తెందుల్కర్.. ద్రవిడ్, వా, చందర్‌పాల్ ఈ పేర్లు మళ్లీ వినిపిస్తున్నాయి.. అండర్-19.. స్కూల్ క్రికెట్లో పదే పదే మెరుస్తున్నాయ్.. రిటైర్ అయిపోయిన ఈ దిగ్గజ ఆటగాళ్ల పేర్లను నిలబెడుతూ.. కింది స్థాయి క్రికెట్లో అదరగొడుతున్న ఆ ఆటగాళ్లు మరెవరో కాదు.. వారి వారసులే..! మాజీ స్టార్ ఆటగాళ్ల వారసత్వంతో బరిలో దిగి ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నారీ కుర్రాళ్లు. వారిలో కొంతమంది క్రికెటర్లు అభిమానులను ఆకర్షిస్తున్నారు. వారెవరో చూద్దాం..
|
పేస్ కెరటం

భవిష్యత్‌లో దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదిస్తాడని పేరున్న ఆటగాళ్లలో తండో ఎన్తిని ఒకడు. తన తండ్రి మఖాయా ఎన్తిని లాగే తండో కూడా కుడి చేతి వాటం పేస్ బౌలర్. గతేడాది అండర్-19 ప్రపంచకప్‌లో 16 ఏళ్ల వయసులో అతను జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అంతేకాక తానాడిన ఎనిమిది యూత్ వన్డేల్లో 10 వికెట్లు పడగొట్టాడు. తండ్రి లాగే బౌలింగ్‌లో వేగం, కచ్చితత్వం తాండో ప్రత్యేకత.
|
దిగాడు అర్జునుడు
 
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ తనయుడు అర్జున్ తెందుల్కర్పైనే ఇప్పుడు అందరి దృష్టి. తండ్రిలా పిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టకపోయినా.. నెమ్మదిగా పేరు తెచ్చుకుంటున్నాడు అర్జున్. తన లెఫ్ట్ ఆర్మ్ స్వింగ్ బౌలింగ్‌తో, మెరుపు బ్యాటింగ్‌తో అర్జున్ ఎదుగుతున్నాడు. ముంబయి అండర్-19 జట్టులో ఉన్న ఈ కుర్రాడు పలుసార్లు భారత జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. ఇంగ్లాండ్ జట్టుకూ గతేడాది నెట్స్‌లో బంతులేశాడు. ఇటీవల శ్రీలంకతో యూత్ టెస్టులో తొలి అంతర్జాతీయ వికెట్ తీసిన అర్జున్ వార్తల్లోకొచ్చాడు. యువ లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు తక్కువగా ఉన్న నేపథ్యంలో స్థిరంగా రాణిస్తే భవిష్యత్‌లో అర్జున్‌కు భారత జట్టులో చోటు దక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
|
చోటా ‘వాల్’
 
భారత జట్టుకు మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందించిన సేవలు అపూర్వం. ఇప్పుడు తండ్రి బాటలో నడుస్తూ అతని తనయుడు సమిత్ కూడా క్రికెట్లోకి వచ్చాడు. ప్రస్తుతం అండర్-14 స్థాయిలో సమిత్.. బ్యాటింగ్, బౌలింగ్‌లో సత్తా చాటుతున్నాడు. తాజాగా బెంగళూరులోని అదిత్ ఇంటర్నేషనల్ పాఠశాల తరఫున ఆడుతూ కేంబ్రిడ్జ్ పబ్లిక్ స్కూల్‌పై అతను అజేయంగా అర్ధసెంచరీ చేయడమే కాక, మూడు వికెట్లు పడగొట్టి జట్టును గెలిపించాడు. ఈ ఏడాది జనవరిలో బీటీడబ్ల్యూ కప్‌లోనూ అతను సెంచరీతో ఆకట్టుకున్నాడు. గత రెండేళ్లుగా పాఠశాల క్రికెట్లో సమిత్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఉంటున్నాడు. నాన్న లాగే సమిత్ కూడా స్లిప్స్‌లో చురుకైన ఫీల్డర్‌గా పేరు సంపాదించాడు.
|
శివ కాదు తేజ్

తేజ్ నారాయణ్ చందర్‌పాల్.. నాన్న శివనారాయణ్ చందర్‌పాల్ పోలి ఉండే తేజ్ తండ్రి బాటలోనే క్రికెట్లోనూ అడుగుపెట్టాడు. చందర్‌పాల్ లాగే తేజ్ కూడా ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్. అండర్-19 ప్రపంచకప్ ఆడిన విండీస్ జట్టులో చోటు సంపాదించిన తేజ్.. దేశవాళీ పోటీల్లో గయానాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటిదాకా 25 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తేజ్.. 1215 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ, ఆరు అర్ధసెంచరీలున్నాయి. దేశవాళీ పోటీల్లో తండ్రితో కలిసి మ్యాచ్‌లు ఆడి అందర్నీ ఆకర్షించాడు.
|
‘వా’రసుడు
 
స్టీవ్‌వా.. ఈ పేరు చెబితే ఆస్ట్రేలియా అప్రతిహత జైత్రయాత్ర గుర్తొస్తుంది. కెప్టెన్‌గా, ఆటగాడిగా తనదైన ముద్ర వేసిన స్టీవ్‌వా రిటైర్ అయి చాలా కాలం అయింది. ఇప్పుడు అతని అడుగుజాడల్లో తనయుడు అస్టిన్ వా తెర మీదకొచ్చాడు. అండర్-19 ప్రపంచకప్‌లో ఆడిన ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించిన అస్టిన్.. నాన్న లాగే మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు చేస్తాడు.. మీడియం పేస్ బౌలింగ్ వేస్తాడు. దేశవాళీ పోటీల్లో పశ్చిమ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 19 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అందరి దృష్టిలో పడ్డాడు అస్టిన్.
|
ఇంజి ‘మామ’ బాటలో..
 
ఇమాముల్ హక్.. పాకిస్థాన్ క్రికెట్లో మార్మోగుతున్న పేరిది. ఆ జట్టు మాజీ స్టార్, మేనమామ ఇంజమాముల్ హక్ వారసుడిగా పాక్ జట్టులోకి వచ్చిన ఇమాముల్.. శ్రీలంకతో తానాడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో మెరిశాడు. మిస్బావుల్ హక్ స్థానంలో జట్టులో స్థానం సంపాదించిన ఇమాముల్.. మిస్బా లేని లోటుని భర్తీ చేస్తున్నాడు. తాజాగా జింబాబ్వేతో సిరీస్‌లో ఇమాముల్ మూడు సెంచరీలు సాధించి సత్తా చాటాడు. మంచి టెక్నిక్‌తో పాటు నిలకడ ఉన్న ఈ లెఫ్ట్ హ్యాండర్.. పాక్ జట్టులో ఎక్కువకాలం కొనసాగే అవకాశాలున్నాయన్నది మాజీల మాట.
|