోల్స్ చేసి బెల్జియం గ్రూప్ టాపర్‌గా నిలవడంలో అతనే కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రపంచకప్ ‘గోల్డెన్ బూట్’ రేసులో అతనున్నాడు. ఒకప్పుడు తనకిష్టమైన ఫ్రెంచ్ మేటి సాకర్ ఆటగాడు థియరీ హెన్రీ ఆట చూడడానికి కనీసం ఇంట్లో టీవీ కూడా లేక నానా తంటాలు పడ్డవాడు, నేడు బెల్జియం జట్టుకు సహాయ కోచ్‌గా వచ్చిన హెన్రీ సలహాలతో ప్రపంచకప్‌లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ‘‘లుకాకు మేధావి ప్రతి మ్యాచ్ ఫైనల్ అన్నట్టే ఆడతాడు. తనకు శారీర దారుఢ్యమే కాదు, మానసిక స్థైర్యం, తెలివితేటలు కూడా ఎక్కువే. మిడ్‌ఫీల్డ్‌లో చిరుతలా కదులుతాడు. బంతిపై అపారమైన పట్టు ఉంటుంది. నిరంతరం పది జతల కళ్లతో పరిస్థితులను అంచనా వేస్తున్నట్లుంటాడు. ఇంకొంచెం కృషి చేస్తే ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ స్ట్రైకర్ కాగల శక్తి ఒక్క లుకాకుకే ఉంది’’.. ఇదీ హెన్రీ లుకాకుకిచ్చిన కితాబు.
ఇద్దరికీ అవే బూట్లు! 16 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారి, కావాల్సినంత డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన లుకాకు.. తనకిష్టమైన బెల్జియం సాకర్ జట్టు రంగులైన ఎరుపు-నలుపుల కలయికతో రోల్స్ రాయిస్ కారును తయారు చేయించుకోగలిగేంత స్థాయికి ఎదిగాడు. కానీ ఒకప్పుడు ఇంట్లో తినడానికి సరైన తిండి ఉండేది కాదు. రెండు మూడు వారాలు ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. కనీసం తనకిష్టమైన ఫుట్‌బాల్ క్రీడను చూద్దామంటే టీవీ కరవే. తోటి పిల్లలు కోరింది తింటూ సరదాగా గడుపుతుంటే ఒంటరిగా స్కూలు గ్రౌండ్లో ఫుట్‌బాల్ ప్రాక్టీస్ చేసేవాడు. లుకాకు ఇంట్లో ఒకే జత బూట్లు ఉండేవి. నాన్నకు అవే. కొడుక్కీ అవే. ఆ బూట్లకు చిరుగులు పడినా వాటితోనే ప్రాక్టీస్ చేసేవాడు. స్వతహాగా చిన్నతనం నుంచే ఒడ్డూ పొడుగూ ఎక్కువగా ఉండడం వల్ల స్కూల్లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లకు ఎంపిక జరిగే ప్రతిసారి ‘నీ వయసు కరెక్టేనా? ఎప్పుడు పుట్టావు? ఐడీ చూపించు?’ లాంటి మాటల తూటాల్ని ఎదుర్కొంటూ ఉండేవాడు. ఎన్ని ప్రతికూలతలెదురైనా ఏనాడూ కుంగిపోలేదు. ఆటలో ఎదిగాడు. పదహారేళ్లు నిండిన ఆరు రోజులకే బెల్జియం జాతీయ జట్టులో చేరమని పిలుపొచ్చింది. ఇక ఆ తర్వాత లుకాకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాడు. 25 ఏళ్ల వయసుకే ప్రీమియర్ లీగుల్లో 100 గోల్స్ కొట్టిన ఐదో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఆ తర్వాత అనేక సాకర్ క్లబ్బులు లుకాకు ఇంటిముందు వరుస కట్టాయి. చెల్సీ, ఎవర్టన్, మాంచెస్టర్ యునైటెడ్ ఇలా అనేక ప్రసిద్ధ క్లబ్బులకు లుకాకు ప్రాతినిధ్యం వహించాడు. నాలుగేళ్ల కిందటే బెల్జియం తరఫున తొలిసారి ప్రపంచకప్ ఆడిన లుకాకు.. ఈసారి టోర్నీలో చెలరేగిపోతున్నాడు.
|

పన్నెండేళ్ల వయసులో మా తాతయ్య ఓసారి ఫోన్ చేసి.. ‘మీ అమ్మ అనేక కష్టాలకోర్చి ఈ ఇంటిని ఇక్కడిదాకా లాక్కొచ్చింది. ఇక ఆమెను, కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే’ అన్నాడు. ఆ రోజే బాధ్యత స్వీకరించాను. ఇప్పుడు కుటుంబంలో అందరినీ సంతోషంగా చూసుకుంటున్నా. నేను 16 ఏళ్లకే బెల్జియం అండర్-19 జట్టుకు సెలెక్టయ్యా. అప్పటికింకా బెంచికే పరిమితమైన రోజులవి. చాలా చికాకుగా ఉండేది. ఓ రోజు కోచ్‌తో ఓ పందెం కాశా. నన్ను గనక జట్టులో ఆడిస్తే ఈ సీజన్ ముగిసేలోపు, అంటే డిసెంబర్ లోగా 25 గోల్స్ కొట్టి తీరుతానని. ఒకవేళ అన్ని గోల్స్ కొట్టకపోతే శాశ్వతంగా బెంచికే పరిమితమవుతానన్నా. నేను 25 గోల్స్ కొడితే జట్టులో అందరికీ నాణ్యమైన ఆహారం పెట్టాలని.. అందరినీ శుభ్రమైన వ్యాన్లలో శిక్షణకు తీసుకురావాలని చెప్పా. నవంబరుకే 25 గోల్స్ కొట్టేశా. షరతులన్నీ నెగ్గించుకున్నా’’
-లుకాకు
|