close

వార్తలు / కథనాలు

నేలమీద నడిచినట్టే సముద్రం అడుగున నడుస్తారు..

నీటిలో ఈదాలంటే మనకు ఈత రావాలి. అదే సముద్రంలో ఈత కొట్టాలంటే ఈతలో నైపుణ్యం ఉండాలి. మరి సముద్ర అడుగుభాగంలో నడవాలంటే.. చాలా కష్టం. ఎవరో కొందరు గజ ఈతగాళ్లకు తప్ప సామాన్యులకు అసాధ్యమే. అయితే ఆగ్నేయాసియాలోని బజావు జాతికి చెందిన ప్రజలకు ఇది చాల చిన్నపని అని చెప్పవచ్చు. మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పైన్స్‌ సముద్రతీరాల్లో విస్తరించివున్న ఈ జాతి ప్రజలు సముద్రంపై ఆధారపడి జీవిస్తారు. దీంతో వీరి జీవితాల్లో ఈత అనేది ఒక భాగంగా మారిపోయింది.

13 నిమిషాలు ఊపిరి బిగబట్టి..

సముద్రతీరాల్లో జీవనం సాగించే వీరికి చిన్నప్పటినుంచే ఈత అలవాటవుతుంది. ఆహార అన్వేషణలో భాగంగా వీరు సముద్రం లోపలి వరకు వెళుతుంటారు . సాధారణంగా పెద్ద పెద్ద డైవర్లు సైతం ఆక్సిజన్‌లేకుండా మూడు నిమిషాల వరకు ఊపిరి బిగబట్టగలుగుతారు. అయితే బజావు తెగకు చెందినవారు కనీసం 13 నిమిషాల వరకు శ్వాసను అదుపులో ఉంచడం విశేషం.

200 అడుగుల కిందకు వరకు..

ఆహార అన్వేషణలో భాగంగా వీరు సముద్రంలో 200 అడుగుల కిందవరకు వెళుతారు. అక్కడ సముద్రగర్భంలోని నేలపై నడిచే నైపుణ్యత కూడా వీరికి ఉంది.దాదాపు ఎనిమిది గంటల పాటు వీరు డైవింగ్‌ చేస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరిని తొలిసారిగా  15వ శతాబ్దంలో యూరప్‌కు చెందిన అన్వేషకులు గుర్తించారు. అప్పట్లోనే వీరి ఈత నైపుణ్యాలను గమనించినవారు ఆశ్చర్యపోయారు. 

సముద్రంపైనే నివాసం

వీరికి శాశ్వత నివాసం ఉండదు.తీరప్రాంతాల్లోనే సముద్రజలాలపై కట్టెలతో నిర్మించిన నివాసాల్లో నివసిస్తారు. సముద్రాన్ని పూజిస్తారు. సముద్ర ఉత్పత్తులు భారీగా దొరికే ప్రదేశాలకు వలసవెళుతుంటారు. దీంతో వీరికి సముద్రపు దిమ్మరులుగా పేరువచ్చింది. చెక్కతో చేసిన కంటి అద్దాలను ఈత కొట్టే సమయంలో వాడుతుంటారు. అంతకంటే వీరికి అధునాతన పరికరాలు ఉండవు. సముద్రంలోకి వెళ్లి చేపలు, ఆక్టోపస్‌, రొయ్యలు.. తదితర వాటిని వేటాడి పట్టుకొచ్చి విక్రయిస్తుంటారు. వీటితో పాటు ముత్యాలు, పగడాలను కూడా  సేకరిస్తారు.

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు