
వార్తలు / కథనాలు
గంట కౌగిలించుకుంటే... 60 డాలర్లు ఇస్తారు
నెట్‌ఫ్లిక్స్ చూస్తే వంద డాలర్లు ఇస్తారట!
ఉత్తరాలకు సమాధానాలు రాస్తే జీతం ఇస్తారు...
ఫేస్బుక్లో బిజీగా ఉంటే ఉద్యోగం ఇస్తారు...
పరుపుల మీద నిద్రపోయినందుకు డబ్బులిస్తారు...
హోటల్స్ చూసి వచ్చినందుకు శాలరీ వస్తుంది...
అబ్బో ఇలాంటివి చాలా ఉన్నాయి. చేయడానికి మీరు సిద్ధమేనా? మీరు మరీ జోకులేస్తున్నారండీ. ఇలాంటి పనులు చేసినందుకు ఎవరైనా ఉద్యోగాలు.. డబ్బులిస్తారా అంటారా? ఒట్టండీ బాబు... ఇలాంటి ఉద్యోగాలు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలియాలంటే ఈ కథనం చదవాల్సిందే!
ఆఫీసుకు వెళ్లి ఎనిమిది గంటలు పని చేయడం.. కంప్యూటర్లు, పనిముట్లతో కుస్తీ పట్టి ఆలసిపోవడం. సాధారణంగా ఉద్యోగమంటే చాలామంది ఇలాగే ఫీలవుతుంటారు. కానీ మనం సరదా కోసం చేసే పనులు, ఇష్టంగా చేసే పనులే ఉద్యోగాలుగా మారి ఆదాయం తెచ్చి పెడితే?. ఇదెక్కడ సాధ్యం అనుకుంటున్నారా? అలాంటి ఉద్యోగాలు నిజంగానే ఉన్నాయండీ బాబూ. మనసుకు నచ్చిన పనిని చేసుకునే ఆసక్తికరమైన ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఉన్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి.. |
శాంటా క్లాజ్ లేఖలు.. క్రిస్మస్ వేళల్లో ప్రజలు శాంటాక్లాజ్ కోసం చర్చిలకు లేఖలు రాస్తుంటారు. పండుగ శుభాకాంక్షలు చెబుతూ.. కోరికల చిట్టా విప్పుతూ కోకొల్లలుగా శాంటాక్లాజ్లకు లేఖలు పంపుతారు. అలా వచ్చిన లేఖలకు జవాబు రాయాలి. ఒక్కో లేఖకు సమాధానం రాసినందుకు 10 డాలర్ల వరకు ఆదాయం పొందవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉన్నాయి. |
‘షో’ గురించి వివరిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందుతున్న నెట్‌ఫ్లిక్స్‌ను చూస్తూ కూర్చోవడమే ఓ ఉద్యోగం. నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే ప్రతీ షోను వీక్షించి.. ఆ షో గురించి నాలుగైదు వ్యాఖ్యల్లో వివరించాలి. ఇందుకుగాను నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఉద్యోగులకు వారానికి వంద డాలర్లకు పైగానే జీతంగా ఇస్తోంది. |
ఉత్తుత్తి ప్రతినిధులు ఏవైనా అంతర్జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడు అనేక సంస్థలు హాజరవుతుంటాయి. అయితే చైనాలో పలు సంస్థలు ఆ సమావేశాలకు తమ సంస్థ తరఫున హాజరయ్యేందుకు నకిలీ ప్రతినిధులను నియమించుకుంటున్నాయి. నియమితుడైన వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే.. సమావేశాలకు హాజరై సంస్థ గురించి ప్రసంగించడం. అలా సంస్థ తరఫున సమావేశానికి హాజరవుతున్నందుకు వారానికి 1000 డాలర్ల వరకు ఇస్తున్నాయి అక్కడి సంస్థలు. |
కౌగిలింతకు కాసులోస్తాయ్ కౌగిలింతలో ఉన్న ఆప్యాయత మరెక్కడ దొరకదంటే అతిశయోక్తి కాదు. కౌగిలింతలోనే మనిషి మనసుకి, శరీరానికి ప్రశాంతత లభిస్తుంది. అలాంటి కౌగిలింతను డబ్బులు తీసుకొని ఇచ్చేవాళ్లు ఉన్నారు. అమెరికా, చైనా, పోర్ట్లాండ్ తదితర దేశాల్లో ఇందుకోసం ఏకంగా సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగులను నియమించుకుంటున్నారు. ఎవరైనా కౌగిలింతను కొరుకుంటే వీరికి గంటకు 60 డాలర్లు ఇవ్వాల్సి ఉంటుంది. |
బంతిని తెచ్చిపెట్టడమే పని గోల్ఫ్ కోర్టులు చాలా వరకు సరస్సులు, నదుల ఒడ్డునే ఉంటాయి. గోల్ఫ్ క్రీడాకారులు కొన్ని సార్లు బంతిని గట్టిగా కొడితే సరస్సులో పడిపోతుంటాయి. అలా నీళ్లలో పడ్డ ఆ బంతులను తెచ్చి పెట్టడమే ఉద్యోగి విధి. ఈ ఉద్యోగులు ఏడాదికి 33వేల డాలర్లు జీతంగా పొందుతున్నారు. ఇలాంటి ఉద్యోగాలు అమెరికా, ఇంగ్లాండ్‌లో అధికంగా లభిస్తాయి. |
సదుపాయాలు అనుభవించి ప్రపంచవ్యాప్తంగా అన్నీ ట్రావెల్స్ సంస్థలు తమ వినియోగదారులకు మంచి హోటల్స్‌లో విడిది ఏర్పాటు చేయాలని భావిస్తాయి. అందుకే ఆయా సంస్థలు కొందరు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఆ ఉద్యోగులు వివిధ హోటళ్లకు వెళ్లి అక్కడి సదుపాయాలను అనుభవించి.. వాటిపై రివ్యూ ఇస్తారు. ఈ పని చేసినందుకు ఉద్యోగికి ఏడాదికి 48 వేల డాలర్లు జీతంగా ఇస్తున్నారు. ఉచితంగా లగ్జరీ బస చేయడమే కాకుండా ఆదాయమూ వస్తుందన్నమాట. |
చురుగ్గా ఉంటే ఈ ఉద్యోగం ఈజీ అమెరికా వంటి వాణిజ్య దేశాల్లో ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి. సోషల్‌మీడియాలో చాలా కంపెనీలు తమ బ్రాండ్ల గురించి ప్రచారం చేస్తుంటాయి. అలా సోషల్‌మీడియాలో కనిపించే బ్రాండ్లను గమనిస్తూ.. వాటికి సంబంధించి ఆసక్తికరమైన విషయాలపై నివేదికగా తయారు చేయాలి. అలాంటి వాళ్లు ఏడాదికి 79వేల డాలర్లు పొందుతున్నారు. |
నిద్రపోతే జీతం జేబులోకి.. పరుపులు తయారు చేసే సంస్థలు తాము తయారు చేసిన పరుపుల నాణ్యతను పరిశీలిస్తాయి. ఇందుకోసం నిపుణులను నియమిస్తాయి. ఆ నిపుణులు చేసేదల్లా పరుపుపై నిద్రపోవడమే. ఆ తర్వాత పరుపు నాణ్యత ఎలా ఉంది? సుఖమైన నిద్ర పడుతోందా లేదా అన్న విషయాన్ని సంస్థకు తెలియజేస్తారు. ఈ నిపుణులకు ఏడాదికి 70వేల డాలర్ల జీతం ముడుతోంది. ఇవే కాకుండా చాకోలెట్, ఐస్‌క్రీమ్, కాఫీ, మద్యం వంటి ఉత్పత్తుల రుచి చూసే ఉద్యోగాలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఉన్నాయి. ఇలాంటి ఉద్యోగాలు ఉద్యోగికి సరదానే కాదు.. ఆకర్షణీయమైన జీతమూ అందిస్తున్నాయి మరి. |