Latest Telugu News, Headlines - EENADU
close

వార్తలు / కథనాలు

గుండె గుభేల్‌మన్నా..చెర్నోబిల్‌ చూడాల్సిందే..

చెర్నోబిల్‌... గుర్తుందా. 1986లో ఇక్కడి అణువిద్యుత్‌ కర్మాగారంలో జరిగిన ప్రమాదంలో ఈ ప్రాంతం పేరు యావత్‌ ప్రపంచానికి వెల్లడయింది.  అప్పటి సోవియట్‌ రష్యా, ఇప్పటి ఉక్రెయిన్‌ ఆధీనంలో ఉన్న చెర్నోబిల్‌లో అణువిద్యుత్‌ కేంద్రాన్ని నెలకొల్పారు. అయితే నిర్వహణలో వైఫల్యంతో 1986లో ప్రమాదం సంభవించింది.ఆ ప్రమాదంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు అక్కడ నుంచి వెలువడుతున్న అణుధార్మికతతో కనీసం 2 లక్షల మంది చనిపోయివుంటారని అంతర్జాతీయ సంస్థలు పేర్కొంటున్నాయి. కానీ అప్పట్లో సోవియట్‌ యూనియన్‌ పాలనలో ఉండటంతో ప్రాణనష్టం అంశంపై సరైన గణాంకాలు లేవు.

టీవీ సీరియల్‌తో ఆసక్తిపెరిగింది.
 మూడు దశాబ్దాలకు పూర్వంజరిగిన ఈ ప్రమాదం గురించి ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు. అయితే చెర్నోబిల్‌  టీవీ సీరియల్‌లో వస్తున్న కథనాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దీంతో వారు ఈ నగరాన్నిచూసేందుకు భారీ సంఖ్యలో వస్తున్నారు.

ఖాళీ నగరాన్ని చూడాల్సిందే..
ఉక్రెయిన్‌లోని ప్రిప్‌యత్‌ నగరానికి సమీపంలో ఉంటుందీ చెర్నోబిల్‌. ప్రమాదం జరిగిన వెంటనే నగరంలోని వేలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అణుధార్మికత ప్రభావంతో క్యాన్సర్‌.. తదితర వ్యాధులు వచ్చే ప్రమాదముండటంతో మొత్తం నగరాన్ని మూసివేశారు. ఇప్పటికీ పార్కులు, నివాసగృహాలు ఖాళీగా ఉన్నాయి. ప్రజలను అప్పటికప్పుడు తరలించడంతో వారు తమ వస్తువులను తీసుకెళ్లే సమయం కూడా లేకపోయింది. ఇప్పటికీ ఆ గుర్తులను చూడవచ్చు.

యంత్రాలకు స్మశానం ఉంది..
చెర్నోబిల్‌లో ప్రమాదం అనంతరం వేలాది యంత్రాలను, వాహనాలను, హెలికాప్టర్లను అలాగే వదిలివెళ్లిపో్యారు. ఇవి అక్కడే మట్టికొట్టుకుపోవడంతో మరుభూమిలాగా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని యంత్రాల స్మశానం  అని పిలుస్తుంటారు.

పర్యాటకులు పెరుగుతున్నారు..
చెర్నోబిల్‌ సీరియల్‌ విశేష ప్రేక్షకాదరణ పొందింది.దీంతో అనేకమంది ఉక్రెయెన్‌కు వచ్చి చెర్నోబిల్‌ చూసేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ఎక్కవమంది ఒక్కరోజు టూర్‌ కోసం వస్తున్నట్టు స్థానిక గైడ్‌లు తెలిపారు. చెర్నోబిల్‌ కేంద్రానికి 300 మీటర్ల దూరం వరకు మాత్రమే పర్యాటకులను అధికారులు అనుమతిస్తున్నారు. రేడియేషన్‌ ప్రమాదం లేకుండా ఉండేందుకు అందరు కచ్చితంగా మాస్క్‌లు ధరించాల్సిందే. అయితే పర్యాటకులు వీటిని పాటించకపోవడంపై అధికారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు.

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు