సంగీతంలో మునిగినా..

పీటర్ వాన్ స్ట్రాటెన్.. 26 ఏళ్ల ఈ యువకుడు సంగీతంలో శిక్షణ పొందుతున్నాడు. సరిగమలు పలకడంపై సాధన చేస్తున్నాడు. మరోవైపు స్టిక్ పట్టుకొని మైదానంలో హాకీలో మాయ చేస్తున్నాడు. హాలెండ్‌లో చదువుతున్న పీటర్.. బెల్జియంలో పని చేస్తూ.. ఫ్రాన్స్ తరపున అంతర్జాతీయ హాకీ మ్యాచ్‌లు ఆడుతున్నాడు. అంతేకాకుండా అండర్-16 స్థాయిలో అతను నెదర్లాండ్స్ జట్టులో ఆడాడు. ప్రపంచకప్‌లో జట్టు విజయాల్లో తనదైన పాత్ర పోషించాడు.
|
కిక్కెక్కిస్తాడు..

మ్యాచ్‌లో హాకీ స్టిక్‌తో అదరగొట్టే టామ్ జెనెస్టెట్.. మంచి వైన్ తయారుచేసి జనాలకు కిక్కెక్కిస్తాడు. ఫ్రాన్స్ జట్టు తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన 31 ఏళ్ల టామ్ మంచి వైన్ తయారు చేయించడంలో సిద్ధహస్తుడు. మైదానంలో కంటే వైన్యార్డుల్లో ఎక్కువగా ఉంటే టామ్.. ద్రాక్ష నుంచి గ్లాస్‌కు స్పిరిట్ చేరే ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. సెయింట్ జెర్మైన్లోని తన బార్లో 12 గంటల పాటు కష్టపడే అతను రోజుకు రెండు గంటల పాటు హాకీ సాధన చేస్తాడు. ఫ్రాన్స్ జట్టు ఆటగాళ్లు అతని బార్లోనే మ్యాచ్‌లు చూస్తూ.. వ్యూహాల గురించి చర్చిస్తూ ఉంటారు.
|
జిమ్నస్టిక్స్ కోచ్..

20 ఏళ్ల బ్రనిస్కి ఓ వైపు జిమ్నాస్టిక్స్ కోచ్ అయేందుకు అడుగులు వేస్తూనే.. మరోవైపు హాకీలో సత్తాచాటుతున్నారు. బ్రసెల్స్‌లోని ఓ విశ్వవిద్యాయంలో జిమ్నాస్టిక్స్ శిక్షకుడిగా కోర్సు అభ్యసిస్తున్న బ్రనిస్కి మొదట బెల్జియం యూత్ జట్టులో సభ్యుడు. అయితే అక్కడ సీనియర్ జట్టులో చోటు దొరకడం చాలా కష్టమని భావించిన అతను ఫ్రాన్స్ చేరాడు. పగటి పూట బ్రసెల్స్‌లో చదువుతూ.. సాయంత్రం వేళ హాకీ సాధన కోసం అతను ప్యారిస్ వెళ్లేవాడు. రోజు ప్రయాణం కష్టమైనా కూడా ఓ ఆటగాడి జీవితంలో ఇవి సహజమేనని అతను అంటున్నాడు.
|
డాక్టర్ కెప్టెన్
ఫ్రాన్స్ కెప్టెన్ విక్టర్ చార్లెట్ వైద్య విద్య అభ్యసించాడు. 6 అడుగుల 5 అంగుళాల పొడవుతో ప్రస్తుత ప్రపంచకప్‌లో పొడవైన ఆటగాడిగా నిలిచిన విక్టర్ మొదట ఫుట్‌బాల్ ఆడేవాడు. కానీ ఎందుకో తనకు ఆ ఆట నప్పదు అనిపించింది. అప్పుడే ఓ స్నేహితుడి ద్వారా తొలిసారి హాకీ ఆడిన అతను ఇక ఈ ఆటలోనే కొనసాగుతున్నాడు. విక్టర్ పొడుగుండడంతో సాధారణ హాకీ స్టిక్‌లతో ఆడడం ఇబ్బందిగా మారింది. దాంతో ప్రత్యేకంగా తన కోసం హాకీ స్టిక్‌లు రూపొందించుకున్నాడు. అవి మామూలు స్టిక్‌ల కంటే ఎక్కువ పొడవుంటాయి.
|