China spy: ఈ చైనీయుడు దేశముదురు..!
close

Published : 23/06/2021 17:04 IST
China spy: ఈ చైనీయుడు దేశముదురు..!

 రక్షణ శాఖ వెబ్‌సైట్ల హ్యాకింగ్‌కు డ్రాగన్‌ యత్నం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

చైనా దృష్టి భారత రక్షణ వ్యవస్థలోని కీలక వెబ్‌సైట్లపై ఉందని తేటతెల్లమైంది..! వాటిని హ్యాకింగ్‌ చేయడానికి శతవిధాల యత్నిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల రెండోవారం పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా సమీపంలోని బంగ్లాదేశ్‌ సరిహద్దులో అరెస్టైన చైనా గూఢచారి హాన్‌ జున్వేను నిఘా సంస్థలు ప్రశ్నించే కొద్దీ అతని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. దాదాపు పదేళ్లుగా అతడు భారత్‌లో ఏమి చేశాడనే దానిపై ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

రక్షణశాఖ వెబ్‌సైట్లపై కన్ను..

ఈ కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం పలు విషయాలను రాబట్టింది. చైనాలోని వివిధ ఏజెన్సీలు భారత రక్షణశాఖలోని వివిధ విభాగాలకు చెందిన వెబ్‌సైట్లపై కన్నేసినట్లు గుర్తించారు. అంతేకాదు బెంగళూరులో బీఎస్‌ఎన్‌ఎల్‌తో కలిసి పనిచేస్తున్న ఒక కంపెనీ కూడా వీరి లక్ష్యంలో ఉందని, దీంతోపాటు వైమానిక రంగంలోని కంపెనీలను చైనా ఏజెన్సీలు లక్ష్యంగా చేసుకొన్నట్లు అతను అధికారులకు వెల్లడించాడు. వీటిల్లో అతని పాత్ర ఏమిటో తెలియాల్సి ఉంది. ‘‘ అతను చెప్పిన దాని  ప్రకారం  భారత రక్షణ వ్యవస్థలో ఏం జరుగుతుందో తెలుసుకొనేందుకు చైనా ప్రయత్నిస్తోంది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన వెబ్‌సైట్లను లక్ష్యంగా చేసుకొందని అర్థమవుతోంది. అతను భారత్‌లో ఎక్కడికి వెళుతున్నాడన్న అంశం తెలియాల్సి ఉంది. ఇక్కడి నుంచి కూడా అతనికి ఎవరో గైడ్‌ చేసి ఉండాలి. అంతేకాదు మావోయిస్టులకు ఆర్థిక సహకారం కూడా అందించే అవకాశాలు ఉన్నాయి’’ అని అధికారిక వర్గాలు వెల్లడించాయి. 

ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అన్‌లాక్‌కు సహకరించకుండా..

హాన్‌ జున్వే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లకు మాండరీన్‌ భాషలో పాస్‌వర్డ్‌లు ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వీటిని ఓపెన్‌ చేయడం అధికారులకు కష్టంగా మారింది. జాతీయ దర్యాప్తు సంస్థ, ఎన్‌ఎస్‌జీలకు  వీటిని క్రాక్‌ చేసే సామర్థ్యం ఉందని అధికారులు చెబుతున్నారు. అతడిని అరెస్టు చేసిన సమయంలో  ఎలక్ట్రానిక్‌ సామగ్రిని స్వాధీనం చేసుకొన్నారు. ఒక యాపిల్‌ ల్యాప్‌టాప్‌, రెండు ఐఫోన్లు, రెండు చైనా సిమ్‌ కార్డులు, ఒక బంగ్లాదేశ్‌ సిమ్‌, ఒక భారత్‌ సిమ్‌,రెండు పెన్‌డ్రైవ్‌లు,రెండు చిన్న టార్చిలైట్లు, ఐదు నగదు లావాదేవీలు చేసే యంత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. 

సుశిక్షితుడైన గూఢచారే..

హాన్‌ వాలకం చూస్తుంటే అతడు సుశిక్షితుడైన గూఢచారిగానే భావిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అతను ఇంగ్లిష్‌ అనర్గళంగా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. అతడి వద్ద ఉన్న పరికరాలు చూస్తేంటే గూఢచర్యం చేస్తున్నట్లు తెలుస్తోందన్నారు. అతని పాస్ పోర్టుపై బంగ్లాదేశ్‌, నేపాల్‌ వీసాలు ఉన్నాయని చెప్పారు. అతను బంగ్లా నుంచి రావడానికి ఆసక్తి చూపినట్లు తెలిపారు. భారత్‌లో తాను చెప్పే వాటిని నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలను కూడా సమకూర్చుకొన్నాడు. అధికారులను తప్పుదోవ పట్టించేందుకు ఏవో చిన్న సైబర్‌ నేరాలు చేయడానికి వచ్చినట్లు సమాచారం ఇస్తున్నాడు.  అతని వద్ద బ్యాంక్‌ పత్రాలు కూడా ఉన్నాయి. కానీ, వాటిని స్వాధీనం చేసుకోవడానికి మూడు రోజులు పట్టింది. బీఎస్‌ఎఫ్‌ దళాలు వెంటపడగానే అతడు ఆ పత్రాలను విసిరేసి పరుగులు తీశాడు. హాన్‌ గతంలో చాలా సార్లు భారత్‌ వచ్చినట్లు తేలింది. 2010లో అతను హైదరాబాద్‌ కూడా వచ్చినట్లు గుర్తించారు. కానీ, అతడి పాస్‌పోర్టుపై బంగ్లాదేశ్‌ స్టాంప్‌ తప్పితే మరేమీ లేదని అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్టు లేకుండా భారత్‌ ఎలా వచ్చాడు..? లేకపోతే మరో పాస్‌పోర్టుతో వచ్చి ఉండాలి. అంటే అతని వద్ద మరో పాస్‌పోర్టు ఉండితీరాలి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని