సంప్రదింపులు ప్రారంభించిన సుప్రీం నిపుణుల కమిటీ!
close

Published : 21/01/2021 18:39 IST
సంప్రదింపులు ప్రారంభించిన సుప్రీం నిపుణుల కమిటీ!

8 రాష్ట్రాల రైతు సంఘాలతో సమావేశం

దిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నియమించిన నిపుణుల కమిటీ రైతులతో సంప్రదింపులను ప్రారంభించింది. తొలిరోజు ఉత్తర్‌ ప్రదేశ్‌తో సహా మొత్తం ఎనిమిది రాష్ట్రాల రైతు సంఘాల నాయకులతో సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిపిన ఈ భేటీలో కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన రైతు సంఘాల నేతలతో సంప్రదింపులు జరిపినట్లు సుప్రీం నియమించిన కమిటీ ప్రకటించింది. ఈ చర్చల్లో పాల్గొన్న రైతు సంఘాలు సాగు చట్టాలపై తమకున్న అభిప్రాయాలతో పాటు చట్ట అమలుకు పలు సూచనలను కూడా స్పష్టంగా పేర్కొన్నాయని కమిటీ తెలిపింది.

ఇక రైతులతో సంప్రదింపులు జరిపేందుకు నలుగురు సభ్యులను సుప్రీం కోర్టు నియమించగా సభ్యుల్లో ఒకరైన భూపీందర్‌ సింగ్‌ మాన్‌ ఇప్పటికే తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కమిటీలో మహారాష్ట్రకు చెందిన షెట్కారీ సంఘాటనా అధ్యక్షుడు అనిల్‌ ఘన్వాత్‌తో పాటు వ్యవసాయరంగ ఆర్థికవేత్త అశోక్‌ గులాటీ, డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌ జోషీలు పాల్గొన్నారు.

ఇదిలాఉంటే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మూడు చట్టాల అమలుపై సుప్రీంకోర్టు జనవరి 11న స్టే ఇచ్చింది. మరోవైపు రైతుల సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతూనే ఉంది. ఇప్పటికే పదిదఫాల్లో చర్చలు జరిపింది. తాజాగా సాగు చట్టాలను కొంతకాలం పాటు నిలుపుదల చేస్తామని కేంద్రం కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. దీనిపై రైతు సంఘాలు తమ అభిప్రాయాలను రేపు కేంద్ర ప్రభుత్వంతో జరగబోయే భేటీలో తెలిపే అవకాశం ఉంది.

ఇవీ చదవండి..
సాగు చట్టాలను తాత్కాలికంగా నిలిపివేస్తాం
సాగు చట్టాలపై సుప్రీం స్టే


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని