close

వార్తలు / కథనాలు

లైబ్రరీలో పుస్తకాలతోపాటు చాలా ఉంటాయ్‌

లైబ్రరీ అంటే పుస్తకాల భాండాగారం. మనిషికి ఎంతో జ్ఞానాన్ని అందించే అనేక రకాల పుస్తకాలు, గ్రంథాలు లభించే చోటు. ఎవరికి ఎలాంటి సందేహాలు ఉన్నా అక్కడికి వెళ్లి నివృత్తి చేసుకోవచ్చు. కానీ.. అమెరికా ఒహాయోలోని సిన్సినాటి పట్టణంలో ఉన్న లైబ్రరీకి మాత్రం తలదాచుకోవడానికి, స్నానాలు చేయడానికి, ఉద్యోగం వెతుక్కొవడానికి వెళ్తుంటారు. ఇదేం విచిత్రం అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదవండి..

అనాథలు, నిరాశ్రయుల కోసం ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడతుంటాయి. అయినా పేదలకు స్వచ్ఛందంగా సేవ చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తుంటాయి. ఆ కోవలోనిదే సిన్సినాటిలోని పబ్లిక్‌ లైబ్రరీ. పుస్తకాలు చదువుకునేందుకు వచ్చే వారితోపాటు నిరాశ్రయులకు ఈ లైబ్రరీ ద్వారాలు తెరుస్తోంది. గూడు లేని పేదలకు చిరునామాగా మారుతోంది. ఎండ, వాన, చలిని తప్పించుకునేందుకు ఆశ్రయం కల్పిస్తోంది. 

రోడ్డుపై బతుకు వెళ్లదీసే వారు కాలకృత్యాలు తీర్చుకునేందుకు నిర్వాహకులు లైబ్రరీలో ప్రాంగణంలో మరుగుదొడ్లు, స్నానాల గదులను ఏర్పాటు చేశారు. వారి కనీస అవసరాలు తీరేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఇంతటితో ఈ పబ్లిక్‌ లైబ్రరీ తమ సేవలు ఆపేయలేదు. నిరాశ్రయులకు ఉపయోగపడేలా ఇటీవల ఓ కార్యక్రమం చేపట్టింది. తమ లైబ్రరీకి వచ్చేవారి కోసం ప్రత్యేకంగా మానసిక నిపుణులతో సెమినార్‌ ఏర్పాటు చేస్తోంది. నిరుద్యోగుల కోసం కంప్యూటర్‌, వృత్తి విద్యా కోర్సులను ఉచితంగా అందిస్తోంది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడంలో లైబ్రరీ సిబ్బంది సహాయపడుతున్నారు. చదువురాని నిరాశ్రయులు ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే వారి కోసం టికెట్లు బుక్‌ చేస్తారు. ఇలా ఆసరా కోసం వచ్చిన వారితోపాటు జైలు జీవితం గడిపి విడుదలైన ఖైదీలకు కూడా ఈ లైబ్రరీ చేయందించి.. వాళ్ల కాళ్లపైవాళ్లు నిలబడే వరకు తోడుగా ఉంటోంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న